ఎం.ఎస్.స్వామినాథన్ రాయని డైరీ
ఎం.ఎస్.స్వామినాథన్ రాయని డైరీ
Published Sun, Jan 8 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
కల మొలకెత్తడం తేలిక. కలను కళ్ల నిండుగా పండించుకోవడం కూడా తేలికే! హైబ్రీడ్‌ల గురించి కాదు ఈ మాట. పొలాన్ని శ్రద్ధగా చేతుల్లోకి ఎత్తుకోవాలంటున్నాను. క్యాబ్‌లో వెళ్లొచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలా సాగుబడి ఉండకూడదు. నిద్ర లేస్తూనే పొలంలోకి వెళ్లాలి. పొలాన్ని నిద్రలేపాలి. పొలానికి స్నానం చేయించాలి. పొలానికి ఇంత తిండి పెట్టాలి. పొలానికి కబుర్లు చెప్పాలి. పొలం చెప్పే కబుర్లు వినాలి. నిద్రొస్తే పొలంలోనే కునుకు తియ్యాలి. ‘అయ్యో! సిక్స్ అయిపోయింది’ అని ఇంటికి పరుగులు తీసే పనిలా ఉండకూడదు పొలం పని. వెళ్లలేక వెళ్లలేక పొలం వదలి ఇంటికి వెళుతున్నట్లు ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ఉండబట్టలేక పొలానికి పరుగెత్తినట్లు ఉండాలి.
పసికందుకు పడిశెం పడితే తుమ్ము రప్పించి శ్వాస ఆడిస్తుంది తల్లి. పొలానికి అలా శ్వాస ఆడించాలి. పసికందుకు బలం కోసం సెరెలాక్ పట్టిస్తుంది తల్లి. పొలానికి అలా ఎరువుల్ని పట్టించాలి. వయసొస్తున్న పిల్లలకు కాపు కాస్తుంది తల్లి. పొలానికి అలా దిష్టిబొమ్మగా ఉండాలి. పోతపాలా? తల్లిపాలా అని కాదు. ఆలన లాలన ముఖ్యం.. పొలానికీ పచ్చదనానికీ.
సైన్స్ కాంగ్రెస్‌లో కొంతమంది రైతులొచ్చి నన్ను కలిశారు. నన్ను కలవడమే పనిగా వచ్చి కలిశారు. వాళ్లంతా కళ్ల నిండా కలల కంకులు పండించుకొచ్చిన రైతులు! యువరైతులు! వాళ్ల కలలకు నాగలికి ఉన్నంత బలం ఉంది, కోతలకు ఉన్నంత పదును ఉంది, నూర్పిళ్లకు ఉన్నంత ఒడుపు ఉంది. వాళ్లలో ప్రతి ఒక్కరు ఒక హరిత విప్లవకారుడు.
ఆ యువరైతులంతా ఉత్సాహంగా ఉన్నారు. ఎన్ని బస్తాలైనా మోసేలా ఉన్నారు. ఎన్ని ఎకరాలైనా దున్నేసేలా ఉన్నారు. పంటను బాగా పండించడానికి ఇంకా ఏవైనా సలహాలు ఉంటే ఇవ్వండి అని అడిగేందుకు వచ్చారు! ఏం చెప్పను? బాగా పండించడానికి నా దగ్గర సలహాలేవీ మిగిలి లేవు. ‘ఇంకా బాగా’ పండించడమెలాగో చెప్పమంటే చెప్పగలను.
పొలం పచ్చగా అవడం పచ్చని భూమి వల్ల కాదు. పొలం పోటెత్తడం పచ్చని జలం వల్ల కాదు. పొలం పంటెత్తడం పచ్చని పరిశోధన వల్ల కాదు. పొలాలకు, పంచభూతాలకు పచ్చదనాన్ని ఇచ్చే ఆ చేతులు వేరు. పొత్తిళ్ల వంటి చేతులు అవి. మన అమ్మలవి, మన అక్కచెల్లెళ్లవి ఆ చేతులు. చేనుకు అందుతున్న చేవ అంతా ఆ పచ్చని చేతుల్లోంచి వచ్చి చేరుతున్నదే.
పొలాలన్నీ ఆడపడుచుల చేతుల్లోకి వచ్చేయాలి. ఆడపిల్లలకు కట్నంగా తండ్రి ఆ పిల్ల పేరిటే పొలం రాసివ్వాలి. నాలుగు రాళ్ల కోసం ఇంటాయన్ని పట్నం పోనివ్వకుండా ఆపినందుకు ప్రభుత్వం ఆ ఇంటి ఇల్లాలికి పొలాన్ని పట్టాగా ఇవ్వాలి. అప్పుడు ప్రతి మహిళా ‘మదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్’ అవుతుంది. అప్పుడు ప్రతి ఊరూ పచ్చటి పంటపొలం అవుతుంది.
-మాధవ్ శింగరాజు
Advertisement
Advertisement