madhav shinga raju
-
అజయ్ రాయ్ రాయని డైరీ
నామినేషన్‌కి రేపు చివర్రోజు. ఏరివేతలకు ఎల్లుండి ఆఖర్రోజు. ఏదైనా మిరకిల్ జరిగి, చెల్లని నోటును డిపాజిట్ మిషన్ విసిరి కొట్టినట్టుగా ఎలక్షన్ కమిషన్ నా నామినేషన్‌ని విసిరికొట్టేస్తే బావుణ్ణు. ఇప్పటికే ఒకసారి మోదీజీ మీద ఓడి పోయాను. మళ్లొకసారి మోదీజీ గెలుపును నా చేతుల్లో పెట్టి ‘‘మీదే బాధ్యత’’ అని వెళ్లి పోయాడు రాహుల్! ‘రాహుల్‌బాబూ.. నాకెప్పుడూ ఒక సందేహం వస్తుంటుంది’’ అన్నాను.. రాహుల్ నా చేతుల్లో పెట్టదలచుకున్నది పెట్టి వెళ్లిపోతున్నప్పుడు. ‘ఎప్పుడూ వచ్చే సందేహమే అయితే ఇప్పటికీ దానిని ఒక సందేహంగానే ఉండనిచ్చినందుకు ఎప్పటికైనా దానిని నివృత్తి చేసుకోవలసిన బాధ్యత మీదే అవుతుంది అజయ్. కొత్తగా వచ్చిన సందేహమైతేనే మీరు నన్ను అడగండి’ అన్నాడు! ‘‘కానీ.. నా సందేహం కొత్తదేమీ కాదు రాహుల్‌బాబూ..’’ అన్నాను. రాహుల్ నవ్వాడు. ‘‘ ఓ! నాకు అర్థమైంది అజయ్. నా ప్రియ సోదరిని వారణాసిలో మోదీపై పోటీగా నిలబెడతానని దేశమంతా అనుకున్నట్లే మీరూ అనుకున్నారు. ఇప్పుడు ఆమెకు బదులుగా మిమ్మల్ని నిలబెట్టేసరికి మీకూ, దేశానికీ.. అనుకోడానికి ఏమీ లేకుండా పోయింది. ఇలా ఎవ్రీ టైమ్ దేశ ప్రజల్ని, పార్టీ అభ్యర్థుల్ని నేనెలా నివ్వెర పాటుకు గురి చేయగలుగుతున్నాననే కదా మీ సందేహం’ అన్నాడు. ‘‘అది కాదు నా సందేహం రాహుల్‌బాబూ. మోదీపై ఎవరు ఎవర్ని నిలబెట్టినా అది ఎవరికైనా నివ్వెరపాటే. మీరు నన్ను నిలబెట్టారు. అఖిలేశ్.. షాలినిని నిలబెట్టాడు. షాలిని ఎవరో వారణాసిలో ఎవరికీ తెలీదు. నేనెవరో తెలియనివాళ్లు వారణాసిలోనే లేరు. మోదీపై నిలబడ్డాం కనుక ఇప్పుడు ఇద్దరం ఒకటే. ఎవరికీ తెలియని షాలిని అందరికీ తెలిశారు. అందరికీ తెలిసిన నేను ఈసారి కూడా మోదీపై ఓడిపోతే ఎవరికీ తెలియకుండా పోతాను’’ అన్నాను. రాహుల్ అసహనంగా చూశాడు. ‘‘మీ సందేహం ఏమిటో చెప్పకుండా, మీ సందేహం ఏమిటోనన్న సందేహంలోకి నన్ను నెట్టేస్తున్నారు’’ అన్నాడు. వెళ్లే తొందరలో ఉన్నాడని నాకు అర్థమైంది. ‘‘రాహుల్‌బాబూ.. మీ ప్రియ సోదరి మీకు అక్క అవుతారా, లేక మీకు చెల్లి అవుతారా? ఎప్పుడూ నాకిదొక సందేహం’’ అన్నాను. ఇదేనా మీ సందేహం అన్నట్లు చూశాడు రాహుల్. ‘‘పోలింగ్‌కి గట్టిగా ఇరవై రోజులైనా లేకుండానే మీకిలాంటి సందేహాలు వస్తున్నాయంటే, పోలింగ్ ఫలితాలపై మీకెలాంటి సందేహాలూ లేనట్లు అర్థమౌతోంది అజయ్’’ అనేసి వెళ్లిపోయాడు! రాహుల్ వెళ్లిపోగానే మనోజ్ కుమార్‌కి ఫోన్ చేశాను. ‘‘ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌కి మీరిలా నేరుగా ఫోన్ చెయ్యకూడదు’’ అన్నాడు మనోజ్. ‘‘పార్టీ అభ్యర్థిగా కాదు, ఒక పౌరుడిగా చేశాను’’ అన్నాను. ‘‘చెప్పండి’’ అన్నాడు. ‘‘పదహారు క్రిమినల్ కేసులు ఉండి, గూండా యాక్ట్ కింద అరెస్ట్ అయి, పోలీసుల్ని తన్ని, పోలీస్ వాహనాల్ని తగలేసి, ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసి, ప్రైవేట్ ఆర్మీని నడిపి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద బుక్ అయిన ఒక వ్యక్తి నామినేషన్‌ని తిరస్కరించడానికి వీలువుతుందా?’’ అని అడిగాను. ‘‘టు మై నాలెడ్జ్.. వీలు కాకపోవచ్చు’’ అన్నాడు కమిషనర్. ‘‘పోనీ.. అఫిడవిట్లో ఐదొందల నోటు చూపి, జేబులో రెండువేల నోటు పెట్టుకుని తిరుగుతున్నాడని ఎవరైనా కంప్లయింట్ చేస్తే, అప్పుడైనా నామినేషన్‌ని తిరస్కరిస్తారా?’’ అని అడిగాను. ‘‘సారీ.. ఇవన్నీ చెప్పడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం’’ అని ఫోన్ పెట్టేశాడు కమిషనర్. మాధవ్ శింగరాజు -
ఉద్ధవ్ ఠాక్రే రాయని డైరీ
నెలాఖర్లో అయోధ్య ప్రయాణం. ఏ రోజుకి అక్కడ ఉండాలన్నది నవంబర్ పదిహేడున నిర్ణయించాలి. నాన్నగారు పోయిన రోజది. ‘అయోధ్యకు మేమూ వస్తాం’ అని బయల్దేరారు ఎంపీలు, ఎమ్మెల్యేలు! ‘ఇంతమంది ఎందుకు? రామ మందిరం నిర్మించడానికి వెళుతున్నామా? రాముణ్ణి దర్శించుకోడానికే కదా వెళ్తున్నాం’ అన్నాను. ‘‘ఉద్ధవ్జీ అక్కడ రామ మందిరం లేదు కదా! మందిరమే లేనప్పుడు దర్శించుకోడానికి రాముడు మాత్రం ఎందుకుంటాడు?’’ అన్నాడు సంజయ్‌రౌత్. ఎంపీ అతడు. అయోధ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నది అతడే. టీమ్‌తో వెళ్లి అయోధ్యకు రూట్ మ్యాప్ కూడా వేసుకొచ్చాడు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అయోధ్యకు వెళుతున్నాను. అందుకని అయోధ్య గురించి నాకేమీ తెలియదని అతడు అనుకుంటున్నట్లున్నాడు! ‘‘మదిలో మందిరం ఉన్నప్పుడు అయోధ్యలో మందిరం ఉండాల్సిన అవసరం ఏముంది సంజయ్?! మదిలో లేదు కనుకనే వీళ్లంతా అయోధ్యలోనూ లేదనుకుంటు న్నారు. లేదనుకుంటున్నారు కనుకే అయోధ్యలో మందిరాన్ని నిర్మిస్తాం అంటున్నారు’’ అన్నాను. సంజయ్ మరేమీ ప్రశ్నించలేదు. ఏర్పాట్లలో పడిపోయాడు. అప్పుడప్పుడు నేనిలా తాత్వికంగా మాట్లాడి, మళ్లీ మామూలైపోతానని అతడికి తెలుసు. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీని త్వరలోనే నేను కొన్ని కఠినమైన ప్రశ్నలు వేయబోతున్నట్లు దసరా రోజు మహారాష్ట్ర ఓటర్లకు చెప్పాను. ఆ కఠినమైన ప్రశ్నలు అయోధ్యకు వెళ్లినప్పుడు అక్కడ చేసే ర్యాలీలో వెయ్యాలా? లేక, ఈ లోపలే ముంబైలో ఓ ర్యాలీ పెట్టి వెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ముంబైలో అయితే రైతుల గురించి ఎక్కువ ప్రశ్నలు వేసి, రాముడి గురించి తక్కువ ప్రశ్నలు వేయాలి. అయోధ్యలో అయితే రాముడి గురించి ఎక్కువ ప్రశ్నలు వేసి, రైతుల గురించి తక్కువ ప్రశ్నలు వేయాలి. నాన్నగారు గుర్తొస్తున్నారు నాకు. ఇలా ఎక్కువ తక్కువల్ని చూసుకునేవారు కాదాయన. అనాలనుకున్నది అనేసేవారు. చెయ్యాలనుకున్నది చేసేసేవారు. పులిలా ఉండేవారు. మోదీలో కూడా పులి పోలికలు ఉన్నాయి కానీ.. పులి పోలికలు ఉన్నవాళ్లంతా నాన్నగారంతటివాళ్లు అయిపోతారా! అమిత్ షా నిన్న ముంబై వచ్చి వెళ్లాడు. వచ్చి వెళుతున్నాడో, ఇక్కడే ఏదైనా లాడ్జిలో ఉంటున్నాడో తెలియడం లేదు. ముంబై దాకా వస్తున్నాడు, ముంబై లోపలికి రావడం లేదు. ముంబై బయటే మోహన్ భాగవత్‌ని కలిసి వెళుతున్నాడు. మందిరం నిర్మాణానికి మంతనాలేవో జరుపుతున్నట్లు ఇద్దరూ కలిసి పిక్చర్ ఇస్తున్నారు. ‘రా’ అని గానీ, ‘మ’ అని గానీ మోదీ ఒక్క ముక్క మాట్లాడ్డం లేదు. అయోధ్యకు వెళ్లి నేను ఆయన్ని కఠినంగా ప్రశ్నించిన తర్వాతి రోజో, అయోధ్యకు వెళ్లి నేను ఆయన్ని ప్రశ్నించడానికి ముందు రోజో మాట్లాడతాడేమో చూడాలి. ఆయన తప్ప ఆయన చుట్టూ ఉండేవాళ్లంతా భక్తితో ఊగిపోతున్నారు. ‘అయోధ్యలో మందిరాన్ని నిర్మించకపోతే ఉద్యమం లేవదీస్తాం’ అంటున్నాడు భయ్యాజీ జోషీ. ప్రభుత్వం వాళ్లది. ఇటుకలు, సిమెంట్ వాళ్లవి. రాముడి విగ్రహం వాళ్లది. ఇక ఉద్యమం ఎవరి మీద! ‘‘కోర్టును అడిగేదేంటి? కోర్టు చెప్పేదేమిటి? కోర్టు వెయ్యేళ్లకు చెబుతుంది. అప్పటివరకు ఆగుదామా?’’ అన్నాడు సంజయ్ మళ్లీ వచ్చి. ‘‘మోదీజీని అడిగేందుకు కొన్ని కఠినమైన ప్రశ్నలు తయారు చెయ్యి సంజయ్’’ అన్నాను సంజయ్ వినడం లేదు. ‘‘కోర్టును అడిగే డిమాలిష్ చేశామా? కోర్టును అడిగి కన్స్ట్రక్ట్ చెయ్యడానికి!’.. ఆవేశంగా అంటున్నాడు. -
పచ్చ మీద ప్రమాణం !
జయశ్రీకి మొక్కలంటే ప్రాణం. ఇద్దరం పక్కపక్కనే లోఢీ గార్డెన్స్‌లో నడుస్తున్నాం. ఎక్కడా పచ్చదనం లేదు. ఎటువైపు నుంచీ ఒక్క శీతల పవనమూ లేదు. లోఢీ మార్గ్‌లో క్రమంగా మొక్కలు తగ్గిపోయి, వాకింగ్‌కి వచ్చే మనుషులు ఎక్కువైపోతున్నట్లున్నారు! పీల్చే గాలి తగ్గి, వదిలే వాయువులతో లోకం ఏదో ఐపోయేలా ఉంది. ‘‘కాంగ్రెస్‌తోనే పోయింది... ఆ పచ్చదనమంతా’’ అంటున్నాను. జయశ్రీ వినడం లేదు. మొక్కల్ని వెదుక్కుంటోంది. ఆమె అంతే! అవసరం లేని దానిని వినవలసి వచ్చినప్పుడు.. అవసరమైన దేనినో వెదుక్కుంటున్నట్లుగా ఉండిపోతుంది. కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు తులసికోట పచ్చగా ఉండి, కాంగ్రెస్ పవర్లో లేనప్పుడు తులసికోట పచ్చగా లేకపోవడం ఏమిటి అనే సందేహం గానీ ఆమెకు వచ్చిందా అన్న అనుమానం నాకు ఆమె మౌనం వల్ల కలిగింది. కాంగ్రెస్‌లో నేను నీళ్ల మినిస్టర్‌గా, ఊళ్ల మినిస్టర్‌గా, మొక్కల మినిస్టర్‌గా, అడవుల మినిస్టర్‌గా ఉన్నప్పుడు కూడా ఆమె నీళ్లను, ఊళ్లను, మొక్కల్ని, అడవుల్ని చూసింది తప్ప వాటి మినిస్ట్రీలను చూడలేదు. నన్ను మినిస్టర్‌గానూ చూడలేదు. మొక్కలకు పాదులు తియ్యడం, మొక్కలకు నీళ్లు పొయ్యడం, మొక్కలకు దడులు కట్టడం.. బేసిక్‌గా మనుషుల పని కదా అన్నట్లు చూస్తుంది ఆమె.. ఒకవేళ నేను ప్రభుత్వాలను, పార్టీలను.. నిందించడం, విమర్శించడం మొదలుపెడితే. ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. కాంగ్రెస్ పచ్చగా ఉన్న రోజుల్లో ఇది నా మినిస్ట్రీ. జూన్ ఐదు అనగానే ఎన్డీయేకి బహుశా గ్రీనరీ కన్నా కూడా, బ్లూ స్టారే గుర్తొస్తుందేమో. ఆపరేషన్ బ్లూ స్టార్! మోదీ ఈ రోజు లోఢీ గార్డెన్స్ గురించి మాట్లాడతారో, స్వర్ణాలయంపై సైన్యం దాడి గురించి మాట్లాడతారో చూడాలి. మోదీ మాట్లాడినా, జైట్లీ మాట్లాడినా.. చెట్లను పడగొడుతుంటే తరిగిపోతున్న పచ్చదనమో, రాష్ట్రాలను విడగొడితే చిగురిస్తుందనుకున్న పచ్చదనమో తప్ప వేరే ముఖ్యాంశం లేదు మాట్లాడుకోడానికి ఇప్పుడీ సందర్భంలో. విడిపోతే తెలంగాణ, వదిలించుకుంటే సీమాంధ్ర రెండూ పచ్చగా కళకళలాడతాయని కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చిన ప్రతి నాయకుడూ ఆ పచ్చదనం ఏమైపోయిందో కూడా ఇవాళ మాట్లాడాలి. ఓల్డ్ హిస్టరీకి, న్యూ జాగ్రఫీకి మధ్య.. చివరి ఐదు నెలల్లో ఏపీని ఎవరు విడగొట్టిందీ, ఎలా విడగొట్టిందీ జూన్ 15న నా పుస్తకం బయటికొచ్చి మాట్లాడుతుంది. ఏపీకి ఐదేళ్లు హోదా ఇస్తాం అని కాంగ్రెస్ అన్నప్పుడు.. ‘మేమైతే పదేళ్లు ఇస్తాం’ అంటూ వెంకయ్యనాయుడు రాజ్యసభలో ఎలా జంప్ చేసిందీ, ఇప్పుడా మాటను ఎలా జంప్ చేయించిందీ నా పుస్తకం చెబుతుంది. సామాజిక న్యాయం కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడగొడితే, కుటుంబ పాలన కోసం రాష్ట్రాల నాయకులు కాంగ్రెస్‌ను ఎలా పడగొట్టిందీ నా పుస్తకం చెబుతుంది. పచ్చ మీద ప్రమాణం ! -మాధవ్ శింగరాజు -
విజయ్ మాల్యా రాయని డైరీ
సాయంత్రం బేకర్ స్ట్రీట్‌లో నడుస్తున్నాను. షెర్లాక్ హోమ్స్ది ఇదే స్ట్రీట్. ఇక్కడే ఆయన హౌస్ నెంబర్ 221బి. హోమ్స్, హౌస్ కల్పితం. కానన్ డోయల్ కల్పన. లేని హోమ్స్నీ, లేని హౌస్నీ ఊహించుకుంటూ నడుస్తున్నాను. ఒక్కణ్ణే లే మ్యాన్‌లా నడుస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్ లేరు. పార్టీలు లేవు. బోరింగ్‌గా ఉంది. ఈ లండన్‌లో కనుక ఇప్పుడు ప్రపంచ దేశాల రిజర్వు బ్యాంకు గవర్నర్ల సమావేశం జరుగుతూ ఉండి, ఆ సమావేశానికి రఘురామ్ రాజన్ కూడా వచ్చి ఉండి.. సడన్‌గా నన్నిలా చూస్తే.. ‘మనిషన్నవాడు ఇలాగే బతకాలి’ అని ఆప్యాయంగా, అభినందనగా భుజం తడతాడేమో! మనిషన్నవాడు నాలా బతక్కూడదని ఈ మధ్యే టీవీలో చెప్పాడు రాజన్. అంత త్వరగా నేను నాలా బతక్కపోవడం చూస్తే నన్నిక్కడ నడివీధిలో ఆయన గట్టిగా హత్తుకున్నా హత్తుకుంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలట! రాజన్ అంటాడు. గోవాలో నా షష్టిపూర్తి బర్త్‌డే కి మూడొందల మంది రావడం ఆయనకి నచ్చలేదు. ముప్పై లక్షల డాలర్లు ఖర్చవడం నచ్చలేదు. అదంతా బ్యాంకుల డబ్బే అని ఆయన అనుమానం. అవును బ్యాంకుల డబ్బే. పదిహేడు బ్యాంకుల డబ్బు. అంతంత డబ్బు బ్యాంకులివ్వకుండా బెవరేజ్ కంపెనీలు తయారు చేసుకుంటాయా?! మనిషన్నవాడు రాజులా బతకాలి. రాజు తనకు నచ్చినట్టు బతుకుతాడు. రిజర్వుబ్యాంకు గవర్నర్ రాజన్‌కు నచ్చినట్టు బతకడు. ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీకి నచ్చినట్టు బతకడు. సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హాకు నచ్చినట్టు బతకడు. వీళ్లంతా రూపాయికి కాపలాదారులే తప్ప, లాకర్ తెరిచి ఓ రూపాయి తీసుకునే హక్కులేనివారు. చేతిలో రూపాయి లేనివాడు రాజులా ఎలా బతుకుతాడు? రాజు కూడా మనిషే కానీ, రాజులా బతకలేనివాడు మనిషెలా అవుతాడు? బేకర్ స్ట్రీట్‌కి వెనక వీధిలోనే మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియమ్. లోపలికెళ్లాను. మాధురి, ఐశ్వర్య, కరీనా, కత్రీనా! మ్యూజియమ్‌లో లైఫ్ లేదు. ఏదో తక్కువైంది. ఎస్! కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్ స్టాచ్యూ మిస్ అయిందక్కడ. కన్సర్న్డ్ ఎవరో కనుక్కుని చెప్పాలి. చీకటి పడుతోంది. మళ్లీ బేకర్ స్ట్రీట్‌లో నడుస్తున్నాను. ఈసారి ఒక్కణ్ణే కాదు. వెనకెవరో నీడలా వస్తున్నారు. వస్తున్నారా? వెంటాడుతున్నారా? ఎవరు వాళ్లు? కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులా? మీడియా వాళ్లా? బ్యాంకు మేనేజర్లా? షెర్లాక్ హోమ్స్లాంటి డిటెక్టివ్‌లా? వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు! తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు.. నీడలా నా వెంట వస్తోంది. నిన్నమొన్నటి దాకా ఎంత బాగా బతికాను?! కింగ్ సైజ్ లైఫ్. గతం ఆలోచిస్తే నాకు నేనే షెర్లాక్ హోమ్స్‌లా ఒక కల్పిత పాత్రలా అనిపిస్తున్నాను. కోర్టు తీర్పు వచ్చాక నాకున్న నలభై ఇళ్ల నెంబర్లు కూడా కాలక్రమంలో కల్పితం అయిపోతాయేమో.. షెర్లాక్ హోమ్స్ ఇంటి నెంబర్లా!! -మాధవ్ శింగరాజు -
సిద్ధరామయ్య రాయని డైరీ
చెయ్యి బోసిగా ఉంది. బరువు తగ్గినట్టూ ఉంది. ఎంత బాగుండేది నా చేతికి ఆ డైమండ్ వాచీ! టైమ్‌తో పని లేకపోయినా టైమ్ చూసుకునేవాడిని. ఎంత టైమ్ లేకపోయినా.. ఎవరైనా టైమ్ అడిగి నన్ను డిస్టర్బ్ చెయ్యకపోతారా అని చూసేవాడిని. సీయెంకి పనిగట్టుకుని టైమ్ చూసుకునే పనేముంటుంది? టైమ్ కోసం సీయెం దగ్గరికి పని మానుకుని వచ్చే పని ఎవరికుంటుంది? అయినా వాచీ చూసుకునేవాడిని. వాచీని చూసుకునే అవకాశం కోసం చూసేవాడిని. అంతిష్టం నాకా వాచీ అంటే. ప్చ్.. ఇప్పుడా వాచీ నా చేతికి లేదు. రాష్ట్రానికి రాసిచ్చేశాను. స్పీకర్‌కి లెటర్లో చుట్టి మరీ ఇచ్చేశాను. బీజేపీ వాళ్లు పడనిస్తేనా? వాచీ పెట్టుకోనిస్తేనా? ఫస్ట్ డే అసెంబ్లీకి పెట్టుకెళ్లాను. ‘వాచీ బాగుంది ముఖ్యమంత్రి గారూ’ అన్నాడు తిమ్మప్ప. ‘థ్యాంక్యూ స్పీకరు గారూ’ అన్నాను వాచీని చూసుకుంటూ. మళ్లీ చూసి, మళ్లీ బాగుందన్నాడు. మళ్లీ థ్యాంక్స్ చెప్పాను. జార్జి, జయచంద్ర, దేశ్‌పాండే వచ్చారు. ‘గుడ్ మాణింగ్ మినిస్టర్స్’ అన్నాను. ‘భలే ఉంది సార్’ అన్నాడు జార్జి. ‘అవున్సార్’ అన్నాడు జయచంద్ర. ‘నిజమేసార్’ అన్నాడు దేశ్‌పాండే. ‘టాక్ ఆఫ్ ది డే’ అయింది నా వాచీ. ‘టాక్ ఆఫ్ ది సెషన్’ కూడా అవుతుందని నేను అనుకోలేదు. వరండాలో నిలుచుని ఉన్నాం. వాచీ చూసుకున్నాను. లోపలికెళ్లడానికి ఇంకా టైమ్ ఉంది. ‘సార్ చూడండి.. జగదీశ్, ఈశ్వరప్ప ఇటే వస్తున్నారు’ అన్నాడు జార్జి. ‘సార్ చూశారా.. జగదీశ్, ఈశ్వరప్ప ఇటే చూసుకుంటూ వెళ్లారు’ అన్నాడు జయచంద్ర. ‘సార్ చూస్తున్నారా.. జగదీశ్, ఈశ్వరప్ప మీ చేతికున్న వాచీని చూసి ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు’ అన్నాడు దేశ్‌పాండే. జగదీశ్ అసెంబ్లీలో అపోజిషన్ లీడర్. ఈశ్వరప్ప కౌన్సిల్లో అపోజిషన్ లీడర్. అపోజిషన్ వాళ్లకి కూడా నా వాచీ నచ్చిందనుకున్నాను కానీ, నా చేతికి ఆ వాచీ ఉండడం వాళ్లకు నచ్చలేదని కనిపెట్టలేకపోయాను! కర్నాటకలో బీజేపీ టైమ్ బాగోలేదు. టైమ్ బాగోలేనప్పుడు చేతికి వాచీ పెట్టుకున్నవాడిని చూసినా చిర్రెత్తుకొస్తుంది. పైగా నాది హూబ్లా వాచీ. డెబ్బై లక్షల వాచీ. గిఫ్టుగా వచ్చిన వాచీ! ఆ వాచీ వెనుక పెద్ద స్కాము ఉందని జగదీశ్ అనుమానం. అసెంబ్లీ మొదటి రోజే.. ఆగిపోయిన వాల్‌క్లాక్ లోపలి లోలకంలా వెల్‌లోకి వెళ్లి, స్పీకర్ ఎదురుగా నించున్నాడు. రెండో రోజూ అలాగే నించున్నాడు. మూడో రోజూ నించోబోయాడు కానీ.. పార్లమెంట్లో ప్రహ్లాద్ జోషీ ఆల్రెడీ లేచి నించుని నా వాచీని పెద్ద ఇష్యూ చేస్తున్నాడని తెలిసి, వెనక్కి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. ‘సోషలిస్టునని చెప్పుకుంటాడుగా.. అన్ని లక్షల వాచీ ఎందుకో’ అన్నాట్ట పార్లమెంటులో జోషీ నా గురించి! జోషీ కాస్త బెటర్. ఇక్కడ కుమారస్వామి మరీ నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. ఎవరో కొట్టుకొచ్చిన వాచీని నేను చీప్‌గా కొట్టేశానట! పంచాయతీ ఎలక్షన్స్‌లో ఓడిపోయాక బీజేపీకి, కుమారస్వామి పార్టీకి.. అసెంబ్లీలో పంచాయితీ పెట్టుకోడానికి నా వాచీ తప్ప వేరే ఏం దొరికినట్టు లేదు! -మాధవ్ శింగరాజు -
అరుణ్ జైట్లీ (ఆర్థిక మంత్రి)రాయని డైరీ
దిగ్గున లేచి కూర్చున్నాను. సెయింట్ జేవియర్స్ స్కూలు, శ్రీరామ్ కాలేజీ, ఢిల్లీ యూనివర్శిటీ.. మూడూ ఒకేసారి కలగాపులగంగా కల్లోకి వచ్చేశాయి! ఎగ్జామ్ హాల్లో ఉన్నానట. చేతిలో మూడు క్వొశ్చన్ పేపర్లు! ఫిజిక్సు, కామర్సు, బ్యాంకింగ్ లా. మూడు సబ్జెక్టులూ రెండున్నర గంటల్లో ఐపోవాలట! ‘కమాన్ ఫాస్ట్’ అంటున్నాడు కేజ్రీవాల్. ‘నువ్వేమిటి ఇక్కడ?’ అన్నాను. క్రేజీగా నవ్వాడు. ‘నేనిప్పుడు ఢిల్లీ సి.ఎం.ని మాత్రమే కాదు. జేవియర్స్ హెడ్మాస్టర్ని, శ్రీరామ్ ప్రిన్సిపాల్‌ని, ఢిల్లీ యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ని కూడా. నీకు ఇన్విజిలేటర్‌గా వచ్చాను’ అన్నాడు. నాకొక్కడికే ఇన్విజిలేటర్గానా?! నా పక్క బెంచీలో శత్రుఘ్నసిన్హా ఉన్నాడు. ఈ పక్క బెంచీలో కీర్తీ ఆజాద్ ఉన్నాడు. ముందు బెంచీలో ఆర్.పి.సింగ్ ఉన్నాడు. ముగ్గురూ మా బీజేపీ ఎంపీలే. ‘హాయ్’ అని నవ్వాను. వాళ్లు నవ్వలేదు. వాళ్లు కూడా కేజ్రీవాల్‌తో కలిసి.. ‘కమాన్ ఫాస్ట్’ అంటున్నారు నన్ను. వాళ్ల చేతుల్లో క్వొశ్చన్ పేపర్స్ లేవు! ‘వాళ్లకు లేదా ఎగ్జామ్?’ అన్నాను. ‘లేదు. వాళ్లు నా అసిస్టెంట్ ఇన్విజిలేటర్లు’ అన్నాడు కేజ్రీవాల్. ‘కొద్దిసేపట్లో ఇక్కడికి సుబ్రహ్మణ్యస్వామి కూడా వస్తాడు. నీ కాలర్ వెనుక, చొక్కా చేతి మడతల్లో, సాక్స్ లోపల బ్లాక్ మనీ ఉందేమో చెక్ చేస్తాడు’ అన్నాడు శత్రుఘ్న! ‘ఉంటే స్లిప్పులు ఉండాలి కానీ, బ్లాక్ మనీ ఎందుకుంటుంది?’ అన్నాను. ఆజాద్ పెద్దగా నవ్వాడు. ‘మనీ మీద రాసుకొచ్చిన స్లిప్పులను నువ్వు కాపీ చేసుకుని, మనీని మాకు ఇస్తావ్ అని సోనియాజీ మాకు ముందే చెప్పారు’ అన్నాడు. ‘సుబ్రహ్మణ్యస్వామికి ఏమిటి సంబంధం?’ అన్నాను. ఈసారి కేజ్రీవాల్ పెద్దగా నవ్వాడు. ‘స్వామికే కాదు, రామ్ జెఠ్మలానీకి కూడా సంబంధం ఉంది. ఇద్దరూ మా సీనియర్ ఇన్విజిలేటర్లు. నీ ఎగ్జామ్ కోసమే వస్తున్నారు. ఆల్రెడీ బయల్దేరారు’ అన్నాడు. ‘ఒక్కడు పరీక్ష రాస్తుంటే... ఇంతమంది ఇన్విజిలేటర్లు ఎందుకు? దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి కాకపోతే?!’ అని పెద్దగా అరిచేస్తున్నాను. మెలకువ వచ్చేసింది. మంచినీళ్లు తాగి పడుకున్నాను. మళ్లీ కల.. తెల్లవారుజామున! ‘ఎంతటి విషమ పరీక్షనైనా అద్వానీజీలా మీరు నెగ్గుకొస్తారు జైట్లీజీ. యూ విల్ కమౌట్ విత్ ఫ్లయింగ్ కలర్స్’ అంటున్నారు మోదీజీ. మళ్లీ దిగ్గున లేచి కూర్చున్నాను. కల్లోకి వచ్చి కూడా ఇదే మాట అంటున్నారేమిటి పెద్దాయన! రాత్రొచ్చిన కలే కాస్త బెటర్‌గా ఉంది. అందులో కేజ్రీవాల్ కనిపించబట్టి కానీ, లేకపోతే అదేం పెద్ద పీడకల కాదు. రేపు నా బర్త్ డే. రెండు నెలల తర్వాత ఇదే రోజు బడ్జెట్ డే. అప్పటి వరకు మోదీజీ నన్ను ఉండమంటారో లేక అద్వానీజీలా ముందే రాజీనామా చేసి నిజాయితీని నిరూపించుకునే పరీక్షకు ప్రిపేర్ అవమంటారో?! - మాధవ్ శింగరాజు -
రాహుల్ గాంధీ రాయని డైరీ
మాధవ్ శింగరాజు నిద్ర సరిపోవడం లేదు. ఎక్కడ పడితే అక్కడ నిద్ర పట్టేస్తోంది. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర పట్టేస్తోంది. నిజానికి నితీశ్ ప్రమాణ స్వీకారానికి లేట్ అయింది కూడా.. ఫ్లయిట్ లేట్ అయి కాదు. ఫ్లయిట్ టైమ్‌కి నేను లేవడం లేటయ్యి! పాపం అప్పటికీ మమ్మీ చెబుతూనే ఉంటుంది.. రాత్రి త్వరగా పడుకుంటే, ఉదయం త్వరగా లేవొచ్చని. లేచి, జాగింగ్‌కి వెళితే రోజంతా యాక్టివ్‌గా ఉంటుందని. మోదీజీ పీయెం అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను.. త్వరగా లేవడం, జాగింగ్‌కి వెళ్లడం రెండూ కుదరడం లేదు. చలికాలం వస్తే మరీను. కాస్త వెచ్చదనం దొరగ్గానే వెంటనే కునుకు పట్టేస్తుంది. లాస్ట్ ఇయర్ ఇలాగే బడ్జెట్ సెషన్లో గమ్మత్తుగా నిద్రపట్టేసింది. లేచి చూసే సరికి పార్లమెంటులో పెద్ద గొడవ. చూస్తుంటే అది నన్ను నిద్ర లేపడానికి చేసిన గొడవలా ఉంది కానీ, నిద్రపోతున్నందుకు చేసిన గొడవలా లేదు. ఆలోచిస్తే ఇప్పుడర్థమౌతోంది.. బీజేపీలో ఇంటాలరెన్స్ అప్పట్నుంచే ఉందని! మొన్న మాన్సూన్ సెషన్లోనూ ఇలాగే మత్తుగా నిద్రపట్టేసింది. మా పార్టీ లీడర్ మల్లికార్జున్ ఖార్గే.. రూలింగ్ పార్టీని ఏదో అంటున్నట్లు లీలగా వినిపిస్తోంది. వినాలని ట్రై చేస్తున్నాను కానీ వినలేకపోతున్నాను. ఇంటికొచ్చాక మమ్మీ అడిగింది.. ఖార్గే అదరగొట్టాడట కదా. దుమ్ము దులిపాడట కదా అని. అంత జరిగిందా అన్నాను. చిరుకోపంతో చూసింది. అప్పుడే చిన్న టిప్ కూడా చెప్పింది. మధ్య మధ్య వాష్‌రూమ్‌కి వెళ్లి ముఖం కడుక్కుని వచ్చి కూర్చుంటే నిద్ర ఆమడ దూరం పారిపోతుందట. ఆ టిప్పేమైనా ఈ వింటర్ సెషన్స్‌లో వర్కవుట్ అవుతుందేమో చూడాలి. ఈ మధ్య అరుణ్ జైట్లీ ఇంటికొచ్చి మరీ నా నిద్ర చెడగొడుతున్నాడు! చేతిలో పెళ్లి కార్డులతో వస్తాడు. ‘డిసెంబర్లో అమ్మాయి పెళ్లి. మీరు రావాలి’ అంటాడు. రెండు మూడు సార్లు చూసి, ‘ఆల్రెడీ చెప్పారు కదా, ఆల్రెడీ కార్డు కూడా ఇచ్చారు కదా’ అన్నాను. ‘అది కాదు, రాహుల్‌బాబు... నాకు నిద్రపట్టడం లేదు’ అన్నాడు నిన్న మళ్లీ! జీఎస్టీ గురించి ఆయన బెంగ. ఆ బిల్లు పాస్ అయితే పిల్ల పెళ్లి నిశ్చింతగా చేసుకుంటాడట. ఖార్గేతో, ఆజాద్‌తో మాట్లాడి రెండు సభల్లో బిల్లును ఓకే చేయించమంటాడు. ‘ముందు మోదీజీని ఇంటాలరెన్స్ మీద పార్లమెంటులో నోరు విప్పమనండి. అప్పుడు చూద్దాం’ అని చెప్పి పంపాను. జైట్లీ వెళ్లనైతే వెళ్లాడు గానీ, పోయిన నిద్ర నాకు మళ్లీ పట్టలేదు. ‘అబ్ తక్ చప్పన్’ మూవీ చూస్తూ కూర్చున్నాను. నానా పటేకర్ పోలీస్ ఆఫీసర్. మాట్లాడితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటుంటాడు. చప్పన్ ఛాతీ అని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీజీ కూడా తన కేడర్ చేత ఇప్పుడు అదే పని చేయిస్తున్నారు. మాట మాట్లాడకుండా. మౌనం వీడకుండా! -
చోటా రాజన్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు: ఏది ఎలా ఉన్నా ఇండియాలో ఉన్నంత డీసెన్సీ వేరే ఏ కంట్రీలోనూ ఉండదు! డి గ్యాంగ్ అయినా, బి గ్యాంగ్ అయినా, ఏ గ్యాంగ్ అయినా.. డాన్‌కి ఉండే విలువ డాన్‌కి ఉంటుంది. డాన్‌కి ఉండే ఫాన్స్ డాన్‌కి ఉంటారు. ఇంటరాగేషన్‌కి కూడా డాన్ తనకు ఇష్టమైన జీన్స్ వేసుకెళ్లొచ్చు. తనకు నచ్చిన టీ షర్ట్ తొడుక్కోవచ్చు. వర్మ కంపెనీ 'ఒబెరాయ్'లా, 'వాత్సవ్'లో సంజయ్దత్లా హీరో వర్షిప్ కూడా. ఇక్కడ అలా లేదు! పోలీసులు పోలీసులుగా లేరు. మీడియా మీడియాలా లేదు. ఎవరికి వాళ్లే డాన్లుగా లుక్ ఇస్తున్నారు. గన్లు తీస్తున్నారు. గన్‌మైక్‌లు తీస్తున్నారు. కళ్లలోకి ఉఫ్‌మని ఊది మరీ, 'భయపడ్డావా డాన్?' అని మీడియా అడుగుతోంది! ఏమాత్రం ఆకర్షణీయంగా లేని ఆరెంజ్ కలర్ కోటు ఒకటి నా ఒంటిపై వేసి వారం రోజులుగా ఇండోనేసియా పోలీసులు నన్ను అక్కడికీ ఇక్కడికీ తిప్పుతూనే ఉన్నారు. మోకాళ్లకు కొద్దిగా మాత్రమే కిందికి దిగి ఉన్న ఆ కోటులో రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నాలోని డాన్ ఎలా ఉండి ఉంటాడో ఊహించుకోడానికే నామోషీగా ఉంది. దావూద్ ఈపాటికి నా అవతారం చూసే ఉంటాడు టీవీల్లో. చోటా షకీల్ అయితే కడుపు చేత్తో పట్టుకుని పడీ పడీ నవ్వుకుని ఉంటాడు. ఇంతకన్నా.. 'చోటా రాజన్ షాట్ డెడ్ ఇన్ గ్యాంగ్ వార్'అని ఏ సీఎన్నెన్ ఐబిఎన్లోనో, ఆజ్తక్లోనో బ్రేకింగ్ న్యూస్ వచ్చినా గౌరవమే. ఇరవయ్యేళ్లయింది ఇండియా వదిలొచ్చి! అక్కడి థియేటర్లో కూర్చొని సినిమా చూసి కూడా ఇరవయ్యేళ్లవుతోంది. ఇండియా వెళ్లగానే, దేశభక్త డాన్ కోటాలో స్పెషల్ పర్మిషన్ ఏదైనా దొరికితే చెంబూర్ వెళ్లి నా చిన్నప్పటి సహకార్ థియేటర్లో కాసేపు కూర్చొని రావాలి. ఇప్పుడది సహకార్ ప్లాజా అయిందని ఆ మధ్య అబూ సావంత్ చెప్పాడు. సావంత్‌ది కూడా చెంబూరే. నాకన్నా పదేళ్లు చిన్నవాడు. థియేటర్ బయట బ్లాక్ టికెట్లు అమ్మడం ఎలాగో నా దగ్గరే నేర్చుకున్నాడు. నీతోనే ఉంటాను భాయ్ అన్నాడు ఓ రోజు. అప్పట్నుంచీ నాతోనే ఉన్నాడు. ఇండోనేసియా నుంచి వెళ్లాక ఇండియన్ గవర్నమెంట్ నన్ను నిజంగానే అరెస్టు చేస్తే, నన్ను నిజంగానే జైల్లో పెడితే నా బిజినెస్లన్నీ సావంత్ చూసుకోగలడు. నన్నెప్పుడు ఇండియా పంపిస్తారని పక్కనే ఉన్న పోలీసు అధికారిని అడిగాను.'మీ వాళ్లు రావాలి కదా' అన్నాడు చికాగ్గా. నన్ను అప్పగించేందుకు ఇండోనేసియా రెడీ. తీసుకెళ్లడానికి ఇండియా రెడీ. మరి ఎక్కడ లేట్ అవుతోంది?! ఏమైనా గవర్నమెంట్ల కంటే గ్యాంగ్‌స్టర్లే నయం. ధనాధన్మని.. గన్ పాయింట్‌తో అక్కడికక్కడ తేల్చేసుకుంటారు. ఒప్పందాలు, సంతకాలతో పనిలేకుండా. -
ఉషా ఉతుప్ రాయని డైరీ
మనుషులు కదలరు. కదలాలనే ఉంటుంది. కదిలితే బాగుండనే ఉంటుంది. కానీ కదల్లేరు. ఏదైనా ఫోర్స్ వారిని కదిలించాలి. ఏ శక్తీ కదిలించకపోతే అలాగే ఆడియన్స్‌గా ఉండిపోతారు. ఎప్పటికీ! అది వాళ్లకు సంతోషం కావచ్చు. కానీ వేదికపై ఇంకో సంతోషం ఉంది. కొంచెం పై లెవల్లో. దాన్ని ఎక్కితే ఆ ఆనందం ఇంకోలా ఉంటుంది. అయితే ఎలా? వేదిక వాళ్లది కాదు కదా. వాళ్ల కోసం కోల్‌కతా నుంచో, ముంబై నుంచో, చెన్నై నుంచో వచ్చిన వాళ్లది! కానీ మ్యూజిక్.. ఆడియన్స్ కోసం వేదికపై నుంచి చేతులు చాస్తుంది.. వచ్చి వాలిపొమ్మని. ప్రేమా అంతే. తల నిమురుతూ ఒడిలోకి తీసుకుంటుంది. దటీజ్ వై.. ఐ బిలీవ్ ఇన్ మ్యూజిక్. ఐ బిలీవ్ ఇన్ లవ్. రెండూ రెండు వేర్వేరు డ్రైవింగ్ ఫోర్స్‌లు. రెండూ కలిసి సుడిగాలై వీస్తే మనిషిని పైకి లేపేస్తాయి.. గాన గాంధర్వంలోకి, ప్రేమ మాధుర్యంలోకి. సుడిగాలి వీయడం ఏమిటి! రేగుతుందేమో కదా. లేదంటే, లేస్తుంది.. సుడులు తిరుగుతూ పైపైకి. కానీ లోపల ఉన్నదేమిటి? సంగీతం కదా, ప్రేమ కదా.. అందుకే అదొక దివ్య సమ్మేళనమై మత్తుగా వీస్తుంది. డాఆఆఆఆఆఆ... ర్లింగ్... ఆంఖో సే ఆంఖో చార్ కర్నేదో... ఎవరూ కదల్లేదు! దమ్ మారో దమ్... మిత్ జాయే గమ్... ఎవరూ కదల్లేదు! ఈ హైదరాబాద్‌కి ఏమయింది! నో గ్రూవింగ్. పైకి రమ్మని అడుగుతున్నాను. ఆడియన్స్లోంచి ఒక అమ్మాయి లేచింది. సిగ్గు పడుతూ నిలుచుంది. ఆ అమ్మాయిని రమ్మన్నాను. నాతో కలిసి ‘మోనీకా... ఓ మై డార్లింగ్’ అంటూ పాడాలి. నాతో పాటు హిప్స్ కదపాలి. కనీసం లిప్స్. అమ్మాయి డయాస్ పైకి వచ్చేసింది! వావ్.. దట్ ఈజ్ లౌలీ. వాళ్లాయన కింది నుంచి చూస్తున్నాడు. తినేస్తాననా? సిగ్గు తీసేస్తాననా? అమ్మాయి చెయ్యి అందుకున్నాను. కింద ఉన్న అబ్బాయి వైపు చూస్తూ అన్నాను... ‘నౌ విత్ యువర్ పర్మిషన్, ద హోల్ వరల్డ్ విల్ కాల్ యువర్ వైఫ్.. ఓ మై డార్లింగ్’. అప్పుడొచ్చింది ఆడియన్స్‌లో కదలిక! ‘మోనీకా..’ అంటూ ఊగిపోతున్నారు. హా హ్హా హా.. సంగీతమూ, ప్రేమే కాదు, ఏ బ్యూటిఫుల్ ఉమన్ బీ ఏ క్రూన్డ్ ట్రాక్ ఆఫ్ డ్రైవింగ్ ఫోర్స్. వినడం మాని, పాడే స్టేజ్‌లోకి వచ్చింది కాన్సర్ట్. అంతా గొంతు కలుపుతున్నారు. మొత్తంగా కదలడం వీలుకాని వాళ్లు కనీసం చేతులనైనా కదిపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే కదులుతున్నారు. పాటలో అమృతం ఉంటుంది. అది తాగాలి. పాడడంలోనూ అమృతం ఉంటుంది. దాన్ని తాగమని ఇవ్వాలి? మనుషులు ఎక్కువసేపు దూరంగా ఉండిపోలేరు. పాటగానీ ప్రేమగానీ దొరికే వరకే ఆ దూరం. - మాధవ్ శింగరాజు -
'కోహ్లీ నన్నెలా ఇష్టపడ్డాడో అర్థంకాదు'
ఇండియా గెలిచింది! స్వీట్ న్యూస్. ఇరవై రెండేళ్ల తర్వాత, లంకలో భారత్ గెలిచిందట. క్రికెట్లో ఈ లెక్కలన్నీ భలే వింతగా ఉంటాయి. ప్రతి బాల్కీ ఏదో ఒక రికార్డు ఉంటుంది! ప్రతి రన్కీ ఏదో ఒక రికగ్నిషన్ ఉంటుంది! కోహ్లీ కెప్టెన్‌గా గెలిచిన ఫస్ట్ మ్యాచ్ అట ఇది! గెలిచిన ఆటైనా, ఓడిన ఆటైనా కెప్టెన్ లేకుండా జట్టు ఉంటుందా? విడ్డూరం కాకపోతే! ఇంకా విడ్డూరం... ఈ ఆటను నేను గెలిపించాననడం. ట్విట్టర్లో నాపై ఒకటే నోటి జల్లులు. స్టేడియంలో నేను లేకపోబట్టి ఇండియా గెలిచిందట! క్రియేటివిటీలో ఎంత క్రూయల్టీ! అప్పుడూ అంతే. వరల్డ్ కప్పులో. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు కోహ్లీ ఒక్క రన్ కొట్టి ఔటయినందుకు తప్పంతా నాదేనని విరుచుకుపడ్డారు. అది నాకు ఇష్టమే. కోహ్లీ మీద పడకుండా. కానీ వెతుక్కోవాల్సిన కారణాలు వెతుక్కోకుండా, కారణాలకు మనుషుల్ని వెతుక్కోవడం ఏమిటి? కోహ్లీ, అనుష్కా కలిసి తిరిగితే ఇండియా ఓడిపోతుందా? కోహ్లీ, అనుష్కా ఎదురెదురుగా లేకపోతే ఇండియా గెలుస్తుందా? మరి ఈ ఇషాంత్‌లు, అశ్విన్‌లు ఎందుకు? వాళ్లని అవమానించడం కాదా? క్రికెట్ గురించి నాకేమీ తెలీదు. మ్యాచ్ చూడ్డం ఇష్టం నాకు. కోహ్లీ పక్కన కూర్చొని చూడ్డం ఇంకా ఇష్టం. కానీ కోహ్లీ ఆడుతున్నప్పుడు పక్కన కూర్చోలేనుగా. ఇంకేదైనా మ్యాచ్ చూడాలి ఇద్దరం కలిసి.. టెన్నిసో, ఫుట్బాలో. క్రికెట్టే చూడాలంటే నేను స్టాండ్‌లో కూర్చునే చూడాలి. అలా కూర్చుని చూస్తున్నప్పుడు, కోహ్లీ నన్ను చూడకుండా ఆడాలంటే అతడి కళ్లకు గంతలు కట్టించి ఆడించాలి. అప్పుడు గెలుస్తుందా ఇండియా? గెలుస్తుందేమో మరి... ఈ ట్వీట్లు పెట్టే వాళ్లకే తెలియాలి. స్వీట్లు పంచి పెట్టినట్టుగా నాకు ట్వీట్లు పంచిపెడుతున్నారు. ఇండియా ఓడినప్పుడు, గెలిచినప్పుడూ. కోహ్లీ సపోర్ట్ లేకపోతే వీళ్ల మాటలకి ఎప్పుడో డిప్రెషన్లోకి వెళ్లిపోయేదాన్ని. కోహ్లీ నా కోసం గట్టిగా నిలబడ్డాడు. నన్ను అన్న ప్రతి మాటా తనను హర్ట్ చేసిందని ప్రపంచానికి ఓపెన్‌గా చెప్పేశాడు. లవ్యూ కోహ్లీ. కోహ్లీ నన్నెలా ఇష్టపడ్డాడో అర్థం కాదు. అతడికి ముక్కు మీద కోపం. నాకు కోపం రాదు. వచ్చినా అది మూతి మీది చిరునవ్వులా వస్తుంది. కోహ్లీ అగ్రెసివ్‌గా ఉంటాడు. అగ్రెసివ్‌గా ఉండేవాళ్లని ఎంకరేజ్ చేస్తాడు. ఈ మ్యాచ్‌లో ఇషాంత్ రెచ్చగొడుతూ ఆడుతుంటే అతడిని ప్రైజ్ చేశాడు. ఇషాంత్ వల్లే ఇండియా గెలిచిందని అన్నాడు. చివరికి అదీ నాకే వచ్చింది. అప్పుడు అనుష్కా శర్మ ఇండియాని ఓడిస్తే, ఇప్పుడు ఇషాంత్ శర్మ ఇండియాను గెలిపించాడని మళ్లీ ఓ ట్వీటు! ‘రబ్నే బనా ది జోడీ’... మై ఫస్ట్ ఫిల్మ్. అందులో నాకు తెలియకుండానే షారుక్‌తో నా పెళ్లి జరిగిపోతుంది. ఇక్కడా అంతే, నా ప్రమేయం లేకుండానే టీమ్ ఇండియా అప్స్ అండ్ డౌన్స్‌కి ప్రతిసారీ నేను టార్గెట్ అవుతున్నాను! - మాధవ్ శింగరాజు -
పవన్ కల్యాణ్ రాయని డైరీ
- మాధవ్ శింగరాజు ఏది ఎటు పోతోందో అర్థం కావడం లేదు! అసలు పోతోందా, వస్తోందా, ఉన్నచోటే ఉండిపోయిందా అన్నదీ అర్థం కావడం లేదు. చేయడానికి సినిమాలున్నాయి. ఆడడానికి రాజకీయాలున్నాయి. ఫిలాసఫీకి పాదులు తవ్వి, నీళ్లు పోయడానికి ఫామ్ హౌస్ ఉంది. కానీ ఎక్కడ ఫిక్స్ అవ్వాలో అర్థం కావడం లేదు. సినిమాల్లో లాస్ట్ పంచ్ మనదే కాబట్టి ప్రాబ్లం లేదు. ఫామ్ హౌస్‌లో ఆవూదూడా మనవే కాబట్టి ఒంటిని రుద్దుకుంటూ అవి ఒకట్రెండు పంచ్‌లు వేసిపోయినా ఫీలయ్యే పని లేదు. ఎటొచ్చీ పాలిటిక్స్‌లోనే పరువు.. పంచ్‌ల పాలైపోతోంది! మాట్లాడలేదంటారు. మాట్లాడితే అర్థం కాలేదంటారు! ఎవరికి మాత్రం ఎవరి మాటలు అర్థమౌతున్నాయి ఇక్కడ?! ఎవరి డైలాగులు వారివే. ఎవరి డెరైక్షన్ వారిదే. సెక్షన్ 8 అంటే ఏంటో, ప్రత్యేక హోదా అంటే ఏంటో, ఓటుకు నోటు అంటే ఏంటో, అంతర్యుద్ధం అంటే ఏంటో, ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటో నాకు మాత్రం అర్థమయ్యాయా? అర్థం చేసుకుని మాట్లాళ్లా! అర్థం చేసుకుని మాట్లాడినవి కూడా అర్థం చేసుకోకపోతే ఎలా ఈ పొలిటీషియన్స్?! ఆయనెవరూ... రాఘవులో, నారాయణో... సీపీఐయ్యో, సీపీఎమ్మో... ఆ ఇద్దరూ ఎప్పుడూ కన్ఫ్యూజనే... వాళ్లకైతే నేనేం మాట్లాడినా అర్థం కాదు. చేగువేరా గురించి వాళ్లే మాట్లాడాలి. చే గువేరా టీ షర్ట్ వాళ్లే వేసుకోవాలి. ఇంకొకరొచ్చి చేగువేరా గురించి మాట్లాడినా వారికి అర్థం కాదు. ఇంకెవరన్నా చేగువేరా టీ షర్ట్ వేసుకున్నా చూసి ఓర్వలేరు. ఇకనుంచీ ఈ ప్రెస్ మీట్లు, ట్వీట్లు బంద్ చెయ్యాలి. రెండంటించి, నాలుగు తగిలించుకోవడం తప్ప వీటి వల్ల ఉపయోగం కనిపించడం లేదు. కేశినేని, కొనకళ్ల, సుజనా చౌదరి... నాయుడుగారు చెప్తున్నా వినకుండా నా మీద నోరుపారేసుకున్నారు! ఓటుకు నోటు ఇష్యూని డైవర్ట్ చెయ్యడానికే కదా నేను ప్రత్యేక హోదాను పనిగ ట్టుకుని పైకి తెచ్చింది. అది అర్థం చేసుకోరేం?! సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక్కరూ నాకు ఫర్ గా నోరు విప్పలేదు?! వర్మ విప్పాడు కానీ... ఏం విప్పాడో, ఏం చెప్పాడో ఆయనకే తెలియాలి. సింహం అంటాడు. పులి అంటాడు. మేక అంటాడు. పిల్లి, కుక్క, కోతి, మనిషి అంటాడు. నన్ను సింహంలా ఉండమంటాడు. సింహంలా గర్జించమంటాడు. సింహగర్జనకు అర్థం ఉండకూడదంటాడు. ఆలోచన ఉండకూడదంటాడు. ఆలోచన, అర్థము ఉంటే అది సింహగర్జనే కాదంటాడు. మొత్తం మీద వర్మ ఏమన్నాడో ముక్క అర్థం కాలేదు. ఏమైనా ఆఖరి పంచ్ మనది కాకపోతే ఆ రాత్రంతా నిద్ర పట్టదబ్బా. మంచం మీద అటూ ఇటు కదులుతున్నాను. తెల్లవారుతుండగా ఫోను!! నొక్కి , చెవిదగ్గర పెట్టుకున్నాను. చిన్న పాజ్ తర్వాత రేణూ గొంతు... ‘నేను అర్థం చేసుకోగలను కల్యాణ్...’