ఒడిశాలో ఎన్నికల స్నేహానికి బీజేపీ, బీజేడీ సిద్ధమవుతున్నాయా? పొత్తు కుదరలేదని తాజా వార్త. కాదు... కుదరవచ్చని ఊహాగానం. ఇప్పటికింకా పూర్తి స్పష్టత లేదు. దోస్తీ మాట నిజమే అయితే, ఒక ప్రశ్న ఉదయిస్తుంది! ‘‘అసలు ఈ రెండు పార్టీలూ కలవాల్సిన అవసరం ఏముంది?’’ రాష్ట్రంలో సర్కార్ ఏర్పాటుకై బీజేడీకి బీజేపీ అవసరం లేదు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి బీజేడీ అవసరం లేదు. మరి ఏ ప్రయోజనాలు ఆశించి మోదీ, పట్నాయక్‌లు స్నేహహస్తాలు చాస్తున్నారు. 2008 నాటి క్రైస్తవుల హత్యోదంతాల అనంతరం 2009లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న పట్నాయక్... పదిహేనేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆ పార్టీతో నెయ్యానికి చర్చలు జరిపారు? అడగవలసిన ప్రశ్నలెన్నో ఉన్నాయి!
గతాన్ని గుర్తు చేయటం రాజకీయ నాయ కులకు ఇష్టం ఉండదు. అది వారికి ‘‘ఒక పరదేశం’’. ఎల్.పి.హార్ట్‌లీ చెప్పిన విధంగా, ‘‘వారు అక్కడ పనులను భిన్నంగా చేస్తారు’’. సరిగ్గా అలానే చేసే ఉద్దేశంతో నేనివాళ ఉన్నాను. భారతీయ జనతా పార్టీతో నవీన్ పట్నాయక్ కొత్తగా పొత్తు కుదుర్చుకోవాలని చూస్తున్నట్టు వినగానే పదిహేను సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలని నాకు అనిపించింది. వాటిని మీకు గుర్తు చేసి, మీ సొంతంగా ఒక అభిప్రాయానికి వచ్చేందుకు మిమ్మల్ని వదిలేస్తాను.
2008లో కొంధమాల్‌లో జరిగిన క్రైస్తవుల దారుణ హత్యోదంతాల అనంతరం నేను నవీన్ పట్నాయక్‌ను ఇంటర్వ్యూ చేశాను. ఆ హత్యలు దేశాన్ని కుదిపి వేయటమే కాకుండా, పట్నాయక్ ప్రతిష్ఠను పదేపదే దెబ్బతీశాయి. తేరుకోవటానికి ఆయన తలకిందులుగా తపస్సు చేయవలసి వచ్చింది. ‘‘నా దేహంలోని ప్రతి అస్థికా మతంతో సంబంధం లేనిది. ఆ అస్థికల్లో ఏవైనా దెబ్బతిని ఉంటాయని నేను అనుకోను’’ – అని, లౌకికవాదిగా తనకై తను ఆయన ఒక ఉనికిని ఇచ్చుకున్నారు. ఆరు నెలల తర్వాత, 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు, బీజేపీతో తనకున్న తొమ్మిదేళ్ల పొత్తును విచ్ఛిన్నం చేసుకున్నారు. అప్పుడు మళ్లీ నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను.
పట్నాయక్: ‘‘బీజేపీతో తెగతెంపులు చేసుకోవటం తప్పనిసరి అయింది. ఎందుకంటే, నా రాష్ట్రానికి వారినిక ఏమాత్రంగానైనా ఆరోగ్యకరమని నేను పరిగణించటం లేదు. కొంధమాల్ తర్వాత అది ప్రతి ఒక్కరికీ స్పష్టమై ఉంటుందని అనుకుంటున్నాను.’’
థాపర్: ‘‘కొంధమాల్ తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీతో కొనసాగలేమని మీరు చెబుతున్నారా?’’
పట్నాయక్ : ‘‘కొనసాగటం చాలా చాలా కష్టంగా మారింది.’’
థాపర్: ‘‘అంటే కొంధమాల్ ఒక విధంగా మీ పొత్తు విచ్ఛిత్తికి కారణం అయిందనేనా?’’
పట్నాయక్ : ‘‘నిజానికి, అంతే.’’
(ఈ సంభాషణ మరింతగా ముందుకు సాగింది. చెప్పాలంటే, అలా జరగాలన్న ఆసక్తి ఆయనలో కనిపించింది.)
థాపర్: కొంధమాల్ ఘటనలతో పట్టణ ప్రాంత మధ్య తరగతి ప్రజలు మిమ్మల్ని నరేంద్ర మోదీతో పోల్చడం ప్రారంభించారు. కొంతమంది మిమ్మల్ని రెండవ నరేంద్ర మోదీ అని కూడా అన్నారు. అది మిమ్మల్ని కలవరపరిచిందా? నొప్పించింది కూడానా?’’
పట్నాయక్: ‘‘నన్ను నేను ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా అలా చూసుకోలేదు. నేను ఎల్లవేళలా లౌకికవాద ధోరణిలోనే ఆలోచిస్తాను. నాది పూర్తిగా లౌకికవాద నేపథ్యం. కనుక నేను దానిని నాపై వచ్చిన సరైన ఆరోపణగా ఏనాడూ పరిగణించలేదు.’’
థాపర్: ‘‘దానర్థం... నరేంద్ర మోదీతో పోల్చడం మిమ్మల్ని బాగా గాయపరచేదిగా ఉండి ఉండాలి.’’
పట్నాయక్: ‘‘నా మీద అలాంటి ఆరోపణ వస్తుందని నేను అస్సలు నమ్మలేకపోయాను.’’
(కొంధమాల్ తర్వాత పట్నాయక్ బీజేపీని ఎలా చూశారన్నది స్పష్టం అయింది. అయితే ఆయన చెప్పాలనుకున్నది ఇంకా ఉండింది. అక్కడితో ముగించలేదు.)
థాపర్: ‘‘కొంధమాల్ తర్వాత నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ శరీరంలోని ప్రతి అస్థికా మత రహితమైనదేనని మీరు చెప్పారు. అది నిజమేనని... మీరిప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకోవటమన్నది రుజువు చేస్తోందని మీరు చెప్పగలరా?’’
పట్నాయక్: ‘‘మీరేమనుకుంటున్నారు కరణ్? నేనేమిటో మీకు ఎప్పటి నుండో తెలుసు.’’
థాపర్: ‘‘అది నిజమేనని రుజువు చేస్తోందని నేను చెప్పగలను.’’
పట్నాయక్: ‘‘థ్యాంక్యూ.’’
(మరొక ప్రశ్న అడగవలసిన అవసరం ఉందని నా ప్రవృత్తి చెప్పింది. అది ఆయనపై ముష్టిఘాతాన్ని విసిరింది.)
థాపర్: ‘‘ఆ పని (బీజేపీతో తెగతెంపులు) మీరు మనస్ఫూర్తిగా చేసినదే కదా?’’
పట్నాయక్: ‘‘చివరికొచ్చేటప్పటికి ఎవరి నమ్మకాలపై వారు నిలబడతారు. కాదా చెప్పండి? ఎవరి నమ్మకాలపై వారు నిలబడి తీరాలి కూడా.’’
(అయిపోయింది – స్పష్టంగా, క్లుప్తంగా, నిశ్చయంగా పట్నా యక్ తనేమిటో చెప్పేశారు. ఆయన నమ్మకాలు తమను తాము పునరుద్ఘాటించుకున్నాయి. పాత పట్నాయక్ ప్రత్యక్షమయ్యారు. బీజేపీతో జతపడి ఉండటం అన్నదిక చరిత్రే.)
థాపర్: ‘‘తను నమ్మిన సిద్ధాంతాలపై నిలబడేందుకు నవీన్ పట్నాయక్‌కు తొమ్మిదేళ్లు పట్టిందని చాలామంది అంటారు. మిమ్మల్ని బాగా ఎరిగిన వారికి మీరు లౌకికవాదులు, ఉదారవాదులు, నవీ నులు. నిజంగా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే, ఆ పొత్తు దీర్ఘకాలం సాగిందంటే వారికి ఆశ్చర్యంగా ఉంటుంది. మీ నమ్మికలు ఏమిటో మీరు కనుగొనడానికి ఎందుకు మీకంత ఎక్కువ సమయం పట్టింది?’’
పట్నాయక్: ‘‘గత పన్నెండేళ్లలో బీజేపీకి అనేక లౌకికవాద పక్షాల పొత్తు ఉండటం మీరు చూసే ఉంటారు. మమతా బెనర్జీ లేదా హెగ్డే లేదా ఫరూఖ్ అబ్దుల్లా, చివరికి జార్జిఫెర్నాండెజ్, నితిశ్‌కుమార్. అనేక మిత్ర పక్షాలూ ఉండేవి. అంతేకాదు, ఒడిశాలో మన అదృష్టవశాత్తూ మొదటి ఎనిమిదేళ్లలో ఎలాంటి మతపరమైన సంఘటనలూ జరగ లేదు. కొంధమాల్ జరగనంత వరకు మొత్తంగా పరిస్థితే మారలేదు.’’
ప్రస్తుతం ఒకే ఒక ప్రశ్న మిగిలింది. పరిస్థితి ఏం మారింది? బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఆ తర్వాత బాగా పని చేసిన పట్నాయక్ తిరిగి ఇప్పుడు వారి ఆలింగనం కోసం ఎందుకు వెనక్కు నడవాలని తపిస్తున్నారు? వారి అవసరం లేకుండానే ఆయన మళ్లీ గెలుస్తారు కదా!అయితే విషయం అది కాదు. ఆయన తెగతెంపులు చేసుకున్న బీజేపీ ఎల్.కె. అద్వానీ నేతృత్వం లోనిది. ఆయనిప్పుడు తిరిగి వెళ్ళాలని చూస్తున్నది నరేంద్ర మోదీ సారథ్యం లోనిది. నేను మరింతగా చెప్పాల్సిన అవసరం ఉందంటారా?
పట్నాయక్ మళ్లీ బీజేపీతో ఎందుకు పొత్తు కుదుర్చుకోవాలని అనుకున్నారో నాకెప్పటికైనా తెలుస్తుందా అని నా సందేహం. కానీ తను యూ–టర్న్ తీసుకోవటాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటారో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు ఉంది. ఈలోగా మీదైన అభిప్రాయా లకు మీరు వచ్చేందుకు మిమ్మల్ని వదిలేస్తాను. బహుశా మీలోకొందరు... మీరూ నాలాగే ఊహించారని భావించే అవకాశం ఉంది.
- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
- కరణ్ థాపర్
Odisha : ఒడిషా రాజకీయం ఎటు తిరుగుతోంది?
Published Mon, Mar 25 2024 1:03 AM | Last Updated on Mon, Mar 25 2024 6:30 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment