పవన్ కల్యాణ్ రాయని డైరీ
- మాధవ్ శింగరాజు
ఏది ఎటు పోతోందో అర్థం కావడం లేదు! అసలు పోతోందా, వస్తోందా, ఉన్నచోటే ఉండిపోయిందా అన్నదీ అర్థం కావడం లేదు. చేయడానికి సినిమాలున్నాయి. ఆడడానికి రాజకీయాలున్నాయి. ఫిలాసఫీకి పాదులు తవ్వి, నీళ్లు పోయడానికి ఫామ్ హౌస్ ఉంది. కానీ ఎక్కడ ఫిక్స్ అవ్వాలో అర్థం కావడం లేదు. సినిమాల్లో లాస్ట్ పంచ్ మనదే కాబట్టి ప్రాబ్లం లేదు. ఫామ్ హౌస్‌లో ఆవూదూడా మనవే కాబట్టి ఒంటిని రుద్దుకుంటూ అవి ఒకట్రెండు పంచ్‌లు వేసిపోయినా ఫీలయ్యే పని లేదు. ఎటొచ్చీ పాలిటిక్స్‌లోనే పరువు.. పంచ్‌ల పాలైపోతోంది!
మాట్లాడలేదంటారు. మాట్లాడితే అర్థం కాలేదంటారు! ఎవరికి మాత్రం ఎవరి మాటలు అర్థమౌతున్నాయి ఇక్కడ?! ఎవరి డైలాగులు వారివే. ఎవరి డెరైక్షన్ వారిదే. సెక్షన్ 8 అంటే ఏంటో, ప్రత్యేక హోదా అంటే ఏంటో, ఓటుకు నోటు అంటే ఏంటో, అంతర్యుద్ధం అంటే ఏంటో, ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటో నాకు మాత్రం అర్థమయ్యాయా? అర్థం చేసుకుని మాట్లాళ్లా! అర్థం చేసుకుని మాట్లాడినవి కూడా అర్థం చేసుకోకపోతే ఎలా ఈ పొలిటీషియన్స్?! ఆయనెవరూ... రాఘవులో, నారాయణో... సీపీఐయ్యో, సీపీఎమ్మో... ఆ ఇద్దరూ ఎప్పుడూ కన్‌ఫ్యూజనే... వాళ్లకైతే నేనేం మాట్లాడినా అర్థం కాదు. చేగువేరా గురించి వాళ్లే మాట్లాడాలి. చే గువేరా టీ షర్ట్ వాళ్లే వేసుకోవాలి. ఇంకొకరొచ్చి చేగువేరా గురించి మాట్లాడినా వారికి అర్థం కాదు. ఇంకెవరన్నా చేగువేరా టీ షర్ట్ వేసుకున్నా చూసి ఓర్వలేరు.
ఇకనుంచీ ఈ ప్రెస్ మీట్‌లు, ట్వీట్లు బంద్ చెయ్యాలి. రెండంటించి, నాలుగు తగిలించుకోవడం తప్ప వీటి వల్ల ఉపయోగం కనిపించడం లేదు. కేశినేని, కొనకళ్ల, సుజనా చౌదరి... నాయుడుగారు చెప్తున్నా వినకుండా నా మీద నోరుపారేసుకున్నారు! ఓటుకు నోటు ఇష్యూని డైవర్ట్ చెయ్యడానికే కదా నేను ప్రత్యేక హోదాను పనిగ ట్టుకుని పైకి తెచ్చింది. అది అర్థం చేసుకోరేం?! సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక్కరూ నాకు ఫర్ గా నోరు విప్పలేదు?! వర్మ విప్పాడు కానీ... ఏం విప్పాడో, ఏం చెప్పాడో ఆయనకే తెలియాలి. సింహం అంటాడు. పులి అంటాడు. మేక అంటాడు. పిల్లి, కుక్క, కోతి, మనిషి అంటాడు. నన్ను సింహంలా ఉండమంటాడు. సింహంలా గర్జించమంటాడు. సింహగర్జనకు అర్థం ఉండకూడదంటాడు. ఆలోచన ఉండకూడదంటాడు. ఆలోచన, అర్థము ఉంటే అది సింహగర్జనే కాదంటాడు. మొత్తం మీద వర్మ ఏమన్నాడో ముక్క అర్థం కాలేదు. ఏమైనా ఆఖరి పంచ్ మనది కాకపోతే ఆ రాత్రంతా నిద్ర పట్టదబ్బా. మంచం మీద అటూ ఇటు కదులుతున్నాను. తెల్లవారుతుండగా ఫోను!! నొక్కి , చెవిదగ్గర పెట్టుకున్నాను. చిన్న పాజ్ తర్వాత రేణూ గొంతు... ‘నేను అర్థం చేసుకోగలను కల్యాణ్...’