![Elina Svitolina to donate prize money to help Ukraine military - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/1/SVITOLINA-PR1.jpg.webp?itok=RP1bDbwb)
మాంటేరి (మెక్సికో): ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినా ఇకపై మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నీల్లో గెలిచిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తమ సైన్యానికి విరాళంగా ఇస్తానని ప్రకటించింది. రష్యా యుద్ధంతో ప్రస్తుతం ఉక్రెయిన్ అంతటా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ పౌరులు కూడా తమ మిలిటరీకి అండగా ఆయుధాలు చేపట్టి యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ 15వ ర్యాంకర్ అయిన స్వితోలినా మాట్లాడుతూ ‘రష్యా మిలిటరీ చర్యతో ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోజులు వెళ్లదీస్తుండగా, సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. నేను టోర్నీలాడేందుకు బయటికొచ్చాను. కానీ నా కుటుంబం, సన్నిహితులంతా అక్కడే ఉన్నారు. ఎన్నో కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ ఊపిరిపీల్చుకుంటున్నాయి. దేశం కోసం సైన్యం పోరాటం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నా వంతు సాయంగా నా ప్రైజ్‌మనీ అంతా మిలిటరీ, సహాయ–పునరావాస అవసరాల కోసం విరాళంగా ఇస్తాను’ అని పేర్కొంది. ఆమె ఈ వారం మాంటేరి సహా, ఇండియన్ వెల్స్, మయామి టోర్నీల్లో పాల్గొననుంది.
Comments
Please login to add a commentAdd a comment