రాహుల్ గాంధీ రాయని డైరీ
రాహుల్ గాంధీ రాయని డైరీ
Published Sun, Nov 22 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM
మాధవ్ శింగరాజు
నిద్ర సరిపోవడం లేదు. ఎక్కడ పడితే అక్కడ నిద్ర పట్టేస్తోంది. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర పట్టేస్తోంది. నిజానికి నితీశ్ ప్రమాణ స్వీకారానికి లేట్ అయింది కూడా.. ఫ్లయిట్ లేట్ అయి కాదు. ఫ్లయిట్ టైమ్‌కి నేను లేవడం లేటయ్యి! పాపం అప్పటికీ మమ్మీ చెబుతూనే ఉంటుంది.. రాత్రి త్వరగా పడుకుంటే, ఉదయం త్వరగా లేవొచ్చని. లేచి, జాగింగ్‌కి వెళితే రోజంతా యాక్టివ్‌గా ఉంటుందని. మోదీజీ పీయెం అయినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను.. త్వరగా లేవడం, జాగింగ్‌కి వెళ్లడం రెండూ కుదరడం లేదు. చలికాలం వస్తే మరీను. కాస్త వెచ్చదనం దొరగ్గానే వెంటనే కునుకు పట్టేస్తుంది.
లాస్ట్ ఇయర్ ఇలాగే బడ్జెట్ సెషన్‌లో గమ్మత్తుగా నిద్రపట్టేసింది. లేచి చూసే సరికి పార్లమెంటులో పెద్ద గొడవ. చూస్తుంటే అది నన్ను నిద్ర లేపడానికి చేసిన గొడవలా ఉంది కానీ, నిద్రపోతున్నందుకు చేసిన గొడవలా లేదు. ఆలోచిస్తే ఇప్పుడర్థమౌతోంది.. బీజేపీలో ఇంటాలరెన్స్ అప్పట్నుంచే ఉందని!
మొన్న మాన్‌సూన్ సెషన్‌లోనూ ఇలాగే మత్తుగా నిద్రపట్టేసింది. మా పార్టీ లీడర్ మల్లికార్జున్ ఖార్గే.. రూలింగ్ పార్టీని ఏదో అంటున్నట్లు లీలగా వినిపిస్తోంది. వినాలని ట్రై చేస్తున్నాను కానీ వినలేకపోతున్నాను. ఇంటికొచ్చాక మమ్మీ అడిగింది.. ఖార్గే అదరగొట్టాడట కదా. దుమ్ము దులిపాడట కదా అని. అంత జరిగిందా అన్నాను. చిరుకోపంతో చూసింది. అప్పుడే చిన్న టిప్ కూడా చెప్పింది. మధ్య మధ్య వాష్‌రూమ్‌కి వెళ్లి ముఖం కడుక్కుని వచ్చి కూర్చుంటే నిద్ర ఆమడ దూరం పారిపోతుందట. ఆ టిప్పేమైనా ఈ వింటర్ సెషన్స్‌లో వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
ఈ మధ్య అరుణ్ జైట్లీ ఇంటికొచ్చి మరీ నా నిద్ర చెడగొడుతున్నాడు! చేతిలో పెళ్లి కార్డులతో వస్తాడు. ‘డిసెంబర్‌లో అమ్మాయి పెళ్లి. మీరు రావాలి’ అంటాడు. రెండు మూడు సార్లు చూసి, ‘ఆల్రెడీ చెప్పారు కదా, ఆల్రెడీ కార్డు కూడా ఇచ్చారు కదా’ అన్నాను. ‘అది కాదు, రాహుల్‌బాబు... నాకు నిద్రపట్టడం లేదు’ అన్నాడు నిన్న మళ్లీ! జీఎస్‌టీ గురించి ఆయన బెంగ. ఆ బిల్లు పాస్ అయితే పిల్ల పెళ్లి నిశ్చింతగా చేసుకుంటాడట. ఖార్గేతో, ఆజాద్‌తో మాట్లాడి రెండు సభల్లో బిల్లును ఓకే చేయించమంటాడు. ‘ముందు మోదీజీని ఇంటాలరెన్స్ మీద పార్లమెంటులో నోరు విప్పమనండి. అప్పుడు చూద్దాం’ అని చెప్పి పంపాను.
జైట్లీ వెళ్లనైతే వెళ్లాడు గానీ, పోయిన నిద్ర నాకు మళ్లీ పట్టలేదు. ‘అబ్ తక్ చప్పన్’ మూవీ చూస్తూ కూర్చున్నాను. నానా పటేకర్ పోలీస్ ఆఫీసర్. మాట్లాడితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటుంటాడు. చప్పన్ ఛాతీ అని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీజీ కూడా తన కేడర్ చేత ఇప్పుడు అదే పని చేయిస్తున్నారు. మాట మాట్లాడకుండా. మౌనం వీడకుండా!
Advertisement