నెలాఖర్లో అయోధ్య ప్రయాణం. ఏ రోజుకి అక్కడ ఉండాలన్నది నవంబర్ పదిహేడున నిర్ణయించాలి. నాన్నగారు పోయిన రోజది. ‘అయోధ్యకు మేమూ వస్తాం’ అని బయల్దేరారు ఎంపీలు, ఎమ్మెల్యేలు! ‘ఇంతమంది ఎందుకు? రామ మందిరం నిర్మించడానికి వెళుతున్నామా? రాముణ్ణి దర్శించుకోడానికే కదా వెళ్తున్నాం’ అన్నాను. ‘‘ఉద్ధవ్‌జీ అక్కడ రామ మందిరం లేదు కదా! మందిరమే లేనప్పుడు దర్శించుకోడానికి రాముడు మాత్రం ఎందుకుంటాడు?’’ అన్నాడు సంజయ్‌రౌత్. ఎంపీ అతడు. అయోధ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నది అతడే. టీమ్‌తో వెళ్లి అయోధ్యకు రూట్ మ్యాప్ కూడా వేసుకొచ్చాడు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అయోధ్యకు వెళుతున్నాను. అందుకని అయోధ్య గురించి నాకేమీ తెలియదని అతడు అనుకుంటున్నట్లున్నాడు!
‘‘మదిలో మందిరం ఉన్నప్పుడు అయోధ్యలో మందిరం ఉండాల్సిన అవసరం ఏముంది సంజయ్?! మదిలో లేదు కనుకనే వీళ్లంతా అయోధ్యలోనూ లేదనుకుంటు న్నారు. లేదనుకుంటున్నారు కనుకే అయోధ్యలో మందిరాన్ని నిర్మిస్తాం అంటున్నారు’’ అన్నాను. సంజయ్ మరేమీ ప్రశ్నించలేదు. ఏర్పాట్లలో పడిపోయాడు. అప్పుడప్పుడు నేనిలా తాత్వికంగా మాట్లాడి, మళ్లీ మామూలైపోతానని అతడికి తెలుసు. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీని త్వరలోనే నేను కొన్ని కఠినమైన ప్రశ్నలు వేయబోతున్నట్లు దసరా రోజు మహారాష్ట్ర ఓటర్లకు చెప్పాను. ఆ కఠినమైన ప్రశ్నలు అయోధ్యకు వెళ్లినప్పుడు అక్కడ చేసే ర్యాలీలో వెయ్యాలా? లేక, ఈ లోపలే ముంబైలో ఓ ర్యాలీ పెట్టి వెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ముంబైలో అయితే రైతుల గురించి ఎక్కువ ప్రశ్నలు వేసి, రాముడి గురించి తక్కువ ప్రశ్నలు వేయాలి. అయోధ్యలో అయితే రాముడి గురించి ఎక్కువ ప్రశ్నలు వేసి, రైతుల గురించి తక్కువ ప్రశ్నలు వేయాలి.
నాన్నగారు గుర్తొస్తున్నారు నాకు. ఇలా ఎక్కువ తక్కువల్ని చూసుకునేవారు కాదాయన. అనాలనుకున్నది అనేసేవారు. చెయ్యాలనుకున్నది చేసేసేవారు. పులిలా ఉండేవారు. మోదీలో కూడా పులి పోలికలు ఉన్నాయి కానీ.. పులి పోలికలు ఉన్నవాళ్లంతా నాన్నగారంతటివాళ్లు అయిపోతారా! అమిత్ షా నిన్న ముంబై వచ్చి వెళ్లాడు. వచ్చి వెళుతున్నాడో, ఇక్కడే ఏదైనా లాడ్జిలో ఉంటున్నాడో తెలియడం లేదు. ముంబై దాకా వస్తున్నాడు, ముంబై లోపలికి రావడం లేదు. ముంబై బయటే మోహన్ భాగవత్‌ని కలిసి వెళుతున్నాడు. మందిరం నిర్మాణానికి మంతనాలేవో జరుపుతున్నట్లు ఇద్దరూ కలిసి పిక్చర్ ఇస్తున్నారు.
‘రా’ అని గానీ, ‘మ’ అని గానీ మోదీ ఒక్క ముక్క మాట్లాడ్డం లేదు. అయోధ్యకు వెళ్లి నేను ఆయన్ని కఠినంగా ప్రశ్నించిన తర్వాతి రోజో, అయోధ్యకు వెళ్లి నేను ఆయన్ని ప్రశ్నించడానికి ముందు రోజో మాట్లాడతాడేమో చూడాలి. ఆయన తప్ప ఆయన చుట్టూ ఉండేవాళ్లంతా భక్తితో ఊగిపోతున్నారు. ‘అయోధ్యలో మందిరాన్ని నిర్మించకపోతే ఉద్యమం లేవదీస్తాం’ అంటున్నాడు భయ్యాజీ జోషీ. ప్రభుత్వం వాళ్లది. ఇటుకలు, సిమెంట్ వాళ్లవి. రాముడి విగ్రహం వాళ్లది. ఇక ఉద్యమం ఎవరి మీద!
‘‘కోర్టును అడిగేదేంటి? కోర్టు చెప్పేదేమిటి? కోర్టు వెయ్యేళ్లకు చెబుతుంది. అప్పటివరకు ఆగుదామా?’’ అన్నాడు సంజయ్ మళ్లీ వచ్చి. ‘‘మోదీజీని అడిగేందుకు కొన్ని కఠినమైన ప్రశ్నలు తయారు చెయ్యి సంజయ్’’ అన్నాను సంజయ్ వినడం లేదు. ‘‘కోర్టును అడిగే డిమాలిష్ చేశామా? కోర్టును అడిగి కన్‌స్ట్రక్ట్ చెయ్యడానికి!’.. ఆవేశంగా అంటున్నాడు.
ఉద్ధవ్ ఠాక్రే (శివసేన చీఫ్) రాయని డైరీ
Published Sun, Nov 4 2018 1:12 AM | Last Updated on Sun, Nov 4 2018 1:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment