ఢిల్లీ: భారత వ్యవసాయ రంగంలో ఓ శకం ముగిసింది. భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్.ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎనలేని సేవ చేశారు.
దేశంలో ఆహార కొరతను ఎదుర్కొనడానికి మేలైన వరి వంగడాలను స్వామినాథన్ సృష్టించారు.1960 నుంచి 1970ల్లో స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చింది. కరువు కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధివైపుకు మరలించారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించి వ్యవసాయ ఉత్పాదకతను అమాంతం పెంచారు.
వ్యవసాయ రంగంలో వినూత్న విధానాలతో స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహనతో ఆధునిక శాస్త్రీయ పద్ధతులను మిళితం చేశారు స్వామినాథన్. దీంతో ఎంతో మంది తక్కువ ఆదాయ రైతులు దేశాభివృద్ధికి గణనీయంగా తోడ్పాటునిచ్చారు. స్వామినాథన్ చేసిన సేవలకు గాను 1987లో మొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను అందుకున్నారు. ఆ డబ్బుతో ఆయన చెన్నైలో ఎమ్.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. 1971లో స్వామినాథన్‌కు రామన్‌మెగసెసే అవార్డు, 1986లో అల్బర్ట్ ఐన్‌స్టీన్ సైన్స్ అవార్డ్‌లతో సత్కరించారు. పద్మ విభూషన్, పద్మ శ్రీ అవార్డులు కూడా ఆయన్ను వరించాయి.
బాల్యంలోనే నిర్ణయం..
1925 ఆగష్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో స్వామినాథన్ జన్మించారు. డా.ఎం.కె. సాంబశివన్, పార్వతి దంపతులకు రెండవ కుమారుడు. ఆయన 11 యేట తండ్రి మరణంచగా.. ఆయన మామయ్య సంరక్షణలో చదువు కొనసాగించారు. కుంభకోణంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1943 నాటి బెంగాల్ కరువు పరిస్థితులను స్వయంగా చూసిన ఆయన.. ఆ దుర్భర పరిస్థితులను దేశం నుంచి పారదోలాలని నిర్ణయించుకున్నారు. మొదట జంతుశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన మద్రాసు వ్యవసాయ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్రవేత్తగా ఎదిగారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో స్వామినాథన్‌కు పరిచయమైన మీనాతో ఆయన వివాహం అయింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Father of India's Green Revolution, MS Swaminathan passes away in Chennai, Tamil Nadu.
— ANI (@ANI) September 28, 2023
(Pic: MS Swaminathan Research Foundation) pic.twitter.com/KS4KIFtaP2
ఎన్నో బాధ్యతలు..
1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరెక్టర్‌గా స్వామినాథన్ పనిచేశారు. 1979 నుంచి 1980 వరకు భారత వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు కూడా ఆయన తన సేవలను అందించారు. 2014 వరకు నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు.
#WATCH | Dr Soumya Swaminathan, former Chief Scientist and former Deputy Director General at the WHO and daughter of MS Swaminathan, says, "...He was not keeping well for the last few days... His end came very peacefully this morning... Till the end, he was committed to the… https://t.co/n8B313Q2et pic.twitter.com/0BKDqqXbse
— ANI (@ANI) September 28, 2023
భారత్‌లో చేసిన సేవల కంటే స్వామినాథన్ ప్రపంచ వేదికపై ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వివిధ అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ కార్యక్రమాలకు ఆయన మేధస్సును అందించారు. టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన 20 మంది ఆసియన్లలో ఒకరిగా ఆయనకు స్థానం దక్కింది.
ఇదీ చదవండి: భారత్-కెనడా వివాదం: జైశంకర్, బ్లింకెన్ కీలక సమావేశం
Comments
Please login to add a commentAdd a comment