జావెద్ అఖ్తర్ రాయని డైరీ
మార్చి 21. రేపే! రాజ్యసభలో నా చివరి రోజు. రెప్పపాటులో టెర్మ్ అయిపోయింది! ఆరేళ్లు. ఆరు రెప్పపాట్లు. ఎక్కడిది ఇంత స్పీడ్? ఎవరు తిప్పుతున్నారు ఈ భూగోళాన్ని? తిప్పేవాళ్లు భూగోళాన్ని, రాజ్యసభని ఒకేలా తిప్పకుండా వేర్వేరుగా, వేర్వేరు వేగాలతో తిప్పుతున్నారా?.. ఒకే దేశంలో హిందువుల్ని, ముస్లింలను మత విశ్వాసాలు వేర్వేరుగా నడిపిస్తున్నట్టు!!
దేశంలో ఎందరు దేవుళ్లయినా ఉండొచ్చు. కానీ దేవుళ్లందరికీ ఒకటే దేశం ఉండాలి. దేవుళ్లందరూ ఉంటున్నది ఒకే దేశంలో అయినప్పుడు వాళ్లందరిదీ ఒకే దేశం అవుతుందని రాజ్యాంగం పని గట్టుకుని చెప్పనక్కర్లేదు. అర్థమైపోవాలంతే.
రాజ్యాంగం చాలా విషయాలు చెప్పదు. ప్రతి మనిషీ ఉదయాన్నే లేచి శుభ్రంగా పళ్లు తోముకోవాలని రాజ్యాంగం చెప్పదు. అయినా మనం తోముకోవడం లేదా? బట్టలు వేసుకుని మాత్రమే ప్రతి మనిషీ బయటికి రావాలని రాజ్యాంగం చెప్పదు. అయినా మనం వేసుకుని రావడం లేదా? విశ్వాసాలు మనుషుల్ని కాకుండా, దేవుళ్లను నడిపిస్తున్నప్పుడే.. ‘రాజ్యాంగంలో అలా లేదు కదా, రాజ్యాంగంలో ఇలా లేదు కదా’ అనే ప్రశ్నలు వస్తుంటాయి. లౌకికరాజ్యంలో ప్రజలు మాత్రమే కాదు, దేవుళ్లూ కలిసి మెలిసి ఉండాలి. ప్రజాస్వామ్యంలోని అందమే అది!
సయ్యద్ షాబుద్దీన్ నుంచి ఫోను! ‘నువ్వెప్పటికి మారతావ్ అఖ్తర్’ అని ఆయన ఆవేదన. ‘మారడం’ అంటే ఆయన ఉద్దేశంలో నికార్సయిన ముసల్మాన్‌గా మారడం! ఎప్పుడూ చెప్పే మాటే చెప్పాను. ‘ఒకటే గుర్తు షాబుద్దీన్ జీ. అల్లర్లు జరిగి, శివసేన నా ఇంటిని తగలబెడితే కనుక నేను ముస్లింగా మారినట్టు మీరు అర్థం చేసుకోవచ్చు’అన్నాను. రాజ్యసభలో మొన్నటి నా ప్రసంగం ఆయన్ని బాధించిందట. భరతమాతకు జై కొట్టనుగాక కొట్టనని ప్రకటించిన సాటి ముసల్మాన్‌ని నేను విమర్శించడం ఆయనకు కోపమైతే తెప్పించి ఉంటుంది కానీ, బాధను మాత్రం కలిగించి ఉండదని నాకు తెలుసు. షాబుద్దీన్ బాధపడరు. బైటపడతారు. ఇప్పుడూ అంతే. బాబ్రీ మసీదు కూల్చివేత, రాజ్యసభలో నా సెక్యులర్ ప్రసంగం ఆయనలో ఒకే విధమైన భావాలను రగిలించి ఉంటాయి.
నన్నొక అలౌకికవాది ఆపి అడిగాడు. ‘అఖ్తర్‌జీ.. భారత్ మాతా కి జై అని అనడానికి నిరాకరించిన వారినీ, గోమాంసం తింటున్నారని ముస్లింలను చంపేసినవారినీ మీరు సమానంగా చూడగలరా?’ అని! మత భావనల్లోని తీవ్రత ఎలాంటిదైనా మనం ఖండించవలసిందే అన్నాను. ‘ముందు నీ నాస్తిక భావనల్లోని తీవ్రతను ఖండించుకో. దేవుడే చూసుకుంటాడు.. లోకంలో ఏ గొడవా లేకుండా’ అన్నట్లు చూశాడు!
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చెయ్యొద్దన్న పని చేస్తారు. అదే పిల్లలు పెద్దవాళ్లయ్యాక చెయ్యమన్న పని చెయ్యరు. అందుకేనా.. ‘క్యాచ్ దెమ్ ఎంగ్’ అంటున్నాడు మోహన్ భగవత్?! భగవత్‌ని సపోర్ట్ చేసినందుకు నా ముస్లి సోదరులు నన్ను ఆరెసెస్‌లోకి తోసేయవచ్చు. ఏ మతం అయితే ఏమిటి? నేనున్నది భారత్‌లో అయినప్పుడు? భారత్ మాతా కి జై!
- మాధవ్ శింగరాజు