కూటమి నాయకత్వానికి సంబంధించి జోరుగా చర్చలు
కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి వరుస అపజయాలు
ప్రతిపక్ష కూటమికి నాయకత్వ బాధ్యతలు వహించాలనుకుంటున్న మమత
ప్రముఖ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్‌లు మద్దతు
కూలమి ఓటమికి రాహుల్ గాంధీ నాయకత్వ లోపమే కారణమంటూ ఆరోపణలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇండియా కూటమిలో చీలికలు మొదలయ్యాయి. అలాగే ఈ కూటమి నాయకత్వానికి సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇదే నేపధ్యంలో ఇండియా కూటమి సారధ్యంపై అటు కాంగ్రెస్, ఇటు టీఎంసీల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది.
‘ఇండియా’ సారధ్యం ఎవరికి?
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి వరుస అపజయాలు ఎదురవుతున్న నేపధ్యంలో ఇప్పుడు కూటమి సారధ్య బాధ్యతలు టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి అప్పగించాలనే వాదన వినిపిస్తోంది. దీనికితోడు ఆమె కూడా ప్రతిపక్ష కూటమికి నాయకత్వ బాధ్యతలు వహించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో దేశంలోని పలువురు మేధావులు, రాజకీయ పార్టీలు మమతా బెనర్జీవైపు మొగ్గుచూపడం ప్రారంభించారు. ఈ విషయంలో ప్రముఖ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్‌లు మమతకు తమ ఓటు వేశారు.
రాహుల్ గాంధీ నాయకత్వ లోపం
అటు హర్యానా, ఇటు మహారాష్ట్రలలో బీజేపీతో జరిగిన ప్రత్యక్ష పోరులో కూటమి ఓటమికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వ లోపమే కారణమంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇవి తృణమూల్ అధినేత మమతకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో అటు రాహుల్ గాంధీ, ఇటు మమతా బెనర్జీలలో ఎవరి బలాలు ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.
మమతకు పెరుగుతున్న మద్దతు
మమతా బెనర్జీకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయనే మాట వినిపిస్తోంది. టీఎంసీ నేతలు కూడా మమతనే కూటమికి తగిన సారధి అంటూ ప్రచారం సాగిస్తున్నారు. మమతా బెనర్జీ ఏడుసార్లు ఎంపీగా, నాలుగుసార్లు కేంద్రమంత్రిగా, మూడుసార్లు సీఎంగా రాజకీయాల్లో అపార అనుభవం సంపాదించారని టీఎంసీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. అందుకే ఆమెనే కూటమికి తగిన సారధి అంటూ స్పష్టం చేస్తున్నారు. సుపరిపాలనలో ఆమె రికార్డు అద్భుతంగా ఉందని, గత ఎన్నికల్లో బీజేపీని ఆమె చిత్తుగా ఓడించారని పలువురు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలువురు నేతలు కూడా కూటమి సారధిగా ఆమె ఉంటేనే అధికార పక్షానికి తగిన సమాధానం చెప్పగలమని అంటున్నారు. అంతేకాకుండా మమత నేతలనందరినీ తన వెంట తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగివున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఇండియా కూటమికి అధినేత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉండేందుకు మద్దతు పలికిన ప్రతిపక్ష నేతల జాబితాలో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ నేతలు అఖిలేష్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్ ఉన్నారు.
మమతా బెనర్జీ సత్తా ఇదే..
మమతా బెనర్జీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2011లో తొలిసారిగా ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. మూడు సార్లు సీఎంగా ఉన్నారు. ఆమె టీఎంసీ అధినేత్రిగానూ వ్యవహరిస్తున్నారు. 1998లో కాంగ్రెస్ నుంచి విడిపోయి టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. మమత పలుమార్లు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. రెండుసార్లు రైల్వే మంత్రిగా ఉన్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలకు కూడా సారధ్యం వహించారు. ఆమె 2011 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మమతా బెనర్జీ ఏడుసార్లు ఎంపీగా ఉన్నారు.
రాహుల్ గాంధీ అనుభవం
యూపీలోని రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ రాయ్‌బరేలీ, వయనాడ్ రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. అయితే ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గంగా రాయ్‌బరేలీని ఎంచుకున్నారు. ఆయన సోదరి ప్రియాంక వయనాడ్ ఎంపీగా ఇటీవలే ఎన్నికయ్యారు. రాహుల్ గాంధీ 2017 నుంచి 2019 వరకు కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన 2004లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అమేథీ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో కూడా అమేథీ నుంచి గెలుపొందారు. 2019లో రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిని చవిచూశారు. 2019లో ఆయన వయనాడ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన ఆయన అక్కడి ఎంపీగా కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ ఒక్కసారి కూడా కేంద్ర మంత్రి కాలేదు.
ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment