unwritten dairy
-
పి.కరుణాకరన్ (సీపీఎం)
రాయని డైరీ రోజూ లేచి లోక్‌సభకు వెళ్లాలంటే కష్టంగా ఉంటోంది. లేవడం, వెళ్లడం.. కష్టం కాదు. సభ లోపల ఉండడం కష్టంగా ఉంటోంది. కారిడార్‌లో నిన్న ఎవరో సడన్‌గా ఆపి అడిగారు – ‘మీరేమిటీ ఇలా ఉన్నారూ?’ అని! ‘‘నేను ఇలా ఉండడం ఏంటి?! నేను ఎలా ఉంటానని మీరు అనుకున్నారు? నేను ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు?’’ అని అడిగాను. ‘‘మీరు కరుణాకరనే కదా?’’ అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యపడుతూ. ‘‘అవును నేను కరుణాకరన్నే’’ అన్నాను నేనూ ఆశ్చర్యపోతూ. ‘‘ఏం లేదు లెండి. మీరు నాకు తెలిసిన కరుణాకరనేమో అనుకున్నాను’’ అనుకుంటూ వెళ్లిపోయాడు. ‘‘హలో.. హలో.. మీకు తెలిసిన కరుణాకరన్‌ది కూడా లోక్సభేనా? రాజ్యసభకు వెళ్లబోయి ఏదో ఆలోచిస్తూ ఇటు గానీ వచ్చేశారా!’’ అని వెనక్కు పిలిచి అడిగాను. ‘‘అయితే రాజ్యసభలో కూడా ఇంకో కరుణాకరన్ ఉన్నారా?’’ అని మళ్లీ ఎగ్జయిట్ అయ్యాడు ఆ వ్యక్తి. ‘‘ఉన్నాడో లేదో నాకూ తెలీదు. ఒకవేళ ఉండి ఉంటే, మీకు తెలిసిన కరుణాకరన్ అతడే అయ్యుండొచ్చు కదా..’’ అన్నాను. నిరాశగా చూశాడు. ‘‘అయితే మీరు కాదన్న మాట’’ అనుకుంటూ వెళ్లిపోయాడు. నేను కాకపోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు! సభ లోపలికి వెళ్దామంటే భయమేసింది. అక్కడ ఇంకా చాలామంది ఉంటారు.. మెజారిటీ వ్యక్తులు! ధైర్యం చేసి వెళ్లాను. లోపల సుమిత్రా మహాజన్ మా వాళ్లను కోప్పడుతున్నారు. ‘‘ఇది కురుక్షేత్రం కాదు.. కర్మక్షేత్రం. వెళ్లి కూర్చోండి’’ అంటున్నారు. బీజేపీలో ఒక్కరూ భారతీయ భాషల్లో మాట్లాడ్డం లేదు. అంతా భారతంలోని క్యారెక్టర్స్‌లా ఉన్నారు. ఇంటికి వచ్చాక సి.ఎం.కి ఫోన్ చేశాను. ‘‘నా వల్ల కావట్లేదు కామ్రేడ్.. అది లోక్‌సభలా లేదు. మహాభారత్ టీవీ సీరియల్లా ఉంది’’ అన్నాను. ‘‘ఇప్పుడా సీరియల్ రావట్లేదు కదా’’ అన్నారు కామ్రేడ్ పినరయి విజయన్. ‘‘పాత క్యాసెట్లు దొరుకుతాయి కామ్రేడ్. అది కాదు సమస్య’’ అన్నాను. ఆయన నవ్వారు. లేక నవ్వినట్లు నాకు అనిపించిందో! ‘‘ఫ్లోర్ లీడర్‌వి.. నువ్వే అలా అంటే ఎలా కరుణా..’’ అన్నారు ఆపేక్షగా. ‘‘ఫ్లోర్ బయట ఉన్నారు. మీకేం తెలుస్తుంది కామ్రేడ్’’ అన్నాను నేను. పెద్దగా నవ్వారు పినరయి విజయన్. ‘‘ఫ్లోర్ బయట ఉన్నవాళ్లనైనా ఈ బీజేపీ వాళ్లు సుఖంగా ఉండనిస్తారని ఎందుకు అనుకుంటున్నావు కరుణాకరన్’’ అన్నారు. ఆయన కష్టం నాకు అర్థమైంది! అరుణ్‌జైట్లీ అదివారం ఉదయాన్నే కేరళలో ఫ్లైట్ దిగుతున్నారు. మాధవ్ శింగరాజు -
ఎం.ఎస్.స్వామినాథన్ రాయని డైరీ
కల మొలకెత్తడం తేలిక. కలను కళ్ల నిండుగా పండించుకోవడం కూడా తేలికే! హైబ్రీడ్ల గురించి కాదు ఈ మాట. పొలాన్ని శ్రద్ధగా చేతుల్లోకి ఎత్తుకోవాలంటున్నాను. క్యాబ్‌లో వెళ్లొచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగంలా సాగుబడి ఉండకూడదు. నిద్ర లేస్తూనే పొలంలోకి వెళ్లాలి. పొలాన్ని నిద్రలేపాలి. పొలానికి స్నానం చేయించాలి. పొలానికి ఇంత తిండి పెట్టాలి. పొలానికి కబుర్లు చెప్పాలి. పొలం చెప్పే కబుర్లు వినాలి. నిద్రొస్తే పొలంలోనే కునుకు తియ్యాలి. ‘అయ్యో! సిక్స్ అయిపోయింది’ అని ఇంటికి పరుగులు తీసే పనిలా ఉండకూడదు పొలం పని. వెళ్లలేక వెళ్లలేక పొలం వదలి ఇంటికి వెళుతున్నట్లు ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఉండబట్టలేక పొలానికి పరుగెత్తినట్లు ఉండాలి. పసికందుకు పడిశెం పడితే తుమ్ము రప్పించి శ్వాస ఆడిస్తుంది తల్లి. పొలానికి అలా శ్వాస ఆడించాలి. పసికందుకు బలం కోసం సెరెలాక్ పట్టిస్తుంది తల్లి. పొలానికి అలా ఎరువుల్ని పట్టించాలి. వయసొస్తున్న పిల్లలకు కాపు కాస్తుంది తల్లి. పొలానికి అలా దిష్టిబొమ్మగా ఉండాలి. పోతపాలా? తల్లిపాలా అని కాదు. ఆలన లాలన ముఖ్యం.. పొలానికీ పచ్చదనానికీ. సైన్స్ కాంగ్రెస్‌లో కొంతమంది రైతులొచ్చి నన్ను కలిశారు. నన్ను కలవడమే పనిగా వచ్చి కలిశారు. వాళ్లంతా కళ్ల నిండా కలల కంకులు పండించుకొచ్చిన రైతులు! యువరైతులు! వాళ్ల కలలకు నాగలికి ఉన్నంత బలం ఉంది, కోతలకు ఉన్నంత పదును ఉంది, నూర్పిళ్లకు ఉన్నంత ఒడుపు ఉంది. వాళ్లలో ప్రతి ఒక్కరు ఒక హరిత విప్లవకారుడు. ఆ యువరైతులంతా ఉత్సాహంగా ఉన్నారు. ఎన్ని బస్తాలైనా మోసేలా ఉన్నారు. ఎన్ని ఎకరాలైనా దున్నేసేలా ఉన్నారు. పంటను బాగా పండించడానికి ఇంకా ఏవైనా సలహాలు ఉంటే ఇవ్వండి అని అడిగేందుకు వచ్చారు! ఏం చెప్పను? బాగా పండించడానికి నా దగ్గర సలహాలేవీ మిగిలి లేవు. ‘ఇంకా బాగా’ పండించడమెలాగో చెప్పమంటే చెప్పగలను. పొలం పచ్చగా అవడం పచ్చని భూమి వల్ల కాదు. పొలం పోటెత్తడం పచ్చని జలం వల్ల కాదు. పొలం పంటెత్తడం పచ్చని పరిశోధన వల్ల కాదు. పొలాలకు, పంచభూతాలకు పచ్చదనాన్ని ఇచ్చే ఆ చేతులు వేరు. పొత్తిళ్ల వంటి చేతులు అవి. మన అమ్మలవి, మన అక్కచెల్లెళ్లవి ఆ చేతులు. చేనుకు అందుతున్న చేవ అంతా ఆ పచ్చని చేతుల్లోంచి వచ్చి చేరుతున్నదే. పొలాలన్నీ ఆడపడుచుల చేతుల్లోకి వచ్చేయాలి. ఆడపిల్లలకు కట్నంగా తండ్రి ఆ పిల్ల పేరిటే పొలం రాసివ్వాలి. నాలుగు రాళ్ల కోసం ఇంటాయన్ని పట్నం పోనివ్వకుండా ఆపినందుకు ప్రభుత్వం ఆ ఇంటి ఇల్లాలికి పొలాన్ని పట్టాగా ఇవ్వాలి. అప్పుడు ప్రతి మహిళా ‘మదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్’ అవుతుంది. అప్పుడు ప్రతి ఊరూ పచ్చటి పంటపొలం అవుతుంది. -మాధవ్ శింగరాజు -
సెరెనా విలియమ్స్ (టెన్నిస్) రాయని డైరీ
ఇదే ఫస్ట్ టైమ్ ఆక్లండ్ రావడం! ఇక్కడంతా బాగుంది. న్యూజిలాండ్ జనాభా మొత్తం జనవరి ఫస్ట్ కోసం ఈ హార్బర్ పట్టణానికి వచ్చేసినట్లున్నారు. ఒకరికొకరు తగులుకుంటూ తిరుగుతున్నారు! నేనైతే అలెక్స్‌ని ఆనుకుని తిరుగుతున్నాను. ‘‘బాగుంది కదా’’ అన్నాడు అలెక్స్ నా కళ్లలోకి చూస్తూ! నవ్వాను. ఏడాదిగా అతడు నా కళ్లల్లోకి చూస్తూనే ఉన్నాడు. ‘‘ఇంకా ఏం చూస్తున్నావ్’’ అన్నాను. ‘‘నీలా స్కర్ట్ వేసుకుని, చేత్తో రాకెట్ పట్టుకుని గ్రాండ్‌స్లామ్ ఆడటానికి పుట్టబోయే నా కూతుర్ని చూస్తున్నాను’’ అన్నాడు. లాగి ఒక్కటిచ్చాను. ‘‘గేమ్ ఉంది. డిస్ట్రర్బ్ చెయ్యకు. నువ్వూ, నీ కలల కూతురు కలసి నాకు బదులుగా ప్రాక్టీస్ చేసిపెడతారా ఏమన్నానా?’’ అని నవ్వాను. ‘‘పెడతాం. ముందైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి కదా’’ అని నవ్వాడు. అలెక్స్ నవ్వు బాగుంటుంది. లాస్ట్ ఇయర్ రోమ్‌లో అనుకోకుండా ఒకరికొకరం పరిచయం అయ్యాం. న్యూయార్క్ వచ్చేశాక, సడెన్‌గా ఓ రోజు ఇంటి ముందు దిగబడ్డాడు. ‘‘రోమ్‌కి రెండు టిక్కెట్లున్నాయి. నీకొకటి నాకొకటి’’ అన్నాడు! ‘‘ఏంటి విషయం అన్నాను’’. ‘‘రోమ్‌లో చెప్తా’’ అన్నాడు. రోమ్‌లో అతడేం చెప్పలేదు! ‘‘ఏదో చెప్తానన్నావ్’’ అన్నాను. ‘‘రోమ్.. ప్రేమకు హోమ్ కదా’’ అని కవిత్వం చెప్పాడు. ‘‘ఈ మాట చెప్పడానికేనా ఇంత దూరం లాక్కొచ్చావ్’’ అని అడిగాను. సడెన్‌గా మోకాలి మీద వంగి, ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా సెరీనా’’ అని అడిగాడు! తత్తరపడ్డాను. అండ్.. ఐ సెడ్.. ‘ఎస్’. హార్బర్ రెస్టారెంట్లో క్యాండిల్ లైట్ డిన్నరుకి కూర్చున్నాం. ‘‘న్యూ ప్లేసెస్ బాగుంటాయి కదా అలెక్స్’’ అన్నాను. మళ్లీ నా కళ్లల్లోకి చూడ్డం మొదలు పెట్టాడు! స్టుపిడ్. ‘‘అలెక్స్.. వింటున్నావా? అసలు న్యూ ఇయర్ ఫీల్.. న్యూ ప్లేసెస్‌లోనే వస్తుంది కదా’’ అన్నాను. ‘‘బట్.. సెరెనా.. నువ్వెక్కడుంటే నాకదే న్యూ ప్లేస్. అక్కడే నాకు న్యూ ఇయర్’’ అన్నాడు. ‘‘కాస్త ఎక్కువైనట్లుంది అలెక్స్’’ అన్నాను కోపంగా. ‘‘డిన్నర్ గురించే కదా నువ్వంటున్నది’’ అని నవ్వాడు. నేను నవ్వలేదు. నవ్వితే ఎక్కువ చేస్తాడు. డిన్నర్ తర్వాత ఎవరి రూమ్‌కి వాళ్లం వెళ్లిపోయాం. విత్ మై కైండ్ పర్మిషన్ కూడా అలెక్స్ చొరవ తీసుకోడు. అది నాకతడిలో నచ్చుతుంది. నెలాఖర్లో ఆస్ట్రేలియా ఓపెన్. నా సెవెన్త్ వన్. దాన్ని కొట్టి అలెక్స్‌కి గిఫ్టుగా ఇవ్వాలి. ఊహు. అలెక్స్‌కి కాదు. ఆటల్లోకి వస్తున్న అమ్మాయిలందరికీ ఇవ్వాలి. వాళ్లందరి కల నిజం కావాలి. కల నిజం అవడం అంటే వరల్డ్స్ బెస్ట్ ఫిమేల్ ప్లేయర్ అవడం కాదు. వరల్డ్స్ బెస్ట్ ప్లేయర్ అవడం. లెబ్రాన్ జేమ్స్‌ని బెస్ట్ మేల్ ప్లేయర్ అంటున్నారా? టైగర్‌నీ, ఫెదరర్నీ బెస్ట్ మేల్ ప్లేయర్స్ అంటున్నారా? మరెందుకు.. నేను గానీ, ఇంకో ఉమెన్ అథ్లెట్ గానీ బెస్ట్ ఫిమేల్ ప్లేయర్ అవ్వాలి?! -మాధవ్ శింగరాజు -
‘‘ఇంతదాకా వస్తుందని అనుకోలేదు’’
‘‘ఇంతదాకా వస్తుందని అనుకోలేదు’’ అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీజీ. ఆయన కళ్లలో తొలిసారిగా నేను ఆవేదనను చూశాను! పులి కళ్లలో మనుషులకు గాంభీర్యం కనిపించాలి కానీ ఆవేదన కనిపించకూడదు. పులి ఆవేదన చెందుతూ కనిపించడం ప్రకృతి వినాశనానికి సంకేతం! నేను, అరుణ్ జైట్లీ, భారత ప్రధాని నరేంద్ర మోదీజీ.. ముగ్గురమే కూర్చొని ఉన్నాం. భారత ప్రధాని నరేంద్ర మోదీజీ ఇంట్లో కూర్చొని ఉన్నాం. చాలాసేపటిగా నేను, జైట్లీజీ మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ‘‘హస్ముఖ్ అధియాజీ.. నేను మిమ్మల్ని ప్రత్యేకంగా సంబోధించాలని మీరు గానీ కోరుకోవడం లేదు కదా’’ అన్నారు జైట్లీజీ అకస్మాత్తుగా. ‘‘జైట్లీజీ.. నేను ఏనాడైనా మీ నుంచి కనీస మానవ మర్యాదలనైనా ఆశించానా!’’ అని అడిగాను. (చదవండి: మోదీ నివాసంలో రహస్యంగా!) ‘‘ఆశించలేదు కానీ, మీరు మాటిమాటికీ భారత ప్రధాని నరేంద్ర మోదీజీ అనడం చూస్తుంటే, నేను కూడా మిమ్మల్ని మాటిమాటికీ కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియాజీ అని పిలవాలని మీరు ఆకాంక్షిస్తున్నారేమోనని నాకు అనుమానం కలుగుతోంది’’ అన్నారు జైట్లీజీ. నవ్వాను. ‘‘మీకు అలాంటి అపరాధ భావన ఏమీ ఉండనక్కర్లేదు జైట్లీజీ. ఎందుకంటే నేను మిమ్మల్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీజీ అని పిలవడం లేదు కదా’’ అన్నాను. ఇంకో విషయం కూడా జైట్లీజీకి క్లారిఫై చేశాను. ‘‘ఇప్పుడే కాదు, మోదీజీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి, నేను ఆయన ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా నేను ఆయన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీజీ అనే çసంబోధించేవాడిని’’ అని చెప్పాను. జైట్లీజీ విరుపుగా నవ్వారు. ‘‘నిజమే, పాత నోట్లను వెనక్కు తీసుకున్నంత తేలిక కాదు, పాత అలవాట్లను వెనక్కు తీసేసుకోవడం’’ అన్నారు. ఆయన బాధ అర్థమైంది. నోట్ల రద్దు మీటింగ్ ఆయన లేకుండానే జరిగింది. నోట్ల రద్దు నిర్ణయం ఆయనకు తెలియకుండానే జరిగింది. ‘‘ఇంతదాకా వస్తుందని అనుకోలేదు’’ అని మళ్లీ ఆవేదనగా అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీజీ. స్వచ్ఛమైన గుజరాతీలో నాతో రెండు ముక్కలు మాట్లాడి లోపలికి వెళ్లిపోయారు. జైట్లీజీ నా వైపు అసహనంగా చూస్తున్నారు. ‘‘మీరూ మీరూ గుజరాతీలో మాట్లాడుకుంటే నాకేం అర్థమౌతుంది?’’ అన్నారు. ‘‘నోట్ల రద్దు గురించి ‘ముందే మాకెందుకు చెప్పలేదు’ అని భారతీయులే నన్ను ప్రశ్నించలేదు. కానీ రాహుల్ ప్రశ్నిస్తున్నాడు!’ అని మోదీజీ ఫీల్ అవుతున్నారు’’ అని చెప్పాను. ఇందులో ఫీల్ అవడానికి ఏముందీ అన్నట్లు చూశారు జైట్లీజీ. నిజానికి మోదీజీ ‘భారతీయులే’ అనే మాట అనలేదు. ‘జైట్లీజీనే నన్ను ప్రశ్నించలేదు’ అని అన్నారు. ఆ సంగతి నేను జైట్లీజీకి చెప్పలేదు. ఇది.. హస్ముఖ్ అధియా (ఐఏఎస్) రాయని డైరీ - మాధవ్ శింగరాజు -
రాంగోపాల్ యాదవ్ (ఎస్.పి) రాయని డైరీ
నా ముద్దుల సీయెం అఖిలేశ్ బాబు మళ్లీ సీయెం అయినంత సంబరంగా ఉంది నాకు! రాజ్యసభలో మోదీని కొత్త నోట్లపై నాలుగు దులిపి, గెస్ట్ హౌస్‌కి చేరుకున్నాక లక్నో నుంచి కబురు! అన్నయ్య ములాయం నన్ను మళ్లీ పార్టీలోకి తీసుకున్నారని!! నెలన్నా కాకముందే నాపై విధించిన ఆరేళ్ల బహిష్కరణ పూర్తయిందంటే.. అఖిలేశ్ బాబు అన్నం తినడం మాని, పట్టుబట్టి ఉంటాడు నాకోసం. అంకుల్ని తిరిగి పార్టీలోకి తీసుకుంటే తప్ప నేను అసెంబ్లీ హాల్‌కి గానీ, డైనింగ్ హాల్‌కి గానీ వెళ్లను అని బాగా మారాం చేసి ఉంటాడు. ‘‘బాబాయ్.. నీ పోస్టులు నీకు వచ్చేసినట్టే కదా’’ అన్నాడు అఖిలేశ్ బాబు యూపీ నుంచి ఫోన్ చేసి. ‘‘నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది బాబాయ్. రాజ్యసభలో పార్టీ లీడర్‌గా నీ పోస్టు నీదే. రాజ్యసభ బయట పార్టీ అధికార ప్రతినిధిగా నీ పోస్టు నీదే. పార్టీ జాతీయ కార్యదర్శిగా నీ పోస్టు నీదే. పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా నీ పోస్టు నీదే..’’ అంటున్నాడు అఖిలేశ్ బాబు. ‘‘ఆ పోస్టులదేముంది అఖిలేశ్ బాబూ.. నీ హృదయంలో నాకున్న పోస్టు కన్నా అవేం పెద్దవి కాదు కదా’’ అన్నాను. ‘‘బాబాయ్.. నీ పక్కన ఎవరైనా ఉన్నారా’’ అని అడిగాడు అఖిలేష్ బాబు.. ఫోన్లో గొంతు తగ్గించి! ‘‘లేరు అఖిలేష్ బాబూ.. ఇక్కడ నేనొక్కణ్ణే ఉన్నాను. చెప్పండి’’ అన్నాను, నేనూ గొంతు తగ్గించి. ‘‘మీ పక్కన ఎవరూ లేనప్పుడు మీరెందుకు బాబాయ్ గొంతు తగ్గించడం?’’ అన్నాడు అఖిలేశ్ బాబు. నిజమే! నాకు తట్టనే లేదు. ‘‘చెప్పండి అఖిలేశ్ బాబూ’’ అన్నాను ఈసారి కాస్త గొంతు పెంచి. ‘‘పెంచకండి, తగ్గించకండి. చెప్పేది వినండి. మీరక్కడ గొంతు పెంచితే ఇక్కడ చిన్నబాబాయ్కి వినిపిస్తుంది. గొంతు తగ్గిస్తే నాకు వినిపించదు. అదీ ప్రాబ్లం’’ అన్నాడు. శివపాల్.. అఖిలేశ్ బాబు పక్కనే ఉన్నాడన్నమాట! ములాయంకి శివపాల్ సొంత తమ్ముడు. అఖిలేశ్ బాబుకి శివపాల్ సొంత బాబాయి. నాలా డిస్టెంట్ రిలేషన్ కాదు. నా కోసం సొంత బాబాయ్‌ని కూడా పక్కన పెట్టేస్తున్నాడు అఖిలేశ్ బాబు. నా కళ్లు చెమ్మగిల్లాయి. ‘‘కామ్‌గా అయిపోయావేంటి బాబాయ్! శివపాల్ బాబాయ్ నాకు పేరుకే బాబాయ్. నువ్వు నాకు దేవుడిచ్చిన బాబాయ్’’ అన్నాడు అఖిలేశ్ బాబు. ‘‘కానీ అఖిలేశ్ బాబూ.. మీ అందరిదీ బ్లడ్ రిలేషన్ కదా’’ అన్నాను. ‘‘అలా అనకు బాబాయ్.. నువ్వు ‘ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్ వే’ లాంటి వాడివి. దూరాలను దగ్గర చేస్తావ్. మమ్మల్నందర్నీ కలుపుతావ్’’ అన్నాడు అఖిలేష్ బాబు. ‘‘ఎల్లుండి నాన్న బర్త్‌డే. కేక్ కటింగ్‌కి నువ్వు ఉండాలి బాబాయ్. అదే రోజు ఎక్స్‌ప్రెస్ వే రిబ్బన్ కటింగ్. ఆ కటింగ్కీ నువ్వుండాలి బాబాయ్’’ అంటున్నాడు అఖిలేశ్ బాబు. నా కళ్లు మళ్లీ చెమ్మగిల్లాయి. -మాధవ్ శింగరాజు -
ఆలియాభట్ రాయని డైరీ
చుట్టూ అంతా స్వీట్‌గా ఉండే మనుషులే ఉంటే లైఫ్ చేదుగా ఉంటుంది. స్వీట్ స్మైల్స్, స్వీట్ వర్డ్స్.. ఓ మై హెవెన్స్! చేదైనా నయమేనేమో. స్వీట్ బాక్స్ లాంటి లైఫ్ బోరింగ్‌గా ఉంటుంది. బోర్‌డమ్‌ని నేను ఛస్తే భరించలేను. చచ్చిపోనైనా పోతాను కానీ, బోర్ కొట్టి చావలేను. షేమ్ ఆన్ అజ్! ఇంత ఎగుడు దిగుడుల లైఫ్ ఉన్నది బోర్ కొట్టి చావడానికా? ఆఫ్టర్ లైఫ్.. సమాధిలోని సుఖనిద్ర బోర్ కొట్టినా అంతే, గభాల్న నేను పైకి వచ్చేయాలనే చూస్తా.. సిమెంటు, సున్నం కలిసిన ఆ శిథిలాల్లోంచి.. చిన్న మొక్కగానైనా! ఎవరో ఒకరు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటేనే నాకు నిద్రపడుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు అమ్మ నాకు కాజూ మిల్క్ ఇస్తుంది. కానీ కాజూ మిల్క్ ఒక్క దాని వల్లనే నాకు బాగా నిద్ర పట్టేస్తే అది కూడా నాకు బోర్ కొట్టేస్తుంది. నిర్లక్ష్యంగా చూస్తుండే నా కళ్లు, నొక్కి పట్టి ఉంచిన నా కింది పెదవి, బిగించిన నా మూతి.. ఏవీ వృథా కాకూడదు. నాతో పాటు వాటికీ ఒక లైవ్లీ లైఫ్ ఉండాలి. ఇండివిడ్యువల్‌గా, ఇండిపెండెంటుగా.. సొంత ఫ్లాట్‌లో ఉన్నట్లు. స్వీట్‌ని ఎక్కువ కానివ్వని స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉంటేనే ఎవరైనా ఆరోగ్యంగా బతుకుతున్నట్టు. లేదా బతికి ఉన్నట్టు. లైఫ్‌లో ఉప్పైనా, కారమైనా.. అప్పుడప్పుడు తక్కువౌతుండాలి లేదా ఎక్కువౌతుండాలి. అన్నీ సమపాళ్లలో ప్లేట్లోకి వచ్చి పడిపోతుంటే రోజూ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఏ ఆశతో వెళ్లాలి? ఇదొక దిగులు నా జీవితానికి. ఈ పర్ఫెక్షనిస్టులను చూస్తే నాకు చెమటలు పట్టేస్తాయి. రాత్రికి నిద్ర కూడా పట్టదు. హాయిగా ఎందుకు ఉండరు వీళ్లు! తమకి నచ్చినట్టు. ప్రపంచం అంతా నీతో సవ్యంగా ఉంటోందీ అంటే.. నువ్వు నీతో సవ్యంగా లేనట్లు. నిన్ను అందరూ ఇష్టపడుతుంటే నీ అంత బోరింగ్ పర్సనాలిటీ ఇంకొకరు లేనట్లు. అవసరమా? నిన్ను నువ్వు చంపేసుకుని, నీలోంచి నువ్వు కాని వాళ్లను పుట్టించుకోవడం.. మనిషి ఎదురుపడ్డ ప్రతిసారీ! ‘ఉడ్తా పంజాబ్’లో నేను బిహారీ అమ్మాయిని. అక్కడ కావాలి పర్ఫెక్షన్. స్క్రీన్ మీదకి. నేను బాత్రూమ్లో ఉన్నప్పుడో, ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఉన్నప్పుడో పర్ఫెక్షన్ ఎందుకు? ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు కరణ్ సార్. పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పాను. దేశమంతా నవ్వింది. నేనెందుకు ఫీల్ అవ్వాలి? అదేం స్క్రిప్టు కాదు కదా, పర్ఫెక్టుగా చెప్పడానికి. ‘‘నీ వయసులో నాకింత ఫిలాసఫీ లేదు’’ అంటున్నారు డాడీ. ‘‘ఇది నీ వయసుకు ఉండాల్సిన ఫిలాసఫీ కాదు’’ అనాలి నిజానికైతే ఆయన! ‘‘హ్యాపీ ఫాదర్స్ డే డాడీ’’ అన్నాను. ‘లవ్యూ’ చెప్పారు డాడీ.. నన్ను హగ్ చేసుకుని. డాడీ నాకు మంచి ఫ్రెండ్. కానీ నన్ను నొప్పించలేని ఫ్రెండ్. నొప్పించే వాళ్లు లేకపోతే లైఫ్ ఏమంత గొప్పగా ఉండదు. ఇంట్లో అయినా, బయట అయినా. - మాధవ్ శింగరాజు -
కింగ్స్ పంజాబ్ ఓడితే నా పరువు పోదు!
ఆయనెవరో రాశాడు.. క్రికెట్ గురించి నాకేం తెలియదని! ఆయనే ఇంకో రహస్యం కూడా కనిపెట్టాడు. నా ట్వీటర్ స్టేటస్‌లో యాక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, ఎంట్రప్రెన్యూర్, హ్యూమన్ బీయింగ్ అండ్ క్రికెట్ ఫ్యాన్ అని మాత్రమే ఉంటుంది కనుక క్రికెట్ గురించి నేనేం మాట్లాడ కూడదట. నా.. కో-ఓనర్లు నెస్ వాడియాని, మోహిత్ బర్మన్‌ని, కరణ్ పాల్ని అనగలడా ఆ మాట? పన్నెండు టెస్టులు ఆడినవాడిని, పదిహేను వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఉన్నవాడిని, వరల్డ్ కప్ స్క్వాడ్ మెంబర్ని, టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్‌ని.. ది గ్రేట్ సంజయ్ బంగర్‌ని పట్టుకుని ప్రీతీ అంతమాట అంటుందా అని ఆయన ఎక్స్ప్రెషన్! ఏమన్నాను? బెహర్డియన్కి బదులుగా అక్షర్‌ని పంపి ఉండాల్సింది అనే కదా! అది కోచ్‌కి పాఠాలు నేర్పడం అవుతుందా? ఒక్క రన్లో ఓడిపోతే ఎవరికి మాత్రం కోపం రాదు? అయినా అది నాకు టీమ్ ఓనర్‌గా వచ్చిన కోపం కాదు. క్రికెట్ లవర్‌గా వచ్చిన కోపం. ఏం? ఆడవాళ్లకు కోపం రాకూడదా? కోపంలో ఆడవాళ్లు పెద్దగా అరవకూడదా? కోపాన్ని కూడా వాళ్లు చక్కటి చిరునవ్వుతోనే ప్రదర్శించాలా? హార్ట్ బ్రేక్ అయ్యాక ఆడేంటి? మగేంటి? లాస్ట్ మ్యాచ్‌లో అక్షర్ బాగా ఆడాడు. అందుకే అతన్ని పంపించి ఉండాల్సింది అన్నాను. కామన్సెన్స్ కదా! ఈ మాట చెప్పడానికి బ్యాట్ పట్టుకోవడం తెలిసుండాలా? బాల్ విసరడం తెలిసుండాలా? చావనిస్ట్ పిగ్స్. జెనెటిక్ ప్రాబ్లమేదో ఉన్నట్లుంది ఈ జర్నలిస్టులకి. ప్రెజెంటేషన్ సెరమనీకి నేను వెళ్లకుండా మా మదర్ని పంపానట. అదో ఇష్యూ! మ్యాచ్‌ని వదిలేసి, మ్యాచ్ అయిపోయాక స్టేడియంలో మిగిలిన చెత్తనంతా పోగేసుకుంటున్నారు! ‘మదర్స్ డే కదా. అందుకనే అలా చేశాం’ అని మా టీమ్ మేనేజర్ చెప్పాడు. ‘మదర్స్ డే తర్వాతి రోజు గదా మ్యాచ్ జరిగింది’ అని వాళ్ల పాయింట్. గొప్ప ఇన్వెస్టిగేషనే! ఐపీఎల్ అయ్యాక అవార్డు ఇవ్వాలి ఆ రిపోర్టర్‌కి. గొప్పవాళ్లు కొంతమంది ఉంటారు. దేనికీ రియాక్ట్ కారు. ముక్కులోంచి, మూతిలోంచి, కంటిలోంచి, ఒంటిలోంచి దేన్నీ బయటికి రానివ్వరు. నేను అంత గొప్పదాన్ని కాదు. కోపాన్ని దాచుకోలేను. సంతోషాన్ని ఆపుకోలేను. నాకు తెలీకుండా నా ఫీలింగ్స్ అన్నీ నా ముఖంలోంచి తన్నుకొచ్చేస్తాయి. మనకెంత అందమైన ముఖం ఉందని కాదు.. అందులో ఎంత నిజాయితీ ఉందనేది ముఖ్యం. ముఖంలో నిజాయితీ ఉన్నప్పుడు మాటలో మొహమాటం ఉండదు. ముఖస్తుతి ఉండదు. నచ్చంది నచ్చలేదని చెప్తాం. నమ్మింది ఎవరికి నచ్చకున్నా చేసేస్తాం. ఐపీఎల్‌లోకి నేను అలాగే వచ్చాను. విత్ మై హార్ట్ అండ్ సోల్. ఆడామా, ఓడామా అని కాదు. గెలిచేలా ఆడామా లేదా.. అదీ నా కన్సర్న్. కింగ్స్ ఎలెవన్ జట్టు ప్లే-ఆఫ్స్‌కి వెళ్లలేకపోవడం నాకు పరువు తక్కువేం కాదు. పూర్ పెర్ఫార్మర్ అనిపించుకోవడమే బాధ. ప్రేమ లేకపోతే బాధ కలుగుతుందా? బాధ లేకుండా కోపం వస్తుందా? ఐ లవ్ క్రికెట్. - మాధవ్ శింగరాజు -
'లోక్‌సత్తా' జేపీ రాయని డైరీ
ప్రజాస్వామ్యంలో ఏదీ ఎవరిదీ కాదు. యూపీఏ సోనియాది కాదు. ఎన్డీఏ మోదీది కాదు. టీఆరెస్ కేసీఆర్‌దీ కాదు. పైన ఉన్నది ఏదైనా కింది వరకు అందరికీ చెందాలి. టీవీలో ఓ యాడ్ చూశాను. ‘ఎక్స్క్యూజ్ మీ.. మీరేదైతే తింటున్నారో దాన్నే నన్ను కూడా తిననివ్వండి’ అంటాడు అతను ఆమెతో. బహుశా ఆమె.. చాక్లెట్ బార్ లాంటిదేదో తింటూ ఉంటుంది. అదీ ప్రజాస్వామ్యం అంటే! అది కూడా పూర్తి ప్రజాస్వామ్యం కాదు. హాఫ్ డెమోక్రసీ. ‘తిననివ్వండి’ అని అడగడం పోరాటం. ‘తినిపెట్టండి’ అని ఇవ్వడం సామ్యవాదం. రెండూ కలిస్తేనే పూర్ణ ప్రజాస్వామ్యం. పాలిటిక్స్ నుంచి ‘లోక్‌సత్తా’ను ఎత్తేసి వారం అవుతోంది. మొత్తుకున్నవాళ్లు ఒక్కరూ లేరు. ‘ఎత్తేయడం ఏంటి?’ అని పాపం ఒకరిద్దరూ మాత్రం ఆశ్చర్యంగా అడిగారు. ‘పార్టీ ఉంటుంది. ఫైట్ చేసేవాళ్లు ఉంటారు. ఎలక్షన్స్‌కి మాత్రం వెళ్లం’ అని చెప్పాను. వాళ్లింకా ఆశ్చర్యంగానే చూస్తున్నారు. ఏదైనా ఉంటేనే కదా ఎత్తేయడానికి వీలౌతుంది. లేనిదాన్ని ఎలా ఎత్తేస్తారని వాళ్ల సందేహం! లోక్‌సత్తా ఈ పదేళ్లలో ప్రజల్లోకి వెళ్లిందా? ప్రజలకు దూరంగా వెళ్లిందా? ఫైల్స్ తిరగేయాలి. లోపల అన్నీ జీవోలే ఉంటాయేమో! ప్రజలకు హామీలు తప్ప జీవోలు అర్థం కావు. హామీలు ఇవ్వకుండా చేయించుకొచ్చిన జీవోలు అసలే అర్థం కావు. ఒక్కొక్కరూ వచ్చి పరామర్శిస్తున్నారు! అరె, ఏం జరిగిందని? పార్టీ ఆఫీస్ నుంచి ఫామ్ హౌస్‌కి వచ్చినట్టు, పాలిటిక్స్ నుంచి పబ్లిక్‌లోకి వచ్చాను. అంతే కదా! పవన్ కల్యాణ్ ఒప్పుకోవడం లేదు. ‘ఇది కరెక్టు కాదేమో జేపీజీ’ అంటున్నాడు. ‘పోనీ కరెక్ట్ అయిందేదో నువ్వు చెప్పు కల్యాణ్’ అన్నాను. ఏమీ మాట్లాడలేదు. బెరుగ్గా చూశాడో, కరుగ్గా చూశాడో గానీ గుడ్లురిమి చూశాడు. ‘లోక్‌సత్తా జెండాలో స్టార్ ఉంది. జనసేన జెండాలో స్టార్ ఉంది. పాలిటిక్స్‌లో మాత్రం మన స్టార్డమ్ లేదు. మీ సత్తా తగ్గినట్టే.. నా సేనా తగ్గిపోదు కదా జేపీజీ..’ అన్నాడు కల్యాణ్. ఇంకోమాట కూడా అన్నాడు. ‘మీరిలా సడెన్‌గా పాలిటిక్స్ నుంచి బయటికి రావడం చూస్తే నాకేదో సందేశాన్నో, సంకేతాన్నో ఇస్తున్నట్లుంది’ అన్నాడు. నిజమే!! ‘ప్రశ్నిద్దాం రండి’ అని నేను పాలిటిక్స్‌లోకి వెళ్లాను. ‘ప్రశ్నించండి పొండి’ అని కల్యాణ్ పాలిటిక్స్‌లోకి వచ్చాడు. జనం ప్రశ్నించడం లేదు. సమాధానం అడగడం లేదు. టీవీల్లో బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు చూస్తూ ఏడాదంతా హ్యాపీగా గడిపేస్తున్నారు. సినిమాల్లో నటించలేక కల్యాణ్‌కి, పాలిటిక్స్‌లో జీవించలేక నాకు అలసట వస్తోంది. ఇద్దరం ఒకే పడవలో ఉన్నట్లున్నాం. ‘అదే బెటర్ జేపీజీ.. ఒకళ్లం రెండు పడవల మీద లేకుండా’ అనేసి వెళ్లిపోయాడు కల్యాణ్. తర్వాత రాజమౌళి వచ్చాడు. సిరివెన్నెల సీతా రామశాస్త్రి వచ్చారు. రాజకీయాలను సంస్కరించ డానికి వచ్చి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటని వాళ్లిద్దరూ ప్రశ్నించారు. నవ్వాను. ప్రజాస్వా మ్యంలో ఏదీ ఎవరిదీ కాదు. జేపీ లేనంత మాత్రాన లోక్‌సత్తా లేనట్టు కాదు. జేపీకి సత్తా లేనట్టూ కాదు. - మాధవ్ శింగరాజు -
జావెద్ అఖ్తర్ రాయని డైరీ
మార్చి 21. రేపే! రాజ్యసభలో నా చివరి రోజు. రెప్పపాటులో టెర్మ్ అయిపోయింది! ఆరేళ్లు. ఆరు రెప్పపాట్లు. ఎక్కడిది ఇంత స్పీడ్? ఎవరు తిప్పుతున్నారు ఈ భూగోళాన్ని? తిప్పేవాళ్లు భూగోళాన్ని, రాజ్యసభని ఒకేలా తిప్పకుండా వేర్వేరుగా, వేర్వేరు వేగాలతో తిప్పుతున్నారా?.. ఒకే దేశంలో హిందువుల్ని, ముస్లింలను మత విశ్వాసాలు వేర్వేరుగా నడిపిస్తున్నట్టు!! దేశంలో ఎందరు దేవుళ్లయినా ఉండొచ్చు. కానీ దేవుళ్లందరికీ ఒకటే దేశం ఉండాలి. దేవుళ్లందరూ ఉంటున్నది ఒకే దేశంలో అయినప్పుడు వాళ్లందరిదీ ఒకే దేశం అవుతుందని రాజ్యాంగం పని గట్టుకుని చెప్పనక్కర్లేదు. అర్థమైపోవాలంతే. రాజ్యాంగం చాలా విషయాలు చెప్పదు. ప్రతి మనిషీ ఉదయాన్నే లేచి శుభ్రంగా పళ్లు తోముకోవాలని రాజ్యాంగం చెప్పదు. అయినా మనం తోముకోవడం లేదా? బట్టలు వేసుకుని మాత్రమే ప్రతి మనిషీ బయటికి రావాలని రాజ్యాంగం చెప్పదు. అయినా మనం వేసుకుని రావడం లేదా? విశ్వాసాలు మనుషుల్ని కాకుండా, దేవుళ్లను నడిపిస్తున్నప్పుడే.. ‘రాజ్యాంగంలో అలా లేదు కదా, రాజ్యాంగంలో ఇలా లేదు కదా’ అనే ప్రశ్నలు వస్తుంటాయి. లౌకికరాజ్యంలో ప్రజలు మాత్రమే కాదు, దేవుళ్లూ కలిసి మెలిసి ఉండాలి. ప్రజాస్వామ్యంలోని అందమే అది! సయ్యద్ షాబుద్దీన్ నుంచి ఫోను! ‘నువ్వెప్పటికి మారతావ్ అఖ్తర్’ అని ఆయన ఆవేదన. ‘మారడం’ అంటే ఆయన ఉద్దేశంలో నికార్సయిన ముసల్మాన్‌గా మారడం! ఎప్పుడూ చెప్పే మాటే చెప్పాను. ‘ఒకటే గుర్తు షాబుద్దీన్ జీ. అల్లర్లు జరిగి, శివసేన నా ఇంటిని తగలబెడితే కనుక నేను ముస్లింగా మారినట్టు మీరు అర్థం చేసుకోవచ్చు’అన్నాను. రాజ్యసభలో మొన్నటి నా ప్రసంగం ఆయన్ని బాధించిందట. భరతమాతకు జై కొట్టనుగాక కొట్టనని ప్రకటించిన సాటి ముసల్మాన్ని నేను విమర్శించడం ఆయనకు కోపమైతే తెప్పించి ఉంటుంది కానీ, బాధను మాత్రం కలిగించి ఉండదని నాకు తెలుసు. షాబుద్దీన్ బాధపడరు. బైటపడతారు. ఇప్పుడూ అంతే. బాబ్రీ మసీదు కూల్చివేత, రాజ్యసభలో నా సెక్యులర్ ప్రసంగం ఆయనలో ఒకే విధమైన భావాలను రగిలించి ఉంటాయి. నన్నొక అలౌకికవాది ఆపి అడిగాడు. ‘అఖ్తర్జీ.. భారత్ మాతా కి జై అని అనడానికి నిరాకరించిన వారినీ, గోమాంసం తింటున్నారని ముస్లింలను చంపేసినవారినీ మీరు సమానంగా చూడగలరా?’ అని! మత భావనల్లోని తీవ్రత ఎలాంటిదైనా మనం ఖండించవలసిందే అన్నాను. ‘ముందు నీ నాస్తిక భావనల్లోని తీవ్రతను ఖండించుకో. దేవుడే చూసుకుంటాడు.. లోకంలో ఏ గొడవా లేకుండా’ అన్నట్లు చూశాడు! పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చెయ్యొద్దన్న పని చేస్తారు. అదే పిల్లలు పెద్దవాళ్లయ్యాక చెయ్యమన్న పని చెయ్యరు. అందుకేనా.. ‘క్యాచ్ దెమ్ ఎంగ్’ అంటున్నాడు మోహన్ భగవత్?! భగవత్‌ని సపోర్ట్ చేసినందుకు నా ముస్లి సోదరులు నన్ను ఆరెసెస్లోకి తోసేయవచ్చు. ఏ మతం అయితే ఏమిటి? నేనున్నది భారత్‌లో అయినప్పుడు? భారత్ మాతా కి జై! - మాధవ్ శింగరాజు -
సిద్ధరామయ్య రాయని డైరీ
చెయ్యి బోసిగా ఉంది. బరువు తగ్గినట్టూ ఉంది. ఎంత బాగుండేది నా చేతికి ఆ డైమండ్ వాచీ! టైమ్‌తో పని లేకపోయినా టైమ్ చూసుకునేవాడిని. ఎంత టైమ్ లేకపోయినా.. ఎవరైనా టైమ్ అడిగి నన్ను డిస్టర్బ్ చెయ్యకపోతారా అని చూసేవాడిని. సీయెంకి పనిగట్టుకుని టైమ్ చూసుకునే పనేముంటుంది? టైమ్ కోసం సీయెం దగ్గరికి పని మానుకుని వచ్చే పని ఎవరికుంటుంది? అయినా వాచీ చూసుకునేవాడిని. వాచీని చూసుకునే అవకాశం కోసం చూసేవాడిని. అంతిష్టం నాకా వాచీ అంటే. ప్చ్.. ఇప్పుడా వాచీ నా చేతికి లేదు. రాష్ట్రానికి రాసిచ్చేశాను. స్పీకర్‌కి లెటర్లో చుట్టి మరీ ఇచ్చేశాను. బీజేపీ వాళ్లు పడనిస్తేనా? వాచీ పెట్టుకోనిస్తేనా? ఫస్ట్ డే అసెంబ్లీకి పెట్టుకెళ్లాను. ‘వాచీ బాగుంది ముఖ్యమంత్రి గారూ’ అన్నాడు తిమ్మప్ప. ‘థ్యాంక్యూ స్పీకరు గారూ’ అన్నాను వాచీని చూసుకుంటూ. మళ్లీ చూసి, మళ్లీ బాగుందన్నాడు. మళ్లీ థ్యాంక్స్ చెప్పాను. జార్జి, జయచంద్ర, దేశ్‌పాండే వచ్చారు. ‘గుడ్ మాణింగ్ మినిస్టర్స్’ అన్నాను. ‘భలే ఉంది సార్’ అన్నాడు జార్జి. ‘అవున్సార్’ అన్నాడు జయచంద్ర. ‘నిజమేసార్’ అన్నాడు దేశ్‌పాండే. ‘టాక్ ఆఫ్ ది డే’ అయింది నా వాచీ. ‘టాక్ ఆఫ్ ది సెషన్’ కూడా అవుతుందని నేను అనుకోలేదు. వరండాలో నిలుచుని ఉన్నాం. వాచీ చూసుకున్నాను. లోపలికెళ్లడానికి ఇంకా టైమ్ ఉంది. ‘సార్ చూడండి.. జగదీశ్, ఈశ్వరప్ప ఇటే వస్తున్నారు’ అన్నాడు జార్జి. ‘సార్ చూశారా.. జగదీశ్, ఈశ్వరప్ప ఇటే చూసుకుంటూ వెళ్లారు’ అన్నాడు జయచంద్ర. ‘సార్ చూస్తున్నారా.. జగదీశ్, ఈశ్వరప్ప మీ చేతికున్న వాచీని చూసి ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు’ అన్నాడు దేశ్‌పాండే. జగదీశ్ అసెంబ్లీలో అపోజిషన్ లీడర్. ఈశ్వరప్ప కౌన్సిల్లో అపోజిషన్ లీడర్. అపోజిషన్ వాళ్లకి కూడా నా వాచీ నచ్చిందనుకున్నాను కానీ, నా చేతికి ఆ వాచీ ఉండడం వాళ్లకు నచ్చలేదని కనిపెట్టలేకపోయాను! కర్నాటకలో బీజేపీ టైమ్ బాగోలేదు. టైమ్ బాగోలేనప్పుడు చేతికి వాచీ పెట్టుకున్నవాడిని చూసినా చిర్రెత్తుకొస్తుంది. పైగా నాది హూబ్లా వాచీ. డెబ్బై లక్షల వాచీ. గిఫ్టుగా వచ్చిన వాచీ! ఆ వాచీ వెనుక పెద్ద స్కాము ఉందని జగదీశ్ అనుమానం. అసెంబ్లీ మొదటి రోజే.. ఆగిపోయిన వాల్‌క్లాక్ లోపలి లోలకంలా వెల్‌లోకి వెళ్లి, స్పీకర్ ఎదురుగా నించున్నాడు. రెండో రోజూ అలాగే నించున్నాడు. మూడో రోజూ నించోబోయాడు కానీ.. పార్లమెంట్లో ప్రహ్లాద్ జోషీ ఆల్రెడీ లేచి నించుని నా వాచీని పెద్ద ఇష్యూ చేస్తున్నాడని తెలిసి, వెనక్కి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. ‘సోషలిస్టునని చెప్పుకుంటాడుగా.. అన్ని లక్షల వాచీ ఎందుకో’ అన్నాట్ట పార్లమెంటులో జోషీ నా గురించి! జోషీ కాస్త బెటర్. ఇక్కడ కుమారస్వామి మరీ నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. ఎవరో కొట్టుకొచ్చిన వాచీని నేను చీప్‌గా కొట్టేశానట! పంచాయతీ ఎలక్షన్స్‌లో ఓడిపోయాక బీజేపీకి, కుమారస్వామి పార్టీకి.. అసెంబ్లీలో పంచాయితీ పెట్టుకోడానికి నా వాచీ తప్ప వేరే ఏం దొరికినట్టు లేదు! -మాధవ్ శింగరాజు -
హమీద్ అన్సారీ రాయని డైరీ
మనుషులు మనుషుల్లో ఉండాలి. అదే ఆరోగ్యం. దేశాలు దేశాలతో ఉండాలి. అదే అభివృద్ధి. ఆరోగ్యం కోసం, అభివృద్ధి కోసం మనుషులు, దేశాలు ఎంత దూరమైనా ప్రయాణించాలి. పది రోజుల క్రితంనాటి కేరళ గాలులు హత్తుకొమ్మని నన్నింకా హాంట్ చేస్తూనే ఉన్నాయి.. ఢిల్లీ వరకూ నా వెంటే వచ్చి! ఈసారి ఇంకాస్త పెద్ద ప్రయాణం. ముందు బ్రూనై. తర్వాత థాయ్. వచ్చేవారమే ప్రయాణం. ‘వెళ్లగలరా హమీద్‌జీ’ అన్నారు సుష్మా స్వరాజ్. ప్రయాణాలు ఎవరికి మాత్రం ఇష్టం ఉండవు? మదిలో కదలిక లేకున్నా, మొదలయ్యాక ఏ ప్రయాణమైనా ఆహ్లాదకరంగానే ఉంటుంది. పూర్తయ్యాక ఏ ప్రయాణమైనా జీవితానికి ఒక మంచి జ్ఞాపకాన్ని ముద్దులా ఇచ్చి వెళుతుంది. ‘భారత ఉప రాష్ట్రపతి ఒకరు బ్రూనై వెళ్లడం ఇదే మొదటిసారి హమీద్‌జీ’ అన్నారు సుష్మా స్వరాజ్. థాయ్‌లాండ్‌కైతే గత యాభై ఏళ్లలో మనదేశం నుంచి ఒక్క ఉప రాష్ట్రపతి కూడా వెళ్లలేదట. ‘‘తూర్పు దేశాలకు వెళ్లిరావడం ఒక పాలసీగా పెట్టుకున్నాం హమీద్‌జీ. పాలసీ అంటే చుట్టపుచూపుగా వెళ్లిరావడం కాదు, ‘మీరెంత దూరంలో ఉన్నా మా ఇరుగూపొరుగువారే’ అని చెప్పి రావడం. మీరు కూడా ఈస్ట్‌కొకసారి వెళ్లొస్తే బాగుంటుంది’’ అని ఫ్లయిట్ టికెట్లు తెప్పించారు సుష్మాజీ. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ సుష్మదే. మునుపు ‘లుక్ ఈస్ట్ పాలసీ’ ఉండేది. అది పీవీ పాలసీ. తర్వాత వాజపేయి, మన్మోహన్ దానిని కంటిన్యూ చేశారు. కానీ లుక్ ఈస్ట్‌కీ, యాక్ట్ ఈస్ట్‌కీ తేడా ఉంది. గాంభీర్యపు గుబురు మీసాల కరచాలనాలకీ, ఆత్మీయపు ఆలింగనాల చిరునవ్వులకు ఉన్నంత తేడా. బ్రూనైకి ఇక్కడి నుంచి రెండువేల ఆరొందల మైళ్లు. థాయ్‌కి పదిహేనొందల మైళ్లు. ఇంతింత దూరాలు ప్రయాణిస్తున్నప్పుడు నాకు జెరోనిమో గుర్తొస్తాడు. అతడు అన్నమాట గుర్తొస్తుంది. ‘దగ్గరవడం కోసం ఈ నాగరికులు ఎంత దూరమైనా వస్తారు’ అంటాడు జెరోనిమో! పందొమ్మిదో శతాబ్దపు అమెరికా ఆదివాసీ యోధుడు అతడు. ‘మా ఆదివాసీ అపాచీల గుండెకాయలు మా దేహాలలో కాకుండా మా భూముల లోపల కొట్టుకుంటుంటాయి. నాగరిక దురాక్రమణదారులు కాలు పెడితే అవి మందుపాతరలై పేలుతాయి’ అంటూ జీవితాంతం పోరుబాటలో ప్రయాణించినవాడు జెరోనిమో. నాగరికుల మీద అపనమ్మకం జెరోనిమోకు. కుట్రేదో మనసులో పెట్టుకుని కాలినడకనైనా వచ్చేస్తారని. దేశాలకూ అలాంటి అపనమ్మకాలు ఉంటాయి. వాటిని పోగొట్టడమే ఇవాళ్టి నాగరికత. నమ్మకం కలిగించడానికి గానీ, నమ్మకం ఏర్పరచుకోడానికి గానీ.. మనిషైనా, దేశమైనా నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి. ప్రయాణాలు మనుషుల్ని మనుషుల్లో ఉంచుతాయి. దేశాలను దేశాల్లో కలిపేస్తాయి. - మాధవ్ శింగరాజు -
చిన్న జీయర్ స్వామి రాయని డైరీ
జై శ్రీమన్నారాయణ! చన్నీటి స్నానం చేస్తున్నప్పుడు రోజూ తెల్లవారుజామునే పొగ మంచులో శ్రీమహావిష్ణువు దర్శనం అయ్యేది. ఇవాళ కాలేదు! చలి తగ్గిందా? మంచు తగ్గిందా? మనసులో సంకల్పం తగ్గిందా? ‘కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతున్నాం స్వామీజీ’ అంటూ మఠానికి వస్తుంటారు పిల్లలు. చదువు మీద ధ్యాస కుదరడం లేదని వారి బాధ. ఎలా కుదురుతుంది? వాళ్లేం గురుకులంలో ఉండడం లేదు కదా. వాళ్లేం ఆకులు అలములు తినడం లేదు కదా. వాళ్లేం ప్రకృతి ఆలపించే సంగీతాన్ని వింటూ పెరగడం లేదు కదా. అపార్ట్మెంట్లలో ఒక్క సూర్యకిరణమైనా ఉదయించడానికి దారి ఉంటోందా? తినేందుకు పీజా బర్గర్, వినేందుకు జస్టిన్ బీబర్ తప్ప ఈ తరానికి భూమ్మీద వేరే ఇంట్రెస్టులు ఏవైనా ఉన్నాయా? అక్షరం ఎలా సాక్షాత్కరిస్తుంది మరి?! పెద్దవాళ్లకూ జీవితం మీద ఏవో కంప్లైంట్లు. ‘స్వామీజీ ఈ కొత్త సంవత్సరమైనా దశ తిరుగుతుందా?’ అని ఆశగా అడుగుతుంటారు. లైఫ్‌లో ఉన్నది మొత్తం ఒక్క దక్షిణాయనం, ఒక్క ధనుర్మాసమే అయితే చెప్పొచ్చు.. బతుకులో సంక్రమణం సిద్ధిస్తుంది అని, ఇవిఇవి ఆచరిస్తే ఇవిఇవి సంప్రాప్తిస్తాయి అని. కానీ ఎన్నో రుతువులు, ఎన్నో జీవన క్రతువులు! కొత్త అనగానే ఏదో ఆశ.. అర్ధరాత్రి పన్నెండు దాటిన మరుక్షణం గ్రహగతులు మారబోతున్నాయని! ఆశ మంచిదే. కానీ కాలచక్రంలో ఏదీ కొత్త కాదు. ఏదీ పాత కాదు. మనం ఎప్పుడైతే మొదలు పెట్టామో అదే కొత్త సంవత్సరం. మనం ఎక్కడైతే వదిలేశామో అదే గతించిన సంవత్సరం. మనిషి భ్రమణ పరిభ్రమణాలే కాలచక్రంలోని పరిణామాలు. అంటే చక్రం తిప్పుతున్నదీ, చక్రంలా తిరుగుతున్నదీ మనిషే! ‘స్వామీజీ.. ఈ చలి, మంచు, వేడి, వాన, గాలి మిమ్మల్నీ బాధిస్తాయా?’ - ఇంకో ప్రశ్న. ఎందుకు బాధించవు? స్వామీజీకి, మామూలు హ్యూమన్జీకి తేడా ఉంటుందని ఎందుకు అనుకోవాలి? స్వామీజీ లైఫ్‌లోనూ ఆందోళన ఉంటుంది. అలజడి ఉంటుంది. అశాంతి ఉంటుంది. రేవంత్‌రెడ్డీ ఉంటాడు. కేసీఆర్‌ని జాతిపిత అంటే రేవంత్‌రెడ్డికి కోపం వస్తుంది. ఆ కోపాన్ని శాంతియుతంగా తిప్పికొట్టాలంటే ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చున్నా కూడా రేవంత్‌రెడ్డి అక్కడికీ వచ్చేస్తాడు. ధ్యానం మాని రాజకీయాల్లోకి రమ్మంటాడు! సేవ చేయడానికి రాజకీయ పీఠాలే కావాలా? కొన్నింటిని మనసులోకి రానీయకూడదు. దేహం బయటే వదిలేయాలి. కొందరు విసిరిన మాటల్లోకి మనం చొరబడకూడదు. మౌనంతోనే సమాధానం చెప్పాలి. అప్పుడు సంకల్ప భగ్నం జరగదు. భగ్నం అయిందీ అంటే మనం చూడాలనుకున్నదాన్ని చూడలేం. చేయాలనుకున్నదాన్ని చేయలేం. ఆఖరికి ఆ శ్రీమన్నారాయణుడి దర్శనభాగ్యం కలుగుతున్నా గుర్తించలేక.. చేతులతో దిక్కులను తడుముకుంటూ ఉండిపోతాం. అప్పుడు మామూలు స్నానం ఒక్కటే సరిపోదు. మనసుకూ స్నానం చేయించాలి. - మాధవ్ శింగరాజు -
అరుణ్ జైట్లీ (ఆర్థిక మంత్రి)రాయని డైరీ
దిగ్గున లేచి కూర్చున్నాను. సెయింట్ జేవియర్స్ స్కూలు, శ్రీరామ్ కాలేజీ, ఢిల్లీ యూనివర్శిటీ.. మూడూ ఒకేసారి కలగాపులగంగా కల్లోకి వచ్చేశాయి! ఎగ్జామ్ హాల్లో ఉన్నానట. చేతిలో మూడు క్వొశ్చన్ పేపర్లు! ఫిజిక్సు, కామర్సు, బ్యాంకింగ్ లా. మూడు సబ్జెక్టులూ రెండున్నర గంటల్లో ఐపోవాలట! ‘కమాన్ ఫాస్ట్’ అంటున్నాడు కేజ్రీవాల్. ‘నువ్వేమిటి ఇక్కడ?’ అన్నాను. క్రేజీగా నవ్వాడు. ‘నేనిప్పుడు ఢిల్లీ సి.ఎం.ని మాత్రమే కాదు. జేవియర్స్ హెడ్మాస్టర్ని, శ్రీరామ్ ప్రిన్సిపాల్‌ని, ఢిల్లీ యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ని కూడా. నీకు ఇన్విజిలేటర్‌గా వచ్చాను’ అన్నాడు. నాకొక్కడికే ఇన్విజిలేటర్గానా?! నా పక్క బెంచీలో శత్రుఘ్నసిన్హా ఉన్నాడు. ఈ పక్క బెంచీలో కీర్తీ ఆజాద్ ఉన్నాడు. ముందు బెంచీలో ఆర్.పి.సింగ్ ఉన్నాడు. ముగ్గురూ మా బీజేపీ ఎంపీలే. ‘హాయ్’ అని నవ్వాను. వాళ్లు నవ్వలేదు. వాళ్లు కూడా కేజ్రీవాల్‌తో కలిసి.. ‘కమాన్ ఫాస్ట్’ అంటున్నారు నన్ను. వాళ్ల చేతుల్లో క్వొశ్చన్ పేపర్స్ లేవు! ‘వాళ్లకు లేదా ఎగ్జామ్?’ అన్నాను. ‘లేదు. వాళ్లు నా అసిస్టెంట్ ఇన్విజిలేటర్లు’ అన్నాడు కేజ్రీవాల్. ‘కొద్దిసేపట్లో ఇక్కడికి సుబ్రహ్మణ్యస్వామి కూడా వస్తాడు. నీ కాలర్ వెనుక, చొక్కా చేతి మడతల్లో, సాక్స్ లోపల బ్లాక్ మనీ ఉందేమో చెక్ చేస్తాడు’ అన్నాడు శత్రుఘ్న! ‘ఉంటే స్లిప్పులు ఉండాలి కానీ, బ్లాక్ మనీ ఎందుకుంటుంది?’ అన్నాను. ఆజాద్ పెద్దగా నవ్వాడు. ‘మనీ మీద రాసుకొచ్చిన స్లిప్పులను నువ్వు కాపీ చేసుకుని, మనీని మాకు ఇస్తావ్ అని సోనియాజీ మాకు ముందే చెప్పారు’ అన్నాడు. ‘సుబ్రహ్మణ్యస్వామికి ఏమిటి సంబంధం?’ అన్నాను. ఈసారి కేజ్రీవాల్ పెద్దగా నవ్వాడు. ‘స్వామికే కాదు, రామ్ జెఠ్మలానీకి కూడా సంబంధం ఉంది. ఇద్దరూ మా సీనియర్ ఇన్విజిలేటర్లు. నీ ఎగ్జామ్ కోసమే వస్తున్నారు. ఆల్రెడీ బయల్దేరారు’ అన్నాడు. ‘ఒక్కడు పరీక్ష రాస్తుంటే... ఇంతమంది ఇన్విజిలేటర్లు ఎందుకు? దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి కాకపోతే?!’ అని పెద్దగా అరిచేస్తున్నాను. మెలకువ వచ్చేసింది. మంచినీళ్లు తాగి పడుకున్నాను. మళ్లీ కల.. తెల్లవారుజామున! ‘ఎంతటి విషమ పరీక్షనైనా అద్వానీజీలా మీరు నెగ్గుకొస్తారు జైట్లీజీ. యూ విల్ కమౌట్ విత్ ఫ్లయింగ్ కలర్స్’ అంటున్నారు మోదీజీ. మళ్లీ దిగ్గున లేచి కూర్చున్నాను. కల్లోకి వచ్చి కూడా ఇదే మాట అంటున్నారేమిటి పెద్దాయన! రాత్రొచ్చిన కలే కాస్త బెటర్‌గా ఉంది. అందులో కేజ్రీవాల్ కనిపించబట్టి కానీ, లేకపోతే అదేం పెద్ద పీడకల కాదు. రేపు నా బర్త్ డే. రెండు నెలల తర్వాత ఇదే రోజు బడ్జెట్ డే. అప్పటి వరకు మోదీజీ నన్ను ఉండమంటారో లేక అద్వానీజీలా ముందే రాజీనామా చేసి నిజాయితీని నిరూపించుకునే పరీక్షకు ప్రిపేర్ అవమంటారో?! - మాధవ్ శింగరాజు -
నితీశ్ కుమార్ రాయని డైరీ
ప్రమాణ స్వీకారం! ఈ మాట ఎందుకో సరైనదిగా అనిపించదు. ఇప్పటికి నాలుగు స్వీకారాలు అయ్యాయి. ఇది ఐదోది. అయినా స్వీకారం అనే మాటకు మనసు అలవాటు పడలేకపోతోంది. పదవీ స్వీకారం గానీ, ప్రమాణ స్వీకారం గానీ.. అసలు స్వీకారం ఏమిటి? సమర్పణ అని కదా అనాల్సింది! పదవిని ప్రజలకు సమర్పిస్తున్నాం. ‘మహా జనులారా ఇదిగో... ఈ పదవిని, ఈ అధికారాన్ని మీకు సమర్పిస్తున్నాం’ అని కదా అనాలి. అప్పుడది ప్రమాణ సమర్పణ అవుతుంది. పదవీ సమర్పణ అవుతుంది. జేపీ అనేవారు.. ప్రజలే నాయకులై నడిపిస్తే ఉత్తేజితుడినై ముందుకు నడిచినవాడిని నేను.. అని! ఇప్పుడీ మహా కూటమిని నడిపించిందీ ఆ ప్రజలే. జేపీ సంపూర్ణ క్రాంతి ఉద్యమం ప్రారంభమైన చోట.. పట్నా గాంధీ మైదానంలో మేమిప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నది కూడా అందుకే.. ప్రజలకు అధికారం సమర్పించడం కోసం. నిన్న అందరం కలసి కూర్చున్నాం. అలయెన్స్‌గా ఉన్నవాళ్లందరం. గెలిచాక ఫస్ట్ మీటింగ్. అందరి ముఖాల్లో సంతోషం. ఈ సంతోషం బిహార్ ప్రజల్లో కనిపించినప్పుడు కదా నిజంగా మేము గెలిచినట్లు! జేడీ(యూ) విడిగా గెలవలేదు. ఆర్జేడీ విడిగా గెలవలేదు. కాంగ్రెస్ విడిగా గెలవలేదు. విడివిడిగా గెలిపించకుండా, ఒకటిగా గెలిపించి, ఒకటిగా కలిపి ఉంచి ‘ఇక పాలించండి’ అని బిహార్ తీర్పు ఇచ్చింది. కలసి పాలించడం కష్టం కాదు. పాలించడానికి కలసి ఉండడమే కష్టం. దానికి కమిట్మెంట్ కావాలి. కమిట్మెంట్ ఉంటుందా ఉండదా అన్నది.. లాలూజీ కుమారులలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి వస్తుందా లేదా అన్నదాన్ని బట్టి ఉండకూడదు. జేడీ(యు)కి వచ్చిన సీట్లు ఆర్జేడీకి వచ్చిన సీట్లకంటే తక్కువ కదా అనే దాన్ని బట్టీ ఉండకూడదు. మోదీజీని కలసికట్టుగా కమిట్మెంట్తో దూరంగా ఉంచినట్టే, మహాకూటమి కమిట్మెంట్తో కలసికట్టుగా ఉండాలి. ప్రమాణ స్వీకారం బలప్రదర్శనలా ఉండాలి అంటున్నారు లెజిస్లేజర్ మీటింగ్‌లో యువ ప్రజాప్రతినిధులు. ‘సోనియాజీ, రాహుల్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, జయలలిత, నవీన్ పట్నాయక్‌లను ఒకే వేదికపై చూస్తే చాలు మోదీజీ గుండె జారిపోతుంది’ అంటున్నారు. అద్వానీ, మురళీమనోహర్ జోషీ, యశ్వంత్ సిన్హాలను కూడా రప్పిస్తే?..’ నవ్వుతున్నారు నవ ప్రతినిధులు. నాయకుల బలాన్ని ప్రదర్శించవలసిన వాళ్లు ప్రజలు. ప్రజల ఆశల్ని నెరవేర్చవలసిన వారు మాత్రమే నాయకులు. మోదీజీకి గుబులు పుట్టించడానికి ఇంతపెద్ద వేదిక అవసరం లేదు. ఇంతమంది నాయకులు ఆసీనులు అవనవసరం లేదు. లాలూజీ ఒక్కరు చాలు. మోదీజీ దేశాలు తిరిగి నిలుపుకోలేని దాన్ని, లాలూజీ రాష్ట్రాలు తిరిగి గెలుచుకోగలరు. - మాధవ్ శింగరాజు -
చోటా రాజన్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు: ఏది ఎలా ఉన్నా ఇండియాలో ఉన్నంత డీసెన్సీ వేరే ఏ కంట్రీలోనూ ఉండదు! డి గ్యాంగ్ అయినా, బి గ్యాంగ్ అయినా, ఏ గ్యాంగ్ అయినా.. డాన్‌కి ఉండే విలువ డాన్‌కి ఉంటుంది. డాన్‌కి ఉండే ఫాన్స్ డాన్‌కి ఉంటారు. ఇంటరాగేషన్‌కి కూడా డాన్ తనకు ఇష్టమైన జీన్స్ వేసుకెళ్లొచ్చు. తనకు నచ్చిన టీ షర్ట్ తొడుక్కోవచ్చు. వర్మ కంపెనీ 'ఒబెరాయ్'లా, 'వాత్సవ్'లో సంజయ్దత్లా హీరో వర్షిప్ కూడా. ఇక్కడ అలా లేదు! పోలీసులు పోలీసులుగా లేరు. మీడియా మీడియాలా లేదు. ఎవరికి వాళ్లే డాన్లుగా లుక్ ఇస్తున్నారు. గన్లు తీస్తున్నారు. గన్‌మైక్‌లు తీస్తున్నారు. కళ్లలోకి ఉఫ్‌మని ఊది మరీ, 'భయపడ్డావా డాన్?' అని మీడియా అడుగుతోంది! ఏమాత్రం ఆకర్షణీయంగా లేని ఆరెంజ్ కలర్ కోటు ఒకటి నా ఒంటిపై వేసి వారం రోజులుగా ఇండోనేసియా పోలీసులు నన్ను అక్కడికీ ఇక్కడికీ తిప్పుతూనే ఉన్నారు. మోకాళ్లకు కొద్దిగా మాత్రమే కిందికి దిగి ఉన్న ఆ కోటులో రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నాలోని డాన్ ఎలా ఉండి ఉంటాడో ఊహించుకోడానికే నామోషీగా ఉంది. దావూద్ ఈపాటికి నా అవతారం చూసే ఉంటాడు టీవీల్లో. చోటా షకీల్ అయితే కడుపు చేత్తో పట్టుకుని పడీ పడీ నవ్వుకుని ఉంటాడు. ఇంతకన్నా.. 'చోటా రాజన్ షాట్ డెడ్ ఇన్ గ్యాంగ్ వార్'అని ఏ సీఎన్నెన్ ఐబిఎన్లోనో, ఆజ్తక్లోనో బ్రేకింగ్ న్యూస్ వచ్చినా గౌరవమే. ఇరవయ్యేళ్లయింది ఇండియా వదిలొచ్చి! అక్కడి థియేటర్లో కూర్చొని సినిమా చూసి కూడా ఇరవయ్యేళ్లవుతోంది. ఇండియా వెళ్లగానే, దేశభక్త డాన్ కోటాలో స్పెషల్ పర్మిషన్ ఏదైనా దొరికితే చెంబూర్ వెళ్లి నా చిన్నప్పటి సహకార్ థియేటర్లో కాసేపు కూర్చొని రావాలి. ఇప్పుడది సహకార్ ప్లాజా అయిందని ఆ మధ్య అబూ సావంత్ చెప్పాడు. సావంత్‌ది కూడా చెంబూరే. నాకన్నా పదేళ్లు చిన్నవాడు. థియేటర్ బయట బ్లాక్ టికెట్లు అమ్మడం ఎలాగో నా దగ్గరే నేర్చుకున్నాడు. నీతోనే ఉంటాను భాయ్ అన్నాడు ఓ రోజు. అప్పట్నుంచీ నాతోనే ఉన్నాడు. ఇండోనేసియా నుంచి వెళ్లాక ఇండియన్ గవర్నమెంట్ నన్ను నిజంగానే అరెస్టు చేస్తే, నన్ను నిజంగానే జైల్లో పెడితే నా బిజినెస్లన్నీ సావంత్ చూసుకోగలడు. నన్నెప్పుడు ఇండియా పంపిస్తారని పక్కనే ఉన్న పోలీసు అధికారిని అడిగాను.'మీ వాళ్లు రావాలి కదా' అన్నాడు చికాగ్గా. నన్ను అప్పగించేందుకు ఇండోనేసియా రెడీ. తీసుకెళ్లడానికి ఇండియా రెడీ. మరి ఎక్కడ లేట్ అవుతోంది?! ఏమైనా గవర్నమెంట్ల కంటే గ్యాంగ్‌స్టర్లే నయం. ధనాధన్మని.. గన్ పాయింట్‌తో అక్కడికక్కడ తేల్చేసుకుంటారు. ఒప్పందాలు, సంతకాలతో పనిలేకుండా. -
నరేంద్ర మోదీ రాయని డైరీ
నిన్న రాత్రి డైరీ రాస్తుంటే అమిత్ భాయ్ వచ్చి కూర్చున్నాడు. ఎంతకీ కదలడు. ఏమీ మాట్లాడడు. చూపుడు వేలు, మధ్యవేలు కలిపి నోటికి ఆన్చుకుని, కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ ఉన్నాడు. నేనూ చూసి చూసి, డైరీ మూసి.. ‘చాయ్ తెప్పించనా’ అని అడిగాను. వద్దనలేదు. కావాలనలేదు. కామ్‌గా ఉండిపోయాడు. ఇంకేదో అడిగాను. నో ఎక్స్ప్రెషన్! నోరు తెరిచి, పెద్దగా సౌండ్ చేస్తూ రాని ఆవలింత కూడా ఒకటి ఆవలించాను. తనూ ఆవలించాడు కానీ వెళ్లిపోతానని మాత్రం పైకి లేవలేదు! డైరీ రాస్తున్నప్పుడు మధ్య మధ్యలో మంచి మంచి పంచ్లైన్లు పడుతుంటాయి. అవెక్కడ మర్చిపోతానోనని నా భయం. మొన్నరాత్రి ఇలాగే డైరీ రాస్తుంటే గొప్ప పంచ్ పడింది. నోట్ చేసుకుని మర్నాడు బిహార్ ర్యాలీలో ప్రయోగించాను. చప్పట్లే చప్పట్లు. నితీశ్‌కి, లాలూకీ చెమటలు పట్టి ఉండాలి. బిహార్‌లో ఇంకా పది ర్యాలీలు ఉన్నాయి. ర్యాలీకో పంచ్ పడినా చాలు... మహా కూటమి మహా ఓటమి అవుతుంది. అరె! మళ్లీ పంచ్ పడింది! రోజూ రాత్రి ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. నిన్న అమిత్ భాయ్ వల్ల డైరీ ఆగిపోతే, మొన్న జైట్లీజీ వల్ల డైరీ ఆగిపోయింది. అందుకే ముందు రోజు డైరీని మర్నాడు ఉదయం రాయవలసి వస్తోంది. ఈరోజు రాత్రి కూడా డైరీ రాయడం కుదరకపోవచ్చు. సాయంత్రం జర్మనీ నుంచి మిస్ మెర్కెల్ వస్తున్నారు. ఆవిణ్ణి రిసీవ్ చేసుకోవాలి. ఆవిడతో కలిసి ఫొటోలు దిగాలి. ఈసారి నోబెల్ పీస్ ఆవిడకే రావచ్చంటున్నారు కాబట్టి రెండుమూడు ఎక్స్ట్రా పోజ్‌లు కూడా తీసుకోవాలి. మెర్కెల్ ఇప్పటికే మేక్ ఇన్ ఇండియాకి, స్కిల్ ఇండియాకి, క్లీన్ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. ‘హగ్ ఇండియా’ అని ఒక కాన్సెప్ట్ పెట్టి ఆమె చేత లాంచ్ చేయిస్తే ఎలా ఉంటుంది?! ఆవిడ హగ్ ఇవ్వకపోయినా పర్వాలేదు... హగ్‌కి సపోర్ట్ ఇస్తే చాలు. ‘మనం కాన్సెప్టులు తగ్గించి, కొంతకాలం కామ్‌గా పనిచేసుకుపోవాలేమో మోదీజీ’ అంటాడు అమిత్ భాయ్. ఆ మాట చెప్పడానికే రాత్రి అతడు వచ్చింది. ‘మాటకు ఒకటే అర్థం ఉంటుంది మోదీజీ. మౌనానికి అనేక అర్థాలుంటాయి. శాన్‌జోస్‌లో చూశారు కదా. అక్కడ మీరు మాట్లాడిన మాటల మీద కన్నా, మాటల మధ్య మీరిచ్చిన పాజ్‌ల మీదే ఎక్కువ డిబేట్ నడుస్తోంది. దాన్ని నడవనివ్వాలి’ అన్నాడు అమిత్ భాయ్. జైట్లీజీ పూర్తిగా విరుద్ధం. టాకెటివ్గా లేకపోతే రాహుల్‌కి మనకు పెద్ద తేడా ఉండదు అంటాడు. మాటా? మౌనమా? ఏది కరెక్ట్? వెంకయ్యనాయుడిని అడగాలి. ఎప్పుడు ఏది వర్కవుట్ అవుతుందో ఆయనకు బాగా తెలుసు. - మాధవ్ శింగరాజు -
ఎం.ఎస్.స్వామినాథన్ రాయని డైరీ
విలువల్లేవు అనే మాట... ఇంట్లో బియ్యం లేవు అనే మాటలా తోస్తుంది నాకు... ఎవరు ఏ సందర్భంలో మాట్లాడినా! ప్రణబ్‌జీ ప్రసంగం వింటున్నాను. పార్లమెంటు భవనంలా ఆయన ఎంతో గంభీరంగా ఉన్నారు. ఆయన మాట్లాడబోతున్నది అంతకన్నా గంభీరమైన సంగతని తెలుస్తూనే ఉంది. రెండ్రోజుల క్రితమేగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాకుండానే ముగిసింది! ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవాలని ప్రణబ్‌జీ అంటున్నారు. అది ఉద్బోధా లేక ప్రాధేయపూర్వకమైన అభ్యర్థనా అన్నదే తెలియడం లేదు. జాతిని ఉద్దేశించిన ఆయన ప్రసంగంలో... జాతిని ఉద్ధరించేవారి ప్రస్తావనే ప్రస్ఫుటంగా ఉంది. కనుక దానిని ఉద్బోధనా కాదు, అభ్యర్థనా కాదు... ఆవేదన అనుకోవాలి. పార్లమెంటులో ఎవరి రిక్వెస్టును ఎవరు పట్టించుకున్నారనీ... ప్రజల్ని, రాష్ట్రపతిని పట్టించుకోడానికి! ట్రిస్ట్ విత్ డెస్టినీ గుర్తుకొస్తోంది నాకు. నా ఇరవై రెండేళ్ల వయసులో... దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆ అర్ధరాత్రి... నేను విన్న నెహ్రూ ప్రసంగం! అలసట తీర్చుకునే మజిలీ కాద ట మన ముందున్న భవిష్యత్తు. ఎంత బాగా చెప్పారు! ‘పీఠంపై సుఖంగా కూర్చోడానికి లేదు. మాట మీద నిలబడాలి. దేశ ప్రజలకు ఇప్పటి వరకు మనం చేసిన ప్రమాణాలను, ఈ రోజు మనం చేస్తున్న ప్రతిజ్ఞను నెరవేర్చడానికి భవిష్యత్తులోకి వెళ్తున్నాం. దేశసేవ అంటే దేశ ప్రజల సేవ. కోట్లాదిమంది నిర్భాగ్యుల సేవ’ అన్నారు నెహ్రూ. అంతేనా... చెమ్మగిల్లిన ప్రతి కంటినీ, చెంపకు జారిన ప్రతి కన్నీటి చుక్కను తుడవాలి అన్నారు. బాధ, కన్నీళ్లు ఉన్నంత కాలం... మన బాధ్యత ఉంటుందని చెప్పారు. నా సందేహం... ఇవాళ్టికీ ఆ బాధ్యతను మనం భుజానికి ఎత్తుకోలేకపోతున్నామా అని! ఎత్తుకునే ఉంటే ఇండిపెండెన్స్డేకొకసారి, రిపబ్లిక్డేకొకసారి అవే మాటల్ని మళ్లీ మళ్లీ ఎందుకని మనం సంకల్పంలా చెప్పుకుంటూనే ఉంటాం?! ప్రణబ్‌జీ ప్రకృతి గురించి కూడా మాట్లాడారు. సమతౌల్యాన్ని కాపాడుకోవాలన్నారు. మానవ ప్రవృత్తిలో సంయమనం దెబ్బతింటే విలువలకు కరువొస్తుంది. ప్రకృతిలో సమతౌల్యం దెబ్బతింటే తిండిగింజలకు కరువొస్తుంది. రెండూ ముఖ్యమే. ఒకటి దేశానికి. ఒకటి దేశ ప్రజలకు. కరువొస్తే ఏం చేయాలో నార్మన్ బొర్లాగ్ చెప్పేవారు. ‘కొబ్బరికాయ కొట్టండి. కళ్లుమూసుకుని దేవుడిని ప్రార్థించండి. తప్పులేదు. గుడి బయటికి వచ్చాక మాత్రం నేరుగా ఇంటికి వెళ్లిపోకండి. పొలానికి వెళ్లి మట్టిని పెళ్లగించండి. రసాయన ఎరువుల్ని కలపండి. బలమైన విత్తనాలను నాటండి. పంట దిగుబడి భారమైపోయిందని దేవుడేమీ కోప్పడడు. ఆకలితో పెట్టే నైవేద్యాలు ఆయనకు మాత్రం రుచిస్తాయా’ అనేవారు. హరిత విప్లవ పితామహుడు ఆయన. పంట దిగుబడులను పెంచినట్టే, పార్లమెంటేరియన్లలో విలువల దిగుబడిని పెంచే మరో విప్లవం ఏదైనా వస్తే బాగుంటుంది. వరి, గోధుమల్లో హ్యూమన్ వాల్యూస్‌ని కూడా జోడించే కొత్త హైబ్రిడ్ కోసం ఇప్పుడేదైనా ప్రయోగం జరగాలి. - మాధవ్ శింగరాజు