women tennis
-
‘అతి’ వల్ల అనర్థాలు తప్పవు!.. చాలా బాధగా ఉంది..
యడ్లపల్లి ప్రాంజల... హైదరాబాద్‌కు చెందిన యువ టెన్నిస్ ప్లేయర్. కొన్నేళ్ల క్రితం వరకు చక్కటి ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తూ సానియా మీర్జా తర్వాత ఆ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్న అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? మే, 2019లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో ఆమె అత్యుత్తమంగా 265కు చేరుకుంది.మరింత మెరుగైన ప్రదర్శనతో పైకి దూసుకు పోతూ మెరుగైన భవిష్యత్తుపై ప్రాంజల ఆట నమ్మకం కలిగించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. 20 ఏళ్ల వయసులో ఆమె మళ్లీ మళ్లీ గాయాలపాలైంది. ఒక గాయం నుంచి కోలుకోగానే మరొకటి ఆమెను వెంటాడింది.15 ఏళ్ల వయసులోనే ఐటీఎఫ్ స్థాయిలో వరుసగా టైటిల్స్ గెలిచిన ఆ అమ్మాయికి అసలు సమయంలో గాయాల విషయంలో సరైన మార్గనిర్దేశనం లేకుండా పోయింది. దాంతో కెరీర్లో ఎదుగుతున్న సమయంలో ఆమె ఆటకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో ప్రాంజల 1409వ స్థానానికి పడిపోయింది! అంటే కెరీర్లో ఎదుగుతున్న కీలకమైన 20–25 మధ్య ఐదేళ్ల కెరీర్‌ను ఆమె దాదాపు పూర్తిగా నష్టపోయింది.‘నాకు ఇప్పటికీ టెన్నిస్ అంటే చాలా ఇష్టం. పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్నాను. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా బాధ వేస్తుంది. గాయాలతో పాటు టోర్నమెంట్ షెడ్యూల్, ఫిట్నెస్వంటివాటిపై సరైన రీతిలో మార్గనిర్దేశనం లభించి ఉంటే పరిస్థితి ఎంత మెరుగ్గా ఉండేదో అనిపిస్తుంది’ ఆమె ప్రాంజల వ్యాఖ్యానించింది.జిమ్ ఎక్సర్సైజ్లే సమస్యగా... ప్రాంజల మాత్రమే కాదు భారత టెన్నిస్‌లో ఎంతో మంది అమ్మాయిలు ప్రస్తుతం ఈ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి కారణం భారత టెన్నిస్‌లో ముఖ్యంగా మహిళల టెన్నిస్‌లో ఇలాంటివి చూసేందుకు ఒక సరైన వ్యవస్థనే లేదు. అసలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోలిస్తే ఫిట్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్సర్సైజ్లు కూడా ఎంత వరకు చేయాలి, అవి పరిమితి దాటితో ఎలాంటి నష్టం కలిగిస్తాయో కూడా ఎవరూ చెప్పే పరిస్థితి లేదు.అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) వద్ద కూడా దీనికి సరైన సమాధానం లేదు. ఆటలో దూసుకుపోతున్న సమయంలో ‘అతి’గా ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు చేయడం కూడా ప్రాంజలను నష్టపర్చింది. ఒక మ్యాచ్‌లో 6–3, 5–2, 30–30తో విజయానికి బాగా చేరువైన సమయంలో కూడా అనారోగ్యంతో తప్పుకోవాల్సి రావడం ఆమె పరిస్థితిని చూపించింది. ‘నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ట్రైనింగ్ చేసేదానిని. జిమ్‌లో కూడా చాలా ఎక్కువగా బరువును ఎత్తేదానిని. దాని వల్ల ఏమైనా అయితే ఎలా కోలుకోవాలనే విషయంపై కనీస సమాచారం కూడా లేదు.వెన్నునొప్పి, తుంటి నొప్పి, మోకాలు, మడమ... ఇలా ఒకదాని తర్వాత మరో గాయం వెంటాడింది. జిమ్‌లో బరువుల ప్రభావంతో కండరాలు బాగా బిగుసుకుపోయాయి. దాంతో శరీరంలో సమతుల్యత లభించింది. రెండు నెలలో తగ్గే గాయాలకు కూడా ఆరు నెలలు పట్టింది. నేను చేసిన ఎక్సర్సైజ్లతోనే నాకు బాగా నష్టం జరిగిందనే విషయం కూడా నాకు ఇటీవల అర్థమైంది. అంతకుముందు ఏమీ తెలీదు. తెలిస్తే జాగ్రత్త పడేదాన్ని’ అని ప్రాంజల తన ఆవేదనను ప్రదర్శించింది. ఏఐటీఏ చొరవ చూపిస్తేనే... కొన్నేళ్ల క్రితం చైనా మహిళా టెన్నిస్ ప్లేయర్ల కోసమే ప్రత్యేకంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను మొదలు పెట్టింది. ముఖ్యంగా తమ అగ్రశ్రేణి క్రీడాకారిణులకు అమిత ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పుడు భారత్‌లో 16–24 వయసు మధ్య టెన్నిస్ ఆడుతున్న అమ్మాయిలకు కూడా అలాంటిది అవసరం ఉంది. దీనిపై ఇప్పుడిప్పుడే డిమాండ్లు పెరుగుతున్నాయి. ‘భారత మహిళా ప్లేయర్లు విడివిడిగా కాకుండా ఒక బృందంగా టోర్నీలకు వెళ్లటం మేలు చేస్తుంది. అప్పుడు ఏఐటీఏ వారి కోసమే ఒక కోచ్‌ను, ఫిజియోను పంపే అవకాశం ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే అమ్మాయిలకు 360 డిగ్రీ పర్యవేక్షణ అవసరం. న్యూట్రిషన్, మానసిక దృఢత్వం, మ్యాచ్‌ల విశ్లేషణ, సరైన షెడ్యూలింగ్, ప్రాక్టీస్‌కు స్పేర్ పార్ట్నర్లు...ఇలా అన్నింటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో భారత్‌లో పెద్ద సంఖ్యలో టోర్నీలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే 3–4 ఏళ్ల పాటు ప్రస్తుత ప్లేయర్లకు అండగా నిలవాల్సి ఉంది. లేదంటే ఈ ప్రతిభ వృథా అవుతుంది’ అని ప్రముఖ టెన్నిస్ అడ్మినిస్ట్రేటర్ సుందర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడైనా ఏఐటీఏ మేల్కొనకపోతే ప్రాంజల కెరీర్‌ను దెబ్బ తీసిన అనుభవాలు మున్ముందూ ఎదురు కావచ్చు. -సాక్షి క్రీడా విభాగం -
WTA: క్రీడాకారిణులకు పెయిడ్ మెటర్నిటీ లీవ్!
రియాద్: మహిళా టెన్నిస్ క్రీడాకారిణుల కోసం ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. టూర్లో ఆడుతున్న ప్లేయర్ ఎవరైనా గర్భం ధరిస్తే 12 నెలల పాటు వారికి డబ్బులు చెల్లిస్తూ ‘పెయిడ్ మెటర్నిటీ లీవ్’ ఇవ్వాలని నిర్ణయించింది. సరొగసీ లేదా దత్తత తదితర కారణాలతో అమ్మగా మారితే వారికి 2 నెలల పాటు ఈ సౌకర్యం కల్పిస్తారు. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) ఈ మొత్తాలను చెల్లించేందుకు సిద్ధమైంది. ఏడాది కాలంగా పీఐఎఫ్... డబ్ల్యూటీఏ స్పాన్సర్లలో ఒకరిగా వ్యవహరిస్తోంది. ఈ కొత్త పథకం ద్వారా కనీసం 300 మంది టెన్నిస్ ప్లేయర్లకు ప్రయోజనం కలగుతుందని డబ్ల్యూటీఏ సీఈఓ పోర్షియా వెల్లడించింది. మహిళల టెన్నిస్ చరిత్రలో ఇది కొత్త అధ్యాయమని పేర్కొన్న ఆమె... టెన్నిస్ ఆడుతూ అమ్మగా మారిన ప్లేయర్లు ఆటకు ఒక్కసారిగా దూరం కాకుండా మళ్లీ వచ్చి పాల్గొనేందుకు ఇది ఊతమిస్తుందని తెలిపింది. సెరెనా (అమెరికా), అజరెంకా (బెలారస్), వొజ్నియాకి (డెన్మార్క్), క్లియ్‌స్టర్స్ (బెల్జియం), బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్), ఒసాకా (జపాన్) వంటి స్టార్లు తల్లిగా మారిన తర్వాత తిరిగొచ్చి టైటిల్స్ గెలిచారు. పిల్లలకు అమ్మలైన తర్వాత తిరిగొచ్చి ఆడుతున్న వారు ప్రస్తుతం 25 మందికి పైగా ప్లేయర్లు ఉన్నారు. డబుల్స్ సెమీస్‌లో రష్మిక జోడీ గుర్‌గ్రామ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–3, 6–4తో అంటోనియా ష్మిడిట్ (జర్మనీ)–క్లారా వ్లాసీలర్ (బెల్జియం) జోడీపై విజయం సాధించింది.87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక–వైదేహి తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. మరోవైపు హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. భారత్‌కే చెందిన వైదేహి 6–3, 6–3తో భారత రెండో ర్యాంకర్ సహజను ఓడించింది. -
Madison Keys: తొమ్మిదేళ్ల తర్వాత...
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ రూపంలో కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్... తొమ్మిదేళ్ల విరామం తర్వాత మళ్లీ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా ర్యాంకింగ్స్‌లో 29 ఏళ్ల కీస్ 14వ ర్యాంక్ నుంచి ఏడు స్థానాలు ఎగబాకి 7వ ర్యాంక్‌కు చేరుకుంది. కీస్ ఖాతాలో 4680 పాయింట్లున్నాయి. 2016 అక్టోబర్ 10న కీస్ కెరీస్ బెస్ట్ ఏడో ర్యాంక్‌లో నిలిచింది. ఆ తర్వాత 2020 వరకు కీస్ టాప్–20లో కొనసాగింది. 2021 సీజన్ ముగిసేసరికి 56వ ర్యాంక్‌కు చేరిన కీస్ 2022 సీజన్‌ను 11వ ర్యాంక్‌తో... 2023 సీజన్‌ను 12వ ర్యాంక్‌తో, 2024 సీజన్‌ను 21వ ర్యాంక్‌తో ముగించింది. డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో టాప్–10లో నలుగురు అమెరికా క్రీడాకారిణులు ఉన్నారు. కోకో గాఫ్ 6538 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో... జెస్సికా పెగూలా 4861 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో... ఎమ్మా నవారో 3709 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. -
30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను.. మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు
ప్రపంచ మాజీ నంబర్ 2 టెన్నిస్ క్రీడాకారిణి, రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనలిస్ట్ అయిన ఆండ్రియా జేగర్ (అమెరికా) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ స్టాఫ్ మెంబర్ ఒకరు తనపై 30కి పైగా సందర్భాల్లో లైంగికంగా దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు టెన్నిస్ అసోసియేషన్‌కు చెందిన మరో ప్రముఖుడు తనకు మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడని 57 ఏళ్ల ఆండ్రియా జేగర్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఆండ్రియా జేగర్ 1980వ దశకంలో మహిళల టెన్నిస్‌లో స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. భుజం గాయం కారణంగా కెరీర్ అర్ధంతరంగా ముగియకముందు ఆమె 10కి పైగా టైటిళ్లు సాధించింది. జేగర్.. 1982 ఫ్రెంచ్ ఓపెన్, 1983 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. జేగర్.. ప్రముఖ మహిళల టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా సమకాలీకురాలు. చదవండి: వామ్మో కట్టెముక్కను విరిచినట్లు.. బ్యాట్‌ను సింపుల్‌గా -
ఉక్రెయిన్ సైన్యానికి నా ప్రైజ్‌మనీ: స్వితోలినా
మాంటేరి (మెక్సికో): ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినా ఇకపై మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నీల్లో గెలిచిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తమ సైన్యానికి విరాళంగా ఇస్తానని ప్రకటించింది. రష్యా యుద్ధంతో ప్రస్తుతం ఉక్రెయిన్ అంతటా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ పౌరులు కూడా తమ మిలిటరీకి అండగా ఆయుధాలు చేపట్టి యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ 15వ ర్యాంకర్ అయిన స్వితోలినా మాట్లాడుతూ ‘రష్యా మిలిటరీ చర్యతో ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోజులు వెళ్లదీస్తుండగా, సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. నేను టోర్నీలాడేందుకు బయటికొచ్చాను. కానీ నా కుటుంబం, సన్నిహితులంతా అక్కడే ఉన్నారు. ఎన్నో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ ఊపిరిపీల్చుకుంటున్నాయి. దేశం కోసం సైన్యం పోరాటం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నా వంతు సాయంగా నా ప్రైజ్‌మనీ అంతా మిలిటరీ, సహాయ–పునరావాస అవసరాల కోసం విరాళంగా ఇస్తాను’ అని పేర్కొంది. ఆమె ఈ వారం మాంటేరి సహా, ఇండియన్ వెల్స్, మయామి టోర్నీల్లో పాల్గొననుంది. -
Naomi Osaka: 'ఇక నుంచి నన్ను అలా పిలవండి'
మహిళల టెన్నిస్ సూపర్ స్టార్ నయామి ఒసాకా తన బ్రేక్టైమ్ను ఫుల్ స్వింగ్‌తో ఆస్వాధిస్తోంది. ఇటీవలే జరిగిన యూఎస్ ఓపెన్‌లో మూడోరౌండ్లోనే ఇంటిబాట పట్టిన ఒసాకా కొంతకాలం టెన్నిస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దొరికిన సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్న ఒసాకా తనకిష్టమైన వంటల్లో వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ వాటికి గమ్మత్తైన పేర్లు పెడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటుంది. తాజాగా వాగ్యూ కాస్తూ అనే జపనీస్ కర్రీనీ వండిన ఒసాకా దానిని ఇన్‌స్టాలో పంచుకుంటే.. ఈరోజు మీ ముందుకు వాగ్యా కాస్తూ జపనీస్ కర్రీనీ తీసుకొచ్చాడు.. కానీ అది సరిగా కుదిరిందో లేదో చూడాలి.. ఇకపై నన్ను ''చెఫ్ బొయార్డీ'' అని పిలవండి. అంటూ క్యాప్షన్ జత చేసింది. చదవండి: గోవాలో ఎంజాయ్ చేస్తున్న సారా... బ్రేకప్ చెప్పేశారా అంటూ నెటిజన్ల ట్రోల్స్! ఇక ఈ ఏడాది ఒసాకాకు పెద్దగా కలిసిరాలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను రెండోసారి గెలిచిన ఒసాకా 2021 ఏడాదిని ఘనంగానే ఆరంభించింది. అయితే ఆ తర్వాత జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఆరోగ్య సమస్యలతో వింబుల్డన్ నుంచి పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మూడోరౌండ్లోనే వెనుదిరిగి నిరాశ పరిచింది. ఇక 24 ఏళ్ల ఒసాకా తన టెన్నిస్ కెరీర్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ అందుకుంది. ఇటీవలే టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ''2021లో అత్యంత ప్రభావితం చేసిన 100 మంది వ్యక్తులు'' జాబితాలో నయామి ఓసాకా చోటు దక్కించుకోవడం విశేషం. -
టెన్నిస్ మమ్మీస్
జన్మనివ్వడం పునర్జన్మ. కమ్ బ్యాక్ కూడా అంతే. మెట్టినింటికి కమ్ బ్యాక్. ఆఫీస్‌కి కమ్ బ్యాక్. ఆటకు కమ్ బ్యాక్. ప్రాణం పుంజుకోవాలి. ఫిట్నెస్తో రెడీ అవ్వాలి. టెన్నిస్ బరిలో ఈసారి.. తొమ్మిది మంది మమ్మీస్! అందరూ పవర్ రాకెట్స్ యు.ఎస్. ఓపెన్ మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో మొన్న మంగళవారం సెరెనా, త్సె్వతానా, విక్టోరియా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోగానే 96 ఏళ్ల గ్రాండ్ స్లామ్ చరిత్రలో (వింబుల్డన్, యు.ఎస్., ఫ్రెంచి, ఆస్ట్రేలియన్ ఓపెన్) ఒక రికార్డు నమోదు అయింది. ముగ్గురు తల్లులు ఒకేసారి క్వార్టర్ఫైనల్స్కు చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని యు.ఎస్. ఓపెన్ టోర్నమెంట్ గర్వంగా రెండు ట్వీట్లతో షేర్ చేసుకుంది. ‘గ్రాండ్ స్లామ్ చరిత్రలో తొలిసారి క్వార్టర్ ఫెనల్స్‌కు ముగ్గురు తల్లులు’ అనేది మొదటి ట్వీట్. ‘మదర్ ఆఫ్ ఆల్ గ్రాండ్ స్లామ్స్’ అనేది రెండో ట్వీట్. ప్రత్యేకించి 139 ఏళ్ల యు.ఎస్. ఓపెన్‌కి ఇది నిజంగానే గర్వకారణం. ఈ అవకాశం వింబుల్డన్కో, ఫ్రెంచికో, ఆస్ట్రేలియన్ ఓపెన్కో పోలేదు. వెరా జ్వోనారెవా (రష్యా), త్సె్వతానా (బల్గేరియా) ఆగస్టు 31న న్యూయార్క్‌లో ప్రారంభం అయిన యు.ఎస్. ఓపెన్‌లో బరిలోకి దిగిన వారిలో ఈసారి తొమ్మిది మంది తలుల్లు ఉన్నారు. వీళ్లంతా గత రెండు మూడేళ్లలో కాన్పు విరామం తర్వాత ఆటలోకి తిరిగి వచ్చినవాళ్లే. కమ్ బ్యాక్ ఉమన్ ప్లేయర్స్. సెరెనా, త్సె్వతానా, విక్టోరియా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోడానికి ముందే వారిలో ఆరుగురు.. కిమ్ క్లిజ్స్టర్స్, వెరా జ్వొనారెవా, తత్జానా మారియా, కేథరీనా బాండెరెంకో, ప్యాట్రీషియా మేరియా టిగ్, ఓగ్లా గోవోర్ట్సోవా.. ఆడి ఓడారు. మదర్స్ కాబట్టి ఓడినా గెలిచినట్లేనని కాదు. గెలుపుకోసం చివరి వరకూ పోరాట పటిమను కనబరిచారని. మిగిలిన ముగ్గురు తల్లులూ ఒకేసారి కార్వర్ఫైనల్స్కి చేరడం రికార్డు అయినట్లే.. ఆ ముగ్గురి తల్లుల వ్యక్తిగత రికార్డులూ అసాధారణమైనవే. ఓల్గా గోవోర్ట్సోవా (బెలారస్), పాట్రీషియా మారియా టిగ్ (రొమేనియా) ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్లో మమ్మీ సెరెనా ఫైనల్స్‌కి వచ్చి, అక్కడా గెలిస్తే అది ఆమెకు 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అవుతుంది. అప్పుడు.. గ్రాండ్‌స్లామ్‌లో 24 టైటిళ్లతో రికార్డును నిలుపుకుని ఉన్న ఆస్ట్రేలియన్ టెన్నిస్ క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్‌తో సెరెనా సమానం అవుతారు. క్వార్టర్‌ఫైనల్స్‌కి చేరిన మిగతా ఇద్దరు మమ్మీలు విక్టోరియా (31), త్సె్వతానా (32) కన్నా సెరెనా సీనియర్. వయసు 38. సెరెనాకు ఒలింపియా అనే మూడేళ్ల కూతురు ఉంది. తత్జానా మారియా (జర్మనీ), క్యాథెరీనా బాండెరెంకో (ఉక్రెయిన్) మరో మమ్మీ త్సె్వతానా గ్రాండ్ స్లామ్లో ఇంతవరకు 105 మ్యాచ్‌లు గెలిస్తే ఓడినవి పదమూడే! ఈ బల్గేరియా క్రీడాకారిణికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. పేరు అలెగ్జాండర్. రెండు వారాలుగా తను కొడుకునే చూడలేదు. గత సోమవారం.. కెరీర్లోనే తన తొలి క్వార్టర్ ఫైనల్స్‌కి చేరడానికి ముందు ఆమె ఆడిన చివరి ఆట 2017లో వింబుల్డన్. ‘‘చాలా టఫ్‌గా ఉంది. రోజు రోజుకూ ఎక్కువ టఫ్ అవుతోంది’’ అంటున్నారు త్సె్వతానా. యు.ఎస్. ఓపన్ గురించి కాదు.. కొడుకును చూడకుండా ఉండలేకపోవడం గురించి. ‘‘నాకు తెలుసు. వాడు నన్ను చూస్తూ ఉండి ఉంటాడు’’ అని చెప్పుకుని మురిసిపోతున్నారు కూడా. త్సె్వతానా వయసు 32. విక్టోరియా (బెలారస్) మూడో మమ్మీ విక్టోరియా (31). బెలారస్ దేశ క్రీడాకారిణి. అమెరికన్ క్రీడాకారిణి సెరెనాలా ఈమె మరో మాజీ వరల్డ్ నెంబర్ వన్. 2015 తర్వాత ఆమె మళ్లీ యు.ఎస్. ఓపెన్ క్వార్టర్‌ఫైనల్స్‌కి లోకి రావడం ఇదే మొదటిసారి. ఆమెకు లియో అనే మూడేళ్ల కొడుకు ఉన్నాడు. బరిలో తనతో పాటు ఉన్న తక్కిన తల్లుల్ని చూసి ‘ఇటీజ్ ఇన్స్పైరింగ్’ అని ఆశ్చర్యపోతున్నారు విక్టోరియా. పిల్లలు పుట్టినా మన కలలు కొనసాగుతూనే ఉండాలి అంటున్నారు. ‘‘తల్లి అనే గుర్తింపు గొప్పది. ఆ గుర్తింపునకు క్రీడాకారిణి మరింత గుర్తింపు తెస్తుంది’’ అంటారు విక్టోరియా. ఇప్పుడీ ముగ్గురు తల్లులు ఏకకాలంలో గ్రాండ్ స్లామ్కే గుర్తింపు తెచ్చిపెట్టారు. గత ఏభై ఏళ్లలో ఇప్పటి వరకు తల్లులు అయ్యాక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన వాళ్లు కూడా ముగ్గురే. మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా), ఎవోన్ గూలగోంగ్ (ఆస్ట్రేలియా), కిమ్ క్లిజ్స్టర్స్ (బెల్జియం). -
రెండోరౌండ్లో శివాని, రిషిక
సాక్షి, హైదరాబాద్: ఆసియా టెన్నిస్ టూర్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో అమినేని శివాని, సుంకర రిషిక శుభారంభం చేశారు. తెలంగాణ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో శాట్స్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన మహిళల తొలిరౌండ్లో శివాని 6-3, 6-2తో మౌళిక రామ్‌పై గెలుపొందగా... సుంకర రిషిక 6-1, 6-1తో శ్వేతను ఓడించి రెండోరౌండ్లోకి ప్రవేశించారు. ఇతర మ్యాచ్‌ల్లో సౌజన్య భవిశెట్టి 6-0, 6-0తో అమ్రిత ముఖర్జీపై, సింధు జనగాం 6-0, 6-0తో గుల్స్ ్రబేగంపై, సంహిత 6-2, 6-3తో శ్రీయపై, భువన 6-2, 6-1తో హర్షితపై, లలిత 6-3, 6-3తో శ్రీ సాయి శివానిపై, నిధి 6-4, 6-4 తీర్థపై విజయం సాధించారు.