టిమ్ కుక్ రాయని డైరీ
కంపెనీలు ఫ్లాప్ అయినట్లే కంట్రీలూ ఫ్లాప్ అవుతుంటాయి. నలభై యేళ్ల ఆపిల్ కంపెనీ చరిత్రలోనే అతి పెద్ద ఫ్లాప్.. ‘గేమ్స్ కన్సోల్’. కంపెనీకే మచ్చ. ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, ఐపాడ్‌లు, మ్యాక్‌లు.. ఎన్ని గొప్ప ఇన్వెన్షన్లు! కానీ మచ్చ మచ్చే.
హిస్టరీని మెరుపుల కన్నా, మరకలే బాగా పట్టేసుకుంటాయి. మెరుపు మెరిసిన ప్రతిసారీ మచ్చ కనబడిపోతుంది. నలభై నాలుగు మంది గొప్ప అధ్యక్షులతో మెరిసిన అమెరికా ఇప్పుడు చేజేతులా తన ముఖం మీదికి మచ్చను తెచ్చుకుంది. ట్రంప్ ఇప్పుడు అమెరికాకు నలభై ఐదవ అధ్యక్షుడిగా మాత్రమే కాదు, అమెరికాలోని అన్ని అమెరికన్ కంపెనీల సీఈఓగా కూడా కనిపిస్తున్నాడు!
నా క్యాబిన్ వైపు నడుస్తున్నాను. ఒక్క చిరునవ్వూ లేదు. ఆగి అడిగాను. ఏంటలా ఉన్నారని! ‘‘గుడ్మాణింగ్ మిస్టర్ ప్రెసిడెంట్’’ అనేసిందో ఇంటెర్నీ! వెంటనే తేరుకుని, ‘సారీ సర్’ అంది! తను అమెరికన్ కాదు. కానీ తన లాంటి వాళ్లు లేకుండా నా అమెరికన్ కంపెనీ లేదు. నవ్వుతూ తన వైపు చూశాను. ‘అమెరికా ప్రెసిడెంట్ మాత్రమే మారాడు. ఆపిల్ కంపెనీ ఎప్పటిలానే ఉంది’ అని చెప్పాను. అమెరికా లాంటిదే ఆపిల్ కంపెనీ. అన్ని దేశాలూ ఉంటేనే అమెరికా. అన్ని దేశాల ఉద్యోగులు ఉంటేనే ఆపిల్ కంపెనీ.
‘‘ఫ్రెండ్స్.. ట్రంప్ ఎలాగైతే అమెరికా అధ్యక్షుడో, మనమంతా అలాగ ఆపిల్ ఉద్యోగులం. ఆయనది వైట్ హౌస్ అయితే మనది ఆపిల్ హౌస్’’ అన్నాను నవ్వుతూ. ఎవరూ నవ్వలేదు. నవ్వు ముఖం మాత్రం పెట్టారు. ట్రంప్ క్యాంపెయిన్ స్పీచ్ వారిని ఇంకా వెంటాడుతూనే ఉన్నట్లుంది!
‘‘సీ.. మనల్ని ఎవరూ విడదీయలేరు. కలిసి పని చేయడమే ఇక్కడ మనం చేయవలసిన పని కాబట్టి మనల్ని ఎవరూ విడదీయలేరు. కొత్తగా వచ్చేవాళ్లనీ మనతో కలవనీయకుండా ఎవరూ చెయ్యలేరు. కొత్త ఐడియాలతోనే మనం ఎప్పుడూ పనిచేస్తుండాలి కాబట్టి మనతో ఎవర్నీ కలవనీయకుండా చేయలేరు. ట్రంప్ గురించి నాకు తెలుసు. ఆపిల్ ప్రోడక్ట్‌లను ఎవరూ కొనద్దని ఆయన ట్వీట్ చేసిన మాట నిజమే. కానీ ఎలా ట్వీట్ చేశారో తెలుసా? ఆపిల్ ఐఫోన్‌లోంచి!’’
ఒక్కసారిగా నవ్వులు. ఏడు ఖండాల నవ్వులు. ఏడు సముద్రాల నవ్వులు. ఈజ్ అవుతున్నారు నా స్టాఫ్ కొద్దికొద్దిగా. ‘‘అందరం కలిసే పనిచేద్దాం. ట్రంప్‌కి ఓటు వేసివచ్చినవాళ్లం, ట్రంప్‌కి వెయ్యకుండా వచ్చినవాళ్లం.. అందరం కలిసే పని చేద్దాం. ముందు ఏముందో తెలియదు. కానీ ముందుకేగా వెళ్లాలి. అంతా కలిసే వెళదాం’’.
‘‘యా.. సర్’’ అంది .. అంతకుక్రితం నన్ను ‘మిస్టర్ ప్రెసిడెంట్’ అని సంబోధించిన అమ్మాయి నవ్వుతూ. తన నవ్వుతో ఆపిల్ కంపెనీ మొత్తానికే వెలుగు వచ్చినట్లుగా అనిపించింది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని నిరంతరం వెలిగిస్తూ ఉండేవి ఇలాంటి భయం లేని నాన్–అమెరికన్ నవ్వులే.
-మాధవ్ శింగరాజు