Sakshi News home page

రాయని డైరీ.. అధీర్‌ రంజన్‌ (లోక్‌సభ కాంగ్రెస్‌ లీడర్‌)

Published Mon, Jan 8 2024 3:01 PM

Rayani dairy By Madhav Singaraju On mamata banerjee adhir ranjan chowdhury - Sakshi

‘‘ఆవిడ అహంకారం గమనించారా ఖర్గేజీ?! అందుకే ఆవిడకు నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు...’’ అన్నాను ఖర్గేజీతో.  
ఆ మాటకు ఖర్గేజీ నవ్వారు! ‘‘ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదన్న స్పృహ మీలో ఇప్పటికీ ఉందంటే అందరికన్నా ముందు మీరే ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు రంజన్‌జీ. ఆవిడ పుట్టిన రోజు వచ్చి పోయి కూడా ఇరవై నాలుగు గంటలు అవడం లేదా...’’ అన్నారు. 
ఆయన వైపు దిగాలుగా చూశాను. 
‘‘రంజన్‌జీ... ఆవిడ ఆల్రెడీ ఎలక్షన్‌ మూడ్‌లోకి వెళ్లిపోయారు కనుక పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ అయిన మీరు గానీ, ఆలిండియా కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ అయిన నేను గానీ, పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఉన్న ఇద్దరంటే ఇద్దరే లోక్‌సభ ఎంపీలలో ఒకరైన మన అబూ హసేమ్‌ ఖాన్‌ సాబ్‌ గానీ ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం, చెప్పకపోవడం అన్నవి ఆవిడ పట్టించుకునేంత ప్రాముఖ్యం ఉన్న విషయాలైతే కావు. మనకే ఆ పట్టింపు..’’ అన్నారు ఖర్గేజీ... అదే నవ్వుతో!  

‘‘ఆవిడ అంటే మమతాజీనే కదా...’’ అన్నారు ఖాన్‌ సాబ్‌. 
‘‘ఆ.. ఆవిడే..’’ అన్నాను. 
ఖాన్‌ సాబ్, నేను, ఖర్గేజీ... ముగ్గురం ఢిల్లీ ఆఫీస్‌లో ఉన్నాం. 
వచ్చే ఎన్నికల సీట్‌ షేరింగ్‌లో మాల్దా సౌత్, బెర్హంపూర్‌.. ఈ రెండూ కాంగ్రెస్‌కు ఇస్తాం అంటున్నారు మమత! మాల్దాకు ఖాన్‌ సాబ్, బెర్హంపూర్‌కి నేను సిట్టింగ్‌ ఎంపీలం. 
‘‘మన సీట్లు మనకు ఇవ్వడం సీట్‌ షేరింగ్‌ ఎలా అవుతుంది ఖర్గేజీ... అహంకారం అవుతుంది కానీ..’’ అన్నాను, ఢిల్లీ పార్టీ ఆఫీస్‌ మెట్లెక్కి పైకి వెళ్లగానే. 
వెంటనే ఆయనేమీ మాట్లాడలేదు.
‘‘ముందు అలా ప్రశాంతంగా కూర్చోండి రంజన్‌జీ...’’అన్నారు! 
‘‘అసలు కూటమి నుంచే బయటికి వచ్చేద్దాం ఖర్గేజీ. కాంగ్రెస్‌కి ఏం తక్కువైంది. తృణమూల్‌కి ఏం ఎక్కువైంది?’’ అన్నాను తీవ్రమైన ఆగ్రహంతో. 
ఖర్గేజీ నవ్వుతూ చూశారు. 
‘‘ఈ రెండు సీట్ల షేరింగ్‌ నాకు చికాకు తెప్పిస్తోంది ఖర్గేజీ. పైగా ఆవిడ ఏమంటున్నారో విన్నారు కదా.. బెంగాల్లో బీజేపీ సంగతి తనొక్కరే చూసుకుంటారట, మిగతా స్టేట్‌లన్నిటిలో మనం చూసుకోవాలట! అంటే.. బెంగాల్‌లో మొత్తం 42 సీట్లూ తృణమూల్‌కి వదిలేయమనే కదా! ఎక్కడి నుంచి వస్తుంది అంత అహంకారం ఖర్గేజీ!! మనం తక్కువన్న ఫీలింగా? లేక, తను ఎక్కువన్న ఫీలింగా?!’’ అన్నాను. 
‘‘తను ఎక్కువన్న ఫీలింగే కావచ్చు...’’ అన్నారు ఖాన్‌ సాబ్‌! 
‘‘ఎలా చెప్పగలరు?!’’ అన్నాను. 
‘‘అవతలి వాళ్లను తక్కువగా చూడగలినప్పుడు మనం ఎక్కువ అనే ఫీలింగ్‌ కలుగుతుంది. బహుశా మమతాజీ కూడా అలా మనల్ని తక్కువగా చూడగలగడం ద్వారా తను ఎక్కువ అనే భావనను కల్పించుకుంటున్నా రేమో...’’ అన్నారు ఖాన్‌ సాబ్‌.
‘‘లోక్‌సభలో 22 సీట్లు మాత్రమే ఉన్న
తృణమూల్‌ పార్టీ, 48 సీట్లున్న కాంగ్రెస్‌ పార్టీని తక్కువగా చూడగలుగుతోందంటే...  కూటమిలో భాగస్వామి కనుక మన 48 సీట్లు కూడా తనవే అని తృణమూల్‌ అనుకుంటూ ఉండాలి. లేదా, తనసలు కూటమిలోనే లేనని అనుకుంటూ ఉండాలి...’’ అన్నాను. 
ఆ మాటకు పెద్దగా నవ్వారు ఖాన్‌ సాబ్‌. 
ఖర్గేజీ నవ్వలేదు! 
‘‘మనమూ కూటమిలో లేమనే అనుకోవాలి రంజన్‌జీ. ఇప్పుడున్నది కాదు కూటమి. ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చాక కుదిరేదే అసలైన కూటమి...’’ అన్నారు! 
‘‘మరిప్పుడేం చేద్దాం ఖర్గేజీ?’’ అన్నాను. 
‘‘బిలేటెడ్‌గానైనా ముందు మీరు మమతాజీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి రంజన్‌జీ... ఆవిడ పట్టించుకున్నా, పట్టించు కోకున్నా... ’’ అన్నారాయన!!
-మాధవ్‌.. శింగరాజు

Advertisement

తప్పక చదవండి

Advertisement