కాంగ్రెస్ దెబ్బకు కూటమి అబ్బా! | India alliance is headed for disintegration sakshi guest column | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ దెబ్బకు కూటమి అబ్బా!

Published Fri, Feb 16 2024 8:30 AM | Last Updated on Fri, Feb 16 2024 8:30 AM

India alliance is headed for disintegration  sakshi guest column - Sakshi

'ఇండియా కూటమి' మధ్య ఐక్యత పెరగకపోగా, కూటమి విచ్ఛిన్నం దిశగా పయనం చేస్తోంది. రేపటి సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎన్ని పార్టీలు కలిసివుంటాయో? చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఏదో ఒకటి రెండు పార్టీలు తప్ప, ఎవరూ కాంగ్రెస్ వెంట నడవడానికి ఇష్టపడడం లేదని ఈ పరిణామాలు బలంగా చెబుతున్నాయి. తాజాగా మరో పార్టీ బయటకు వచ్చేసింది.

కూటమితో సంబంధం లేకుండా జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఫారూక్ అబ్దుల్లా ప్రకటించారు. లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఏకకాలంలో ఎన్నికలు జరుగవచ్చనే ఆశాభావాన్ని  ఆయన వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో బలమైన ఓటుబ్యాంక్ వున్న ప్రధాన పార్టీలలో నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి. కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లనే ఫారూక్ బయటకు వచ్చేశారు.


ఇదే అంశంతో పాటు మరికొన్ని విభేదాలతో ఇండియా కూటమి నుంచి ఒక్కొక్క పార్టీ బయటకు వస్తోంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్,కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, బీహార్ లోని జెడీయు కూడా అదే బాట పట్టాయి. జెడీయు ఇంకొక అడుగు ముందుకు వేసి ఎన్డీఏ గూటికి తిరిగి చేరింది.మహారాష్ట్రకు చెందిన శరద్ పవార్,ఉత్తరప్రదేశ్ కు చెందిన అఖిలేష్ యాదవ్ ది కూడా దాదాపు అదే పరిస్థితి.

2019 ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నుంచి కాంగ్రెస్ ను బలపరిచి,మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతు పలికి,సహకారం అందించారని పేరుతెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సైతం ఇండియా కూటమిలోకి చేరడానికి ఆసక్తి చూపడం లేదు.రేపు జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వెల్లువెత్తుతున్న వేళ,మోదీ వైరిపక్షంలో చేరడానికి బాబు భయపడుతున్నారని అనుకోవాలి.

ప్రస్తుతం తమకున్న అవసరాల దృష్ట్యా ఎలాగైనా మళ్ళీ నరేంద్రమోదీతో జతకట్టడానికి బాబు వీరప్రయత్నాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. బీజేపీ పెద్దలే బాబు పొత్తును కోరుకుంటున్నారని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నా,జనం నమ్మడం లేదని, రేపటి ఎన్నికల అవసరాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ - టిడిపి పొత్తుకట్టినా,అది ధృతరాష్ట్రుడి కౌగిలింత వంటిదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ యాత్రల పేరుతో ప్రయత్నం చేస్తున్నారు.


కానీ,ఇండియా కూటమిలో ఐక్యతను నిలబెట్టుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని, కూటమి శక్తివంతంగా నిర్మాణమవుతుందని గాంధీ త్రయం ( సోనియా, రాహుల్, ప్రియాంక) బలంగా విశ్వసించింది.కానీ, కర్ణాటక,హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడంతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్ గడ్,రాజస్థాన్ లో అధికారం కోల్పోయింది.మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలుపును ఆపలేకపోయింది.

ఆంధ్రప్రదేశ్ లో గిడుగు రుద్రరాజును మార్చి షర్మిలకు పగ్గాలు అప్పగించింది. గిడుగు రుద్రరాజు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వ్యక్తి. కెవిపి రామచంద్రరావు, రఘువీరారెడ్డి,పల్లంరాజు వంటి అనేకమంది సీనియర్ నాయకులు ఉండగా,వారందరినీ పక్కన పెట్టి, వై ఎస్ తనయ షర్మిలకు అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల పార్టీకి జవసత్వాలు పెరుగుతాయని కాంగ్రెస్ అధిష్టానం పెట్టుకున్న విశ్వాసం ఎంతవరకూ ఫలవంతమవుతుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల దాకా ఆగాల్సిందే.

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయ్యాక, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చావుదెబ్బ తిన్నది. ఇప్పటికీ ఆ దెబ్బ నుంచి తేరుకోలేదు. కేవలం రెండు మూడు నెలల వ్యవధి ముందు పార్టీ బాధ్యులను మార్చినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పైకి లేస్తుందన్నది ఒట్టిమాటే. ఈ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన ప్రయోగాలు ఎక్కువ శాతం బెడిసికొట్టాయి. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు పార్టీకి ఎదురుదెబ్బలుగా మిగిలాయి.

ఈరోజు ఇండియా కూటమి బలోపేతం కాకపోవడం, విచ్ఛినం దిశగా ప్రయాణం చేయడానికి మూలం కాంగ్రెస్ విధానాలే.పంజాబ్ లో అమరేంద్ర సింగ్ ను తప్పించి,నవజ్యోత్ సింగ్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం మొదలు ప్రతి రాష్ట్రంలో తప్పటడుగులు వేసుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను అడ్డం పెట్టుకొని పంజాబ్ లో ఆమ్ అద్మీ పార్టీ అధికారంలోకి వచ్చేసింది.

ఢిల్లీలోనూ పాగా వేసింది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, శ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కుదేలైపోయింది.


నిన్న మధ్యప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సమాజ్ వాదీ పార్టీ విషయంలో కాంగ్రెస్ మళ్ళీ అదే తప్పు చేసింది. కాంగ్రెస్ విధానాల వల్లనే మేం నష్టపోయామని ఆ నాయకులు పదే పదే వాపోయారు. కేజ్రీవాల్ మొదటి నుంచీ కాంగ్రెస్ తో జతకట్టడానికి పెద్దగా ఇష్టపడడంలేదు. ఇండియా కూటమి నిర్వహించిన అనేక సమావేశాలకు ఆయన ఎగ్గొట్టారు కూడా. రాహుల్ గాంధీ తీరు పట్ల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మొదటి నుంచి గుర్రుమని వున్నారు.

సమాజ్ వాదీ పార్టీ అధినాయకుడు అఖిలేష్ యాదవ్ ది కూడా ఇంచుమించు అదే తీరు. కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్లలో లోక్ సభ లో బలాన్ని పెంచుకోక పోగా, ఒక్కొక్క రాష్ట్రంలో అధికారాన్ని, పొత్తులను కూడా కోల్పోతూ వచ్చింది. పాండిచ్చేరి వంటి చిన్న రాష్ట్రంలో కూడా అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. పాండిచ్చేరిలో కూటమిలో ముసలం పుట్టిన వేళ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడే వున్నారు. తమిళనాడులో స్టాలిన్ తో స్నేహం కొనసాగుతూ ఉన్నప్పటికీ, గత ఎన్నికల్లో ఆయన కేటాయించిన అరకొర సీట్లతో సర్దుకోవాల్సిన దుస్థితి అప్పట్లో కాంగ్రెస్ కు పట్టింది.

ఇప్పటికీ అదే పరిస్థితి.మొత్తంగా చూస్తే,ఇండియా కూటమి వైఫల్యానికి వున్న ప్రధాన కారణాలలో కాంగ్రెస్ విధానమే ముఖ్యమైన కారణం. ఇంకొక పక్క ఎన్డీఏ తన కూటమిని బలోపేతం చేసే పనిలో పడిపోయింది. నితీశ్ కుమార్ మొదలు అకాలీదళ్ బీజేపీ పంచకు చేరాయి. లాభనష్టాలు, పరిణామాలు ఎలా వున్నా, టీడీపీ కూడా అదే బాట పట్టింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా మోదీ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం మొదటి నుంచి తటస్థంగానే వున్నారు. 370-400 సీట్లు సాధించి హ్యాట్రిక్ కొడతామంటూ బీజేపీ మంచి ఊపులో వుంది.

ఇండియా కూటమిని  నిలుపుకోడం సంగతి అటుంచి,కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తనకున్న లోక్ సభ స్థానాలను సైతం ఏ మాత్రం నిలబెట్టుకుంటుందో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాయకత్వ పటిమను పెంచుకొని, ప్రజావిశ్వాసాన్ని పెంపొందించుకుంటేనే? ఏ పార్టీకైనా, నాయకుడుకైనా ఉనికి, భవిష్యత్తు వుంటాయి.-మాశర్మ


 -మాశర్మ, సీనియర్‌ జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement