ఫిట్‌గా ఉన్నా..జిమ్‌ చేస్తున్నా.. గుండెపోటు ఎందుకు? | Body Fit People Why Who Attacked Cardiac Attack In GYM | Sakshi
Sakshi News home page

ఫిట్‌గా ఉన్నా..జిమ్‌ చేస్తున్నా.. గుండెపోటు ఎందుకు?

Published Sat, Oct 30 2021 3:57 AM | Last Updated on Sat, Oct 30 2021 2:30 PM

Body Fit People Why Who Attacked Cardiac Attack In GYM - Sakshi

ప్రముఖ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉంటారు. అందునా ఆయన వయసు కేవలం 46 ఏళ్లు మాత్రమే. ఇలాంటి వయసులో, ఇంత ఫిట్‌గా ఉన్నవారికి గుండెపోటు రావడం కొంత విస్మయం, మరికొంత ఆందోళన కలిగించే అంశమే. అంత ఫిట్‌గా ఉన్నవారికే వస్తే మరి ఎలాంటి జాగ్రత్తలూ పాటించనివారి పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక్క పునీత్‌ ఘటనే కాదు.. ఇలాంటివి మరికొన్ని ఇటీవల చోటుచేసుకున్నాయి.

సిద్ధార్థ శుక్లా (హిందీ బిగ్‌బాస్‌ ఫేమ్‌), మరొకవ్యక్తి గుండెనొప్పితో బాధపడుతూ జిమ్‌ మెట్ల మీద కూర్చుని అక్కడే కుప్పకూలిపోయారు. చాలామంది యువత ఎస్‌ఐ పరీక్షకు శిక్షణ పొందే క్రమంలో రన్నింగ్‌ చేస్తూ గుండెపోటుకు గురికావడం చూస్తూనే ఉన్నాం. మరిలాంటి గుండెపోట్లకు కారణాలేమిటి? నివారించడమెలా?   

గడ్డలు, అడ్డంకులు లేకపోయినా.. 
పునీత్‌ రాజ్‌కుమార్, సిద్ధార్థ శుక్లా లాంటి పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న యువకులకు యాంజియోగ్రామ్‌ వంటి పరీక్షలు నిర్వహిస్తే... వారి రక్తనాళాల్లో ఎలాంటి రక్తపు గడ్డలు (క్లాట్‌), మరెలాంటి అడ్డంకులు (బ్లాక్స్‌) కనిపించకపోవచ్చు. అంతా నార్మల్‌గా ఉంటుంది. అయినా అలాంటివారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుకు ఇదమిత్థంగా ఇదే కారణమని చెప్పలేకపోయినా.. ఇలాంటివారిలో ఆ సమస్య వచ్చేందుకు దోహదం చేసే అంశాలను తెలుసుకుంటే ఫిట్‌నెస్, ఆరోగ్యం కోసం కఠిన వ్యాయామం చేసే వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోడానికి వీలవుతుంది.  

కఠిన వ్యాయామం చేస్తున్నారా? 
గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడితే అది గుండెపోటు లాంటి  ప్రమాదానికి దారితీయవచ్చు. దీన్నే డిఫెక్షన్‌ అంటారు.      గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో చెప్పుకోదగ్గ బ్లాక్స్‌ లేకపోయినా.. కొవ్వుకణాలతో ఏర్పడిన ‘ప్లాక్‌’పైన పగుళ్లు ఏర్పడటం వల్ల రక్తం గడ్డకట్టి, అది రక్తప్రవాహానికి అడ్డంకిగా మారి గుండెపోటుకు కారణం కావచ్చు. పునీత్‌ లాంటి బాగా ఎక్సర్‌సైజ్‌ చేసే వారి రక్తనాళాల్లో ఎలాంటి ప్లాక్స్‌ / బ్లాక్‌ లేకపోయినా అక్కడ అకస్మాత్తుగా రక్తపు గడ్డలు ఏర్పడటం వల్ల కూడా గుండెపోటు రావచ్చు. ∙కొంతమందిలో సహజంగా రక్తంలో గడ్డలు (క్లాట్స్‌) ఏర్పడే తత్వం ఉంటుంది.

ఉదాహరణకు ప్రొటీన్‌–సి, ప్రొటీన్‌–ఎస్, యాంటీ థ్రాంబిన్‌– 3 డెఫీషియెన్సీల వంటి లోపాలున్నవారిలో ఈ తత్వం ఉంటుంది. అలాగే హోమోసిస్టిన్‌ అనే జీవరసాయనం రక్తంలో ఎక్కువగా ఉన్నవారిలోనూ ఈ క్లాట్‌ ఏర్పడే గుణం ఎక్కువ. ఇలా రక్తం త్వరగా గడ్డ కట్టడానికి అవకాశం ఉన్న ధోరణిని ‘బ్లడ్‌ క్లాటింగ్‌ టెండెన్సీ’ (హైపర్‌కోయాగులబుల్‌ స్టేట్స్‌)గా చెబుతారు. ఇది ఉన్నవారిలో రక్తంలో క్లాట్‌ త్వరగా ఏర్పడి అది రక్తప్రవాహానికి అడ్డంకిగా మారి గుండెపోటును తెచ్చిపెట్టవచ్చు.  

ఇవిగాక జన్యుపరమైన కారణాలతో ఓ వ్యక్తి ఎంత ఫిట్‌గా ఉన్నప్పటికీ ఒక్కోసారి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. కుటుంబంలో (ఫ్యామిలీ హిస్టరీలో) గతంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన దాఖాలాలు ఉంటే.. అలాంటి కుటుంబాల్లోని కొందరికి ఎంత ఫిట్‌గా ఉన్నా ఒక్కోసారి అకస్మాత్తుగా గుండెపోటు రావచ్చు.   

కోవిడ్‌ వచ్చిన వారిలో..  
కోవిడ్‌ వచ్చి తగ్గిన కొందరిలో క్లాట్స్‌ ఏర్పడే తత్వం పెరిగిపోయింది. కొందరికి తమకు కోవిడ్‌ వచ్చి తగ్గిన సంగతే తెలియకపోవచ్చు. కానీ అనంతర పరిణామంగా రక్తపుగడ్డలు (క్లాట్స్‌) ఏర్పడటం వల్ల హఠాత్తుగా గుండెపోటు వచ్చి అది ఆకస్మిక మరణానికి దారితీయవచ్చు.  

మరికొన్ని సాధారణ కారణాలు 
సాధారణంగా చాలా మృదువుగా, సాగే గుణంతో (ఫ్లెక్సిబుల్‌గా) ఉండే రక్తనాళాలు వయసు పెరుగుతున్న కొద్దీ గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కిల్‌రోసిస్‌ అని అంటారు. కొందరిలో అథెరో స్కిల్‌రోసిస్‌ మొదలైన ఏడాదిలోనే గుండెపోటు రావచ్చు. గతంలో 50 ఏళ్లకు పైబడ్డాక ఈ పరిణామం సంభవించేది.

ఇటీవల చాలా చిన్నవయసులోనే అంటే 21 – 40 ఏళ్ల వారిలోనూ రక్తనాళాలు గట్టిబారడం కనిపిస్తోంది. దీనికి ఇదీ కారణం అని చెప్పలేకపోయినా.. కొందరిలో కొలెస్ట్రాల్‌ నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరడం వల్ల, ప్లాక్స్‌గా పిలిచేవి క్లాట్స్‌ (అడ్డంకులు)గా మారడం వల్ల ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు.  
► అథెరోస్కిల్‌రోసిస్‌కూ తద్వారా గుండెపోటుకు పొగాకును ఓ ప్రధాన కారణంగా చెప్పవచ్చు.  
► ఇక జెండర్‌ అంశం కూడా గుండెపోటుకు ఒక ప్రధాన కారణం. మహిళలతో పోలిస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు పురుషుల్లో ఎక్కువ. రుతుస్రావం ఆగిపోయే వరకు మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ వారికి గుండెపోటు నుంచి రక్షణ కల్పిస్తుంది. పురుషులు, మహిళలైన యువ రోగుల్లో గుండెపోటు (మయోకార్డియల్‌ ఇన్‌పార్‌క్షన్‌) నిష్పత్తిని పరిశీలిస్తే అది 20 : 1 గా ఉంటుంది. కానీ రుతుక్రమం ఆగిపోయాక మహిళలతో పాటు ఏ జెండర్‌కు చెందినవారికైనా గుండెపోటు అవకాశాలు సమానం.  
► జంక్‌ఫుడ్‌ తీసుకోవడం వల్ల గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) తగ్గడం, హాని చేకూర్చే చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌), చెడు కొవ్వులైన ట్రైగ్లిసరైడ్స్‌ పెరగడం కూడా యువతలో గుండెపోటు పెరగడానికి దోహదం చేసే అంశాల్లో ప్రధానమైనదే.  
► పొట్ట దగ్గర కొవ్వు విపరీతంగా చేరడంతో వచ్చే సెంట్రల్‌ ఒబెసిటీ, తీవ్రమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్‌)తో కూడిన ఆధునిక జీవనశైలి కూడా హఠాత్తుగా గుండెపోటును తెచ్చేవే.  
► అధిక రక్తపోటు (హైబీపీ) కూడా గుండెపోటుకు దోహద పడుతుంది. 
గుండెపోటు లేకుండానే ఆగిపోవచ్చు  
కొంతమందికి గుండెపోటు రాకుండానే ఆకస్మికంగా గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. వీటిల్లో బ్రుగాడా సిండ్రోమ్, లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్, షార్ట్‌ క్యూటీ సిండ్రోమ్, హైపర్‌ట్రోఫిక్‌ కార్డియోమయోపతి వంటి కారణాలతో గుండెపోటు లేకుండానే అకస్మాత్తుగా ‘కార్డియాక్‌ అరెస్ట్‌’ అయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. 

ఇలా జాగ్రత్త పడాలి 
► కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉన్న మెడికల్‌ హిస్టరీ ఉన్నట్టైతే చిన్నవయసులోనే పరీక్షలు చేయిస్తుండాలి. 40 ఏళ్లు దాటిన ప్రతివారూ తరచూ హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్‌ డిసీజెస్‌ కోసం సాధారణ పరీక్షలు చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి ఆ పరిస్థితిని నియంత్రించుకోవడం / సరిదిద్దుకోవడం కోసం తగిన మందులు వాడుతూ ఉండాలి.  
► వ్యాయామం చాలా మంచిదే. అయితే గుండెమీద భారం పడుతున్నట్లుగా గానీ లేదా తీవ్రమైన ఆయాసానికి గురి చేస్తున్నట్లుగా అనిపించగానే ఆపేయాలి.  
► అన్నిటికంటే ముఖ్యంగా వ్యాయామ ప్రక్రియ ఏదైనా అది తీవ్రమైన శ్రమ కలిగించనిదిగా ఉండాలి. అందుకే వ్యాయామ ప్రక్రియలన్నింటి కంటే నడక మంచి వ్యాయామం.  
► వైద్య, పారామెడికల్‌ సిబ్బందితో పాటు పోలీసులు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలకు ఏఈడీ (ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌) పరికరాన్ని ఉపయోగించే శిక్షణ ఇప్పించడంతో పాటుగా ‘బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌’ శిక్షణ ఇప్పించి, వాటి సహాయంతో హాస్పిటల్‌కు వెళ్లేలోపే రోగిని స్థిమితపరిస్తే... వారిని మరణం బారినుంచి రక్షించే అవకాశాలుంటాయి. ఇలాంటి ఉపకరణాలను ‘పబ్లిక్‌ ప్రదేశాల్లో’ అందుబాటులో ఉంచితే హఠాన్మరణాలను నివారించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement