చేతులు కలపడమే తరువాయి.? Will Chandrababu Join Hands with Rahul Ahead of 2024 Election? - Political News
Sakshi News home page

Chandrababu : చేతులు కలపడమే తరువాయి.?

Published Sat, Sep 16 2023 11:59 AM | Last Updated on Sat, Sep 16 2023 3:50 PM

Chandrababu is moving towards Congress and might join in INDIA alliance - Sakshi

చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రయాణంలో స్పష్టత వస్తున్నట్టు సంకేతాలందుతున్నాయి. ఇక తన ప్రయాణం కాంగ్రెస్‌తోనే కొనసాగించాలని బాబు నిర్ణయించుకున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీతో ఇప్పటికే పూర్తిగా తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు.. ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్‌షాను టార్గెట్‌ చేసుకుని 2019లో చేసిన యాంటీ బీజేపీ క్యాంపెయిన్‌ ఇంకా ప్రజల మదిలో చెదిరిపోలేదు. గత నాలుగున్నరేళ్లుగా పైకి బీజేపీతో దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా.. లోలోన మాత్రం కాంగ్రెస్‌తో నడుపుతున్న రాయబారాలు బహిర్గతమవుతున్నాయి.

సీన్‌ 1 : 2019 ఎన్నికలు - జాతీయ రాజకీయాలు
ఎన్నికల్లో యాంటీ బీజేపీ స్టాండ్‌ తీసుకున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఉదయం తూర్పున బెంగాల్‌లో మమతో ఒక భేటీ జరిగితే, మధ్యాహ్నానికల్లా ముంబైలో శరద్‌ పవార్‌తో మరో భేటీ నిర్వహించారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిస్తే.. అంతే వేగంగా కేరళలో కమ్యూనిస్టులతో భేటీ అయ్యారు. చంద్రబాబు స్పీడ్‌ చూసి నేషనల్‌ మీడియా కూడా అవాక్కయిన సందర్భాలు 2019లో ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్‌ నాయకులయితే సరే సరి. రాహుల్‌తో 10 జన్‌పథ్‌లో నిర్వహించిన మీటింగ్‌కు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అంతెందుకు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారంలో సభ మీద రాహుల్‌తో చట్టాపట్టాల్‌ వేసుకున్నవి కూడా ఇంకా ఇప్పుడే చూసినట్టు ఉంది.


(కర్ణాటక రాజకీయాల సందర్భంగా చంద్రబాబు తిప్పిన యూపీఏ చక్రం)

సీన్‌ 2 : 2019 ఫలితాలు - తదనంతర పరిణామాలు
ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు వెల్లడయింది. సైకిల్‌ కొట్టుకుపోయింది. చంద్రబాబులో నిర్వేదం ఏర్పడింది. ఇంతా చేసినా.. ప్రజలెందుకు తరిమికొట్టారన్న ఆత్మవిమర్శ మాత్రం చేసుకోలేకపోయారు. తనను ఓడించి ప్రజలు ద్రోహం చేశారంటూ నిందించడం మొదలెట్టారు. అదే సెల్ఫ్‌ డబ్బా.. ఈ రోడ్డు నేనేశా..  ఈ భవనం నేను కట్టా.. ఈ కాలువ నేను తవ్వించా.. ఎంత సేపు నేను అనే సోత్కర్ష నుంచి బయటకు రాలేకపోయారు. చివరికి భ్రమలనే నిజమనే స్థాయికి చేరిపోయారు. ఈ సమయంలో ఎల్లో మీడియా వల్ల ఆయనకు నిజంగానే అన్యాయం జరిగింది. ఉదాహారణకు హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేసింది కాంగ్రెస్‌ హయాంలో అని తెలిసినా.. చంద్రబాబే .. చంద్రబాబే అని ప్రచారం చేసి అదే నిజమని ప్రజల్ని నమ్మించే స్థాయికి చేరారు. అంతెందుకు హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టును దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మిస్తే.. ఆ క్రెడిట్‌ చంద్రబాబుకు ఇచ్చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డును నిర్మిస్తే.. పెద్దలా గద్దలా అంటూ ఈనాడులో విమర్శలు చేసి... ఇప్పుడు జన జీవన నాడిగా మారిన తర్వాత చంద్రబాబుకు క్రెడిట్‌ ఇస్తున్నారు. ఇలా మారని భ్రమలతో ఆయన వ్యక్తిత్వ పరంగా మరింత దిగజారారు.


(జపాన్‌ సహకారంతో టెక్నాలజీ పార్కును శంకుస్థాపన చేస్తున్న నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఆ సందర్భంగా మీడియాలో వచ్చిన వార్తలు)


(శంషాబాద్‌ ఎయిర్‌పోర్టును, PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి పూర్తి చేసిన డా.వైఎస్సార్‌)

సీన్‌ 3 : పార్టీ నిర్మాణంలో ఎన్నో లోపాలు
తానొక విజనరీ నాయకుడినని,  విజన్‌ 2020 తర్వాత విజన్‌ 2047 తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తెలుగుదేశం పార్టీని ఒక నిష్క్రియాత్మకమైన వ్యవస్థగా మార్చారు. ఏ పార్టీలోనయినా పిరమిడ్‌ లెవల్‌ ఉంటుంది. అంటే ఒక నాయకుడి తర్వాత అంతటి బాధ్యతలు నిర్వహించగలిగే సత్తా ఉన్నా ఇద్దరో, ముగ్గురో ఉంటారు. మేనేజ్‌మెంట్‌ పాఠాలను వల్లె వేసే చంద్రబాబుకు ఈ విషయాలన్నీ తెలియవని కాదు. తెలుగుదేశం పార్టీలో తీసుకునే ఏ నిర్ణయమైనా చంద్రబాబుకు తప్ప మూడో కంటికి తెలియదు. తన వారసుడిగా లోకేష్‌ను ప్రొజెక్ట్‌ చేయాలని చూసినా.. ఎమ్మెల్యేగా గెలవలేని ప్రతిభాసామర్థ్యాలు లోకేష్‌వి. ఇక పవన్‌కళ్యాణ్‌కు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా..  ఏ ఎజెండాలో సక్సెస్‌ అయిన దాఖలాలు లేవు.


(తన పొలిటికల్‌ పార్ట్‌నర్‌ పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు )

సీన్‌ 4 : కిం కర్తవ్యం.. కాంగ్రెసే శరణ్యం
ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు ఉన్న ఏకైక మార్గం కాంగ్రెస్‌. అందుకే తన శిష్యుడు రేవంత్‌ రెడ్డిని నమ్ముకున్నారు. చంద్రబాబును కాపాడేందుకు ఇప్పటికే రేవంత్‌రెడ్డి రాయబారం నడుపుతున్నారు. బాబును కాపాడేందుకు ఏం చేయాలన్న దానిపై రేవంత్‌రెడ్డి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ‘ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తాను అరెస్ట్‌ అవుతానంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబుతో డీకే శివకుమార్‌తో రేవంత్‌ ఫోన్‌ చేయించినట్టు కథనంలో పేర్కొంది. బాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదించిన న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రాకు డీకేతో మంచి సంబంధాలున్నాయి. డీకేకు ఆయన అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. డీకే సిఫారసుతోనే బాబు కేసులో లూథ్రా రంగంలోకి దిగారు. అయితే కేసు పక్కాగా ఉండడం, ఆధారాలు బలంగా ఉండడంతో లూథ్రా కాస్తా నిర్వేదంలో పడిపోయారు.


(చంద్రబాబును రక్షించేందుకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రేవంత్‌ మంతనాలు)

సీన్‌ 5 : ఇండియా కూటమి వైపు సైకిల్‌
తాజా పరిణామాలతో రేపో, మాపో ఇండియా కూటమి దిశగా సైకిల్‌ వెళ్తోందని తేలిపోయింది. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు కూడా పవన్‌తో పొత్తు ప్రకటించేశారు. బీజేపీ ఈ పరిణామాలపై గుర్రుగా ఉంది. ఇక మిగిలింది కాంగ్రెస్‌. రాహుల్‌తో తనకు చక్కటి సమన్వయం, అంతకు మించిన పరిచయం ఉన్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే.. కాంగ్రెస్‌ నుంచి ఓ స్టెప్పు ముందుకు పడవచ్చు. జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో రాహుల్‌గాంధీ కలవొచ్చు. లేదా తన ప్రతినిధిగా డీకే శివకుమార్‌ గానీ, కపిల్‌సిబల్‌ను కానీ పంపించవచ్చు. ఇటు ఢిల్లీలో కూడా లోకేష్‌ ఓ చీకటి వేళ ఒకరిద్దరు కాంగ్రెస్‌ అగ్రనాయకులతో భేటీ కావొచ్చు. ఇప్పటికే రఘురామకృష్ణరాజుతో కలిసి ఈ ప్రయత్నాల్లో ఉన్నారు.


(ఢిల్లీలో రఘురామకృష్ణరాజుతో కలిసి ఎడతెగని ప్రయత్నాలు చేస్తోన్న లోకేష్‌)

సీన్‌ 6 : కథ సశేషం.. మిగిలింది ఉత్కంఠభరితం
ఎన్నికలు వడివడిగా వస్తున్నాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ వైఎస్సార్‌సిపి మొదటి నుంచి చెబుతున్న విషయం. ఇప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని పంచుకున్నారు. ఈ రాజకీయ ముఖచిత్రం త్వరలోనే సుస్పష్టంగా ఆవిష్కృతం కానుంది. దానికి ప్రజలే సాక్షి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement