సెరెనా విలియమ్స్ (టెన్నిస్) రాయని డైరీ
ఇదే ఫస్ట్ టైమ్ ఆక్లండ్ రావడం! ఇక్కడంతా బాగుంది. న్యూజిలాండ్ జనాభా మొత్తం జనవరి ఫస్ట్ కోసం ఈ హార్బర్ పట్టణానికి వచ్చేసినట్లున్నారు. ఒకరికొకరు తగులుకుంటూ తిరుగుతున్నారు! నేనైతే అలెక్స్‌ని ఆనుకుని తిరుగుతున్నాను. ‘‘బాగుంది కదా’’ అన్నాడు అలెక్స్ నా కళ్లలోకి చూస్తూ! నవ్వాను. ఏడాదిగా అతడు నా కళ్లల్లోకి చూస్తూనే ఉన్నాడు. ‘‘ఇంకా ఏం చూస్తున్నావ్’’ అన్నాను.
‘‘నీలా స్కర్ట్ వేసుకుని, చేత్తో రాకెట్ పట్టుకుని గ్రాండ్‌స్లామ్ ఆడటానికి పుట్టబోయే నా కూతుర్ని చూస్తున్నాను’’ అన్నాడు. లాగి ఒక్కటిచ్చాను. ‘‘గేమ్ ఉంది. డిస్ట్రర్బ్ చెయ్యకు. నువ్వూ, నీ కలల కూతురు కలసి నాకు బదులుగా ప్రాక్టీస్ చేసిపెడతారా ఏమన్నానా?’’ అని నవ్వాను.
‘‘పెడతాం. ముందైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి కదా’’ అని నవ్వాడు. అలెక్స్ నవ్వు బాగుంటుంది. లాస్ట్ ఇయర్ రోమ్‌లో అనుకోకుండా ఒకరికొకరం పరిచయం అయ్యాం. న్యూయార్క్ వచ్చేశాక, సడెన్‌గా ఓ రోజు ఇంటి ముందు దిగబడ్డాడు. ‘‘రోమ్‌కి రెండు టిక్కెట్లున్నాయి. నీకొకటి నాకొకటి’’ అన్నాడు! ‘‘ఏంటి విషయం అన్నాను’’. ‘‘రోమ్‌లో చెప్తా’’ అన్నాడు.
రోమ్‌లో అతడేం చెప్పలేదు! ‘‘ఏదో చెప్తానన్నావ్’’ అన్నాను. ‘‘రోమ్.. ప్రేమకు హోమ్ కదా’’ అని కవిత్వం చెప్పాడు. ‘‘ఈ మాట చెప్పడానికేనా ఇంత దూరం లాక్కొచ్చావ్’’ అని అడిగాను. సడెన్‌గా మోకాలి మీద వంగి, ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా సెరీనా’’ అని అడిగాడు! తత్తరపడ్డాను. అండ్.. ఐ సెడ్.. ‘ఎస్’.
హార్బర్ రెస్టారెంట్‌లో క్యాండిల్ లైట్ డిన్నరుకి కూర్చున్నాం. ‘‘న్యూ ప్లేసెస్ బాగుంటాయి కదా అలెక్స్’’ అన్నాను. మళ్లీ నా కళ్లల్లోకి చూడ్డం మొదలు పెట్టాడు! స్టుపిడ్.
‘‘అలెక్స్.. వింటున్నావా? అసలు న్యూ ఇయర్ ఫీల్.. న్యూ ప్లేసెస్‌లోనే వస్తుంది కదా’’ అన్నాను. ‘‘బట్.. సెరెనా.. నువ్వెక్కడుంటే నాకదే న్యూ ప్లేస్. అక్కడే నాకు న్యూ ఇయర్’’ అన్నాడు.
‘‘కాస్త ఎక్కువైనట్లుంది అలెక్స్’’ అన్నాను కోపంగా. ‘‘డిన్నర్ గురించే కదా నువ్వంటున్నది’’ అని నవ్వాడు. నేను నవ్వలేదు. నవ్వితే ఎక్కువ చేస్తాడు.
డిన్నర్ తర్వాత ఎవరి రూమ్‌కి వాళ్లం వెళ్లిపోయాం. విత్ మై కైండ్ పర్మిషన్ కూడా అలెక్స్ చొరవ తీసుకోడు. అది నాకతడిలో నచ్చుతుంది.
నెలాఖర్లో ఆస్ట్రేలియా ఓపెన్. నా సెవెన్త్ వన్. దాన్ని కొట్టి అలెక్స్‌కి గిఫ్టుగా ఇవ్వాలి. ఊహు. అలెక్స్‌కి కాదు. ఆటల్లోకి వస్తున్న అమ్మాయిలందరికీ ఇవ్వాలి. వాళ్లందరి కల నిజం కావాలి. కల నిజం అవడం అంటే వరల్డ్స్ బెస్ట్ ఫిమేల్ ప్లేయర్ అవడం కాదు. వరల్డ్స్ బెస్ట్ ప్లేయర్ అవడం. లెబ్రాన్ జేమ్స్‌ని బెస్ట్ మేల్ ప్లేయర్ అంటున్నారా? టైగర్‌నీ, ఫెదరర్‌నీ బెస్ట్ మేల్ ప్లేయర్స్ అంటున్నారా? మరెందుకు.. నేను గానీ, ఇంకో ఉమెన్ అథ్లెట్ గానీ బెస్ట్ ఫిమేల్ ప్లేయర్ అవ్వాలి?!
-మాధవ్ శింగరాజు