అనైక్యతా కూటమి | Sakshi Editorial On Congress Indian National Developmental Inclusive Alliance | Sakshi
Sakshi News home page

అనైక్యతా కూటమి

Published Fri, Jan 26 2024 12:01 AM | Last Updated on Fri, Jan 26 2024 12:01 AM

Sakshi Editorial On Congress Indian National Developmental Inclusive Alliance

వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్యంగా ప్రతిఘటిస్తామని 28 పార్టీల కలగూరగంప ‘ఇండియా’ కూటమి ఆది నుంచి చెబుతోంది. కానీ, ఎన్నికలు ముంచుకొస్తుంటే, కూటమి బీటలు వారుతోంది. అంతటా అనైక్యతా రాగాలే వినిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం తేల్చేశారు. ‘ఆప్‌’ నేత – పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ సైతం తమ రాష్ట్రంలోనూ అంతే అని కుండబద్దలు కొట్టారు. జేడీ(యూ) అధినేత – బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ పైకి ఏమీ చెప్పకున్నా, లోలోపల కుతకుతలాడుతున్నట్టు కనిపిస్తూనే ఉంది. వెరసి, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో’ అని తిరుగుతుంటే, ముందుగా ‘ఇండియా(కూటమి) జోడో’ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 

రాహుల్‌ ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ బెంగాల్‌లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందే మమత షాక్‌ ఇచ్చారు. బెంగాల్‌లో హస్తం బలం పుంజుకుంటే, అది తనకు తలనొప్పి అవుతుందని మమతకు తెలుసు. అందుకే, కలసికట్టుగా పోటీ చేసినా... రాష్ట్రంలో నిరుడు కాంగ్రెస్‌ నెగ్గిన 2 లోక్‌సభా స్థానాలనే ఆ పార్టీకి కేటాయిస్తామన్నది తృణమూల్‌ ప్రతిపాదన. దూకుడు ప్రదర్శిస్తున్న స్థానిక హస్తం నేతలు అందుకు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధురి నిత్యం మమతపై చేస్తున్న విమర్శలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. కాంగ్రెస్‌ పెద్దలు నష్టనివారణకు ప్రయత్నిస్తున్నా రాజీ లేదని దీదీ కొట్టిపారే శారు. కూటమిలో కొనసాగుతామంటూనే, ఎన్నికలయ్యాక కాంగ్రెస్‌ బలాన్ని బట్టి మిగతావి మాట్లా డదామని ఆమె చెబుతున్న మాటలు కంటితుడుపుకే తప్ప, బీజేపీపై కలసికట్టు పోరుకు పనికిరావు. 

మరోపక్క ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలక పాత్రధారి, జేడీ (యూ) అధినేత, బిహార్‌ సీఎం అయిన నితీశ్‌ కుమార్‌ వ్యవహారశైలి సైతం అనుమానాస్పదంగానే ఉంది. కూటమిలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. మోదీతో రామ్‌ రామ్‌ చెప్పి, ప్రతిపక్ష కూటమిలో చేరిన ఆయన తీరా ఇప్పుడు మళ్ళీ అధికార ఎన్డీఏ కూటమికే తిరిగి వచ్చేస్తారని ఊహాగానం. బిహార్‌లో ఉమ్మడి పాలన సాగిస్తున్న ఆర్జేడీ – జేడీయూల మధ్య కొన్నాళ్ళుగా సఖ్యత లేదు. ప్లేటు ఫిరాయించడంలో పేరొందిన నితీశ్‌ గతంలో బీజేపీకి కటీఫ్‌ చెప్పి, ఆర్జేడీతో కలసి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ, ఇటీవల తననే గద్దె దింపాలని చూసిన ఆర్జేడీ మీద గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీని పక్కకు నెట్టి, మళ్ళీ కమలనాథులతో నితీశ్‌ చేతులు కలిపే సూచనలున్నట్టు పుకారు. బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ నేతలు ఎవరికి వారు గురువారం కీలక భేటీలు జరపడం, ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తీరు చూస్తుంటే... ఆ రెండు పార్టీల ప్రేమకథ ముగిసినట్టే ఉంది. మరి, రాజకీయ చాణక్యుడు నితీశ్‌ రానున్న రోజుల్లో ఏం చేస్తారో చూడాలి. 

విచిత్రమేమిటంటే, మాటలే తప్ప చేతల్లో కూటమి అడుగు ముందుకు పడట్లేదు. సెప్టెంబర్‌లో అనుకున్న సీట్ల సర్దుబాటు వ్యవహారం డిసెంబర్‌కి వాయిదా పడి, జనవరి ముగిసిపోతున్నా అతీగతీ లేకుండా పడివుంది. అన్ని పార్టీలూ కలసి సమష్టి ప్రతిపక్ష ర్యాలీ భోపాల్‌లో చేయాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. నెలలు గడుస్తున్నా ఉమ్మడి మేనిఫెస్టో ఊసే లేదు. లౌకికవాద, రాజ్యాంగబద్ధ పాలన కోసం పోరాటం అని చెబుతున్నా... బీజేపీ వ్యతిరేకత, మోడీని గద్దె దింపడమనే లక్ష్యం మినహా తగిన సమష్టి సైద్ధాంతిక భూమికను సిద్ధం చేసుకోవడంలో ప్రతిపక్ష కూటమి విఫలమైంది. వివిధ రాష్ట్రాల్లో తమ బలాబలాలు తెలుసు గనక, పార్టీలు తమలో తాము పోరాడే కన్నా బీజేపీపై బాణం ఎక్కుపెడితే ప్రయోజనం. ఒకటి రెండు సీట్లకై పంపిణీలో కలహించుకొనే కన్నా పెద్ద లక్ష్యం కోసం విశాల హృదయంతో త్యాగాలకు సిద్ధపడితేనే లక్ష్యం చేరువవుతుంది. 

బెంగాల్‌లో తృణమూల్, పంజాబ్, ఢిల్లీల్లో ఆప్‌ లేకుండా కూటమికి ప్రాసంగికత ఏముంది? వాస్తవాల్ని గుర్తించి కాంగ్రెస్‌ తన వైఖరి మార్చుకోవాలి. పెద్దమనిషిగా కాక, అందరికీ పెద్దన్నగా వ్యవహరించాలనుకోవడంతోనే అసలు ఇబ్బంది. అలాగే, ‘యాత్ర’లతో రాహుల్‌ ఇమేజ్‌ పెరగ వచ్చేమో కానీ, ప్రతిపక్ష కూటమికి జరిగే ప్రయోజనమేమిటో తక్షణం చెప్పలేం. మణిపుర్‌ నుంచి ముంబయ్‌ దాకా 100 లోక్‌సభా స్థానాల మీదుగా సాగి, మార్చి 20న యాత్ర ముగియనుంది. అన్ని పార్టీలనూ ఒక తాటిపై నడిపి, సమన్వయం సాధించాల్సిన ఎన్నికల వేళ రాహుల్‌ దూరంగా యాత్రలో ఉంటే ఎలా? కనీసం అన్ని పార్టీలతో కలిసైనా యాత్ర చేయాల్సింది. ప్రభుత్వానికి వ్యతి రేకంగా ప్రతిపక్షాల్ని కూడగట్టడంలో 1977లో జేపీ, 1989లో వీపీ సింగ్, ఆ తరువాత యూపీఏ కాలంలో అందరి సమన్వయానికి సోనియా లాంటి వారు కృషి చేశారు. ప్రస్తుతం యాత్రతో రాహుల్, పార్టీ పునరుజ్జీవనంతో ఖర్గే బిజీ. మరి, కూటమి మెడలో ఐక్యత గంట కట్టేదెవరు?

మొత్తానికి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ రోడ్‌షోలు, ప్రచారగీతాలతో సింహనాదం చేస్తుంటే, ప్రతిపక్షాలు వేటికవి స్వలాభం చూసుకుంటూ విభేదాల బాట పట్టడం విడ్డూరం. సమావేశాలతో హంగామా రేపుతూ మొదలైన ప్రతిపక్ష కూటమి తీరా ఆట ఆడకుండానే ‘వాక్‌ ఓవర్‌’తో మోదీకి విజయం కట్టబెడుతోందని అనిపిస్తోంది. 28 కత్తులు ఒకే ఒరలో ఇమడడం కష్టమే. కానీ, అన్ని పార్టీ లకూ ఒకే లక్ష్యం ఉంటే, అసాధ్యం కాకపోవచ్చు. నిష్క్రియాపరత్వంతో, సొంత లాభం కోసం సాటి పార్టీల కాళ్ళు నరికే పనిలో ఉంటే లాభం లేదు. ఢిల్లీలో పాగా వేయాలంటే, సమయం మించిపోక ముందే కళ్ళు తెరవాలి. కూటమిది ఆరంభ శూరత్వం కాదని నిరూపించాలి. కలహాలు మాని కార్యా చరణకు దిగాలి. లేదంటే తర్వాతేం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement