పి.కరుణాకరన్ (సీపీఎం)
రాయని డైరీ
రోజూ లేచి లోక్‌సభకు వెళ్లాలంటే కష్టంగా ఉంటోంది. లేవడం, వెళ్లడం.. కష్టం కాదు. సభ లోపల ఉండడం కష్టంగా ఉంటోంది. కారిడార్‌లో నిన్న ఎవరో సడన్‌గా ఆపి అడిగారు – ‘మీరేమిటీ ఇలా ఉన్నారూ?’ అని!
‘‘నేను ఇలా ఉండడం ఏంటి?! నేను ఎలా ఉంటానని మీరు అనుకున్నారు? నేను ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు?’’ అని అడిగాను.
‘‘మీరు కరుణాకరనే కదా?’’ అన్నాడు ఆ వ్యక్తి ఆశ్చర్యపడుతూ. ‘‘అవును నేను కరుణాకరన్‌నే’’ అన్నాను నేనూ ఆశ్చర్యపోతూ.
‘‘ఏం లేదు లెండి. మీరు నాకు తెలిసిన కరుణాకరనేమో అనుకున్నాను’’ అనుకుంటూ వెళ్లిపోయాడు.
‘‘హలో.. హలో.. మీకు తెలిసిన కరుణాకరన్‌ది కూడా లోక్‌సభేనా? రాజ్యసభకు వెళ్లబోయి ఏదో ఆలోచిస్తూ ఇటు గానీ వచ్చేశారా!’’ అని వెనక్కు పిలిచి అడిగాను. ‘‘అయితే రాజ్యసభలో కూడా ఇంకో కరుణాకరన్ ఉన్నారా?’’ అని మళ్లీ ఎగ్జయిట్ అయ్యాడు ఆ వ్యక్తి.
‘‘ఉన్నాడో లేదో నాకూ తెలీదు. ఒకవేళ ఉండి ఉంటే, మీకు తెలిసిన కరుణాకరన్ అతడే అయ్యుండొచ్చు కదా..’’ అన్నాను.
నిరాశగా చూశాడు. ‘‘అయితే మీరు కాదన్న మాట’’ అనుకుంటూ వెళ్లిపోయాడు.
నేను కాకపోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు! సభ లోపలికి వెళ్దామంటే భయమేసింది. అక్కడ ఇంకా చాలామంది ఉంటారు.. మెజారిటీ వ్యక్తులు! ధైర్యం చేసి వెళ్లాను.
లోపల సుమిత్రా మహాజన్ మా వాళ్లను కోప్పడుతున్నారు. ‘‘ఇది కురుక్షేత్రం కాదు.. కర్మక్షేత్రం. వెళ్లి కూర్చోండి’’ అంటున్నారు. బీజేపీలో ఒక్కరూ భారతీయ భాషల్లో మాట్లాడ్డం లేదు. అంతా భారతంలోని క్యారెక్టర్స్‌లా ఉన్నారు.
ఇంటికి వచ్చాక సి.ఎం.కి ఫోన్ చేశాను. ‘‘నా వల్ల కావట్లేదు కామ్రేడ్.. అది లోక్‌సభలా లేదు. మహాభారత్ టీవీ సీరియల్‌లా ఉంది’’ అన్నాను.
‘‘ఇప్పుడా సీరియల్ రావట్లేదు కదా’’ అన్నారు కామ్రేడ్ పినరయి విజయన్.
‘‘పాత క్యాసెట్‌లు దొరుకుతాయి కామ్రేడ్. అది కాదు సమస్య’’ అన్నాను.
ఆయన నవ్వారు. లేక నవ్వినట్లు నాకు అనిపించిందో!
‘‘ఫ్లోర్ లీడర్‌వి.. నువ్వే అలా అంటే ఎలా కరుణా..’’ అన్నారు ఆపేక్షగా.
‘‘ఫ్లోర్ బయట ఉన్నారు. మీకేం తెలుస్తుంది కామ్రేడ్’’ అన్నాను నేను.
పెద్దగా నవ్వారు పినరయి విజయన్.
‘‘ఫ్లోర్ బయట ఉన్నవాళ్లనైనా ఈ బీజేపీ వాళ్లు సుఖంగా ఉండనిస్తారని ఎందుకు అనుకుంటున్నావు కరుణాకరన్’’ అన్నారు.
ఆయన కష్టం నాకు అర్థమైంది! అరుణ్‌జైట్లీ అదివారం ఉదయాన్నే కేరళలో ఫ్లైట్ దిగుతున్నారు.
మాధవ్ శింగరాజు