ముంబై : తన హిందుత్వను రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని తన హిందుత్వ స్వచ్ఛమైన బాలాసాహెబ్ హిందుత్వేనని మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. తాను తన జెండాను మార్చలేదని, తమ హిందుత్వ అంటే ఏంటో యావత్ ప్రపంచానికి తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. పాక్, బంగ్లాదేశ్‌ల నుంచి అక్రమంగా వలసవచ్చి భారత్‌లో నివసిస్తున్న వారిని స్వదేశాలకు పంపాలని కోరుతూ రాజ్ ఠాక్రేకు చెందిన ఎంఎన్‌ఎస్ మహా ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన కార్యాలయంలో జరిగిన అఖిల పక్ష భేటీలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ కాంగ్రెస్-ఎన్సీపీలతో చేతులు కలిపినంత మాత్రాన శివసేన హిందుత్వ సిద్ధాంతానికి దూరమైనట్టు కాదని వ్యాఖ్యానించారు.
తమది ఇప్పటికీ హిందుత్వ సిద్ధాంతంతో ముడిపడిన పార్టీయేనని, అయితే మహారాష్ట్ర అభివృద్ధి ప్రస్తుతం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని చెప్పుకొచ్చారు. ఈ భేటీ అనంతరం మంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ మహా వికాస్ అఘడి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని, పాలనా పగ్గాలు చేపట్టిన రెండు నెలల్లో రెండు భారీ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. రైతులకు ఊరట కల్పించడంతో పాటు రూ 10కే రుచికరమై భోజనం అందచేస్తున్నామని అన్నారు. అక్రమ వలసదారులపై ఎంఎన్‌ఎస్ ముందకుతెచ్చిన డిమాండ్లు కొత్తేమీ కాదని, దీనిపై ప్రభుత్వం, పోలీసులు పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. మరోవైపు శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో చేతులు కలపడంతో బీజేపీకి దగ్గరై హిందుత్వ పార్టీగా ఎదిగేందుకు ఎంఎన్‌ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment