‘సిద్ధం’ సభల్లో జనసందోహం
కేవలం రాజకీయ ఎత్తు గడలతోనే 40 ఏళ్ల కెరీర్‌ను గడిపిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొత్తులను, చిలక పలుకులను ఆశ్రయించారు. తన వందిమాగధులయిన బాకా మీడియా సంస్థలు విశ్వసనీయతను కోల్పోయిన విషయాన్ని గమనించినట్టున్నారు. అందుకే ఇప్పుడు కొత్తగా పేరెన్నికగన్న ప్రశాంత్ కిషోర్ ద్వారా దుష్ప్రచారానికి తెర లేపారు.
ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహ కర్తలు పుట్టక మునుపు నుంచి ప్రజల నాడి తెలిసిన జన నేతలు ఎన్నికలు గెలుస్తున్నారు. 1994లో ఎన్టీఆర్, అదే విధంగా 2004లో వైఎస్సార్ విజయదుందుభి మోగించింది స్వబలం ఆధారంగానే. క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రశాంత్ కిషోర్ చేపట్టిన వ్యూహకర్త కార్య క్రమాలు అప్పటికే గెలుపు గుర్రాలయినవారికి ఉపయోగపడ్డాయి తప్ప ఈయనవల్ల, ఓడిపోయే నాయకులు గెలుపు చేజిక్కించుకొన్న సందర్భం అయితే లేదు. ఇంతటి ప్రశాంత్ కిషోర్ ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి వ్యూహరచన చేపట్టి బొక్క బోర్లా పడిన సందర్భం మరిచిపోరాదు.
పొత్తుల విషయానికి వస్తే చంద్రబాబు చరిత్ర చర్వితచర్వణమే. 1999 నుంచి చూస్తే ఆయన పోటీ చేసిన అయిదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచింది రెండు మాత్రమే. ఆ రెండింటిలో కూడా పొత్తులే ఆయన్ని గట్టెక్కించాయి. 1999లో కార్గిల్ యుద్ధ నేపథ్యంలో బీజేపీ ఖాతా లోని దేశభక్తి ఓటు ఈయనకి ఉపయోగపడితే, 2014లో మోదీ గాలి, పవన్ కల్యాణ్ నటనా శౌర్యం తోడై విడిపోయిన రాష్ట్రానికి పండి పోయిన అనుభవజ్ఞుడు అవసరమనే తప్పుడు వాదనను ముందుకు తెచ్చి గద్దెనెక్కారు.
పొత్తు లేకుండా ఆయన పోటీ చేసిన ఎన్నికలు కేవలం 2019 మాత్రమే. ఈ 25 ఏళ్ల ఘన చరిత్ర మనకు చెబుతున్న పాఠం ఏమిటంటే... పొత్తులు అన్ని వేళలా పని చేయవు. కాలం గడిచే కొద్దీ స్వప్రయోజనాలకోసం ఇష్టానుసారం భిన్న ధ్రువాలలాంటి శక్తులతో చేతులు కలుపుతూ పోతే రెంటికి చెడ్డ రేవడి కావడం తథ్యం.
బీజేపీని అలౌకిక పార్టీగా తూర్పార బట్టి అయిదు ఏళ్ళు కూడా నిండక మునుపే మళ్లీ దానితోనే పొత్తుపెట్టుకున్నారు. అయితే మును పటి (1999, 2014) ఫలితాలు మళ్ళీ సాధిస్తారా అనేది ప్రశ్న. ఈ సారి వీరి ప్రయాణం నల్లేరు మీద బండి నడక కాదనే చెప్పాలి. ఎందుకంటే గతానికీ, ఇప్పటికీ తేడా ఏమంటే ఇప్పుడు టీడీపీ – జనసేన – బీజేపీ త్రయం, ఒక పూర్తి కాలం పనిచేసి జనాదరణ పొందిన జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటుంది. ఇదే పరిస్థితి 2009లో చంద్ర బాబుకి వచ్చింది. అప్పటి వైఎస్సార్ పార్టీ ప్రభుత్వం సంక్షేమం ద్వారా ప్రజల్లో బలంగా పాతుకుపోయింది.
అందుకే చంద్రబాబు మహా కూటమి ఏమీ చేయలేకపోయింది. అయితే కొంతమంది దీనికి ‘ప్రజారాజ్యం’ పార్టీ కారణం అని అనుకున్నా నిజానికి చిరంజీవికి పడిన ఓటు కోస్తా జిల్లాల్లోని పీడిత వర్గాల ఓటు. తాము ఇలవేలుపుగా భావించే రంగా హత్యానంతరం సాంప్రదాయకంగా టీడీపీని వ్యతిరేకిస్తూ వచ్చిన కాపు ఓటు. అది దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు 2014 కల్లా పవన్ కల్యాణ్ అంటే పెనుప్రేమ చూపించే కాపు వర్గాన్ని బుట్టలో వేసుకోడానికి జనసేనను అక్కున చేర్చుకున్నారు. తద్వారా ఒక అసహజ పొత్తుకు ప్రాణం పోశారు.
2014 ఎన్నికల అనంతరం పవన్ కల్యాణ్ తనను నమ్ముకున్న వర్గాలకు కాని, వ్యక్తులకు కాని ఏ మాత్రం సాయపడలేకపోయారు. ఇటు రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ద్వారా కానీ, అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయలేకపోయారు పవన్ కల్యాణ్. పైపెచ్చు ఆయనే బీజేపీ మన రాష్ట్రానికి ‘పాచి పోయిన లడ్డూలు’ ఇచ్చింది అని 2019 ఎన్ని కలకు ముందు కోడై కూశారు. అలాంటిది మళ్ళీ ఏ విధంగా ఇప్పుడు ఈ త్రయం ఒకటిగా సభలు నిర్వహిస్తారో వారికే తెలియాలి.
ఒకవైపు నేరుగా నగదు బదిలీతో జగన్ పేదలకు వినూత్న సాయం అందజేసి దానిని పెట్టుబడిగా భావిస్తుంటే... ఓటు బదిలీని పెట్టుబడిగా పరిగణిస్తూ టీడీపీ – బీజేపీ – జనసేన త్రయం ఇప్పుడు బరిలోకి దిగు తున్నది. 2019లో జనసేన... బీఎస్పీ, కమ్యూ నిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేసి సుమారు 5–6 శాతం ఓటు దక్కించుకున్నది. బీజేపీ అయితే సొంతంగా పోటీ చేసి ‘నోటా’ కంటే తక్కువ ఓటు శాతాన్ని తెచ్చుకొంది. దీనిని కొలమానంగా తీసుకొంటే టీడీపీకి పడిన 39 శాతానికి వీరి ఓట్లు జత అయినా కూడా జగన్ దరిదాపులకు చేరలేరు. స్థూలంగా విషయమేమిటంటే పొత్తుల జిత్తులూ, వ్యూహకర్తల విషపు పలుకులూ ప్రజ లను ఏమార్చబోవు.
డా.జి. నవీన్
వ్యాసకర్త సామాజిక ఆర్థికాంశాల విశ్లేషకుడు (యూఎస్‌ఏ)
Comments
Please login to add a commentAdd a comment