
Puneeth Rajkumar Death Reason: కన్నడ చిత్రపరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. 46 ఏళ్ల పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సదాశివనగరలోని తన నివాసంలో జిమ్‌లో పునీత్ యథావిధిగా వర్కవుట్లు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు పునీత్‌ను సమీపంలోని రమణశ్రీ క్లినిక్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని విక్రమ్ ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో ఉంచి, వైద్యం ప్రారంభించారు. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునీత్ మరణాన్ని బసవరాజ బొమ్మై అధికారికంగా ప్రకటించారు.
ఆస్పత్రికి వచ్చేటప్పటికే...
పునీత్ కుటుంబ వైద్యులు ఈసీజీ తీయగా, గుండెపోటు అని నిర్ధారణ అయ్యాకే తమ ఆస్పత్రికి వచ్చినట్లు విక్రమ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పునీత్‌ను ఆస్పత్రికి తీసుకు వచ్చినప్పుడే ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారని, హృదయ స్పందన లేదని వైద్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ మూడు గంటల పాటు తీవ్రంగా ప్రయత్నించామన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు చనిపోయినట్లుగా తాము నిర్ధారించినట్లు ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి.
స్టేడియానికి భౌతికకాయం...
శుక్రవారం సాయంత్రం పునీత్ భౌతికకాయాన్ని సదాశివనగరలోని ఇంటికి తరలించారు. అక్కడ కొన్ని పూజలు చేశాక కంఠీరవ స్టేడియానికి తరలించారు. సాయంత్రం 7 గంటల తర్వాత నుంచి అభిమానుల అంతిమ దర్శనానికి అవకాశం కల్పించారు. పునీత్ పెద్ద కుమార్తె అమెరికాలో చదువుతోంది. శనివారం సాయంత్రానికి ఆమె బెంగళూరు చేరుకుంటుంది. అనంతరం పునీత్ అంత్యక్రియలను ఆదివారం కంఠీరవ స్టూడియోలో ఆయన తల్లిదండ్రుల సమాధి చెంతన నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment