పచ్చ మీద ప్రమాణం !
జయశ్రీకి మొక్కలంటే ప్రాణం. ఇద్దరం పక్కపక్కనే లోఢీ గార్డెన్స్‌లో నడుస్తున్నాం. ఎక్కడా పచ్చదనం లేదు. ఎటువైపు నుంచీ ఒక్క శీతల పవనమూ లేదు. లోఢీ మార్గ్‌లో క్రమంగా మొక్కలు తగ్గిపోయి, వాకింగ్‌కి వచ్చే మనుషులు ఎక్కువైపోతున్నట్లున్నారు! పీల్చే గాలి తగ్గి, వదిలే వాయువులతో లోకం ఏదో ఐపోయేలా ఉంది.
‘‘కాంగ్రెస్‌తోనే పోయింది... ఆ పచ్చదనమంతా’’ అంటున్నాను. జయశ్రీ వినడం లేదు. మొక్కల్ని వెదుక్కుంటోంది. ఆమె అంతే! అవసరం లేని దానిని వినవలసి వచ్చినప్పుడు.. అవసరమైన దేనినో వెదుక్కుంటున్నట్లుగా ఉండిపోతుంది. కాంగ్రెస్ పవర్‌లో ఉన్నప్పుడు తులసికోట పచ్చగా ఉండి, కాంగ్రెస్ పవర్‌లో లేనప్పుడు తులసికోట పచ్చగా లేకపోవడం ఏమిటి అనే సందేహం గానీ ఆమెకు వచ్చిందా అన్న అనుమానం నాకు ఆమె మౌనం వల్ల కలిగింది.
కాంగ్రెస్‌లో నేను నీళ్ల మినిస్టర్‌గా, ఊళ్ల మినిస్టర్‌గా, మొక్కల మినిస్టర్‌గా, అడవుల మినిస్టర్‌గా ఉన్నప్పుడు కూడా ఆమె నీళ్లను, ఊళ్లను, మొక్కల్ని, అడవుల్ని చూసింది తప్ప వాటి మినిస్ట్రీలను చూడలేదు. నన్ను మినిస్టర్‌గానూ చూడలేదు. మొక్కలకు పాదులు తియ్యడం, మొక్కలకు నీళ్లు పొయ్యడం, మొక్కలకు దడులు కట్టడం.. బేసిక్‌గా మనుషుల పని కదా అన్నట్లు చూస్తుంది ఆమె.. ఒకవేళ నేను ప్రభుత్వాలను, పార్టీలను.. నిందించడం, విమర్శించడం మొదలుపెడితే.
ఇవాళ వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే. కాంగ్రెస్ పచ్చగా ఉన్న రోజుల్లో ఇది నా మినిస్ట్రీ. జూన్ ఐదు అనగానే ఎన్డీయేకి బహుశా గ్రీనరీ కన్నా కూడా, బ్లూ స్టారే గుర్తొస్తుందేమో. ఆపరేషన్ బ్లూ స్టార్! మోదీ ఈ రోజు లోఢీ గార్డెన్స్ గురించి మాట్లాడతారో, స్వర్ణాలయంపై సైన్యం దాడి గురించి మాట్లాడతారో చూడాలి.
మోదీ మాట్లాడినా, జైట్లీ మాట్లాడినా.. చెట్లను పడగొడుతుంటే తరిగిపోతున్న పచ్చదనమో, రాష్ట్రాలను విడగొడితే చిగురిస్తుందనుకున్న పచ్చదనమో తప్ప వేరే ముఖ్యాంశం లేదు మాట్లాడుకోడానికి ఇప్పుడీ సందర్భంలో. విడిపోతే తెలంగాణ, వదిలించుకుంటే సీమాంధ్ర రెండూ పచ్చగా కళకళలాడతాయని కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చిన ప్రతి నాయకుడూ ఆ పచ్చదనం ఏమైపోయిందో కూడా ఇవాళ మాట్లాడాలి.
ఓల్డ్ హిస్టరీకి, న్యూ జాగ్రఫీకి మధ్య.. చివరి ఐదు నెలల్లో ఏపీని ఎవరు విడగొట్టిందీ, ఎలా విడగొట్టిందీ జూన్ 15న నా పుస్తకం బయటికొచ్చి మాట్లాడుతుంది. ఏపీకి ఐదేళ్లు హోదా ఇస్తాం అని కాంగ్రెస్ అన్నప్పుడు.. ‘మేమైతే పదేళ్లు ఇస్తాం’ అంటూ వెంకయ్యనాయుడు రాజ్యసభలో ఎలా జంప్ చేసిందీ, ఇప్పుడా మాటను ఎలా జంప్ చేయించిందీ నా పుస్తకం చెబుతుంది. సామాజిక న్యాయం కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడగొడితే, కుటుంబ పాలన కోసం రాష్ట్రాల నాయకులు కాంగ్రెస్‌ను ఎలా పడగొట్టిందీ నా పుస్తకం చెబుతుంది. పచ్చ మీద ప్రమాణం !
-మాధవ్ శింగరాజు