
రియాద్: మహిళా టెన్నిస్ క్రీడాకారిణుల కోసం ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. టూర్‌లో ఆడుతున్న ప్లేయర్ ఎవరైనా గర్భం ధరిస్తే 12 నెలల పాటు వారికి డబ్బులు చెల్లిస్తూ ‘పెయిడ్ మెటర్నిటీ లీవ్’ ఇవ్వాలని నిర్ణయించింది.
సరొగసీ లేదా దత్తత తదితర కారణాలతో అమ్మగా మారితే వారికి 2 నెలల పాటు ఈ సౌకర్యం కల్పిస్తారు. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) ఈ మొత్తాలను చెల్లించేందుకు సిద్ధమైంది. ఏడాది కాలంగా పీఐఎఫ్... డబ్ల్యూటీఏ స్పాన్సర్లలో ఒకరిగా వ్యవహరిస్తోంది.
ఈ కొత్త పథకం ద్వారా కనీసం 300 మంది టెన్నిస్ ప్లేయర్లకు ప్రయోజనం కలగుతుందని డబ్ల్యూటీఏ సీఈఓ పోర్షియా వెల్లడించింది. మహిళల టెన్నిస్ చరిత్రలో ఇది కొత్త అధ్యాయమని పేర్కొన్న ఆమె... టెన్నిస్ ఆడుతూ అమ్మగా మారిన ప్లేయర్లు ఆటకు ఒక్కసారిగా దూరం కాకుండా మళ్లీ వచ్చి పాల్గొనేందుకు ఇది ఊతమిస్తుందని తెలిపింది.
సెరెనా (అమెరికా), అజరెంకా (బెలారస్), వొజ్నియాకి (డెన్మార్క్), క్లియ్‌స్టర్స్ (బెల్జియం), బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్), ఒసాకా (జపాన్) వంటి స్టార్లు తల్లిగా మారిన తర్వాత తిరిగొచ్చి టైటిల్స్ గెలిచారు. పిల్లలకు అమ్మలైన తర్వాత తిరిగొచ్చి ఆడుతున్న వారు ప్రస్తుతం 25 మందికి పైగా ప్లేయర్లు ఉన్నారు.
డబుల్స్ సెమీస్‌లో రష్మిక జోడీ
గుర్‌గ్రామ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–3, 6–4తో అంటోనియా ష్మిడిట్ (జర్మనీ)–క్లారా వ్లాసీలర్ (బెల్జియం) జోడీపై విజయం సాధించింది.
87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక–వైదేహి తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. మరోవైపు హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. భారత్‌కే చెందిన వైదేహి 6–3, 6–3తో భారత రెండో ర్యాంకర్ సహజను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment