నితీశ్ కుమార్ రాయని డైరీ
ప్రమాణ స్వీకారం! ఈ మాట ఎందుకో సరైనదిగా అనిపించదు. ఇప్పటికి నాలుగు స్వీకారాలు అయ్యాయి. ఇది ఐదోది. అయినా స్వీకారం అనే మాటకు మనసు అలవాటు పడలేకపోతోంది. పదవీ స్వీకారం గానీ, ప్రమాణ స్వీకారం గానీ.. అసలు స్వీకారం ఏమిటి? సమర్పణ అని కదా అనాల్సింది! పదవిని ప్రజలకు సమర్పిస్తున్నాం. ‘మహా జనులారా ఇదిగో... ఈ పదవిని, ఈ అధికారాన్ని మీకు సమర్పిస్తున్నాం’ అని కదా అనాలి. అప్పుడది ప్రమాణ సమర్పణ అవుతుంది. పదవీ సమర్పణ అవుతుంది.
జేపీ అనేవారు.. ప్రజలే నాయకులై నడిపిస్తే ఉత్తేజితుడినై ముందుకు నడిచినవాడిని నేను.. అని! ఇప్పుడీ మహా కూటమిని నడిపించిందీ ఆ ప్రజలే. జేపీ సంపూర్ణ క్రాంతి ఉద్యమం ప్రారంభమైన చోట.. పట్నా గాంధీ మైదానంలో మేమిప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నది కూడా అందుకే.. ప్రజలకు అధికారం సమర్పించడం కోసం.
నిన్న అందరం కలసి కూర్చున్నాం. అలయెన్స్‌గా ఉన్నవాళ్లందరం. గెలిచాక ఫస్ట్ మీటింగ్. అందరి ముఖాల్లో సంతోషం. ఈ సంతోషం బిహార్ ప్రజల్లో కనిపించినప్పుడు కదా నిజంగా మేము గెలిచినట్లు! జేడీ(యూ) విడిగా గెలవలేదు. ఆర్జేడీ విడిగా గెలవలేదు. కాంగ్రెస్ విడిగా గెలవలేదు. విడివిడిగా గెలిపించకుండా, ఒకటిగా గెలిపించి, ఒకటిగా కలిపి ఉంచి ‘ఇక పాలించండి’ అని బిహార్ తీర్పు ఇచ్చింది.
కలసి పాలించడం కష్టం కాదు. పాలించడానికి కలసి ఉండడమే కష్టం. దానికి కమిట్‌మెంట్ కావాలి. కమిట్‌మెంట్ ఉంటుందా ఉండదా అన్నది.. లాలూజీ కుమారులలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి వస్తుందా లేదా అన్నదాన్ని బట్టి ఉండకూడదు. జేడీ(యు)కి వచ్చిన సీట్లు ఆర్జేడీకి వచ్చిన సీట్లకంటే తక్కువ కదా అనే దాన్ని బట్టీ ఉండకూడదు. మోదీజీని కలసికట్టుగా కమిట్‌మెంట్‌తో దూరంగా ఉంచినట్టే, మహాకూటమి కమిట్‌మెంట్‌తో కలసికట్టుగా ఉండాలి.
ప్రమాణ స్వీకారం బలప్రదర్శనలా ఉండాలి అంటున్నారు లెజిస్లేజర్ మీటింగ్‌లో యువ ప్రజాప్రతినిధులు. ‘సోనియాజీ, రాహుల్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, జయలలిత, నవీన్ పట్నాయక్‌లను ఒకే వేదికపై చూస్తే చాలు మోదీజీ గుండె జారిపోతుంది’ అంటున్నారు. అద్వానీ, మురళీమనోహర్ జోషీ, యశ్వంత్ సిన్హాలను కూడా రప్పిస్తే?..’ నవ్వుతున్నారు నవ ప్రతినిధులు.
నాయకుల బలాన్ని ప్రదర్శించవలసిన వాళ్లు ప్రజలు. ప్రజల ఆశల్ని నెరవేర్చవలసిన వారు మాత్రమే నాయకులు. మోదీజీకి గుబులు పుట్టించడానికి ఇంతపెద్ద వేదిక అవసరం లేదు. ఇంతమంది నాయకులు ఆసీనులు అవనవసరం లేదు. లాలూజీ ఒక్కరు చాలు. మోదీజీ దేశాలు తిరిగి నిలుపుకోలేని దాన్ని, లాలూజీ రాష్ట్రాలు తిరిగి గెలుచుకోగలరు.
- మాధవ్ శింగరాజు