PM Narendra Modi: ఏ కష్టమొచ్చినా మేమున్నాం | PM Narendra Modi Meets Maldives President Muizzu | Sakshi
Sakshi News home page

PM Narendra Modi: ఏ కష్టమొచ్చినా మేమున్నాం

Published Tue, Oct 8 2024 4:28 AM | Last Updated on Tue, Oct 8 2024 4:28 AM

PM Narendra Modi Meets Maldives President Muizzu

మాల్దీవులకు భరోసా ఇచ్చిన ప్రధాని మోదీ 

ఆ దేశాధ్యక్షుడితో కలిసి మాల్దీవుల్లో రూపే కార్డు సేవల ప్రారంభం 

రూ. 3,360 కోట్ల ఆర్థికసాయం 

న్యూఢిల్లీ: చైనా పంచన చేరి భారత్‌పై ద్వేషం పెంచుకున్న మాల్దీవులు ఇప్పుడు మళ్లీ భారత్‌తో మైత్రిబంధం బలోపేతానికి ముందడుగు వేసింది. పెట్టుబడులు, పర్యాటకం ద్వారా తమ ఆర్థికాభివృద్ధికి తోడ్పాడాలని స్నేహహస్తం అందించింది. నాలుగు నెలల వ్యవధిలోనే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు భారత్‌లో రెండోసారి పర్యటించడం ఈ పెనుమార్పుకు అద్దం పడుతోంది. స్నేహహస్తం అందించిన ఏ దేశానికైనా సాదర స్వాగతం పలికే భారత్‌ మరోసారి తన స్నేహశీలతను చాటుకుంది. 

వేల కోట్ల రూపాయల ఆర్థికసాయం అందిస్తూనే మాల్దీవుల్లో సోమవారం రూపే కార్డు సేవలను ప్రారంభించింది. మాల్దీవుల్లో ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ప్రాజెక్ట్, ఇరుదేశాల మధ్య మరింత అనుసంధానత, పర్యాటకం వృద్ధి కోసం భారత ప్రధాని మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు సమాలోచనలు జరిపారు. సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌ వీరి ద్వైపాక్షిక భేటీకి వేదికైంది. తొలుత రాష్ట్రపతి భవన్‌లో ముయిజ్జుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాగతం పలికారు. తర్వాత మోదీ, ముయిజ్జు ద్వైపాక్షిక చర్చలు జరిపాక ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదలచేశారు. మాల్దీవులకు దాదాపు రూ.3,360 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు.  

సాయం చేసేందుకు సదా సిద్ధం 
‘‘ మాల్దీవులు మాకు అత్యంత సమీప పొరుగుదేశం. భారత పొరుగుదేశాల విధానం, సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ ది రీజియన్‌(సాగర్‌) దార్శనికతలో మాల్దీవులు మాకు అత్యంత ప్రధానం. మాల్దీవులపై భారత్‌ ఎల్లప్పుడూ స్నేహభావాన్నే వెదజల్లింది. గతంలో ఎప్పుడు కష్టమొచ్చినా మొట్టమొదట ఆదుకునేందుకు భారతే ముందు కొచ్చింది. కోవిడ్‌ సంక్షోభకాలంలోనూ ఆదుకున్నాం. పొరుగుదేశంగా అన్ని బాధ్యతల్ని నెరవేర్చాం. ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు మేమున్నాం’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల్లో రూపే కార్డ్‌ సర్వీసులను మోదీ, ముయిజ్జులు వర్చువల్‌గా 
ప్రారంభించారు.  

700 ఇళ్ల అప్పగింత 
రూ.3,000 కోట్ల విలువైన దిగుమతులను స్థానిక కరెన్సీల్లో చెల్లించేలా ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. హనీమధో ఎయిర్‌పోర్ట్‌లో నూతన రన్‌వేనూ ప్రారంభించారు. హల్‌హమేలో నిర్మించిన 700 ఇళ్లను భారత్‌ మాల్దీవులకు అప్పగించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మాల్దీవుల్లో పోర్టులు, రోడ్ల నెట్‌వర్క్, పాఠశాలలు, గృహ ప్రాజెక్టుల్లో సాయపడేందుకు భారత్‌ అంగీకారం         తెలిపింది.  

థాంక్యూ మోదీజీ: ముయిజ్జు 
ఆర్థిక సాయం ప్రకటించిన భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ కష్టకాలంలో కీలక భాగస్వామిగా భారత్‌ మమ్మల్ని ఆదుకుంటోంది. పర్యాటకం అభివృద్ధికి భారత్‌ సాయపడాలి. ఎందుకంటే మాల్దీవుల్లో పర్యాటకానికి భారతే ప్రధాన వనరు. పెద్ద ఎత్తున భారతీయులు మా దేశంలో పర్యటించాలి’’ అని ముయిజ్జు అన్నారు. ఈ సందర్భంగా తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోదీని ముయిజ్జు కోరారు. మంగళవారం ఆగ్రా, ముంబైలో, బుధవారం బెంగళూరులో ముయిజ్జు పర్యటిస్తారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement