ఆంధ్రా తీరంలో తిమింగలాలు | Baleen Whale in Andhra Pradesh Coastal | Sakshi
Sakshi News home page

బెలీన్‌.. తన తీరాన్ని చేరెన్‌

Published Sat, Feb 22 2020 7:32 PM | Last Updated on Sat, Feb 22 2020 8:07 PM

Baleen Whale in Andhra Pradesh Coastal - Sakshi

సాక్షి, మచిలీపట్నం: తిమింగలాలు మన ప్రాంతంలోని సముద్ర తీరాన్ని ఆవాసాలుగా ఎంచుకున్నట్లు సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) సుమారు నెల రోజుల క్రితం గుర్తించింది. రాష్ట్రంలోని విశాఖ సముద్ర తీరంలో రెండుచోట్ల, నెల్లూరు జిల్లా మోటుపల్లి, కాకినాడ తీర ప్రాంతాలను ఆవాసాలుగా ఎంచుకుని అక్కడ తిమింగలాలు నెలల తరబడి జీవనం సాగిస్తున్నట్లు (స్టాండింగ్‌ లొకేషన్స్‌)గా వెల్లడించింది. దశాబ్ద కాలం నుంచి రాష్ట్రంలోని తీరం వెంబడి తిమింగలాల కదలికలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఆరేళ్లుగా మన తీరంలో వివిధ కారణాల వల్ల అవి మృత్యువాత పడి తీరానికి కొట్టుకొస్తున్నాయి. (చదవండి: లక్షల్లో ఫీజులు.. పురుగులతో భోజనం)

సీఎంఎఫ్‌ఆర్‌ఐ మ్యాపింగ్‌తో గుర్తింపు
దేశంలోని సముద్ర జలాల్లో జీవించే జంతు జాతుల కదలికలను గుర్తించేందుకు సీఎంఎఫ్‌ఆర్‌ఐ ఇటీవల మ్యాపింగ్‌ రూపొందించింది. దీని ద్వారా తూర్పు తీరాన గల బంగాళాఖాతంలో అరుదైన జంతు జాతుల కదలికలు ఉన్నట్లుగా గుర్తించింది. వీటిలో ప్రధానమైనవి బెలీన్‌ తిమింగలాలు. వీటికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నలుపు, బూడిద రంగుల్లో ఉండే ఇవి ఉత్తర అట్లాంటిక్‌ సముద్ర ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తుంటాయి. 20 అడుగుల పొడవు, 3 వేల కిలోల బరువుండే ఈ తిమింగలాలు 70నుంచి 80 ఏళ్ల పాటు జీవిస్తాయి. ఇవి సాధారణ తిమింగలాలతో కలవవు. వేసవిలో ధృవ ప్రాంతాల్లో చల్లని, పోషకాలు అధికంగా ఉండే నీటి వనరుల్లోకి తరలి వెళ్తాయి. శీతాకాలంలో మాత్రం ఉష్ణ మండల జలాల్లోకి వలసపోతాయి. కనీసం రెండు మూడు నెలల పాటు ఒకే ప్రాంత జలాల్లో సంచరిస్తుంటాయి. రోజుల తరబడి కదలకుండా ఒకేచోట ఉండగలుగుతాయి.  


కృష్ణా జిల్లా నాగాయలంకలో మృతి చెందిన తిమింగలాల కళేబరం (ఫైల్‌ ఫొటో)  

మ్యాపింగ్‌ ఎలా చేస్తారంటే..
దేశం వ్యాప్తంగా విస్తరించి ఉన్న సముద్ర జలాల్లో ఎక్కడెక్కడ ఏయే రకాల జలచరాలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయనే విషయాన్ని శాటిలైట్‌ ఆధారిత జీపీఎస్‌ కో–ఆర్డినేట్స్‌ ద్వారా అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా గుర్తిస్తారు. వివిధ రకాల జలచరాలు ఏయే ప్రాంతాల్లో ఎక్కువ రోజులు  ఉంటున్నాయి, ఏ ప్రాంత జలాల్లో చనిపోయి ఏ తీరంలోకి కొట్టుకొస్తున్నాయో పరిశీలిస్తారు. ఫిష్‌ ల్యాండింగ్‌ పాయింట్స్, వేట సమయంలో మత్స్యకారుల పరిశీలనలోకి వచ్చిన విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా అన్ని కోణాల్లో పరిశీలించి, అధ్యయనం చేస్తారు. ఇలా గుర్తించిన ప్రాంతాలను మ్యాపింగ్‌ చేసి వాటి స్టాండింగ్‌ లొకేషన్స్‌ను ప్రకటిస్తారు. తిమింగలం జాతుల స్ట్రాండింగ్‌ లొకేషన్స్‌ ప్రకటించడం వల్ల వాటి పరిరక్షణపై దృష్టి పెట్టొచ్చు. వాటి ఉనికికి ఇబ్బంది లేకుండా అవి సంచరించే ప్రదేశాల్లో భారీ నౌకలను దారి మళ్లించడం, వేటను నిషేధించడం, నీటి అడుగు భాగాల్లో నావికా, తీర భద్రతా విభాగాలు సాగించే ప్రయోగాలు నియంత్రించడం వంటి చర్యలు చేపట్టడం ద్వారా వాటి జీవనానికి ఇబ్బంది లేకుండా చూసే వీలు కలుగుతుంది. ఏపీ తీరంలో 2013 నుంచి తిమింగల జాతుల మరణాలు నమోదవుతున్నాయి. తీరానికి కొట్టుకొచ్చిన వాటి మృత కళేబరాలను అటవీ శాఖ అధికారులు సేకరించి పరిశోధనలకు తరలిస్తున్నారే తప్ప.. మరణాలకు గల కారణాలను మాత్రం శోధించలేకపోతున్నారు. మ్యాపింగ్‌ అందుబాటులోకి రావడం వల్ల కారణాలను అధ్యయనం చేసే వీలు కలుగుతుంది.  

పరి రక్షణకు ప్రత్యేక చర్యలు
మ్యాపింగ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీరంలో తిమింగలాల ఆవాసాలకు సంబంధించి నాలుగు స్టాండింగ్‌ లొకేషన్స్‌ గుర్తించాం. నావల్, తీర భద్రతా దళాలు తిమింగలాల స్టాండింగ్‌ లొకేషన్స్‌లోని జలాల్లో కసరత్తులు చేయకుండా సూచనలు ఇవ్వవచ్చు. ఇటీవల కేరళ తీరంలోని సముద్ర జలాల్లో చిక్కుకున్న తిమింగలాలకు పునరావాసం కల్పించేందుకు సీఎంఎఫ్‌ఆర్‌ఐ (కొచ్చి) ప్రత్యేక చర్యలు చేపట్టింది. అదే రీతిలో ఏపీలో కూడా అటవీ శాఖ సహకారంతో తిమింగలాల పరిరక్షణకు చర్యలు చేపట్టొచ్చు.
– ఎడ్వర్డ్, శాస్త్రవేత్త, సీఎంఎఫ్‌ఆర్‌ఐ, విశాఖపట్నం
 
ఆవాసాలపై ప్రత్యేక దృష్టి పెట్టొచ్చు
మన ప్రాంతంలోని సముద్ర జలాల్లో తిమింగలాలు రోజులు, నెలల తరబడి నివాసం ఉంటున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లే నౌకలు ఢీ కొట్టడం, నౌకల నుంచి విడుదలయ్యే ఆయిల్స్‌ వల్ల భూగర్భంలో ఆక్సిజన్‌ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల తిమింగలాలు చనిపోతుంటాయి. అవి సంచరించే స్టాండింగ్‌ లోకేషన్స్‌ను గుర్తించడం వల్ల ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రక్షణ చర్యలు చేపట్టే అవకాశం కలుగుతుంది.  
– డాక్టర్‌ ఎల్‌.సుశీల, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, కృష్ణా యూనివర్సిటీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement