ఆరు నెలల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అనతికాలంలోనే నాలుగు రోడ్ల కూడలిలో దిక్కుతోచని పరిస్థితిలో పడినట్టు కనిపిస్తోంది. జార్ఖండ్, జమ్ము – కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుబాటలో పయనించినా, హర్యానా, మహారాష్ట్రల్లో ఎదురైన దిగ్భ్రాంతికరమైన పరాజయాలు ఇప్పుడు కూటమి భాగస్వామ్యపక్షాల మధ్య విభేదాల కుంపటిని రాజేస్తున్నాయి.
హర్యానా ఎన్నికల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేజేతులా కాంగ్రెస్ ఓటమి కొనితెచ్చుకుంటే, మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) సోదిలో లేకుండా పోవడమూ స్వయంకృతమేనన్న భావన అసమ్మతిని పెంచింది. ఖర్గే సారథ్యంలోని ‘ఇండియా’ కూటమిలో ప్రధానపాత్ర కాంగ్రెస్‌దే గనక మహారాష్ట్రలో దెబ్బతో అనూహ్యంగా నాయకత్వ మార్పు అంశం తెర మీదకొచ్చింది. సారథ్యానికి సిద్ధమంటూ మమత ముందుకు రావడంతో కథ మలుపు తిరిగింది.
కూటమి ఆశించిన ఫలితాలు రావడం లేదన్న అసంతృప్తి పెరుగుతున్న పరిస్థితుల్లో అసలీ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించినదే మమతా బెనర్జీ గనక ఇప్పుడీ కూటమికి ఆమే సారథ్యం వహించాలనీ, అందుకామె సిద్ధంగా ఉన్నారనీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ ముందుగా గళం విప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే దీదీ ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, ‘కూటమిని వారు నడిపించ లేకపోతే, నేనే నడిపిస్తాను’ అని కుండబద్దలు కొట్టేశారు.
బెంగాల్‌ను వీడకుండా,అక్కడ నుంచే కూటమి సాఫీగా నడిచేలా చేస్తాననీ వ్యాఖ్యానించారు. దానికి కొనసాగింపుగా జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అగ్రనేత శరద్ పవార్ సైతం జాతీయ నేతగా మమత సమర్థురాలనడంతో తేనెతుట్టె కదిలింది. కూటమిలోని లుకలుకలు, కాంగ్రెస్ పట్ల ఇతర భాగస్వామ్య పక్షాల అసంతృప్తి, అసమ్మతి స్వరాలు బయటపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), అలాగే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ సహా పలువురు కోరస్ కలపడంతో విషయం వీథికెక్కింది. సీపీఐ సైతం సీట్ల సర్దు బాటులో వామపక్షాలకు కూటమి చోటివ్వడం లేదంటూ, కాంగ్రెస్ ఆత్మశోధన చేసుకోవాలనేశారు.
నిజానికి, ఈ ఏటి లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి కొంత ఊపు వచ్చినా, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలతో అంతా నీరుగారింది. ఆ మధ్య హర్యానాలో దెబ్బ తినడమే కాక, తాజా మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి తుడిచిపెట్టుకుపోవడం అశనిపాతమైంది. ఆశలు క్షీణించడంతో హస్తం పార్టీ సారథ్యంపై అసమ్మతి స్వరం పెరిగింది. ఆ మాటకొస్తే తృణ మూల్ చాన్నాళ్ళుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటోంది.
ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు సరికదా పార్లమెంట్ సమావేశాల్లోనూ అంటీముట్టని వైఖరి. ఇటీవల ఎస్పీది సైతం అదే ధోరణి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో హస్తం పార్టీతో కలవడానికి ఇష్టపడకపోగా, పార్లమెంట్‌లో రాహుల్ ముందుండి నడుపుతున్న అదానీ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లోనూ తృణమూల్ లానే పాలు పంచు కోవట్లేదు.
ఇది చాలదన్నట్టు రానున్న ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ఆప్ ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు విడతల వారీగా విడుదల చేసేస్తూ, చర్చలకు తావు లేకుండా చేసేసింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలనీ, ప్రతిపక్ష ఐక్యతకు చర్యలు ఆలోచించాలనీ శివ సేన (ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) పేర్కొన్నదంటే వ్యవహారం ఎందాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలోని కాంగ్రెస్ శైలిపై అసంతృప్తి బాహాటమవుతున్న వేళ... ప్రతిపక్ష కూటమి భవిష్యత్ నేత ఎవరు, భవిష్యత్ దిశ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమిని దీదీ నడిపితే అభ్యంతరం లేదంటూనే, ఈ బీజేపీ వ్యతిరేక కూటమిలో పలువురు సీని యర్ నేతలు ఉన్నందున కూర్చొని చర్చించి, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇప్పటికే సన్నాయి నొక్కులు నొక్కారు.
అసలు బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ కలసి ‘ఇండియా’ కూటమిగా జట్టు కట్టినా, వాటికి సరైన సైద్ధాంతిక భూమికే కాదు... నేటికీ సమ న్వయ సంఘం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, భవిష్యత్ మార్గదర్శనం లాంటివేమీ లేవు. అందు కోసం గడచిన ఏణ్ణర్ధం పైగా ప్రత్యేకించి కసరత్తులు చేసిన దాఖలాలూ లేవు.
నిన్నగాక మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ గొడుగు కింద అందరూ కలసి పోటీ చేసినా... బాబ్రీ మసీదు కూల్చివేతను శివసేన (యుబీటీ) నేత ఒకరు సమర్థించడంతో యూపీలో ముస్లిమ్ ఓట్లపై ఆధార పడ్డ ఎస్పీ తాజాగా ఎంవీఏ నుంచి బయటకొచ్చేసింది. దీన్నిబట్టి ఎన్నికల కోసం కలవడమే తప్ప ‘ఇండియా’ పక్షాల మధ్య సహాయ సహకారాలే కాదు సమన్వయం కూడా లేదన్నది స్పష్టం.
కాంగ్రెస్‌కు కానీ, కూటమికి కానీ సారథ్య బాధ్యతలు తీసుకోకున్నా చక్రం తిప్పడంలో ముందున్న రాహుల్ పరివారానికి ఇప్పుడిది కొత్త పరీక్ష. పార్లమెంట్‌లో సోనియా, రాహుల్, తాజాగా గెలిచొచ్చిన ప్రియాంక – ముగ్గురున్నా కూటమికి బలిమి చేకూరుతున్న దాఖలాలు లేవు.
పెద్దన్న పాత్రలో అత్యుత్సాహం చూపుతున్న హస్తం పార్టీ కార్యకర్తలకు కానీ, ఇతర పార్టీలకు కానీ స్ఫూర్తినివ్వడంలో పదే పదే విఫలమవుతోంది. ఇకనైనా సాటిపక్షాల మాటలకు అది చెవి ఒగ్గాలి. పరస్పర గౌరవంతో అందరినీ కలుపుకొనిపోవాలి. తాజా గందరగోళంతో త్వరలోనే ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమని బీజేపీ జోస్యం చెబుతోంది.
కాషాయపార్టీపై సమైక్యంగా పోరు సాగించడమే ధ్యేయంగా పురుడు పోసుకున్న ప్రతిపక్ష కూటమి ఇలా అనైక్యతా రాగం ఆలపిస్తూ పోతే చివరకు అదే జరుగుతుంది. నాయకత్వచర్చ చివరకు కూటమి ఎన్నికల అజెండాపై కారుమబ్బుల్ని కమ్మేస్తేనే కష్టం. అధికారపక్ష అంచనా తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రతిపక్షాలదే!
అసమ్మతి... అనైక్యత...
Published Wed, Dec 11 2024 12:38 AM | Last Updated on Wed, Dec 11 2024 12:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment