ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ వదలుకున్న వయనాడ్ లోక్‌సభ స్థానంలో.. ఉపఎన్నికలో భాగంగా ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా గాంధీకి ఇదే మొదటి లోక్‌సభ ఎన్నిక కావటం గమనార్హం. అయితే ప్రియాంకా గాంధీ బరిలోకి దిగే వయనాడ్‌లో టీఎంసీ సుప్రీం నేత, సీఎం మమత ప్రచారం చేయనున్నట్లు కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు పొత్తు, సీట్ల పంపకం విషయాల్లో బెంగాల్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న అధీర్ రంజన్ చౌధరీకి మమతా బెనర్జీ మధ్య విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు బాధ్యతగా బెంగాల్ పీసీసీ చీఫ్ పదవికి శుక్రవారం అధీర్ రంజన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల అంతర్గత సమావేశాల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. మమతా బెనర్జీకి తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని, కేవలం రాజకీయంగా మాత్రమే తాను విభేదించినట్లు చూడాలని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.
కాగా, బెంగాల్‌లో సీఎం మమతను విభేదించే అధీర్ రంజన్ రాజీనామా చేయటంతో దీదీ.. ప్రియాంకా గాంధీ ప్రచారానికి సిద్ధమైనట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇరు పార్టీల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. ఇక.. లోక్‌సభలో ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీఎంసీ మొత్తం 42 స్థానాలకు గాను 29 సీట్లును గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకే పరిమితమైంది. ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అధీర్ రంజన్ సైతం ఈసారి టీఎంసీ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారీ కాంగ్రెస్.. లెఫ్ట్ పార్టీలతో కలసి బరిలోకి దిగినప్పటికీ ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment