పురుషుల సింగిల్స్ చాంప్ సతీశ్
మహిళల సింగిల్స్‌లో రన్నరప్ అన్‌మోల్
గువాహటి: సొంతగడ్డపై జరిగిన గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో చివరిరోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మూడు విభాగాల్లో భారత ప్లేయర్లు ఫైనల్ చేరుకోగా... రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం టైటిల్ దక్కించుకోగా... పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కరుణాకరన్ విజేతగా అవతరించాడు.
మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత రైజింగ్ స్టార్ అన్‌మోల్ ఖరబ్ తీవ్రంగా పోరాడినా చివరకు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. పురుషుల సింగిల్స్ తుదిపోరులో సతీశ్ 21–17, 21–14తో చైనీస్ క్వాలిఫయర్ జు జువన్ చెన్‌పై అలవోకగా గెలిచాడు. 44 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించి విజేతగా నిలిచాడు. సతీశ్‌కు 7500 డాలర్ల (రూ. 6 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
మహిళల డబుల్స్ టైటిల్ పోరులో ప్రపంచ 16వ ర్యాంక్ జోడీ అశ్విని పొన్నప్ప–తనీషా (భారత్) ద్వయం 21–18, 21–12తో లి హువా జౌ–వాంగ్ జి మెంగ్ (చైనా) జంటను కంగుతినిపించింది. తొలి గేమ్‌లో చైనా జోడీ నుంచి కాస్త పోటీ ఎదురైనప్పటికీ... రెండో గేమ్‌లో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశమివ్వకుండా అశ్విని–తనీషా 43 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించారు.
అశ్విని–తనీషా జోడీకి 7900 డాలర్ల (రూ. 6 లక్షల 68 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5500 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌మోల్ 21–14, 13–21, 19–21తో కాయ్ యన్ యన్ (చైనా) చేతిలో ఓడింది. తొలి గేమ్‌ను అవలీలగా గెలుచుకున్న భారత షట్లర్‌కు రెండో గేమ్ నుంచి సవాల్ ఎదురైంది.
చైనా క్రీడాకారిణి పుంజుకొని రెండో గేమ్ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడోగేమ్ హోరాహోరీగా జరిగింది. ఇద్దరు ప్రతీ పాయింట్ కోసం దీటుగా పోరాడారు. అయితే కీలకదశలో చైనీస్ ప్లేయర్ పాయింట్లు నెగ్గి విన్నర్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. రన్నరప్ అన్‌మోల్‌కు 3800 డాలర్ల (రూ. 3 లక్షల 21 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4680 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment