Web Application
-
సముద్రం నుంచి సముద్రానికి
చిన్నప్పుడు వేటకు వెళ్లిన తండ్రి ఒక్కోసారి ఖాళీ చేతులతో తిరిగి వచ్చేవాడు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవాడు. పడిన సరుకును సరిగ్గా అమ్ముకోగలిగేవాడు కాదు. ఇవాళ 45 ఏళ్ల వెల్విగి మెరైన్ బయాలజిస్ట్‌గా మారి తమిళనాడు కారైకల్ ప్రాంతంలో మత్స్యకారులకు సురక్షిత చేపల వేటకు సాయం చేస్తోంది. బెస్త స్త్రీల స్వయం సమృద్ధికి మార్గదర్శనం చేస్తోంది. 35 ఏళ్ల క్రితం వెల్విగికి పదేళ్లు. ఇంటికి పెద్ద పిల్ల. తన తర్వాత ముగ్గురు తోబుట్టువులు. తమిళనాడు నాగపట్టణం బెస్తపల్లెలో తండ్రి ఉదయాన్నే నాలుగ్గంటలకు చేపల వేటకు కొయ్య పడవ మీద బయలుదేరుతూ ఉంటే నిద్ర కళ్లతో చూసేది. వేటకు వెళ్లిన తండ్రి రెండు మూడు రోజులు రాడు. ఆ అన్ని రోజులు వెల్విగి దేవుణ్ణి ప్రార్థిస్తూ తండ్రి కోసం ఎదురు చూసేది. తండ్రి తిరిగి వచ్చేంత వరకూ తండ్రికీ ఇంటికీ మధ్య ఏ కమ్యూనికేషనూ ఉండేది కాదు. వాతావరణం మారితే ప్రమాదం. తుఫాను వస్తే ప్రమాదం. లేదా అంతర్జాతీయ జలాల్లోకి పడవ వెళ్లిపోతే ప్రమాదం. ఇన్ని ప్రమాదాలు దాటుకుని తండ్రి ఇల్లు చేరితే అదృష్టం. 35 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నాగపట్టణం చుట్టుపక్కలే కాదు తమిళనాడు బెస్తపల్లెలన్నింటిలోనూ వెల్విగి తన సాంకేతిక ఆలోచనలతో బెస్తవాళ్లకు ఒక ధైర్యంగా మారింది. దానికి కారణం ఏ బెస్త కుటుంబమూ ఆందోళనగా బతక్కూడదని. ఏ బెస్త ఇంటి పిల్లలు తండ్రి కోసం భయం భయంగా ఎదురు చూడకూడదు అని. అలా వారి సాయం కోసం తాను మారాలంటే మెరైన్ బయాలజీ చదవాలి. కాని బెస్త ఇళ్లల్లో ఆడపిల్లలకు అంత చదువా? ‘మన దేశంలో దాదాపు 3 వేలకు పైగా బెస్త పల్లెలు ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది బెస్త కుటుంబాలు ఉన్నాయి. 40 లక్షల బెస్తలు సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. వీరిలో 90 శాతం మంది సంప్రదాయ మత్స్యవేట చేస్తారు. వీరిలో ఇప్పటికి మూడు వంతుల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉంటే ఇక ఆడపిల్లలకు చదువు ఎక్కడ?’ అంటుంది వెల్విగి. బిఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ మెరైన్ బయాలజీలను వెల్విగి తన మేనమామ సాయంతో చదువుకుంది. ‘ఆ చదువులో కూడా వివక్ష ఎదుర్కొన్నాను. బెస్త అమ్మాయి ఇలాంటి చదువు చదవడం కొందరి దృష్టిలో వింతగా ఉండేది’ అంటుంది వెల్విగి. ఇక తన కాళ్ల మీద తాను నిలబడక తప్పలేదు. పూంపుహార్‌లోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ‘ఫిష్ ఫర్ ఆల్ రీసెర్చ్ అండ్ ట్రయినింగ్ సెంటర్’ పేరుతో ఒక ప్రోగ్రామ్ని తీసుకుంటే అందులో పని చేయడానికి రామేశ్వరం వెళ్లింది వెల్విగి. అది తన ఊరికి 265 కిలోమీటర్ల దూరం. ‘కాని నాకు తప్పలేదు. డబ్బులు కావాలి’ అంది వెల్విగి. పదేళ్లు ఆ సంస్థలో పని చేశాక తిరిగి పిహెచ్డి పనిని స్వీకరించి అన్నామలై యూనివర్సిటీ నుంచి పూర్తి చేసింది. అక్కడి బెస్త సమూహంలో పిహెచ్డి చేసిన తొలి మహిళ వెల్విగి. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థలో ప్రస్తుతం సీనియర్ సైంటిస్ట్‌గా పని చేస్తున్న వెల్విగి బెస్తవారి కోసమే ప్రత్యేకంగా ‘మీనవా నన్బన్’ (బెస్తవారికి మిత్రుడు) యాప్‌ను డెవలప్ చేయడంలో సాయపడింది. ఇప్పుడు తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో కనీసం 50 వేల మంది ఈ యాప్ వాడుతున్నారు. మత్స్య పడవల నేవిగేషన్లో ఇది సాయపడుతోంది. అంతేకాదు తీరంతో కమ్యూనికేషన్‌ను కూడా సులభం చేస్తుంది. ‘బెస్తవారి సంప్రదాయ చేపల వేట ప్రకృతి సహజమైనది. అయినప్పటికీ వలకు పడాల్సిన చేపలతో పాటు అనవసరపు సముద్ర జీవులు (బైక్యాచ్) కూడా పడుతూ ఉంటాయి. వాటిని కాకుండా కేవలం చేపలు మాత్రమే పడాలంటే ఏం చేయాలో నేను గైడ్ చేస్తూ ఉంటాను. అలాగే వలలో తాబేళ్లు చిక్కకుండా చిక్కిన తాబేళ్లు ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా వాటిని తిరిగి సముద్రంలో వదిలేలా బెస్తవారికి ట్రైనింగ్ ఇస్తుంటాను’ అంటుంది వెల్విగి. ఆమె ఊరికే బోర్డు మీద పాఠాలు చెప్పే రకం కాదు. ఇప్పటికి చేపల వేటకు వెళ్లే పడవల్లో కనీసం 150 సార్లు సముద్రం మీదకు వెళ్లింది. వారితోనే ఉంటూ మెళకువలు చెబుతుంది. ఏ సమయంలో ఏ ప్రాంతంలో చేపలు పడతాయో వారికి బోధ పరుస్తుంది. ‘ఇదంతా నా చదువు వల్ల మాత్రమే కాదు. మా నాన్న నుంచి తీసుకున్న అనుభవం కూడా’ అంటుంది వెల్విగి. మత్స్స సంపద నుంచి స్త్రీలు ఆదాయం గడించేలాగా వారికి ఫుడ్‌కోర్టులు నడపడం ఎలాగో, నిల్వ ఆహారం చేయడం ఎలాగో, ఎండు చేపల మార్కెట్... వీటన్నింటి గురించి కూడా ఆమె తర్ఫీదు ఇస్తోంది. దాదాపు 17 వేల మంది మహిళలు ఆమె వల్ల లబ్ది పొందారు. ‘మత్స్యకారుల్లో వయసుకు వచ్చిన అబ్బాయిలు వేటలో పడకుండా, అమ్మాయిలు పెళ్లిలోకి వెళ్లకుండా చదువుకోవాలంటే ప్రభుత్వ పరంగా చాలా చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి జీవితాల్లో వెలుగు’ అంటుంది వెల్విగి. సముద్రంలో మత్స్యకారులతో వెల్విగి బెస్త మహిళలు, మత్స్యకారులతో వెల్విగి -
సీ–19 రక్ష యాప్‌కు ఆదరణ
సాక్షి, అమరావతి: నరసరావుపేట యువకుడు గాయం భరత్‌కుమార్‌రెడ్డి రూపొందించిన కోవిడ్–19 లక్షణాలను ట్రాక్ చేసే వెబ్ అప్లికేషన్ (యాప్)కు ఆదరణ లభిస్తోంది. గుంటూరులో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో ప్రైవేటుగా ‘సైబర్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ’ నిర్వహిస్తున్న భరత్ లాక్డౌన్ నేపథ్యంలో నరసరావుపేటకు వచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కలవరపాటుగా మారిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేలా ఒక యాప్‌ను రూపొందించాలనే ఆలోచన చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం తాను రూపొందించిన ‘సీ19–రక్ష’ యాప్‌ను ఇప్పటి వరకు 27,500 మంది ఉపయోగించుకున్నట్టు సాక్షికి తెలిపాడు. కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించాడు. ► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన "www.c19raksha.in' వెబ్ అప్లికేషన్ ఇది. ఇంట్లో కూర్చొని కంప్యూటర్, మొబైల్, ల్యాప్‌టాప్‌ల ద్వారా ఈ యాప్‌ను ఉపయోగించుకుని కేవలం రెండు నిమిషాల్లో మన పరిస్థితి అంచనా వేసుకోవచ్చు. ► ఇందులో కరోనా వ్యాధికి సంబంధించిన సింప్టమాటిక్, అసింప్ట్టమాటిక్ లక్షణాలు, ప్రవర్తనలకు సంబంధించిన ప్రశ్నలను పొందుపర్చాం. ఈ ప్రశ్నావళి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) వారు రూపొందించినవి. ► రోగ లక్షణాలు కలిగిన వారు ఈ యాప్‌లో వ్యక్తిగతంగా తమ ఆరోగ్య పరిస్థితిని ప్రశ్నావళి ద్వారా సరిచూసుకోవచ్చు. ఇందులో సులభంగా ఎస్/నో ఆప్షన్లు ఉంటాయి. ఆ వివరాలు వైద్య విభాగానికి నేరుగా మెయిల్ ద్వారా వెళ్తాయి. ► జ్వరం, తలనొప్పి, ప్రయాణ చరిత్ర, ఊపిరి ఇబ్బంది వంటి 11 ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు బట్టి తక్కువ ప్రమాదం, మధ్యస్థం, అత్యధిక ప్రమాదం వంటి మూడు రకాల రిజల్ట్‌లో ఏదో ఒకటి వస్తుంది. అప్లికేషన్లో ఇచ్చిన సమాధానాలు బట్టి అత్యధిక ప్రమాదం అనే రిజల్ట్ వస్తే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. భవిష్యత్‌లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కూడా ఈ ఆప్లికేషన్‌లో ఉంది. -
‘పూచ్-ఓ’ ఆప్‌పై ఫిర్యాదులు
న్యూఢిల్లీ: సులువైన పద్ధతిలో ఢిల్లీలోని ఆటోసేవల ను ఉపయోగించుకోవడానికి రూపొందించిన వెబ్ అప్లికేషన్ పూచ్-ఓ తప్పులతడకని వినియోగదారులు ఆక్షేపిస్తున్నారు. దీనిని ప్రారంభించిన నెల రోజుల్లో 10 వేల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులోని ఆటోడ్రైవర్ల మొబైల్ నంబర్లన్నీ తప్పుడువని చెబుతున్నారు. ఆటో కోసం శుక్రవారం తాను ఈ ఆప్ ద్వారా ఒక నంబరుకు ప్రయత్నించగా, అది గుర్గావ్వాసిదని తేలిందని సునీతా గుప్తా అనే మహిళ చెప్పారు. మిగతా స్మార్ట్ఫోన్లు యూజర్లు కూడా ఇవే తరహా ఫిర్యాదులు చేస్తున్నారు. ఢిల్లీ సమగ్ర బహుళ రవా ణా వ్యవస్థ (డిమ్టస్) అధికారులు రూపొందిం చిన ఈ ఆప్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ ఈ నెల 11న ఆవిష్కరించారు. జీపీఎస్ సదుపాయమున్న ఆటో లు ఎక్కడున్నాయో తెలుసుకొని డ్రైవర్లను సంప్రదించడం ఈ ఆప్ ద్వారా సాధ్యపడుతుందని డిమ్టస్ అధికారులు చెప్పారు. ఇందుకోసం వందలాది మంది డ్రైవర్ల నంబర్లను ఆప్‌లో పొందుపరిచారు. జీపీఎస్ సదుపాయం ఉన్న ఆటోలు ఎక్కడ ఉన్నా.. సదరు ప్రదేశాన్ని ఆన్లైన్లో గుర్తించడం వీలవుతుంది. అయితే గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఈ ఆప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారు దీనిని ఆక్షేపిస్తూ సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఆప్‌ను ప్రవేశపెట్టేముందే డిమ్టస్ నంబర్లను ధ్రువీకరించుకొని ఉండే బాగుండేదని అమన్ గుప్తా అనే యూజర్ అభిప్రాయపడ్డారు. ‘ఒకరోజు నాకు ఆఫీసు ఆలస్యం కావడంతో ఆటో కోసం పూచ్-ఓ ఆప్‌ను వాడాను. అం దులో ఇచ్చిన ఫోన్ నంబరకు డయల్ చేస్తే ఆటోడ్రైవర్ తండ్రి మాట్లాడాడు’ అని రాకేశ్ కుమార్ శర్మ అనే జర్నలిస్టు వాపోయారు. నగరంలో ప్రస్తుతం 24 వేల ఆటోలకు జీపీఎస్ (జియో పొజిషనింగ్ సిస్టమ్) సదుపాయం ఉంది. మిగతా ఆటోలు కూడా జీపీఎస్ పరికరాలను బిగించుకుంటే మరిం త మందికి ఆన్లైన్లో ఆటోలు సేవలు అందుబాటులోకి వస్తాయని డిమ్టస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆటో డ్రైవర్ల నంబర్లు తప్పుగా నమోదు కావడంపై అధికారులు స్పందిస్తూ నంబర్లను మార్చే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రక్రియ ను ఐదారు రోజుల్లో పూర్తి చేసిన తరువాత వినియోగదారులకు ఎటువంటి సమస్యలూ ఉండబోవని సంస్థ సీనియర్ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు.