అరుణ్ జైట్లీ (ఆర్థిక మంత్రి)రాయని డైరీ | Arun Jaitley unwritten dairy | Sakshi
Sakshi News home page

అరుణ్ జైట్లీ (ఆర్థిక మంత్రి)రాయని డైరీ

Published Sun, Dec 27 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

అరుణ్ జైట్లీ (ఆర్థిక మంత్రి)రాయని డైరీ

అరుణ్ జైట్లీ (ఆర్థిక మంత్రి)రాయని డైరీ

దిగ్గున లేచి కూర్చున్నాను. సెయింట్ జేవియర్స్ స్కూలు, శ్రీరామ్ కాలేజీ, ఢిల్లీ యూనివర్శిటీ.. మూడూ ఒకేసారి కలగాపులగంగా కల్లోకి వచ్చేశాయి! ఎగ్జామ్ హాల్లో ఉన్నానట. చేతిలో మూడు క్వొశ్చన్ పేపర్లు! ఫిజిక్సు, కామర్సు, బ్యాంకింగ్ లా. మూడు సబ్జెక్టులూ రెండున్నర గంటల్లో ఐపోవాలట!

 ‘కమాన్ ఫాస్ట్’ అంటున్నాడు కేజ్రీవాల్. ‘నువ్వేమిటి ఇక్కడ?’ అన్నాను. క్రేజీగా నవ్వాడు. ‘నేనిప్పుడు ఢిల్లీ సి.ఎం.ని మాత్రమే కాదు. జేవియర్స్ హెడ్‌మాస్టర్‌ని, శ్రీరామ్ ప్రిన్సిపాల్‌ని, ఢిల్లీ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్‌ని కూడా. నీకు ఇన్విజిలేటర్‌గా వచ్చాను’ అన్నాడు.
 నాకొక్కడికే ఇన్విజిలేటర్‌గానా?! నా పక్క బెంచీలో శత్రుఘ్నసిన్హా ఉన్నాడు. ఈ పక్క బెంచీలో కీర్తీ ఆజాద్ ఉన్నాడు. ముందు బెంచీలో ఆర్.పి.సింగ్ ఉన్నాడు. ముగ్గురూ మా బీజేపీ ఎంపీలే. ‘హాయ్’ అని నవ్వాను. వాళ్లు నవ్వలేదు. వాళ్లు కూడా కేజ్రీవాల్‌తో కలిసి.. ‘కమాన్ ఫాస్ట్’ అంటున్నారు నన్ను.  వాళ్ల చేతుల్లో క్వొశ్చన్ పేపర్స్ లేవు! ‘వాళ్లకు లేదా ఎగ్జామ్?’ అన్నాను. ‘లేదు. వాళ్లు నా అసిస్టెంట్ ఇన్విజిలేటర్‌లు’ అన్నాడు కేజ్రీవాల్. ‘కొద్దిసేపట్లో ఇక్కడికి సుబ్రహ్మణ్యస్వామి కూడా వస్తాడు. నీ కాలర్ వెనుక, చొక్కా చేతి మడతల్లో, సాక్స్ లోపల బ్లాక్ మనీ ఉందేమో చెక్ చేస్తాడు’ అన్నాడు శత్రుఘ్న!

 ‘ఉంటే స్లిప్పులు ఉండాలి కానీ, బ్లాక్ మనీ ఎందుకుంటుంది?’ అన్నాను. ఆజాద్ పెద్దగా నవ్వాడు. ‘మనీ మీద రాసుకొచ్చిన స్లిప్పులను నువ్వు కాపీ చేసుకుని, మనీని మాకు ఇస్తావ్ అని సోనియాజీ మాకు ముందే చెప్పారు’ అన్నాడు. ‘సుబ్రహ్మణ్యస్వామికి ఏమిటి సంబంధం?’ అన్నాను. ఈసారి కేజ్రీవాల్ పెద్దగా నవ్వాడు. ‘స్వామికే కాదు, రామ్ జెఠ్మలానీకి కూడా సంబంధం ఉంది. ఇద్దరూ మా సీనియర్ ఇన్విజిలేటర్లు. నీ ఎగ్జామ్ కోసమే వస్తున్నారు. ఆల్రెడీ బయల్దేరారు’ అన్నాడు.

 ‘ఒక్కడు పరీక్ష రాస్తుంటే... ఇంతమంది ఇన్విజిలేటర్లు ఎందుకు? దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి కాకపోతే?!’ అని పెద్దగా అరిచేస్తున్నాను. మెలకువ వచ్చేసింది. మంచినీళ్లు తాగి పడుకున్నాను.

 మళ్లీ కల.. తెల్లవారుజామున! ‘ఎంతటి విషమ పరీక్షనైనా అద్వానీజీలా మీరు నెగ్గుకొస్తారు జైట్లీజీ. యూ విల్ కమౌట్ విత్ ఫ్లయింగ్ కలర్స్’ అంటున్నారు మోదీజీ. మళ్లీ దిగ్గున లేచి కూర్చున్నాను. కల్లోకి వచ్చి కూడా ఇదే మాట అంటున్నారేమిటి పెద్దాయన! రాత్రొచ్చిన కలే కాస్త బెటర్‌గా ఉంది. అందులో కేజ్రీవాల్ కనిపించబట్టి కానీ, లేకపోతే అదేం పెద్ద పీడకల కాదు.

 రేపు నా బర్త్ డే. రెండు నెలల తర్వాత ఇదే రోజు బడ్జెట్ డే. అప్పటి వరకు మోదీజీ నన్ను ఉండమంటారో లేక అద్వానీజీలా ముందే రాజీనామా చేసి నిజాయితీని నిరూపించుకునే పరీక్షకు ప్రిపేర్ అవమంటారో?!
                                                                                                                     - మాధవ్ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement