కాంగ్రెస్‌కు పరీక్షా కాలం | Test period for Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు పరీక్షా కాలం

Published Tue, Jan 2 2024 10:02 AM | Last Updated on Tue, Jan 2 2024 11:19 AM

Test period for Congress - Sakshi

2024 ను ఎన్నికల సంవత్సరంగానే అభివర్ణించాలి. వరుస గెలుపులతో బిజెపి చాలా బలంగా ఉంది. అన్నీ కలిసొస్తే హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు వున్నాయి. నరేంద్రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాగల అవకాశాలను కొట్టి పారేయలేం. మోదీని దించడమే ధ్యేయంగా ప్రతిపక్ష పార్టీలన్నీ 'ఇండియా కూటమి'గా ఏర్పడ్డాయి.

కానీ,ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. ఇక ముందు ముందు పనిచేస్తారేమో చూడాలి. విపక్ష పార్టీలలో ప్రధాన పక్షంగా వున్న కాంగ్రెస్ ఇంకా రాటుదేలాల్సిన స్థితిలోనే వుంది.2024 లో అధికారంలోకి రాకపోతే, కాంగ్రెస్ మరింతగాకునారిల్లి పోవచ్చు. ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్కే ఇది పరీక్షాకాలం.

ప్రస్తుతం దేశంలో హిమాచల్ ప్రదేశ్,కర్ణాటక, తెలంగాణ తప్ప, కాంగ్రెస్ ఎక్కడా అధికారంలో లేదు.బిజెపి చాలా రాష్ట్రాలలో అధికారంలో వుంది. మిగిలిన రాష్ట్రాలు వివిధ ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో వున్నాయి. అధికారంలో వున్న ప్రాంతీయ పార్టీలు చాలా వరకూ బలంగానే వున్నాయి.అధికారంలో లేకపోయినా, కొన్ని ప్రాంతీయ పార్టీలు బలంగానే వున్నాయి.

అధికారంలోకి వచ్చినా రాకపోయినా బలపడాల్సిన చారిత్రక అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది.ప్రస్తుతం,జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉనికిలో ఉన్నప్పటికీ, ఈ బలం సరిపోదు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర రాహుల్ ఇమేజ్ ను పెంచడానికే ఎక్కువ భాగం ఉపయోగపడింది తప్ప, పార్టీ ప్రతిష్ఠను కాపాడడానికి, గెలుపును అందించడానికి పూర్తిస్థాయిలో ఉపయోగపడలేదని చెప్పవచ్చు.

కర్ణాటక,తెలంగాణలో అధికారం చేపట్టినప్పటికీ, అది కేవలం జోడో యాత్ర ప్రభావంతో జరిగింది కాదు. కర్ణాటకలో బిజెపి,తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీపై వచ్చిన ప్రజావ్యతిరేకత కాంగ్రెస్ గెలుపుకు కలిసొచ్చింది.ప్రస్తుతం దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా,ఉత్తరాదిలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోయింది ( హిమాచల్ ప్రదేశ్ మినహా).

తాజాగా జరిగిన మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం కావడమే కాక,రాజస్థాన్, ఛత్తీస్గడ్ లో వున్న అధికారాన్ని కూడా కోల్పోయింది. మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి.కొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది, కొన్ని రాష్ట్రాల్లో సంపాయించింది.

బిజెపికి వ్యతిరేకంగా కూటమి కట్టడం వరకూ కొంత విజయం సాధించింది.ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయం ఇంకా గందరగోళంగానే వుంది. ముందు గెలుపు - ఆ తర్వాతే ప్రధాని అభ్యర్థి ఎంపిక అనడం కొంత బాగానే వుంది.కానీ, కాంగ్రెస్ లో అగ్రనాయకుడుగా వున్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి
పదార్ధం ( మెటీరియల్ ) కాదా! అనే సందేహానికి అవకాశం ఇచ్చినట్లయింది.

జనవరి 14నుంచి రాహుల్ గాంధీ మళ్ళీ యాత్ర మొదలు పెడుతున్నారు.జోడో యాత్ర బదులు  'న్యాయ యాత్ర' అని మార్చారు. కేవలం పాదయాత్ర కాకుండా,
రకరకాల రూపాలలో ఈ యాత్ర ఉంటుందని ప్రకటించారు. 1885 లో కాంగ్రెస్ ఏర్పడింది. ఆ తర్వాత అది రకరకాల రూపాలు తీసుకున్నా,జాతీయ కాంగ్రెస్ పార్టీగానే కొనసాగుతోంది.

138 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 139 లో అడుగుపెట్టింది.1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలలో 1984 లో అత్యధికంగా 414 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు అత్యల్పంగా 48 స్థానాలతో బండిని వెళ్ళతీస్తోంది. ఈ 40 ఏళ్లలో కాంగ్రెస్ చెందిన పతనానికి ఇది పెద్ద ఉదాహరణ. 1984లో అంత మెజారిటీ రావడానికి ఇందిరాగాంధీ హత్య నుంచి ఉత్పన్నమైన భావోద్వేగాలు ప్రధాన కారణం.

మిగిలిన పార్టీల సహకారంతో పివి నరసింహారావు, మన్ మోహన్ సింగ్ కాలంలో కేంద్రంలో అధికారంలో వుంది. ముఖ్యంగా,మన్ మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా 10ఏళ్ళ పాలనలో నిలబడింది.1991 నుంచి 1996 వరకూ సాగిన పీవీ నరసింహారావు ఐదేళ్ల పాలన చారిత్రత్మకం. దేశాన్ని ఆర్ధికంగా మలుపుతిప్పిన పాలన అది.మన్ మోహన్ సింగ్ పదేళ్లు పాలనలో ఉన్నప్పటికీ, చెప్పుకో తగిన ప్రగతి లేకపోగా, అవినీతి రాజ్యమేలింది.

ముఖ్యంగా రెండో తఫా ఇదేళ్ల పాలన అత్యంత బలహీనం,అవినీతిమయం. విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ను గద్దె దింపి, బిజెపికి అధికారాన్ని కట్టబెట్టారు.ప్రధానిగా నరేంద్రమోదీ తిరుగులేని నాయకుడుగా అవతరించాడు.ఈ పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడమే కాక, పార్టీ నుంచి బలమైన నాయకత్వాన్ని కూడా అందించలేకపోయింది. పార్టీ అగ్రనేతల మధ్య అంతర్గత కలహాలు కూడా పెరిగాయి.

పార్టీని బాహాటంగానే విమర్శించే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ ప్రజలను సమ్మోహనపరచడంలో, పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారు. పార్టీ ఓడిపోయిన ప్రతిసారీ రాహుల్ గాంధీ కాడి పడేయ్యడం చాలా చెడ్డపేరు మూటగట్టింది.ఇదిగో! జోడో యాత్ర తర్వాత రాహుల్ గ్రాఫ్ కొంత పెరిగింది.ఇంకా పెరగాల్సిన అవసరం వుంది.

ఇప్పటి వరకూ వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడంలో కాంగ్రెస్ ఘోరమైన తప్పటడుగులు వేసింది.పశ్చిమ బెంగాల్ మొదలుకొని,తాజాగా మధ్యప్రదేశ్ వరకూ అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. రేపు జరుగబోయే సాధారణ ఎన్నికల్లో కూడా ఇవే తప్పులు చేస్తే,కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సోదిలో లేకుండా పోయింది.జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ బలంగా అవతరించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు వున్నారు.అతను ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని వున్నారు. మొన్నటి దాకా ఒరిస్సా ఐన్ ఛార్జిగా కూడా పనిచేశారు.

పగ్గాలు మార్చి వైఎస్ షర్మిలకు ఇస్తారనే ప్రచారం మాత్రం జరుగుతోంది.పగ్గాలు మారినంత మాత్రాన పార్టీ పెద్దగా బలపడే అవకాశాలు ఇప్పుడప్పుడే లేవు.ముందుగా ఇండియా కూటమి ఐక్యతలో బలం పెరగాలి.

క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలి.రాహుల్ గాంధీ, ప్రియాంక నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరగాలి. ఇవ్వన్నీ జరిగితేనే కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉంటుంది.లేకపోతే ఉనికికే ప్రమాదమవుతుంది. మొత్తంగా,2024 కాంగ్రెస్ కు పెద్ద పరీక్షా సమయం.

- మాశర్మ, సీనియర్‌ జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement