![Delhi: Congress Leader Mallikarjun Kharge Named INDIA Bloc Chief - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/14/Mallikarjuna%20Kharge%2C.jpg.webp?itok=gl6hA6LA)
న్యూఢిల్లీ/పట్ని/కోల్‌కతా/ముంబై: విపక్ష ‘ఇండియా’ కూటమి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. శనివారం జరిగిన కూటమి వర్చువల్ భేటీలో ఈ విషయమై భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. మొత్తం 28 పక్షాల్లో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, శివసేన (ఉద్ధవ్) మినహా మిగతా పార్టీల నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీలో పాల్గొన్నారు.
లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత, సీట్ల సర్దుబాటుతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కూటమి సారథిగా ఎవరుండాలన్నదీ చర్చకు వచ్చింది. ఖర్గే సారథ్యానికి నేతలంతా సమ్మతించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి చైర్‌పర్సన్‌గా ఆయన నియామకం దాదాపుగా ఖరారైనట్టేనని, అధికారిక ప్రకటనే తరువాయి అని చెబుతున్నారు. ఇక కూటమి కన్వినర్ పదవిని నితీశ్‌కు కట్టబెట్టాలన్న భావన వ్యక్తమైనట్టు తెలిసింది. తృణమూల్, సమాజ్‌వాదీలతో చర్చించాక దీనిపై తుది నిర్ణయానికి రావాలని నిర్ణయించారు.
కానీ నితీశ్ ఆ పదవిపై ఆసక్తిగా లేరని, కాంగ్రెస్ నేతకే ఆ బాధ్యత కూడా అప్పగించాలని సూచించారని తెలుస్తోంది. విపక్ష కూటమిలో అంతర్గత పోరుకు ఈ పరిణామాలు తాజా నిదర్శనమంటూ బీజేపీ ఎద్దేవా చేయగా, కన్వినర్‌తో సహా ఏ విషయంలోనూ కూటమిలో విభేదాల్లేవని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. భావి కార్యాచరణ ఖరారుకు త్వరలో సమావేశమై మరో దఫా చర్చించాలని కూటమి నేతలంతా నిర్ణయానికి వచ్చారు.
డీకే శుభాకాంక్షలు! : ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి రేసులో చైర్‌పర్సన్, కన్వినరే ముందుంటారని భావిస్తున్న నేపథ్యంలో ఆ పదవులు ఎవరికి దక్కుతాయన్న దానిపై భాగస్వామ్య పక్షాల్లో ఆసక్తి నెలకొంది. కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ గత భేటీలోనే ప్రతిపాదించడం తెలిసిందే. కాంగ్రెస్ నేతను చైర్‌పర్సన్ చేసేందుకు జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా సుముఖంగానే ఉన్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ ఝా తాజాగా తెలిపారు.
ఆ పదవికి ఖర్గే పేరు ప్రతిపాదించడంపై నితీశ్ అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో, చైర్‌పర్సన్‌గా ఖర్గే పేరుపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు వర్చువల్ భేటీ అనంతరం సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ అయితే ఏకంగా ఖర్గే నియామకం జరిగిపోయిందని ప్రకటించేశారు! ‘‘ఖర్గే కర్ణాటకకే కాదు, దేశానికే గర్వకారణం’’ అంటూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు! కన్వినర్‌గా నితీశ్ పేరు ప్రతిపాదనకు వచ్చిందని పవార్ ధ్రువీకరించారు.
కానీ, ‘‘కూటమికి కన్వినర్ అవసరమే లేదు. అన్ని పార్టీల అధ్యక్షులతో టీమ్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. నితీశ్‌దీ ఇదే అభిప్రాయం’’ అని ఆయన చెప్పుకొచ్చారు. తాజా భేటీలో కన్వినర్‌గా నితీశ్ పేరు ప్రతిపాదనకు రావడం నిజమేనని ఝా కూడా ధ్రువీకరించారు. కన్వినర్ విషయమై మమత, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌తో ఖర్గే చర్చిస్తున్నట్టు చెబుతున్నారు.
కాంగ్రెస్ పరిమితులు గుర్తెరగాలి: తృణమూల్
కూటమి ధర్మానికి కట్టుబడ్డామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్‌లో ముందుగా తన పరిమితులేమిటో తెలుసుకుంటే మంచిదని హితవు పలికింది. రాష్ట్రం వరకు ఎన్డీఏపై లోక్‌సభ ఎన్నికల పోరుకు తామే సారథ్యం వహిస్తామని పునరుద్ఘాటించింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు కేవలం 2 సీట్లే ఇస్తామని తృణమూల్ ఇప్పటికే పేర్కొనడం తెలిసిందే. కాదంటే మహా అయితే మరో 2 స్థానాల దాకా ఇచ్చే యోచనలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఉన్నట్టు చెబుతన్నారు. బెంగాల్లో 2001, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌తో తృణమూల్ పొత్తు పెట్టుకుంది.
వర్చువల్ కూటమి, వర్చువల్ భేటీలు: బీజేపీ
న్యూఢిల్లీ: ఇండియా కూటమిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా బలం లేని వర్చువల్ కూటమి వర్చువల్ సమావేశాల్లో బిజీగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ‘‘అవి ఊహాత్మక కూటమే తప్ప వ్యూహాత్మక కూటమి కాదు. సొంత కుటుంబాలను, ఆస్తులను కాపాడుకోవడమనే ప్రధాన అజెండాగా విపక్షాలన్నీ మల్లగుల్లాలు పడుతున్నాయి. సోనియా, రాహుల్ సహా నేతలంతా అవినీతిలో పీకలదాకా కూరుకుపోయారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment