చిన్న జీయర్ స్వామి రాయని డైరీ
జై శ్రీమన్నారాయణ!
చన్నీటి స్నానం చేస్తున్నప్పుడు రోజూ తెల్లవారుజామునే పొగ మంచులో శ్రీమహావిష్ణువు దర్శనం అయ్యేది. ఇవాళ కాలేదు! చలి తగ్గిందా? మంచు తగ్గిందా? మనసులో సంకల్పం తగ్గిందా?
‘కాన్‌సన్‌ట్రేట్ చెయ్యలేకపోతున్నాం స్వామీజీ’ అంటూ మఠానికి వస్తుంటారు పిల్లలు. చదువు మీద ధ్యాస కుదరడం లేదని వారి బాధ. ఎలా కుదురుతుంది? వాళ్లేం గురుకులంలో ఉండడం లేదు కదా. వాళ్లేం ఆకులు అలములు తినడం లేదు కదా. వాళ్లేం ప్రకృతి ఆలపించే సంగీతాన్ని వింటూ పెరగడం లేదు కదా. అపార్ట్‌మెంట్‌లలో ఒక్క సూర్యకిరణమైనా ఉదయించడానికి దారి ఉంటోందా? తినేందుకు పీజా బర్గర్, వినేందుకు జస్టిన్ బీబర్ తప్ప ఈ తరానికి భూమ్మీద వేరే ఇంట్రెస్టులు ఏవైనా ఉన్నాయా? అక్షరం ఎలా సాక్షాత్కరిస్తుంది మరి?!
పెద్దవాళ్లకూ జీవితం మీద ఏవో కంప్లైంట్లు. ‘స్వామీజీ ఈ కొత్త సంవత్సరమైనా దశ తిరుగుతుందా?’ అని ఆశగా అడుగుతుంటారు. లైఫ్‌లో ఉన్నది మొత్తం ఒక్క దక్షిణాయనం, ఒక్క ధనుర్మాసమే అయితే చెప్పొచ్చు.. బతుకులో సంక్రమణం సిద్ధిస్తుంది అని, ఇవిఇవి ఆచరిస్తే ఇవిఇవి సంప్రాప్తిస్తాయి అని. కానీ ఎన్నో రుతువులు, ఎన్నో జీవన క్రతువులు!
కొత్త అనగానే ఏదో ఆశ.. అర్ధరాత్రి పన్నెండు దాటిన మరుక్షణం గ్రహగతులు మారబోతున్నాయని! ఆశ మంచిదే. కానీ కాలచక్రంలో ఏదీ కొత్త కాదు. ఏదీ పాత కాదు. మనం ఎప్పుడైతే మొదలు పెట్టామో అదే కొత్త సంవత్సరం. మనం ఎక్కడైతే వదిలేశామో అదే గతించిన సంవత్సరం. మనిషి భ్రమణ పరిభ్రమణాలే కాలచక్రంలోని పరిణామాలు. అంటే చక్రం తిప్పుతున్నదీ, చక్రంలా తిరుగుతున్నదీ మనిషే!
‘స్వామీజీ.. ఈ చలి, మంచు, వేడి, వాన, గాలి మిమ్మల్నీ బాధిస్తాయా?’ - ఇంకో ప్రశ్న. ఎందుకు బాధించవు? స్వామీజీకి, మామూలు హ్యూమన్‌జీకి తేడా ఉంటుందని ఎందుకు అనుకోవాలి? స్వామీజీ లైఫ్‌లోనూ ఆందోళన ఉంటుంది. అలజడి ఉంటుంది. అశాంతి ఉంటుంది. రేవంత్‌రెడ్డీ ఉంటాడు. కేసీఆర్‌ని జాతిపిత అంటే రేవంత్‌రెడ్డికి కోపం వస్తుంది. ఆ కోపాన్ని శాంతియుతంగా తిప్పికొట్టాలంటే ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చున్నా కూడా రేవంత్‌రెడ్డి అక్కడికీ వచ్చేస్తాడు. ధ్యానం మాని రాజకీయాల్లోకి రమ్మంటాడు! సేవ చేయడానికి రాజకీయ పీఠాలే కావాలా?
కొన్నింటిని మనసులోకి రానీయకూడదు. దేహం బయటే వదిలేయాలి. కొందరు విసిరిన మాటల్లోకి మనం చొరబడకూడదు. మౌనంతోనే సమాధానం చెప్పాలి. అప్పుడు సంకల్ప భగ్నం జరగదు. భగ్నం అయిందీ అంటే మనం చూడాలనుకున్నదాన్ని చూడలేం. చేయాలనుకున్నదాన్ని చేయలేం. ఆఖరికి ఆ శ్రీమన్నారాయణుడి దర్శనభాగ్యం కలుగుతున్నా గుర్తించలేక.. చేతులతో దిక్కులను తడుముకుంటూ ఉండిపోతాం. అప్పుడు మామూలు స్నానం ఒక్కటే సరిపోదు. మనసుకూ స్నానం చేయించాలి.
- మాధవ్ శింగరాజు