ఉదయాన్నే ఫోన్ కాల్ ! ఫోన్ చేసిన మనిషి ‘సర్’ అనకుండానే స్ట్రయిట్‌గా పాయింట్‌లోకి వచ్చేశాడు. ‘‘ఓ ఫైవ్ అవర్స్ బయటికి రాకండి. సెక్యూరిటీ ప్రాబ్లమ్’’ అన్నాడు!
‘‘ఎవర్నువ్వు?’’ అని అడిగాను. పేరు చెప్పాడు. ‘‘పేరు కాదు, నువ్వేం చేస్తుంటావ్?’’ అన్నాను. ‘‘అడిషనల్ డీజీపీని సార్’’ అన్నాడు.
‘‘మరి నేనెందుకు బయటికి రాకూడదు?’’ అని అడిగాను.
‘‘మోదీజీ వస్తున్నారు సర్. డీజీపీ, ఎస్పీలు, డీఎస్పీలు, బిహార్ మిలటరీ, టాస్క్‌ఫోర్స్, సి.ఆర్.పి.ఎఫ్., ఎస్టీఎఫ్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. అంతా ఆయనతో ఉంటారు సర్. ఉండటానికి మీకెవరూ ఉండరు ’’ అన్నాడు. కాల్ కట్ చేశాను. వెంటనే లాలూ లైన్‌లోకి వచ్చాడు!
‘‘లాలూజీ చెప్పండీ..’’ అన్నాను.
‘‘ఆ.. నితీశ్‌జీ.. ఎలా ఉన్నారు?’’ అన్నాడు.
బాగున్నాననీ చెప్పలేదు. బాగోలేననీ చెప్పలేదు. ఎలా ఉన్నానో అతడికి తెలీదా!
‘‘నూరేళ్ల పాట్నా యూనివర్సిటీ ఫంక్షన్‌కి మోదీ వస్తున్నాడని ఫ్లెక్సీలు పెట్టారు నితీశ్‌జీ. పెద్ద తలకాయలు, చిన్న తలకాయలు, ఓ మోస్తరు తలకాయలు.. ముప్పై ఐదు వరకు ఉన్నాయి. అందులో ఒక్క తలకాయ కూడా మీది లేదు. గమనించారా?’’ అని అడిగాడు.
‘‘లేనిదాన్ని ఏం గమనిస్తాం చెప్పండి లాలూజీ’’ అన్నాను.
‘‘పోనీ ఉన్నదాన్నైనా గమనించాలి కదా నితీశ్‌జీ. ఫ్లెక్సీలలో మీరు లేరు, మీ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు’’ అన్నాడు.
లాలూ లైన్‌లో ఉండగానే శత్రుఘ్న సిన్హా నుంచి కాల్! ‘‘శత్రూ.. కాల్ చేస్తున్నారు మిత్రమా..’’ అని లాలూతో అన్నాను.
‘‘నాకూ ఇక్కడో కాల్ వస్తోంది.. ఢిల్లీ నుంచి యశ్వంత్ సిన్హా ఫోన్ చేస్తున్నారు’’ అన్నాడు లాలూ.
నలుగురం గ్రూప్ కాల్‌లోకి వచ్చాం.
‘‘నేను పాట్నా ఎంపీని అని మీకు తెలుసు కదా నితీశ్‌జీ’’ అన్నారు శత్రుఘ్న.
‘‘తెలుసు.. చెప్పండి’’ అన్నాను.
‘‘పోనీ, మీకు తెలిసి, మోదీకి తెలియదనే అనుకుందాం. పాట్నా యూనివర్శిటీ పాత స్టూడెంట్‌గానైనా నన్ను సెంటినరీ సెలబ్రేషన్స్‌కి పిలవొచ్చు కదా’’ అన్నారు ఆయన.
‘‘నేనూ పాత స్టూడెంట్‌నే. నాకూ రాలేదు ఇన్విటేషన్’’ అన్నారు యశ్వంత్ సిన్హా.
లాలూ పెద్దగా నవ్వాడు. ‘‘నేనూ పాట్నా స్టూడెంట్‌నే. నాకూ రాలేదు ఇన్విటేషన్’’ అన్నాడు. అని, మళ్లీ పెద్దగా నవ్వాడు.
‘‘అంత నవ్వు ఎందుకొస్తోంది లాలూజీ’’ అన్నారు శత్రుఘ్న, యశ్వంత్ ఇద్దరూ కోపంగా.
‘‘ఫ్లెక్సీలో ప్లేస్ లేకపోవడం కన్నా.. ఇదేం పెద్ద ఇన్‌సల్ట్ కాదు కదా మిత్రులారా’’ అన్నాడు లాలూ.
ఈ ఇన్‌సల్ట్ గురించి చెప్పడానికే సిన్హాలిద్దరినీ లాలూ.. గ్రూప్ కాల్‌లోకి తెప్పించి ఉంటాడని నా అనుమానం.
నితీశ్ కుమార్ (బిహార్ సీఎం)రాయని డైరీ
Published Sun, Oct 15 2017 12:56 AM | Last Updated on Sun, Oct 15 2017 12:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment