un written dairy
-
అరుణ్ జైట్లీ రాయని డైరీ
బడ్జెట్‌కి ముందు రోజు రాత్రి మోదీజీ నన్ను ఇంటికి పిలిచారు. నేనుండేది కైలాష్ కాలనీలో. మోదీజీ ఉండేది లోక్ కల్యాణ్ మార్గ్‌లో. పది కిలోమీటర్ల దూరం. ఇరవై నిమిషాల ప్రయాణం. నేను వెళ్లేసరికి ‘పంచవటి’లో మోదీజీ ఒక్కరే ఉన్నారు. బాల్కనీలో నిల్చుని దూరంగా ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు. ‘‘ప్రశాంతంగా లేను జైట్లీజీ’’ అన్నారు.. తల తిప్పకుండానే, నా అలికిడి విని. పంచవటి ప్రశాంతంగా ఉంటుంది. పంచవటిలో ఉన్నవాళ్లకే ప్రశాంతత ఉండదు! పంచవటిలో బీజేపీ ఒక టర్మే ఉంది. తర్వాత వనవాసంలోకి వెళ్లింది. తర్వాత మళ్లీ పంచవటిలోకి వచ్చింది. తర్వాత మళ్లీ వనవాసమేనా? ‘‘పంచవటి పేరైనా మార్చాలి. పంచవటి ఉన్న ప్లేస్ అయినా మార్చాలి మోదీజీ.. మనం’’ అన్నాను. ‘‘దేని గురించి జైట్లీజీ మీరు మాట్లాడుతున్నది?’’ అన్నారు మోదీజీ. ‘‘ప్రశాంతత గురించి మోదీజీ’’ అన్నాను. ఇద్దరం పక్కపక్కనే నిలబడి ఆకాశంలోకి చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. నిశ్శబ్దంగా ఉన్నారు మోదీజీ. ‘‘ఆకాశంలో ఏం చూస్తున్నారు మోదీజీ?’’ అని అడిగాను. ‘‘సామాన్యుడిని చూస్తున్నాను జైట్లీజీ. అందుకే ప్రశాంతంగా లేను’’ అన్నారు ఆయన.. ఇంకాస్త డీప్‌గా ఆకాశంలోకి చూస్తూ. ‘‘జైట్లీజీ.. మీ బడ్జెట్‌తో ధనవంతుడిని కొంచెం సామాన్యుడిగా, సామాన్యుడిని కొంచెం ధనవంతుడిగా మార్చగలరా?’’ అని అడిగారు. ఆ మాట కూడా ఆకాశంలోకి చూస్తూనే అడిగారు. నేనూ ఆకాశంలోకే చూస్తున్నాను. అక్కడ నాకు సామాన్యుడు కనిపించడం లేదు. మోదీజీ కనిపిస్తున్నారు! ఇక్కడున్న మోదీజీ ఆకాశంలో ఉన్న సామాన్యుడిని చూస్తున్నట్టుగానే, ఆకాశంలో కనిపిస్తున్న మోదీజీ ఇక్కడున్న సామాన్యుడిని చూస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. చేతులెత్తి దండం పెట్టాను! ‘‘ఎవరికి దండం పెడుతున్నారు జైట్లీజీ? సామాన్యుడికేనా?’’ అన్నారు మోదీజీ. మోదీజీలోని ప్రత్యేకత అదే. తనకు కనిపిస్తున్నదే అందరికీ కనిపిస్తూ ఉంటుందని అనుకుంటారు. ‘‘అవును మోదీజీ’’ అన్నాను. ‘‘పది కిలోమీటర్ల దూరాన్ని ఇరవై నిముషాల్లో ఎవరైనా దాటేస్తారు జైట్లీజీ. ఇరవై కిలోమీటర్ల దూరాన్ని పది నిముషాల్లో దాటగలిగినవాళ్లే సామాన్యుడికి ఏమైనా చేయగలరు’’ అన్నారు మోదీజీ! అర్థమైంది. ఆకాశంలో మోదీజీ చూస్తున్నది సామాన్యుడిని కాదు. ఎవరి మీద కోపం వచ్చినా.. వారిని సామాన్యుడిలో చూసుకుంటారు మోదీజీ. అది ఆయనలోని ఇంకో ప్రత్యేకత. - మాధవ్ శింగరాజు -
నితీశ్ కుమార్ (బిహార్ సీఎం)రాయని డైరీ
ఉదయాన్నే ఫోన్ కాల్ ! ఫోన్ చేసిన మనిషి ‘సర్’ అనకుండానే స్ట్రయిట్‌గా పాయింట్లోకి వచ్చేశాడు. ‘‘ఓ ఫైవ్ అవర్స్ బయటికి రాకండి. సెక్యూరిటీ ప్రాబ్లమ్’’ అన్నాడు! ‘‘ఎవర్నువ్వు?’’ అని అడిగాను. పేరు చెప్పాడు. ‘‘పేరు కాదు, నువ్వేం చేస్తుంటావ్?’’ అన్నాను. ‘‘అడిషనల్ డీజీపీని సార్’’ అన్నాడు. ‘‘మరి నేనెందుకు బయటికి రాకూడదు?’’ అని అడిగాను. ‘‘మోదీజీ వస్తున్నారు సర్. డీజీపీ, ఎస్పీలు, డీఎస్పీలు, బిహార్ మిలటరీ, టాస్క్‌ఫోర్స్, సి.ఆర్.పి.ఎఫ్., ఎస్టీఎఫ్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. అంతా ఆయనతో ఉంటారు సర్. ఉండటానికి మీకెవరూ ఉండరు ’’ అన్నాడు. కాల్ కట్ చేశాను. వెంటనే లాలూ లైన్లోకి వచ్చాడు! ‘‘లాలూజీ చెప్పండీ..’’ అన్నాను. ‘‘ఆ.. నితీశ్‌జీ.. ఎలా ఉన్నారు?’’ అన్నాడు. బాగున్నాననీ చెప్పలేదు. బాగోలేననీ చెప్పలేదు. ఎలా ఉన్నానో అతడికి తెలీదా! ‘‘నూరేళ్ల పాట్నా యూనివర్సిటీ ఫంక్షన్‌కి మోదీ వస్తున్నాడని ఫ్లెక్సీలు పెట్టారు నితీశ్‌జీ. పెద్ద తలకాయలు, చిన్న తలకాయలు, ఓ మోస్తరు తలకాయలు.. ముప్పై ఐదు వరకు ఉన్నాయి. అందులో ఒక్క తలకాయ కూడా మీది లేదు. గమనించారా?’’ అని అడిగాడు. ‘‘లేనిదాన్ని ఏం గమనిస్తాం చెప్పండి లాలూజీ’’ అన్నాను. ‘‘పోనీ ఉన్నదాన్నైనా గమనించాలి కదా నితీశ్‌జీ. ఫ్లెక్సీలలో మీరు లేరు, మీ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు’’ అన్నాడు. లాలూ లైన్లో ఉండగానే శత్రుఘ్న సిన్హా నుంచి కాల్! ‘‘శత్రూ.. కాల్ చేస్తున్నారు మిత్రమా..’’ అని లాలూతో అన్నాను. ‘‘నాకూ ఇక్కడో కాల్ వస్తోంది.. ఢిల్లీ నుంచి యశ్వంత్ సిన్హా ఫోన్ చేస్తున్నారు’’ అన్నాడు లాలూ. నలుగురం గ్రూప్ కాల్లోకి వచ్చాం. ‘‘నేను పాట్నా ఎంపీని అని మీకు తెలుసు కదా నితీశ్‌జీ’’ అన్నారు శత్రుఘ్న. ‘‘తెలుసు.. చెప్పండి’’ అన్నాను. ‘‘పోనీ, మీకు తెలిసి, మోదీకి తెలియదనే అనుకుందాం. పాట్నా యూనివర్శిటీ పాత స్టూడెంట్గానైనా నన్ను సెంటినరీ సెలబ్రేషన్స్‌కి పిలవొచ్చు కదా’’ అన్నారు ఆయన. ‘‘నేనూ పాత స్టూడెంట్‌నే. నాకూ రాలేదు ఇన్విటేషన్’’ అన్నారు యశ్వంత్ సిన్హా. లాలూ పెద్దగా నవ్వాడు. ‘‘నేనూ పాట్నా స్టూడెంట్‌నే. నాకూ రాలేదు ఇన్విటేషన్’’ అన్నాడు. అని, మళ్లీ పెద్దగా నవ్వాడు. ‘‘అంత నవ్వు ఎందుకొస్తోంది లాలూజీ’’ అన్నారు శత్రుఘ్న, యశ్వంత్ ఇద్దరూ కోపంగా. ‘‘ఫ్లెక్సీలో ప్లేస్ లేకపోవడం కన్నా.. ఇదేం పెద్ద ఇన్సల్ట్ కాదు కదా మిత్రులారా’’ అన్నాడు లాలూ. ఈ ఇన్సల్ట్ గురించి చెప్పడానికే సిన్హాలిద్దరినీ లాలూ.. గ్రూప్ కాల్లోకి తెప్పించి ఉంటాడని నా అనుమానం. -
నవాజ్ షరీఫ్ (పాక్ ప్రధాని)
రాయని డైరీ ఐ లవ్ మై కంట్రీ! ఏ దేశ పౌరుడు ఆ దేశాన్ని ప్రేమించడంలో విశేషం ఏమీ లేదు. కానీ దేశ ప్రధానిగా ఉంటూ దేశాన్ని ప్రేమించడం పాకిస్తాన్లో విశేషమే. పాకిస్తాన్ కూడా తన దేశ పౌరుల్ని ప్రేమించినంతగా ఏనాడూ తన దేశ ప్రధానిని ప్రేమించలేదు. అందుకు నేనేమీ నా దేశాన్ని నిందించడం లేదు. ఎవరి ప్రేమ వాళ్లది. నన్ను ప్రేమించట్లేదు కాబట్టి, నేను ప్రేమించట్లేదు అని ముషర్రఫ్ లాంటి వాళ్లే అనగలరు. ప్రేమించక పోయినా ప్రేమించడమే నిజమైన ప్రేమ. ఈ మాటని అప్పుడప్పుడు ఇమ్రాన్‌ఖాన్ అంటుంటాడు. కానీ అతణ్ణి నేను నమ్మను. ఏ దేశంలోనూ పాలకపక్షం ప్రతిపక్షాన్ని ప్రేమించదు. ‘ప్రేమించకపోతే నాకేంటి? నేను ప్రేమిస్తాను’ అని నిజంగా అనుకునేవాడే అయితే ప్రతిపక్ష నేతగా ఇమ్రాన్ మా పార్టీని ప్రేమించి ఉండాలి. కనీసం నన్నైనా ప్రేమించి ఉండాలి. ప్రేమించలేదు. ప్రేమిస్తే నాపై కోర్టులో కేసెందుకు వేయిస్తాడు?! కోర్టు తీర్పు రాగానే, దుబాయ్ నుంచి ముషర్రఫ్ ఫోన్ చేశాడు. వెంటనే లిఫ్ట్ చేశాను. ఎంతైనా.. నేను ప్రేమించే నా దేశపు పూర్వ అధ్యక్షుడు అతడు. అతడూ నాలాగే నా దేశాన్ని ప్రేమించాడా లేదా అన్నది నాకు అనవసరం. నా దేశాన్ని ప్రేమించినట్లే, నేనూ నా దేశపు పూర్వ అధ్యక్షులను కూడా ప్రేమిస్తాను. ‘‘మిస్టర్ ముషర్రఫ్.. ఎలా ఉంది మీ ఆరోగ్యం?’’ అని ఎంతో ప్రేమగా అడిగాను. పెద్దగా నవ్వాడు ముషర్రఫ్. అతడి ఆరోగ్యం మెరుగుపడినట్లే ఉంది! ‘‘షరీఫ్ జీ.. నేను దుబాయ్ నుంచి వచ్చేసరికి పాకిస్తాన్‌లోని దుకాణాలలో నాకు ఒక్క మిఠాయి పొట్లం అయినా మిగిలి ఉండే అవకాశం ఉంటుందా?’’ అని అడిగాడు! అతడేం మారలేదు. ‘‘మిస్టర్ ముషర్రఫ్.. ఆ సంగతి చెప్పలేను. కానీ నా పదవి పోయిందన్న ఆనందాన్ని ఇక్కడి వాళ్లతో పంచుకోవడానికి మీరే అక్కడి నుంచి కొన్ని మిఠాయి పొట్లాలు తెచ్చుకోవడం మెరుగైన ఆలోచన కదా’’ అని అన్నాను. అతడిపై నాకేం కోపం రాలేదు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నప్పుడు.. అతడు నన్నెంత ద్వేషించినా.. నేనతడిని ప్రేమించకుండా ఎలా ఉండగలను? ‘‘నెక్స్ట్ ఏంటీ?’’ అన్నాడు ముషర్రఫ్. పాక్ ప్రధానులెవరూ నెక్స్ట్ ఏంటీ అని ఆలోచించరని అతడికి మాత్రం తెలీదా? ‘‘నెక్స్ట్ ఏమీ లేదు మిస్టర్ ముషర్రఫ్.. ఎప్పటిలా నేను నా దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటాను’’ అని చెప్పాను. నా దేశంలోని గొప్పతనం ఏంటంటే.. ఇక్కడ ఏ ప్రధానీ పూర్తికాలం ఐదేళ్లూ ఉండడు. కానీ దిగిపోయిన ప్రతి ప్రధానీ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు! మాధవ్ శింగరాజు -
టిమ్ కుక్ రాయని డైరీ
కంపెనీలు ఫ్లాప్ అయినట్లే కంట్రీలూ ఫ్లాప్ అవుతుంటాయి. నలభై యేళ్ల ఆపిల్ కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద ఫ్లాప్.. ‘గేమ్స్ కన్సోల్’. కంపెనీకే మచ్చ. ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఐపాడ్లు, మ్యాక్‌లు.. ఎన్ని గొప్ప ఇన్వెన్షన్లు! కానీ మచ్చ మచ్చే. హిస్టరీని మెరుపుల కన్నా, మరకలే బాగా పట్టేసుకుంటాయి. మెరుపు మెరిసిన ప్రతిసారీ మచ్చ కనబడిపోతుంది. నలభై నాలుగు మంది గొప్ప అధ్యక్షులతో మెరిసిన అమెరికా ఇప్పుడు చేజేతులా తన ముఖం మీదికి మచ్చను తెచ్చుకుంది. ట్రంప్ ఇప్పుడు అమెరికాకు నలభై ఐదవ అధ్యక్షుడిగా మాత్రమే కాదు, అమెరికాలోని అన్ని అమెరికన్ కంపెనీల సీఈఓగా కూడా కనిపిస్తున్నాడు! నా క్యాబిన్ వైపు నడుస్తున్నాను. ఒక్క చిరునవ్వూ లేదు. ఆగి అడిగాను. ఏంటలా ఉన్నారని! ‘‘గుడ్మాణింగ్ మిస్టర్ ప్రెసిడెంట్’’ అనేసిందో ఇంటెర్నీ! వెంటనే తేరుకుని, ‘సారీ సర్’ అంది! తను అమెరికన్ కాదు. కానీ తన లాంటి వాళ్లు లేకుండా నా అమెరికన్ కంపెనీ లేదు. నవ్వుతూ తన వైపు చూశాను. ‘అమెరికా ప్రెసిడెంట్ మాత్రమే మారాడు. ఆపిల్ కంపెనీ ఎప్పటిలానే ఉంది’ అని చెప్పాను. అమెరికా లాంటిదే ఆపిల్ కంపెనీ. అన్ని దేశాలూ ఉంటేనే అమెరికా. అన్ని దేశాల ఉద్యోగులు ఉంటేనే ఆపిల్ కంపెనీ. ‘‘ఫ్రెండ్స్.. ట్రంప్ ఎలాగైతే అమెరికా అధ్యక్షుడో, మనమంతా అలాగ ఆపిల్ ఉద్యోగులం. ఆయనది వైట్ హౌస్ అయితే మనది ఆపిల్ హౌస్’’ అన్నాను నవ్వుతూ. ఎవరూ నవ్వలేదు. నవ్వు ముఖం మాత్రం పెట్టారు. ట్రంప్ క్యాంపెయిన్ స్పీచ్ వారిని ఇంకా వెంటాడుతూనే ఉన్నట్లుంది! ‘‘సీ.. మనల్ని ఎవరూ విడదీయలేరు. కలిసి పని చేయడమే ఇక్కడ మనం చేయవలసిన పని కాబట్టి మనల్ని ఎవరూ విడదీయలేరు. కొత్తగా వచ్చేవాళ్లనీ మనతో కలవనీయకుండా ఎవరూ చెయ్యలేరు. కొత్త ఐడియాలతోనే మనం ఎప్పుడూ పనిచేస్తుండాలి కాబట్టి మనతో ఎవర్నీ కలవనీయకుండా చేయలేరు. ట్రంప్ గురించి నాకు తెలుసు. ఆపిల్ ప్రోడక్ట్లను ఎవరూ కొనద్దని ఆయన ట్వీట్ చేసిన మాట నిజమే. కానీ ఎలా ట్వీట్ చేశారో తెలుసా? ఆపిల్ ఐఫోన్లోంచి!’’ ఒక్కసారిగా నవ్వులు. ఏడు ఖండాల నవ్వులు. ఏడు సముద్రాల నవ్వులు. ఈజ్ అవుతున్నారు నా స్టాఫ్ కొద్దికొద్దిగా. ‘‘అందరం కలిసే పనిచేద్దాం. ట్రంప్‌కి ఓటు వేసివచ్చినవాళ్లం, ట్రంప్‌కి వెయ్యకుండా వచ్చినవాళ్లం.. అందరం కలిసే పని చేద్దాం. ముందు ఏముందో తెలియదు. కానీ ముందుకేగా వెళ్లాలి. అంతా కలిసే వెళదాం’’. ‘‘యా.. సర్’’ అంది .. అంతకుక్రితం నన్ను ‘మిస్టర్ ప్రెసిడెంట్’ అని సంబోధించిన అమ్మాయి నవ్వుతూ. తన నవ్వుతో ఆపిల్ కంపెనీ మొత్తానికే వెలుగు వచ్చినట్లుగా అనిపించింది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని నిరంతరం వెలిగిస్తూ ఉండేవి ఇలాంటి భయం లేని నాన్–అమెరికన్ నవ్వులే. -మాధవ్ శింగరాజు -
విజయ్ మాల్యా రాయని డైరీ
సాయంత్రం బేకర్ స్ట్రీట్‌లో నడుస్తున్నాను. షెర్లాక్ హోమ్స్ది ఇదే స్ట్రీట్. ఇక్కడే ఆయన హౌస్ నెంబర్ 221బి. హోమ్స్, హౌస్ కల్పితం. కానన్ డోయల్ కల్పన. లేని హోమ్స్నీ, లేని హౌస్నీ ఊహించుకుంటూ నడుస్తున్నాను. ఒక్కణ్ణే లే మ్యాన్‌లా నడుస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్ లేరు. పార్టీలు లేవు. బోరింగ్‌గా ఉంది. ఈ లండన్‌లో కనుక ఇప్పుడు ప్రపంచ దేశాల రిజర్వు బ్యాంకు గవర్నర్ల సమావేశం జరుగుతూ ఉండి, ఆ సమావేశానికి రఘురామ్ రాజన్ కూడా వచ్చి ఉండి.. సడన్‌గా నన్నిలా చూస్తే.. ‘మనిషన్నవాడు ఇలాగే బతకాలి’ అని ఆప్యాయంగా, అభినందనగా భుజం తడతాడేమో! మనిషన్నవాడు నాలా బతక్కూడదని ఈ మధ్యే టీవీలో చెప్పాడు రాజన్. అంత త్వరగా నేను నాలా బతక్కపోవడం చూస్తే నన్నిక్కడ నడివీధిలో ఆయన గట్టిగా హత్తుకున్నా హత్తుకుంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలట! రాజన్ అంటాడు. గోవాలో నా షష్టిపూర్తి బర్త్‌డే కి మూడొందల మంది రావడం ఆయనకి నచ్చలేదు. ముప్పై లక్షల డాలర్లు ఖర్చవడం నచ్చలేదు. అదంతా బ్యాంకుల డబ్బే అని ఆయన అనుమానం. అవును బ్యాంకుల డబ్బే. పదిహేడు బ్యాంకుల డబ్బు. అంతంత డబ్బు బ్యాంకులివ్వకుండా బెవరేజ్ కంపెనీలు తయారు చేసుకుంటాయా?! మనిషన్నవాడు రాజులా బతకాలి. రాజు తనకు నచ్చినట్టు బతుకుతాడు. రిజర్వుబ్యాంకు గవర్నర్ రాజన్‌కు నచ్చినట్టు బతకడు. ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీకి నచ్చినట్టు బతకడు. సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హాకు నచ్చినట్టు బతకడు. వీళ్లంతా రూపాయికి కాపలాదారులే తప్ప, లాకర్ తెరిచి ఓ రూపాయి తీసుకునే హక్కులేనివారు. చేతిలో రూపాయి లేనివాడు రాజులా ఎలా బతుకుతాడు? రాజు కూడా మనిషే కానీ, రాజులా బతకలేనివాడు మనిషెలా అవుతాడు? బేకర్ స్ట్రీట్‌కి వెనక వీధిలోనే మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియమ్. లోపలికెళ్లాను. మాధురి, ఐశ్వర్య, కరీనా, కత్రీనా! మ్యూజియమ్‌లో లైఫ్ లేదు. ఏదో తక్కువైంది. ఎస్! కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్ స్టాచ్యూ మిస్ అయిందక్కడ. కన్సర్న్డ్ ఎవరో కనుక్కుని చెప్పాలి. చీకటి పడుతోంది. మళ్లీ బేకర్ స్ట్రీట్‌లో నడుస్తున్నాను. ఈసారి ఒక్కణ్ణే కాదు. వెనకెవరో నీడలా వస్తున్నారు. వస్తున్నారా? వెంటాడుతున్నారా? ఎవరు వాళ్లు? కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులా? మీడియా వాళ్లా? బ్యాంకు మేనేజర్లా? షెర్లాక్ హోమ్స్లాంటి డిటెక్టివ్‌లా? వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు! తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు.. నీడలా నా వెంట వస్తోంది. నిన్నమొన్నటి దాకా ఎంత బాగా బతికాను?! కింగ్ సైజ్ లైఫ్. గతం ఆలోచిస్తే నాకు నేనే షెర్లాక్ హోమ్స్‌లా ఒక కల్పిత పాత్రలా అనిపిస్తున్నాను. కోర్టు తీర్పు వచ్చాక నాకున్న నలభై ఇళ్ల నెంబర్లు కూడా కాలక్రమంలో కల్పితం అయిపోతాయేమో.. షెర్లాక్ హోమ్స్ ఇంటి నెంబర్లా!! -మాధవ్ శింగరాజు -
ఆశాదేవి (నిర్భయ తల్లి) రాయని డైరీ
నేరము-శిక్ష! చట్టానికి ఇంతవరకే తెలుసు. మహామహులు దీర్ఘంగా ఆలోచించి, ఆ ఆలోచనల్ని పెద్ద బౌండ్ బుక్కులా కుట్టి, దానికో గట్టి అట్ట వేసి, అల్మరాలో భద్రంగా పెట్టి వెళ్లిన చట్టానికి ఇంతవరకే తెలుసు. పుస్తకంలో ఏ నేరానికి ఏ శిక్ష రాసి ఉంటే ఆ శిక్షను వేసి చేతులు దులుపుకుంటుంది చట్టం. పుస్తకానికి అంటుకుని ఉన్న దుమ్మును మాత్రం దులపదు. చేతులు దులుపుకున్నాక పుస్తకాన్ని దులిపితే మళ్లీ ఆ దుమ్ము తన చేతులకు అంటుకుంటుందనేమో.. తిరిగి ఆ పుస్తకాన్ని ముట్టుకోదు. తిరిగి ఆ పుస్తకాన్ని తిరగేయదు. తిరిగి ఆ పుస్తకాన్ని తిరగరాయదు. ఎప్పుడో ఇంకో నేరస్థుడు వస్తాడు. అప్పుడే ఆ పుస్తకమూ బయటికి వస్తుంది. నేరస్థుడిని బోనులో నిలబెట్టాక న్యాయకోవిదులు వాదనలు వినే చట్టం ఒకటి, నేరస్థుడిని విడిపించుకోడానికి కోర్టు మెట్లు ఎక్కి వస్తూ న్యాయవాదులు తమ వెంట తెచ్చుకునే చట్టం ఒకటి. వాదనల కోసం రాసుకున్న ఈ పుస్తకాలలో వేదనలకు ఉపశమనాలుంటాయా?! ఉంటే ఈ తీర్పులు ఇలా ఉంటాయా? నేరస్థుడిని విడుదల చేస్తున్నారట! ఇవాళో రేపో బయటికి వస్తాడట. ‘పిల్లవాడు’ అని వదిలేస్తున్నారట! అలా అని చట్టంలో ఉందట! మృగాన్ని బయటి ప్రపంచంలోకి వదిలిపెడితే మనుషులు ఏమైపోతారోనని చట్టం ఆలోచించడం లేదు. మృగానికి మనుషులెక్కడ హాని తలపెడతారోనని ఆలోచిస్తోంది! మనుషుల్లోకి వెళ్లబోతున్న మృగం.. మనిషిలా మారడానికి చేయవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తోంది! ఆ మృగం చేత టైలరింగ్ షాపు పెట్టిస్తోంది. ఆ షాపుకో సైన్ బోర్డు రాయిస్తోంది. షాపులోకి టైలరింగ్ మెటీరియల్‌ని, రసీదు పుస్తకాలను తెప్పిస్తోంది. షాపు ప్రారంభోత్సవానికి తప్పనిసరిగా ముఖ్యమంత్రి కూడా వెళ్లి తీరాలన్న రూలు చట్టంలో లేదేమో మరి! ఇన్నాళ్లూ చట్టం ఆ మృగం పేరును మాత్రమే దాచిపెట్టింది. ఇప్పుడు ఆ మృగాన్నే దాచిపెడుతోంది. నాకైతే ‘చట్టం’ అనే పుస్తకాన్ని కడిగిపారేయాలనిపిస్తోంది. నా కూతురు.. మా జీవనజ్యోతి.. ప్రాణాలతో పోరాడి పోరాడి, ఆశలలో రెపరెపలాడి ఆడి, ఆరిపోయాక.. ఈ ప్రపంచమే నాకు ధైర్యం చెప్పింది. చెంతకొచ్చి కన్నీళ్లు తుడిచింది. చనిపోయిన నా కూతురికి నామకరణం చేసింది. ఇక నుంచీ ప్రతి కూతురి పేరూ ఇదేనని ఇల్లిల్లూ ప్రతిధ్వనించేలా చెప్పింది. నిర్భయంగా చదువుకొమ్మని, నిర్భయంగా ఉద్యోగాలు చేసుకురమ్మని ఆడపిల్లలకు చెప్పింది. మీ కూతుళ్లను నిర్భయంగా బయటికి పంపండని కన్నవాళ్లకు చెప్పింది. కన్నబిడ్డను పోగొట్టుకున్న తల్లి పడే ఆవేదన లోకంలో ఎవరూ తీర్చలేనిదని తీర్పునిచ్చింది. ఆ మాత్రం తీర్పును ఈ చట్టం ఇవ్వలేకపోయింది! కడుపు రగిలిపోతుంటే.. నాకివాళ కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. కన్నీళ్లతో కడిగితే చట్టం ప్రక్షాళన అవుతుందా? ఓ తల్లి కన్నీళ్లకు కరిగిపోయేంత మానవీయత ఈ చట్టానికి ఉందా? చట్టాలను తీర్చిదిద్దడానికి మహామహులు మాత్రమే సరిపోరు. వారిలో మహనీయులు కూడా ఉండాలి. -మాధవ్ శింగరాజు