కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ధ్వజం
జైపూర్: రైతులకు అండగా ఉంటామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నేతలు.. వాస్తవానికి అన్నదాతల కోసం ఏమీ చేయలేదని, ఇతరులను కూడా చేయనివ్వరని ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించడానికి బదులుగా ఆ పార్టీ రెచ్చగొడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరికి ఈస్టర్న్ రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టు(ఈఆర్‌సీపీ) ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈఆర్‌సీపీ అసంపూర్తిగా ఇంతకాలం నిలిచిపోవడానికి కాంగ్రెస్సే కారణన్నారు.
చంబల్ నదీ పరివాహక ప్రాంతం నుంచి రాజస్తాన్‌లోని 13 జిల్లాలకు నీటిని అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ‘నీటి వివాదాలకు పరిష్కారం వెదకాలని కాంగ్రెస్ ఏనాడూ భావించలేదు. మన నదుల్లోని నీరు సరిహద్దులు దాటి వెళుతోంది. కానీ, మన రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీనికి పరిష్కారం చూపడం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల మధ్య నీటి పంపకం వివాదాలను ప్రేరేపిస్తోంది’అని ఆయన అన్నారు.
రాజస్తాన్‌లోని బీజేపీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం జైపూర్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ పైవ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రూ.46,300 కోట్ల విలువైన ఇంధనం, రహదారులు, రైల్వేలు, జల సంబంధం 24 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గుజరాత్ సీఎంగా ఉండగా నర్మదా నదీ జలాలను సద్వినియోగం చేసుకునేలా పలు ప్రాజెక్టులను తలపెడితే కాంగ్రెస్, కొన్ని ఎన్జీవోలు వాటిని అడ్డుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment