ఎలా చేరతారో చూస్తాం! | Congress party leaders are stoping other party leaders to there party | Sakshi
Sakshi News home page

ఎలా చేరతారో చూస్తాం!

Published Sun, Feb 4 2018 1:11 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress party leaders are stoping other party leaders to there party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆధిపత్య ధోరణే పెత్తనం చలాయిస్తోందా..? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వేరే పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి చేరాలనుకుంటున్న సీనియర్‌ నాయకులకు లైన్‌క్లియర్‌ కాకపోవడానికి ఇదే కారణమా..? వీటికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తే తమకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో.. తమ ప్రాభవం ఎక్కడ తగ్గిపోతుందోనన్న నేతల వైఖరి అసలుకే ఎసరు పెట్టేలా ఉందని టీపీసీసీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఖమ్మంలో నామా, పాలమూరులో నాగం, యెన్నం, ఇందూరులో మండవ, అన్నపూర్ణమ్మ, సిద్దిపేటలో ఒంటేరు, యాదాద్రిలో జిట్టా వంటి నేతలు చాలాకాలంగా కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నిస్తున్నా.. వారి చేరికలకు హస్తం నేతలే మోకాలడ్డుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఖమ్మం, పాలమూరులో ఇదీ పరిస్థితి..
ఖమ్మం జిల్లాకు చెందిన నామా నాగేశ్వరరావు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ లోక్‌సభ సభ్యుడు. మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరతానంటూ ఆయన కబురు పంపారు. పార్టీ నాయకత్వం కూడా అందుకు సుముఖంగానే ఉంది. కానీ కాంగ్రెస్‌కే చెందిన రేణుకా చౌదరి నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. లోక్‌సభకు తాను అభ్యర్థిగా ఉండగా.. పోటీగా మరో అభ్యర్థిని ఖమ్మం లోక్‌సభ పరిధిలో తేవడానికి ఆమె అడ్డు చెబుతున్నారు. అదే జిల్లాకు చెందిన పోట్ల నాగేశ్వర్‌రావును జిల్లా నేతలకు తెలియకుండానే చేర్చుకున్నారని, దీనివల్ల స్థానికంగా ఇబ్బందులు వస్తున్నాయని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు నామా నాగేశ్వర్‌రావు చేరితే జిల్లాలో చాలాకాలంగా ఉన్న సీనియర్ల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నాగం జనార్దన్‌రెడ్డి రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న నేత. టీడీపీని వీడి బీజేపీలో చేరినా అక్కడ పెద్దగా ఉపయోగం లేదని భావించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండాలని తన అనుచరులకు కూడా నచ్చజెప్పారు. పార్టీ నాయ కత్వం కూడా సూత్రప్రాయం గా ఆమోదం తెలిపింది. కానీ ఆయన్ను చేర్చుకుంటే పార్టీ వీడతానని మాజీ మంత్రి డీకే ఆరుణ హెచ్చరించారు. ఇదే విషయంపై నాగర్‌కర్నూలు నుంచి ఐదారు సార్లు పోటీచేసి ఓడిపోయిన ప్రస్తుత ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి సైతం ఆందోళనగా ఉన్నారు. అయితే దామోదర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా మరో నాలుగేళ్ల పదవీకాలం ఉందని, నాగం చేరికను వ్యతిరేకించాల్సిన అవసరంలేదని టీపీసీసీ వాదిస్తోంది. దామోదర్‌రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య, మరో ఐదారు నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలు నాగం జనార్దన్‌రెడ్డిని చేర్చుకోవద్దంటూ ఇప్పటికే రాహుల్‌గాంధీని కలిసి విజ్ఞప్తి చేశారు.

మిగతా జిల్లాల్లో ఇలా..
నిజామాబాద్‌లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూ ర్ణమ్మ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. పార్టీ నాయకత్వం కూడా సరేనంది. కానీ మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి మహేష్‌కుమార్‌ల నుంచి వారిని చేర్చుకోవద్దంటూ ఒత్తిళ్లు వచ్చాయి. వీరి చేరికకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి వంటి వారు అంగీకరించాల్సి ఉంది. నల్లగొండ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బాలు నాయక్‌ కూడా టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. దేవరకొండ టికెట్‌ను ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌కు ఇచ్చే అవకాశాలు ఉండటంతో ఆయన కాంగ్రెస్‌ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే బాలునాయక్‌కు రాజకీయ గురువైన సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ రాలేదని తెలుస్తోంది. పాత కరీంనగర్‌ జిల్లాకు చెందిన టీడీపీ నేత పెద్దిరెడ్డికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఆ జిల్లాకు చెందిన మాజీమంత్రులు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి వంటివారు ఆమోదం తెలియజేయాల్సి ఉంది. సిద్దిపేటలో ఒంటేరు ప్రతాపరెడ్డి, మహబూబ్‌నగర్‌లో యెన్నం శ్రీనివాసరెడ్డి, యాదాద్రి భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి.. ఇలా వీరే కాదు కాంగ్రెస్‌లో చేరేందుకు ఓ మోస్తరు నాయకుడు సిద్ధమయితే చాలు ఇవే బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయని, రానున్న ఎన్నికలలో బలమైన టీంతో తలపడకపోతే మళ్లీ కష్టాలు తప్పవన్న ఆవేదన కేడర్‌లో వినిపిస్తోంది. పార్టీలో చేరికలకు ఎదురవుతున్న అడ్డంకులు ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా చిరాకు తెప్పిస్తున్నట్టు సమాచారం.

చేరికలను ఆపొద్దంటున్న రాహుల్‌
జిల్లాల్లో, స్థానిక పార్టీ నేతల నుంచి అభ్యం తరాలు వ్యక్తం కావడం కొత్తేమీ కాదని, ఈ పేరుతో చేరికలను ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్ద ని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ స్పష్టంగా ఆదేశించినట్టుగా పీసీసీ వర్గాలు వెల్లడించా యి. కాంగ్రెస్‌ కొందరు వ్యక్తులకు పరిమితం కాదని, అన్ని వర్గాలను మమేకం చేసుకుం టూ సమíష్టిగా పోరాటానికి సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్పష్టంగా సూచించినట్టుగా తెలుస్తోంది.

చేరే వారికి టికెట్ల గ్యారంటీ ఇవ్వొద్దని, అంతమాత్రాన పార్టీలో ఇప్పుడు ఆశిస్తున్నవారికే టికెట్లు వస్తాయన్న సంకేతాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని రాహుల్‌ చెప్పినట్టుగా సమాచారం. ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల నుంచి సమాచారం తీసుకుని, సర్వే చేయించి, గెలిచే వారికే టికెట్లు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. భారీ అవినీతి కేసులు, రేప్‌ కేసులు, హత్య కేసులు వంటి పెద్ద నేరాభియోగాలు ఉన్నవారిని మినహా పార్టీలో చేరికలను ఆపొద్దని పార్టీ అధినేత ఆదేశించినట్టుగా టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఆచరణలో మాత్రం ఈ ఆదేశాలు అమలు అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement