ఆపిల్‌ వాచ్‌ 76 ఏళ్ల వ్యక్తిని కాపాడింది! | Apple Watch Saves 76 Year Old Man From A Heart Attack | Sakshi
Sakshi News home page

ఆపిల్‌ వాచ్‌ 76 ఏళ్ల వ్యక్తిని కాపాడింది!

Published Mon, May 14 2018 7:03 PM | Last Updated on Thu, Apr 4 2019 5:42 PM

Apple Watch Saves 76 Year Old Man From A Heart Attack - Sakshi

ఆపిల్‌ వాచ్‌ పెట్టుకున్న గాస్టన్‌ డీఅక్వినో

హాంకాంగ్‌ : ఆపిల్‌ వాచ్‌.. ఐఫోన్‌కు కొనసాగింపుగా టెక్‌ దిగ్గజం తీసుకొచ్చిన వినూత్న ప్రొడక్ట్‌. యూజర్ల ఫోన్‌ కాల్స్, మెసేజ్‌ల నుంచి, హెల్త్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ వరకు అన్ని రకాల పనులను ఇది చేస్తోంది. హార్ట్‌ రేటు స్టేటస్‌ను కనుగొనడంలో ఈ డివైజ్‌లకు మించినది మరేమీ లేదంటే అతిశయోక్తి లేదు. తాజాగా ఈ ఆపిల్‌ వాచే ఓ 76 ఏళ్ల వ్యక్తి ప్రాణాల్ని కాపాడింది. సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు ప్రకారం హాంకాంగ్‌కు చెందిన గాస్టన్‌ డీఅక్వినోను ఒక్కసారిగా హార్ట్‌ రేటు సాధారణ స్థాయి నుంచి  ఎక్కువకి పెరిగిపోయింది. ఆ విషయాన్ని ఆపిల్‌ వాచ్‌ కనిపెట్టేసి, హార్ట్‌ ఎటాక్‌ సూచనలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చింది. చర్చిలో ప్రార్థనలకు వెళ్లిన సమయంలో ఆపిల్‌ వాచ్‌ ద్వారా ఈ సంకేతాలు వచ్చాయని గాస్టన్‌ పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రికి వెళ్తే, నిజంగానే గుండె పోటు సంభవించబోతున్నట్టు ముందుగానే తెలిసినట్టు తెలిపారు. 

‘ఎందుకు ఇక్కడికి వచ్చానో తెలియదని డాక్టర్‌కి చెప్పా. కానీ నా హార్ట్‌ రేటు పెరుగుతుందని నా వాచ్‌ చెప్పింది’ అని గాస్టన్‌ అన్నారు. గాస్టన్‌ మాటలు విన్న డాక్టర్‌, మీకైనా ఆరోగ్యం కాస్త తేడాగా అనిపిస్తుందా అని గాస్టన్‌ను అడిగారు. కానీ అతను అంతా బాగున్నట్టు చెప్పినట్టు సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్టు రిపోర్టు చేసింది. కానీ డాక్టర్లు ఆయన ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్‌(ఈసీజీ) మిషన్‌ ద్వారా పరీక్షిస్తే, నిజంగానే హార్ట్‌ ఎటాక్‌ సంభవిస్తున్నట్టు తెలిసినట్టు పేర్కొంది. అప్పటికే గాస్టన్‌ గుండెకు చెందిన మూడు ప్రధాన హృదయ ధమనుల్లో రెండు పూర్తిగా మూసుకుపోయాయని, మూడోది కూడా దాదాపు 90 శాతం బ్లాక్‌ అయినట్టు నిర్ధారణ అయినట్టు డాక్టర్లు చెప్పారు. దీనివల్ల గుండె పోటు అధికంగా సంభవించి, మనిషి ప్రాణాలను హరింపజేస్తుందని తెలిపారు.  వెంటనే డాక్టర్లు గాస్టన్‌కు శస్త్రచికిత్స చేశారు.

గుండెకు రక్తం సరఫరా అయ్యేలా చికిత్స చేసి, గాస్టన్‌ను డిశ్చార్జ్‌ చేశారు. ఆపిల్‌ వాచ్‌ వల్లే తన ప్రాణాలను కాపాడుకోగలిగానని గాస్టన్‌ చెప్పారు. ఆపిల్‌ వాచే తనకు కొత్త జీవితం ఇచ్చిందని, తనకు ప్రసాదించిన ఆపిల్‌ వాచ్‌ ప్రొడక్ట్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌కు ఈమెయిల్‌ పంపారు. కార్డియాక్‌ సమస్యలు ఉన్న వారు ఆపిల్‌ వాచ్‌ను వాడితే బాగుంటుందని ఆయన సూచించారు. తన కజిన్‌ కూడా గత రెండు వారాల క్రితం తీవ్రమైన గుండె పోటుతో ప్రాణాలు వదిలారని, నిజంగానే తన వద్ద కూడా ఆపిల్‌ వాచ్‌ ఉంటే, తనలాగే ప్రాణాలు కాపాడుకునే అవకాశముండేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గాస్టనో పంపిన ఈమెయిల్‌కు సమాధానమిచ్చిన టిమ్‌ కుక్‌, మీ స్టోరీని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు, ఇది ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆపిల్‌ వాచ్‌ యూజర్ల ప్రాణాలు కాపాడటం ఇదే తొలిసారి కాదు, ఏప్రిల్‌ నెలలో కూడా ఇలాంటి సంఘటనే మూడు చోటు చేసుకున్నాయి. ఆపిల్‌ వాచ్‌లు యూజర్లు హెల్త్‌ స్టేటస్‌ను పరిశీలించి, ముందస్తుగానే వారి ఆరోగ్యంపై హెచ్చరికలు, సూచనలు చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement