కింగ్స్ పంజాబ్ ఓడితే నా పరువు పోదు!
ఆయనెవరో రాశాడు.. క్రికెట్ గురించి నాకేం తెలియదని! ఆయనే ఇంకో రహస్యం కూడా కనిపెట్టాడు. నా ట్వీటర్ స్టేటస్‌లో యాక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, ఎంట్రప్రెన్యూర్, హ్యూమన్ బీయింగ్ అండ్ క్రికెట్ ఫ్యాన్ అని మాత్రమే ఉంటుంది కనుక క్రికెట్ గురించి నేనేం మాట్లాడ కూడదట. నా.. కో-ఓనర్లు నెస్ వాడియాని, మోహిత్ బర్మన్‌ని, కరణ్ పాల్‌ని అనగలడా ఆ మాట?
పన్నెండు టెస్టులు ఆడినవాడిని, పదిహేను వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఉన్నవాడిని, వరల్డ్ కప్ స్క్వాడ్ మెంబర్‌ని, టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్‌ని.. ది గ్రేట్ సంజయ్ బంగర్‌ని పట్టుకుని ప్రీతీ అంతమాట అంటుందా అని ఆయన ఎక్స్‌ప్రెషన్! ఏమన్నాను? బెహర్డియన్‌కి బదులుగా అక్షర్‌ని పంపి ఉండాల్సింది అనే కదా! అది కోచ్‌కి పాఠాలు నేర్పడం అవుతుందా? ఒక్క రన్‌లో ఓడిపోతే ఎవరికి మాత్రం కోపం రాదు? అయినా అది నాకు టీమ్ ఓనర్‌గా వచ్చిన కోపం కాదు. క్రికెట్ లవర్‌గా వచ్చిన కోపం. ఏం? ఆడవాళ్లకు కోపం రాకూడదా? కోపంలో ఆడవాళ్లు పెద్దగా అరవకూడదా? కోపాన్ని కూడా వాళ్లు చక్కటి చిరునవ్వుతోనే ప్రదర్శించాలా? హార్ట్ బ్రేక్ అయ్యాక ఆడేంటి? మగేంటి?
లాస్ట్ మ్యాచ్‌లో అక్షర్ బాగా ఆడాడు. అందుకే అతన్ని పంపించి ఉండాల్సింది అన్నాను. కామన్‌సెన్స్ కదా! ఈ మాట చెప్పడానికి బ్యాట్ పట్టుకోవడం తెలిసుండాలా? బాల్ విసరడం తెలిసుండాలా? చావనిస్ట్ పిగ్స్. జెనెటిక్ ప్రాబ్లమేదో ఉన్నట్లుంది ఈ జర్నలిస్టులకి.
ప్రెజెంటేషన్ సెరమనీకి నేను వెళ్లకుండా మా మదర్‌ని పంపానట. అదో ఇష్యూ! మ్యాచ్‌ని వదిలేసి, మ్యాచ్ అయిపోయాక స్టేడియంలో మిగిలిన చెత్తనంతా పోగేసుకుంటున్నారు! ‘మదర్స్ డే కదా. అందుకనే అలా చేశాం’ అని మా టీమ్ మేనేజర్ చెప్పాడు. ‘మదర్స్ డే తర్వాతి రోజు గదా మ్యాచ్ జరిగింది’ అని వాళ్ల పాయింట్. గొప్ప ఇన్వెస్టిగేషనే! ఐపీఎల్ అయ్యాక అవార్డు ఇవ్వాలి ఆ రిపోర్టర్‌కి.
గొప్పవాళ్లు కొంతమంది ఉంటారు. దేనికీ రియాక్ట్ కారు. ముక్కులోంచి, మూతిలోంచి, కంటిలోంచి, ఒంటిలోంచి దేన్నీ బయటికి రానివ్వరు. నేను అంత గొప్పదాన్ని కాదు. కోపాన్ని దాచుకోలేను. సంతోషాన్ని ఆపుకోలేను. నాకు తెలీకుండా నా ఫీలింగ్స్ అన్నీ నా ముఖంలోంచి తన్నుకొచ్చేస్తాయి.
మనకెంత అందమైన ముఖం ఉందని కాదు.. అందులో ఎంత నిజాయితీ ఉందనేది ముఖ్యం. ముఖంలో నిజాయితీ ఉన్నప్పుడు మాటలో మొహమాటం ఉండదు. ముఖస్తుతి ఉండదు. నచ్చంది నచ్చలేదని చెప్తాం. నమ్మింది ఎవరికి నచ్చకున్నా చేసేస్తాం. ఐపీఎల్‌లోకి నేను అలాగే వచ్చాను. విత్ మై హార్ట్ అండ్ సోల్. ఆడామా, ఓడామా అని కాదు. గెలిచేలా ఆడామా లేదా.. అదీ నా కన్సర్న్. కింగ్స్ ఎలెవన్ జట్టు ప్లే-ఆఫ్స్‌కి వెళ్లలేకపోవడం నాకు పరువు తక్కువేం కాదు. పూర్ పెర్ఫార్మర్ అనిపించుకోవడమే బాధ. ప్రేమ లేకపోతే బాధ కలుగుతుందా? బాధ లేకుండా కోపం వస్తుందా? ఐ లవ్ క్రికెట్.
- మాధవ్ శింగరాజు