విజయ్ మాల్యా రాయని డైరీ
సాయంత్రం బేకర్ స్ట్రీట్‌లో నడుస్తున్నాను. షెర్లాక్ హోమ్స్‌ది ఇదే స్ట్రీట్. ఇక్కడే ఆయన హౌస్ నెంబర్ 221బి. హోమ్స్, హౌస్ కల్పితం. కానన్ డోయల్ కల్పన. లేని హోమ్స్‌నీ, లేని హౌస్‌నీ ఊహించుకుంటూ నడుస్తున్నాను. ఒక్కణ్ణే లే మ్యాన్‌లా నడుస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్ లేరు. పార్టీలు లేవు. బోరింగ్‌గా ఉంది. ఈ లండన్‌లో కనుక ఇప్పుడు ప్రపంచ దేశాల రిజర్వు బ్యాంకు గవర్నర్‌ల సమావేశం జరుగుతూ ఉండి, ఆ సమావేశానికి రఘురామ్ రాజన్ కూడా వచ్చి ఉండి.. సడన్‌గా నన్నిలా చూస్తే.. ‘మనిషన్నవాడు ఇలాగే బతకాలి’ అని ఆప్యాయంగా, అభినందనగా భుజం తడతాడేమో!
మనిషన్నవాడు నాలా బతక్కూడదని ఈ మధ్యే టీవీలో చెప్పాడు రాజన్. అంత త్వరగా నేను నాలా బతక్కపోవడం చూస్తే నన్నిక్కడ నడివీధిలో ఆయన గట్టిగా హత్తుకున్నా హత్తుకుంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలట! రాజన్ అంటాడు. గోవాలో నా షష్టిపూర్తి బర్త్‌డే కి మూడొందల మంది రావడం ఆయనకి నచ్చలేదు. ముప్పై లక్షల డాలర్లు ఖర్చవడం నచ్చలేదు. అదంతా బ్యాంకుల డబ్బే అని ఆయన అనుమానం. అవును బ్యాంకుల డబ్బే. పదిహేడు బ్యాంకుల డబ్బు. అంతంత డబ్బు బ్యాంకులివ్వకుండా బెవరేజ్ కంపెనీలు తయారు చేసుకుంటాయా?!
మనిషన్నవాడు రాజులా బతకాలి. రాజు తనకు నచ్చినట్టు బతుకుతాడు. రిజర్వుబ్యాంకు గవర్నర్ రాజన్‌కు నచ్చినట్టు బతకడు. ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీకి నచ్చినట్టు బతకడు. సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హాకు నచ్చినట్టు బతకడు. వీళ్లంతా రూపాయికి కాపలాదారులే తప్ప, లాకర్ తెరిచి ఓ రూపాయి తీసుకునే హక్కులేనివారు. చేతిలో రూపాయి లేనివాడు రాజులా ఎలా బతుకుతాడు? రాజు కూడా మనిషే కానీ, రాజులా బతకలేనివాడు మనిషెలా అవుతాడు?
బేకర్ స్ట్రీట్‌కి వెనక వీధిలోనే మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియమ్. లోపలికెళ్లాను. మాధురి, ఐశ్వర్య, కరీనా, కత్రీనా! మ్యూజియమ్‌లో లైఫ్ లేదు. ఏదో తక్కువైంది. ఎస్! కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్ స్టాచ్యూ మిస్ అయిందక్కడ. కన్‌సర్న్డ్ ఎవరో కనుక్కుని చెప్పాలి.
చీకటి పడుతోంది. మళ్లీ బేకర్ స్ట్రీట్‌లో నడుస్తున్నాను. ఈసారి ఒక్కణ్ణే కాదు. వెనకెవరో నీడలా వస్తున్నారు. వస్తున్నారా? వెంటాడుతున్నారా? ఎవరు వాళ్లు? కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులా? మీడియా వాళ్లా? బ్యాంకు మేనేజర్లా? షెర్లాక్ హోమ్స్‌లాంటి డిటెక్టివ్‌లా? వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు! తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు.. నీడలా నా వెంట వస్తోంది.
నిన్నమొన్నటి దాకా ఎంత బాగా బతికాను?! కింగ్ సైజ్ లైఫ్. గతం ఆలోచిస్తే నాకు నేనే షెర్లాక్ హోమ్స్‌లా ఒక కల్పిత పాత్రలా అనిపిస్తున్నాను. కోర్టు తీర్పు వచ్చాక నాకున్న నలభై ఇళ్ల నెంబర్లు కూడా కాలక్రమంలో కల్పితం అయిపోతాయేమో.. షెర్లాక్ హోమ్స్ ఇంటి నెంబర్‌లా!!
-మాధవ్ శింగరాజు