సాక్షి, గుంటూరు: బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలేనని.. చేయగలిగినవి మాత్రమే సీఎం జగన్ మేనిఫెస్టోలో పెట్టారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసు.. వైఎస్సార్‌సీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందన్నారు.
‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాం. కోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాం. జగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు. గతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారు. నిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ అర్హత ఏంటో చెప్పలేదు. అంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.
1999లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారు. కానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారు. అది కూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదు. వృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు. ఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారు. చివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారు. బ్యాంకుల దగ్గర పెన్షన్‌దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోంది’’ అని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోంది. వృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదే. వాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు. 2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉంది. అందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారు. కూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు. అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?. సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?’’ అని సజ్జల ప్రశ్నించారు.
‘‘చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయింది. అందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. ఆ యాక్టును బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోంది. ఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదే. తప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడు. చంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రం. ల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలి. బీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?. చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్ముకుంటున్నారా?. దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment