జైపూర్: విపక్ష కూటమి ‘ఇండియా’ ఏర్పాటు తర్వాత.. ప్రధాని నరేంద్ర మోదీ వీలుచిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే వస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన విపక్ష కూటమిని ఏకిపారేశారు. గతంలో చేసిన తప్పుల్ని దాచిపెట్టేందుకు.. యూపీఏ నుంచి ఇండియాగా వాళ్లు పేరు మార్చుకున్నారని మండిపడ్డారాయన.
రాజస్థాన్ సికర్‌లో గురువారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘పేదలకు వ్యతిరేకంగా వాళ్లు పన్నిన కుట్రలు దాచుకునేందుకు ప్రతిపక్షం తమ పేరు మార్చుకుందని విమర్శించారు. ‘‘కొన్ని కంపెనీలు మోసం చేసి.. ఆపై పేర్లు మార్చుకుని మళ్లీ వస్తుంటాయి. అలాగే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తమ పేర్లను మార్చుకున్నాయి. ఉగ్రవాదం ముందు లొంగిపోయామనే మరకను తొలగించుకునేందుకు తమ పేరును మార్చుకున్నారు. వాళ్ల తీరు.. దేశ శత్రువులను పోలి ఉంది. భారతదేశం అనే పేరు తమ దేశభక్తిని చాటుకోవడానికి కాదు.. దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతోనే’’ అని ప్రసంగించారాయన.
రాజస్థాన్‌కు ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపైనా మండిపడ్డారు. ఓవైపు కేంద్రం యువతను ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది. కానీ, రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది?. పేపర్ లీక్‌ల వ్యవస్థ నడుస్తోంది. సమర్థవంతమైన యువత భవిష్యత్తును ఇక్కడి ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది అని మండిపడ్డారాయన.
Comments
Please login to add a commentAdd a comment