మాధవ్ శింగరాజు
ప్రజాస్వామ్యం కొన్నిసార్లు నిరంకుశత్వంతో పోరాడవలసి వస్తుంది. అప్పుడేం చేయాలి? పోరాడాలి. పోరాడేందుకు ఒక్కరైనా ముందుకు రావాలి. ఆ ఒక్కరు ఎవరన్నది... నిర్ణయంతో తేలేది కాదు. నిశ్చయంతో జరిగేది.
‘‘నేనొస్తాను...’’ అన్నాను. ‘‘సీఎంగా ఉంటూనే, ‘ఇండియా’ కూటమినీ నడిపిస్తాను’’ అన్నాను.నేను ఆ మాట అన్నప్పుడు... ‘‘కూటమిని నడిపించటానికే కదా మల్లికార్జున్ ఖర్గే కూటమికి చైర్మన్‌గా ఉన్నారు, కూటమిని కవాతు చేయించటానికే కదా లోక్‌సభలో రాహుల్, రాజ్యసభలో ఖర్గే కూటమి నాయకులుగా ఉన్నారు...’’ అని కూటమిలోని సభ్యులెవరూ అనలేదు!
‘‘ఎస్, మీరు రావాలి మమతాజీ...’’ అన్నారు శరద్ పవార్.
‘‘మీరొస్తే 2025లో గెలుపు మనదే...’’ అన్నారు లాలూ ప్రసాద్.
‘‘మీరు రావటమే మంచిది మేడమ్...’’ అని అఖిలేశ్ యాదవ్.
వారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు కూడా!
కూటమిలో మహామహులు ఉన్నారు. ప్రకాష్ కారత్, అరవింద్ కేజ్రీవాల్,ఎం.కె. స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సోరేన్, ఫరూఖ్ అబ్దుల్లా, డి.రాజా, మెహబూబా ముఫ్తీ... వారిలో ఏ ఒక్కరూ... ‘‘కూటమికి నేను నాయకత్వం వహిస్తాను...’’ అని ముందుకు వచ్చినా నేను వారికి అడ్డుపడేది, వారితో నేను పోటీకి దిగేది ఏముంటుంది?
అంతా ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కూటమిగా ఏర్పడినవాళ్లం ఒకరిని ఒకరం ఎందుకు వెనక్కు లాగుతాం?!
కానీ, రాహుల్ అలా అనుకున్నట్లు లేరు! ‘‘దిగువ స్థాయి లీడర్‌ల మాటల్ని పట్టించుకో కండి. కూటమిలోని సమస్యల్ని పరిష్కరించే సత్తా కాంగ్రెస్‌కు ఉంది...’’ అంటున్నారు.
నన్ను ‘దిగువ స్థాయి’ లీడర్ అన్నందుకు నాకేం పట్టింపు లేదు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి మాటల్ని ఎన్ని వినలేదు! ముఖ్యమంత్రిని అయినంత మాత్రాన నేనేమీ ‘వెరీ ఇంపార్టెంట్ పర్సన్’ అయిపోను. నిజానికి, నేనొక ‘లెస్ ఇంపార్టెంట్ పర్సన్’ అని చెప్పుకోవటమే నాకు ఇష్టం.
‘కూటమిలోని సమస్యల్ని పరిష్కరించే సత్తా కాంగ్రెస్‌కు ఉంది...’ అని రాహుల్ అనడంలో తప్పేమీ లేదు. అయితే ఇప్పుడు పరిష్కరించవలసింది కూటమి లోపలి సమస్యలనా? లేక, కూటమి బయట ఉన్న సమస్యనా? బయటి సమస్య వల్లనే కదా, లోపలి సమస్యలు బయటికి వస్తున్నది!
బీజేపీని ఓడించటానికి కూటమిగా ఒకటై పోరాడాక కూడా 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేకపోయింది. 2024లో హరియాణా, జమ్మూకశ్మీర్, మహారాష్ట్రలలో విజయం సాధించలేకపోయింది. దీనిని కదా కాంగ్రెస్ పరిష్కరించవలసింది!
నాయకుల్ని నాయకులు గౌరవించక పోయినా, పార్టీలను పార్టీలు గౌరవించాలి. రాహుల్ నన్ను దిగువ స్థాయి లీడర్ అని అనటం, తృణమూల్ కాంగ్రెస్‌ను దిగువస్థాయి పార్టీ అని అనటమే! తృణమూల్ కూడా ఒకప్పటి కాంగ్రెస్సే అనే సంగతి ఆయనకు గుర్తు లేకుండా ఉంటుందా?
కూటమిని నేను నడిపిస్తాను అని నేను అంటున్నది... ఖర్గేజీ నడిపించలేక పోతున్నా రనో, రాహుల్ పరుగెత్తలేక పోతున్నారనో కాదు. కూటమి భాగస్వామిగా మోదీజీని దించే బాధ్యత నాకు మాత్రం లేదా... అని.
‘‘కూటమిని లీడ్ చేస్తాను’’ అని నేను అనగానే, అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నాకు శ్రేయోభిలాషిగా మారిపోయారు! ‘‘మమతాజీ! చచ్చిపడి ఉన్న కూటమికి సారథ్యం వహించి, మీరు దానిని బతికించలేరు. 2026లో మీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టండి...’’ అని హితవు చెప్పారు. రాహుల్ అన్న మాట కంటే అదేమీ ఘాటైనది కాదు.
Comments
Please login to add a commentAdd a comment