ఎం.ఎస్.స్వామినాథన్ రాయని డైరీ
విలువల్లేవు అనే మాట... ఇంట్లో బియ్యం లేవు అనే మాటలా తోస్తుంది నాకు... ఎవరు ఏ సందర్భంలో మాట్లాడినా! ప్రణబ్‌జీ ప్రసంగం వింటున్నాను. పార్లమెంటు భవనంలా ఆయన ఎంతో గంభీరంగా ఉన్నారు. ఆయన మాట్లాడబోతున్నది అంతకన్నా గంభీరమైన సంగతని తెలుస్తూనే ఉంది. రెండ్రోజుల క్రితమేగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాకుండానే ముగిసింది!
ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవాలని ప్రణబ్‌జీ అంటున్నారు. అది ఉద్బోధా లేక ప్రాధేయపూర్వకమైన అభ్యర్థనా అన్నదే తెలియడం లేదు. జాతిని ఉద్దేశించిన ఆయన ప్రసంగంలో... జాతిని ఉద్ధరించేవారి ప్రస్తావనే ప్రస్ఫుటంగా ఉంది. కనుక దానిని ఉద్బోధనా కాదు, అభ్యర్థనా కాదు... ఆవేదన అనుకోవాలి. పార్లమెంటులో ఎవరి రిక్వెస్టును ఎవరు పట్టించుకున్నారనీ... ప్రజల్ని, రాష్ట్రపతిని పట్టించుకోడానికి! ట్రిస్ట్ విత్ డెస్టినీ గుర్తుకొస్తోంది నాకు. నా ఇరవై రెండేళ్ల వయసులో... దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆ అర్ధరాత్రి... నేను విన్న నెహ్రూ ప్రసంగం! అలసట తీర్చుకునే మజిలీ కాద ట మన ముందున్న భవిష్యత్తు. ఎంత బాగా చెప్పారు!
‘పీఠంపై సుఖంగా కూర్చోడానికి లేదు. మాట మీద నిలబడాలి. దేశ ప్రజలకు ఇప్పటి వరకు మనం చేసిన ప్రమాణాలను,
ఈ రోజు మనం చేస్తున్న ప్రతిజ్ఞను నెరవేర్చడానికి భవిష్యత్తులోకి వెళ్తున్నాం. దేశసేవ అంటే దేశ ప్రజల సేవ. కోట్లాదిమంది నిర్భాగ్యుల సేవ’ అన్నారు నెహ్రూ. అంతేనా... చెమ్మగిల్లిన ప్రతి కంటినీ, చెంపకు జారిన ప్రతి కన్నీటి చుక్కను తుడవాలి అన్నారు. బాధ, కన్నీళ్లు ఉన్నంత కాలం... మన బాధ్యత ఉంటుందని చెప్పారు. నా సందేహం... ఇవాళ్టికీ ఆ బాధ్యతను మనం భుజానికి ఎత్తుకోలేకపోతున్నామా అని! ఎత్తుకునే ఉంటే ఇండిపెండెన్స్‌డేకొకసారి, రిపబ్లిక్‌డేకొకసారి అవే మాటల్ని మళ్లీ మళ్లీ ఎందుకని మనం సంకల్పంలా చెప్పుకుంటూనే ఉంటాం?!
ప్రణబ్‌జీ ప్రకృతి గురించి కూడా మాట్లాడారు. సమతౌల్యాన్ని కాపాడుకోవాలన్నారు. మానవ ప్రవృత్తిలో సంయమనం దెబ్బతింటే విలువలకు కరువొస్తుంది. ప్రకృతిలో సమతౌల్యం దెబ్బతింటే తిండిగింజలకు కరువొస్తుంది. రెండూ ముఖ్యమే. ఒకటి దేశానికి. ఒకటి దేశ ప్రజలకు. కరువొస్తే ఏం చేయాలో నార్మన్ బొర్లాగ్ చెప్పేవారు.
‘కొబ్బరికాయ కొట్టండి. కళ్లుమూసుకుని దేవుడిని ప్రార్థించండి. తప్పులేదు. గుడి బయటికి వచ్చాక మాత్రం నేరుగా ఇంటికి వెళ్లిపోకండి. పొలానికి వెళ్లి మట్టిని పెళ్లగించండి. రసాయన ఎరువుల్ని కలపండి. బలమైన విత్తనాలను నాటండి. పంట దిగుబడి భారమైపోయిందని దేవుడేమీ కోప్పడడు. ఆకలితో పెట్టే నైవేద్యాలు ఆయనకు మాత్రం రుచిస్తాయా’ అనేవారు. హరిత విప్లవ పితామహుడు ఆయన. పంట దిగుబడులను పెంచినట్టే, పార్లమెంటేరియన్లలో విలువల దిగుబడిని పెంచే మరో విప్లవం ఏదైనా వస్తే బాగుంటుంది. వరి, గోధుమల్లో హ్యూమన్ వాల్యూస్‌ని కూడా జోడించే కొత్త హైబ్రిడ్ కోసం ఇప్పుడేదైనా ప్రయోగం జరగాలి.
- మాధవ్ శింగరాజు