మరబోటు ఫ్యాన్ రెక్క తగిలి కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఆలివ్‌రిడ్లే తాబేలు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్ల ఫ్యాన్ రెక్కలు తగిలి ప్రాణాలు కోల్పోతున్న అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకనుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్లకు లైసెన్స్‌లు తప్పనిసరి చేసింది. మరబోట్లు, మెకనైజ్డ్ బోట్ల ఫ్యాన్ల రెక్కలు ఆలివ్‌రిడ్లే తాబేళ్లకు తగలకుండా ప్రత్యేక పరికరాలను అమర్చాలని నిర్ణయించింది.
కొత్త మరబోట్లకు అనుమతిచ్చే సమయంలోనే ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రక్షణకు ప్రత్యేక షరతులు విధించనుంది. ఈ తాబేళ్లకు ముప్పు కలిగిస్తే వన్యప్రాణి చట్టం–1972 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. తాజా నిర్ణయాలపై సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మన దగ్గర ఎక్కువగానే..
ఆలివ్‌రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వాటిలో జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఐదు రకాల జాతులు ఉండగా, మన దేశంలో రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశా తీరప్రాంతంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మన రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకు, బాపట్ల జిల్లా సూర్యలంక, నిజాంపట్నం
తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి.
ఒక్కో తాబేలు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వీటి సంరక్షణకు అటవీశాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి సంవత్సరం ఈ తాబేళ్ల గుడ్లను సేకరించి సముద్రంలోకి వదులుతుంది. ఈ సంవత్సరం కూడా 46,840 గుడ్లను సముద్రంలోకి వదిలింది. 2009 నుంచి ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.18లక్షల ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి వదిలింది.
Comments
Please login to add a commentAdd a comment