సిద్ధరామయ్య రాయని డైరీ
చెయ్యి బోసిగా ఉంది. బరువు తగ్గినట్టూ ఉంది. ఎంత బాగుండేది నా చేతికి ఆ డైమండ్ వాచీ! టైమ్‌తో పని లేకపోయినా టైమ్ చూసుకునేవాడిని. ఎంత టైమ్ లేకపోయినా.. ఎవరైనా టైమ్ అడిగి నన్ను డిస్టర్బ్ చెయ్యకపోతారా అని చూసేవాడిని. సీయెంకి పనిగట్టుకుని టైమ్ చూసుకునే పనేముంటుంది? టైమ్ కోసం సీయెం దగ్గరికి పని మానుకుని వచ్చే పని ఎవరికుంటుంది? అయినా వాచీ చూసుకునేవాడిని. వాచీని చూసుకునే అవకాశం కోసం చూసేవాడిని. అంతిష్టం నాకా వాచీ అంటే. ప్చ్.. ఇప్పుడా వాచీ నా చేతికి లేదు. రాష్ట్రానికి రాసిచ్చేశాను. స్పీకర్‌కి లెటర్‌లో చుట్టి మరీ ఇచ్చేశాను. బీజేపీ వాళ్లు పడనిస్తేనా? వాచీ పెట్టుకోనిస్తేనా?
ఫస్ట్ డే అసెంబ్లీకి పెట్టుకెళ్లాను. ‘వాచీ బాగుంది ముఖ్యమంత్రి గారూ’ అన్నాడు తిమ్మప్ప. ‘థ్యాంక్యూ స్పీకరు గారూ’ అన్నాను వాచీని చూసుకుంటూ. మళ్లీ చూసి, మళ్లీ బాగుందన్నాడు. మళ్లీ థ్యాంక్స్ చెప్పాను. జార్జి, జయచంద్ర, దేశ్‌పాండే వచ్చారు. ‘గుడ్ మాణింగ్ మినిస్టర్స్’ అన్నాను. ‘భలే ఉంది సార్’ అన్నాడు జార్జి. ‘అవున్సార్’ అన్నాడు జయచంద్ర. ‘నిజమేసార్’ అన్నాడు దేశ్‌పాండే. ‘టాక్ ఆఫ్ ది డే’ అయింది నా వాచీ. ‘టాక్ ఆఫ్ ది సెషన్’ కూడా అవుతుందని నేను అనుకోలేదు.
వరండాలో నిలుచుని ఉన్నాం. వాచీ చూసుకున్నాను. లోపలికెళ్లడానికి ఇంకా టైమ్ ఉంది. ‘సార్ చూడండి.. జగదీశ్, ఈశ్వరప్ప ఇటే వస్తున్నారు’ అన్నాడు జార్జి. ‘సార్ చూశారా.. జగదీశ్, ఈశ్వరప్ప ఇటే చూసుకుంటూ వెళ్లారు’ అన్నాడు జయచంద్ర. ‘సార్ చూస్తున్నారా.. జగదీశ్, ఈశ్వరప్ప మీ చేతికున్న వాచీని చూసి ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు’ అన్నాడు దేశ్‌పాండే. జగదీశ్ అసెంబ్లీలో అపోజిషన్ లీడర్. ఈశ్వరప్ప కౌన్సిల్‌లో అపోజిషన్ లీడర్. అపోజిషన్ వాళ్లకి కూడా నా వాచీ నచ్చిందనుకున్నాను కానీ, నా చేతికి ఆ వాచీ ఉండడం వాళ్లకు నచ్చలేదని కనిపెట్టలేకపోయాను!
కర్నాటకలో బీజేపీ టైమ్ బాగోలేదు. టైమ్ బాగోలేనప్పుడు చేతికి వాచీ పెట్టుకున్నవాడిని చూసినా చిర్రెత్తుకొస్తుంది. పైగా నాది హూబ్లా వాచీ. డెబ్బై లక్షల వాచీ. గిఫ్టుగా వచ్చిన వాచీ! ఆ వాచీ వెనుక పెద్ద స్కాము ఉందని జగదీశ్ అనుమానం. అసెంబ్లీ మొదటి రోజే.. ఆగిపోయిన వాల్‌క్లాక్ లోపలి లోలకంలా వెల్‌లోకి వెళ్లి, స్పీకర్ ఎదురుగా నించున్నాడు. రెండో రోజూ అలాగే నించున్నాడు. మూడో రోజూ నించోబోయాడు కానీ.. పార్లమెంట్‌లో ప్రహ్లాద్ జోషీ ఆల్రెడీ లేచి నించుని నా వాచీని పెద్ద ఇష్యూ చేస్తున్నాడని తెలిసి, వెనక్కి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. ‘సోషలిస్టునని చెప్పుకుంటాడుగా.. అన్ని లక్షల వాచీ ఎందుకో’ అన్నాట్ట పార్లమెంటులో జోషీ నా గురించి! జోషీ కాస్త బెటర్. ఇక్కడ కుమారస్వామి మరీ నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. ఎవరో కొట్టుకొచ్చిన వాచీని నేను చీప్‌గా కొట్టేశానట!
పంచాయతీ ఎలక్షన్స్‌లో ఓడిపోయాక బీజేపీకి, కుమారస్వామి పార్టీకి.. అసెంబ్లీలో పంచాయితీ పెట్టుకోడానికి నా వాచీ తప్ప వేరే ఏం దొరికినట్టు లేదు!
-మాధవ్ శింగరాజు