న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల మొట్టమొదటి సమావేశం గురువారం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో వారంతా భేటీ అయి వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మంగళవారం బెంగళూరులో సమావేశమైన ప్రతిపక్ష నేతలు తమ కూటమికి ఇండియా అనే పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. మణిపూర్ అంశంపై ఉభయసభల్లో చర్చించాలని, అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ..మణిపూర్ సీఎం బిరేన్ సింగ్‌ను వెంటనే తొలగించి, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు 80 రోజులుగా కొనసాగుతున్నా ప్రధాని మోదీ అక్కడికి వెళ్లలేదు, అక్కడి పరిస్థితిపై స్పందించలేదని చెప్పారు. ‘మహిళా రెజ్లర్లపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ పార్లమెంట్ నాలుగో నంబర్ గేట్ దగ్గర కనిపించగా, అక్కడికి కొన్ని అడుగుల దూరంలో ప్రధాని మోదీ మహిళల భద్రతపై లెక్చరిచ్చారు. ద్వంద్వ ప్రమాణాలు బీజేపీ డీఎన్‌ఏలోనే ఉన్నాయి’అని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment